రివ్యూ

మిస్టర్.. మిస్‌ఫైర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిస్టర్ కెకె ** ఫర్వాలేదు

తారాగణం: విక్రమ్, అభిహాసన్, అక్షరహాసన్, లీసా, వికాస్, జాస్మిన్
సంగీతం: జిబ్రాన్
కెమెరా: శ్రీనివాస్ ఆర్ గుత్తా
నిర్మాత: కమల్‌హసన్
దర్శకత్వం: రాజేష్ ఎం సెల్వ
================================================================
ఏదైనా ఒక విషయంలో చిన్న వాళ్ళు, అనుభవం అంతగా లేనివాళ్లు.. వాళ్ల పనిలో తప్పులు చేస్తే వాటిని పొరపాట్లుగా పరిగణించవచ్చు. కానీ విశేషమైన అనుభవం వున్నవారు చేసిన అర్థంలేని ఆవిష్కరణను ఏమనాలో ‘మిస్టర్ కెకె’ చూసి నిర్థారించాలి. మిస్టర్ కెకెని నిర్మించింది -వివిధ విభాగాల్లో విశ్వరూపస్థాయ ఖ్యాతి గడించిన కమల్‌హాసన్, వినూత్న వేషాలు, సెన్సిబుల్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయిన విక్రమ్. అయినా అవుట్‌పుట్ సామాన్య ప్రేక్షకుడిని అలరించని స్థాయిలో రావడం దురదృష్టకరం.
అనేక కేసుల్లో పోలీసులు వెతుకుతున్న నేరస్థుడు మిస్టర్ కెకె (విక్రమ్), ఓ సందర్భంలో పారిపోతూ ప్రమాదానికి గురై హాస్పిటల్‌లో చేరతాడు. అక్కడి డ్యూటీ డాక్టర్ అభిహాసన్. అతని భార్య అతిరి (అక్షరహాసన్)ని కిడ్నాప్ చేసిన దుండగులు, మిస్టర్ కెకెను హాస్పిటల్ నుంచి తప్పించి తమకప్పగిస్తేనే భార్యను వదులుతామని బెదిరిస్తారు. భార్యకోసం హాస్పిటల్ నుంచి కెకెను తప్పిస్తాడు డాక్టర్. మిస్టర్ కెకె కోసం వెదికే వివిధ బృందాలు ఏం చేస్తాయి? గర్భిణిగా వున్న డాక్టర్ భార్యను దుండగులు వదిలారా లేదా? అన్న ప్రశ్నలకు సమాధానాలతో మిస్టర్ కెకె ముగుస్తుంది.
కథాక్రమం అర్థం కావటం కోసం పైవిధంగా కుదించి రాసినా, సినిమాలో ఈ విధానం చాలా గందరగోళంగా నడిచింది. అసలు ఏ సన్నివేశం ఎందుకొస్తుందో, ఎక్కడెక్కడికి వెళ్తుందోనన్నది ఓ పట్టాన అర్థం కాదు. ఇక సినిమాలో అసంగతాల మాట చెప్పనే అక్కరలేదు. మచ్చుకు కొన్ని.. కేవలం డాక్టర్‌గా వుండే వ్యక్తి ప్రొఫెషనల్ గన్ ఫైటర్‌కన్నా అద్భుతంగా ఎలర్ట్‌నెస్‌తో తుపాకీతో కాల్చడం ఎలా సాధ్యమో అర్థంకాదు. అలాగే అదే డాక్టర్ -కెకెకి కడుపులో తగిలిన తీవ్ర గాయానికి ఏ విధమైన ఇతర ఆసరా లేకుండా స్టిచెస్ వేస్తాడు. అదీ పేషెంట్ సిగార్ కాలుస్తుంటే. అర్జున్‌రెడ్డి చిత్రంలో మద్యపానం చేసిన డాక్టర్ ఆపరేషన్ చేసేయగా లేనిది ఇదో లెక్కా? అని సరిపెట్టుకోవాలంతే. ఇంక పోలీసుల్లో గ్రూపులు ‘ఇది నా కేసు, నువ్వెళ్లిపో’ అనే తరహా సీన్స్ ఇందులోనే చూశాం. దానికి పరాకాష్టగా వినె్సంట్ రాజ్ దొరై (ఓ పోలీసు అధికారుల గ్రూప్ హెడ్) మరో పోలీసు ఆఫీసర్ కల్పనను కాల్చేయడం.. ఇలాంటివి సాధారణంగా మాఫియా గాంగ్స్ విషయంలో జరుగుతూ వుంటుంది. దాన్ని పోలీసు అధికారుల మధ్య జరిగినట్లు