రివ్యూ

థ్రిల్లింగ్.. రాక్షస సంహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాక్షసుడు *** బాగుంది
***
తారాగణం: బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, శరవణన్, రాజీవ్ కనకాల, కాశీ విశ్వనాథ్, కేశవ్‌దీపక్, రవిప్రకాష్ తదితరులు
సంగీతం: జిబ్రాన్
సినిమాటోగ్రఫీ: వెంకట్ సి దిలీప్
కథ, కథనం: రామ్‌కుమార్
నిర్మాణం: కోనేరు సత్యనారాయణ
దర్శకత్వం: రమేష్ వర్మ
***
ఐదేళ్ల కెరీర్ జర్నీలో ఆరు భారీ సినిమాలు చేసినా -హీరోగా తనకంటూ మైలేజ్ రాలేదన్న కసి బెల్లంకొండ శ్రీనివాస్‌లో ఉంది. రొటీన్‌గా హీరోలు ఆలోచించే ఇమేజ్ చట్రం నుంచి బయటికొచ్చి కథలు ఎంపిక చేసుకుంటున్నాడు. కొద్దిరోజుల క్రితం వచ్చిన ‘సీత’లోనూ ఇమేజ్‌ను వదులుకుని ప్రయోగం చేసినా -ఆశించిన ఫలితం దక్కలేదు. మరోసారి హీరోయిజాన్ని పక్కనపెట్టేసి -బాడీ లాంగ్వేజ్‌కు తగిన ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్‌ను ఎంచుకున్నాడు. తమిళంలో హిట్టయిన ‘రాచ్చసన్’కు తెలుగు రీమేక్ ఇది. అయితే, కథలోని కోర్ పాయింట్‌ని తీసుకుని చేసుకున్న స్ట్రెయిట్ తెలుగు కథగా మాత్రమే చూడమంటూ ముందే రిక్వెస్ట్ చేశాడు. సో, ఈసారి బెల్లంకొండ ప్రయోగం ఫలించిందా? కసిగా చేసిన క్రైమ్ స్టోరీ మైలేజ్‌నిచ్చిందా? మిగతా దర్శక నిర్మాతలకు రీమేక్‌లపై దృష్టి పెట్టొచ్చన్న ధైర్యానిచ్చిందా? చూద్దాం.