చూపడం ఏ రీతిలో చూసినా మంచి సంప్రదాయం కాదు. దర్శకుడు రాజేష్ ఎం సెల్వ దీనిపై ఒకింత ఆలోచన చేసి ఉంటే బావుండేది. వీటన్నింటిని మించిన అబ్జర్వడ్ అంశమేమిటంటే, హై సెక్యూరిటీకి మలేషియన్ పోలీసు వ్యవస్థ పెట్టింది పేరు. అలాంటి మలేషియా పోలీసు కార్యాలయం కంట్రోల్ రూమ్‌లోని పెన్‌డ్రైవ్‌ని సులభంగా చేజిక్కించుకున్నట్లు చూపడం. అసలా పోలీసు కార్యాలయం అపార్ట్‌మెంట్స్‌లో వున్నట్లు చూసినా, ఆ లుక్కేమీ అలా కాక, ఏదో ఒక రైల్వే ఫ్లాట్‌ఫాం, సూపర్ మార్కెట్ మాల్స్ మాదిరి జనాలు యదేచ్ఛగా వెళ్తున్నట్లు చూపడం ఏరకమైన అవగాహన కోసం తీసినదో అర్థం కాదు. ఇక పెర్‌ఫార్మెన్స్ మేటర్ ప్రస్తావించాలంటే, విక్రమ్ తన శక్తికి మించి శతవిధాలా పాత్ర ప్రేక్షకులకు పట్టేలా ప్రయత్నించారు. కానీ కథలో ఏ మాత్రం సరుకు లేకపోవడంతో ఆయన ప్రయత్నాలన్నీ దాదాపు నిష్ఫలమైపోయాయి. అయినా విక్రమ్ బస్టాప్‌లో తనని డాక్టర్ పిస్టల్‌తో పేల్చేయడానికి ప్రయత్నిస్తున్నపుడు, అతనివంక చూసిన చూపు తదితరాలు సూటిగా తాకాయి. అతిరిగా అక్షరహాసన్ రోల్ చిన్నదే అయినా మంచి సెన్సిటివిటీతో చూపించింది. ముఖ్యంగా గర్భిణీగావున్న తనని ఆత్మహత్యకు పురికొల్పుతూ పోలీసు పాత్రధారిణి వేధిస్తున్న సందర్భాలలో చక్కటి హావభావాలు పలికించారు. అలాగే భార్యకోసం నేరస్తుడిని తప్పించి తప్పు చేశానన్న భావన ఓ పక్క, అలాగైనా భార్యని కాపాడుకోలేకపోయానన్న నిస్సహాయతను డాక్టర్ పాత్రధారి అభిహాసన్ బాగా పలికించారు. జిబ్రాన్ నేపథ్య సంగీతం బాగుంది. ప్రత్యేకించి వయొలిన్‌తో పలికించిన బిట్స్ భావస్ఫోరకంగా వున్నాయి. పాటలో లిరిక్ ప్రకారంగా ‘పాపగా చూసుకుంటా, కంటిరెప్పలా..’ బాగుంది. కానీ సూపర్ విశేషణాలతో ‘త్రివిక్రముడు పరాక్రముడు, పురుషోత్తముడు, రణోత్తముడు(?)’ అంటూ నడిచిన పాటకు సమానంగా చిత్రీకరణపరంగా సినిమాలో కుదరలేదు. సినిమాలో మెచ్చుకోతగ్గ అంశం శ్రీనివాస్ ఆర్ గుత్తా కెమెరా. మలేసియా అందాలను బాగా కాప్చర్ చేయడం. అలాగే కారు ఛేజింగ్ సీను. కానీ దాని నిడివి తగ్గిస్తే బావుండేది. అవడానికి సినిమా రన్ టైమ్ రెండు గంటల ఒక్క నిమిషమైనా ఎంతోసేపు చూసినట్లుగా ప్రేక్షకుడు ఫీలవుతాడు. దానికి ప్రధాన కారణం పిక్చర్ ఇంటర్‌వెల్ వరకూ సినిమా కథేమిటో అయోమయంగా ఉండడం. దానికితోడు స్లో నేరేషన్. మరోసారి చెపుతున్న తప్పనిసరి అంశమేమిటంటే, సినిమాలో ఏ పాయింట్ (ఈ సినిమాకు ప్రేరణగా 2010లో వచ్చిన ఫ్రెంచి చిత్రం ‘ఎబౌట్ పోర్టాంట్’ చిత్రంగా చెప్పారు. ఇదే ‘పాయింట్ బ్లాంక్’గా సుపరిచితం అని కూడా అంటారు)ని హైలైట్ చేద్దామనుకుని మిస్టర్ కెకెని నడిపారో అన్నదాంట్లో కూడా క్లారిటీ లేకపోవడం. మొత్తానికి మిస్టర్ కెకె మిస్‌ఫైర్ అయిన చిత్రంగానే నిశ్చయంగా చెప్పవచ్చు.

-అన్వేషి