దర్శకుడిగా ఓ ఇన్విస్టిగేటివ్ క్రైమ్ స్టోరీని తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉంటాడు అరుణ్ (బెల్లంకొండ). కథ కోసం -నిజ జీవిత నేర సంఘటనలను స్టడీ చేస్తుంటాడు. అలా స్టడీ రిపోర్ట్‌తో కథ సిద్ధం చేసుకున్నా -దర్శకుడు కావాలన్న ప్రయత్నాలు మాత్రం ఫలించవు. దీంతో కలల్ని పక్కనపెట్టేసి -ఎస్సై జాబ్‌లో చేరిపోతాడు. క్రైం ఇన్విస్టిగేషన్ పట్ల సహజమైన ఆసక్తి చూపించే అరుణ్‌కు -డ్యూటీలో అనూహ్య కేసొకటి ఎదురవుతుంది. స్కూలు బాలికల వరుస హత్యల కేసది. క్రైం ఇనె్వస్టిగేషన్‌పై ఆసక్తిచూపించే అరుణ్ -హత్యలు జరిగే తీరును అప్పటికే తనవద్దనున్న స్టడీ రిపోర్ట్‌తో క్రోడీకరించి కేసుపై ఓ నిర్ణయానికి వస్తాడు. కానీ ఉన్నతాధికారులు అతని మాటల్ని పట్టించుకోరు. ఈ స్ట్రగుల్‌లోనే అల్లారు ముద్దుగా చూసుకునే తన మేనకోడలు సైతం హత్యకు గురవుతుంది. దాంతో కేసుపై దూకుడుగా వెళ్తున్న అరుణ్‌ని సస్పెండ్ చేస్తారు సుపీరియర్స్. అంత స్ట్రగుల్‌లోనూ అరుణ్ ఎలాంటి పరిశోధన కావించాడు? సైకోని ఎలా కనిపెట్టాడు? అసలు సైకో ఎవరు? స్కూల్ బాలికలనే ఎందుకు చంపుతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా.
చాలాకాలం తరువాత ప్రేక్షకుడి అనుభవంలోకి వచ్చిన క్రైమ్ ఇనె్వస్టిగేషన్ స్టోరీ కనుక -థ్రిల్లింగ్ అనిపిస్తుంది. చిన్న క్లూ కూడా వదలకుండా అత్యంత పాశవికంగా హత్యాకాండ సాగిస్తోన్న సైకో ఆటల్ని పోలీస్ ఇనె్వస్టిగేషన్‌తో ఎలా చెక్ పెట్టారన్నదే అసలు కథ. ఇనె్వస్టిగేషన్ అంటేనే పజిల్. అందులోని చిక్కుముడులు, దారిమళ్లించే అనుమానాలు, ఉక్కిరిబిక్కిరి ప్రశ్నలు.. ఉత్కంఠకు గురి చేసే సన్నివేశాలు.. ఇలా ఆడియన్స్‌ని పూర్తిగా పజిల్లోకి తీసుకెళ్లి -తరువాత సమాధానాలు ఒక్కొక్కటిగా వదలే గేమ్. ఈక్రమంలోనే ఇప్పుడేం జరగబోతోందన్న ఆసక్తిని ప్రేక్షకుడిలో కలిగిస్తారు. ఊహించినట్టే సమాధానం దొరికిందనుకునే సమయానికి -కొత్త మలుపేదో కంటిముందుకొస్తుంది. ఇనె్వస్టిగేషన్ థ్రిల్లర్‌ను ఆడియన్స్‌కు బలంగా కనెక్ట్ చేయడానికి సహజంగా ఎంచుకునే స్క్రీన్ ప్లే స్కీం ఇది. ఈ విషయంలో మాతృకను డిస్ట్రర్బ్ చేయకపోవడమే దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
‘క్రైం స్టోరీ’ని తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్న దర్శకుడిగా హీరోని పరిచయం చేయడమే కథకు ప్లస్. ఆ సన్నివేశాల నుంచి నేరుగా కథలోకి తీసుకెళ్లే అవకాశం దక్కింది. ఆరంభంలోనే -బాలికల మారణకాండపై హీరో తను అధ్యయనం చేసిన సమాచారాన్ని ఇవ్వడంతో దీని వెనుక సైకో ఉన్నాడని అర్థమవుతుంది. దర్శకుడికి కావాల్సిందదే. సైకో ఉన్నాడన్న విషయాన్ని బయటపెట్టేసి.. వాడెవడు? అన్న మిస్టరీకి పదునుపెట్టాడు. సైకో ఎవరై ఉంటారన్న ఆలోచనానుమానాల చుట్టూ పరిశోథనా కథ పరిగెడుతున్న అదనులో -కొత్త మలుపులు తీసుకుని థ్రిల్లింగ్ మూడ్‌లోకి తీసుకెళ్లాడు. ఇక హత్యలకు సంబంధించి క్లూ కనుక్కునే విధానం, సైకోని కనిపెట్టే తీరు ఉత్కంఠ రేకెత్తించింది. సైకో ఎవరన్నది తెలిసిన తరువాతా -కథ క్లైమాక్స్‌కు చేరడానికి ఎక్కువ టైం తీసుకున్నా ఇంపాక్ట్ దెబ్బతినకుండా దర్శకుడు జాగ్రత్త పడటం మరో ప్లస్ పాయింట్. క్లైమాక్స్ ఎపిసోడ్ కుదిస్తే మరింత రక్తికట్టేదేమో.
తమిళ రాచ్చసన్‌కు ఇది తెలుగు రీమేక్ అయినా -ఆ కోణంలో చూడొద్దంటూ చిత్రబృందం ముందునుంచీ చెబుతోంది. రాచ్ఛసన్ కోర్ పాయింట్‌తో తెలుగులో తీసిన స్ట్రెయిట్ స్టోరీగా చూస్తే ‘రాక్షసుడు’ ఎక్కడా అసంతృప్తికి గురిచేయడు. మరోపక్క ట్రెండ్‌కి తగిన పోలీస్ కథ, ఇమేజ్ చట్రంనుంచి బయటికొచ్చిన హీరో, మాతృకను మార్చాల్సిన అవసరం రాకపోవడంలాంటి కలిసొచ్చిన అంశాలు -రాక్షసుడికి అదనపు బలాలయ్యాయి.
కొత్తగా ఎస్సై ఉద్యోగంలో చేరిన వ్యక్తిగా -హీరో బెల్లంకొండ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కుటుంబ నేపథ్యం నుంచి పుట్టుకొచ్చే ఎమోషనల్ సీన్స్‌ను రక్తికట్టించటంలో పరిణితి చూపించాడు. టీచర్ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ పాత్ర -కథకు బలంకాకపోయినా బ్యాలెన్స్ చేయడానికే. రాజీవ్ కనకాల, కాశీ విశ్వనాథ్ తదితరుల పాత్రలు కథలో భాగంగా ఇమిడిపోయాయి. తమిళ నటుడైన శరవణన్ తెలుగు ఆడియన్స్‌కి కొత్త కావడంతో -సైకో గ్రాఫ్ సీరియస్ ఇంపాక్ట్‌నిచ్చింది. కీలక సన్నివేశాల్లో తమిళ నటులే కనిపించటంతో ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది. సాంకేతికంగా సినిమా బావుంది. వెంకట్ దిలీప్ కెమెరా, జిబ్రాన్ సంగీత పనితనం సినిమాకు ఎక్స్‌ట్రా బోనస్. మాతృకను ఏదో చేసేయాలన్న ఆలోచనలకు దూరంగా తనవంతు రీమేక్ కర్తవ్యాన్ని కచ్చితంగా నిర్వర్తించడమే -దర్శకుడు రమేష్‌వర్మ సక్సెస్ కొట్టినట్టు. చాలాకాలం తరువాత ఆడియన్స్‌ని పూర్తి థ్రిల్‌కు గురి చేశాడు ఈ -రాక్షసుడు.

-మహాదేవ