రివ్యూ

లాజిక్‌లేని గ్యాంగ్‌స్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రణరంగం ** ఫర్వాలేదు
**
తారాగణం: శర్వానంద్, కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్, మురళీశర్మ, బ్రహ్మాజీ, ఆదర్శ్ బాలకృష్ణ, సుదర్శన్, రాజు చెంబూరి, ప్రవీణ్, అజయ్, మహేష్ తదితరులు
సంగీతం: ప్రశాంత్ పిళ్లై
కెమెరా: దివాకర్ మణి
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన, దర్శకత్వం: సుధీర్ వర్మ
**
టైటిల్‌కు ఎంతవరకు న్యాయం చేకూరింది? అన్న పాయింట్‌ని నిశితంగా పరీక్షిస్తుంటాడు ప్రేక్షకుడు. ఈ విషయంలో ఎలాంటి అసంతృప్తి లేకుండా ‘రణరంగం’ టైటిల్‌కీ చిత్రానికీ వందశాతం జస్ట్ఫికేషన్ జరిగేలా జాగ్రత్తలు తీసుకున్నాడు దర్శకుడు సుధీర్‌వర్మ. అంటే మహా రక్తపాతం ‘రణరంగం’లో కొనసాగిందన్న మాట.
**
వైజాగ్‌లో బ్లాక్ టికెటర్ దేవ (శర్వానంద్). మిత్రులతో కలిసి ఉమ్మడి ఆంధ్రలో అమలైన మద్యపాన నిషేధాన్ని ఆసరాగా తీసుకుని, సరిహద్దు రాష్టమ్రైన ఒరిస్సా నుంచి సరుకు తెచ్చి అమ్మే వ్యాపారం మొదలెడతాడు. తన బిజినెస్‌కు అడ్డొస్తున్నాడన్న కోపంతో స్థానిక ఎమ్మెల్యే సింహాచలం (మురళీశర్మ) దేవా గ్రూప్‌తో తలపడతాడు. ఈ పెనుగులాటలో భార్య గీత (కల్యాణి ప్రియదర్శన్)ని కోల్పోతాడు దేవా. కూతురి భవిష్యత్ కోసం అక్రమ వ్యవహారాలన్నీ వదిలేసి స్పెయిన్ వెళ్లిపోతాడు. కానీ అక్కడా అతని సహాయం కోసం, వారి స్వలాభం కోసం వచ్చిన రియల్ ఎస్టేట్ బృందం (అజయ్ తదితరులు) కలిగించిన ఇబ్బందులూ, తదనంతర పరిణామాలతో చిత్రం ముగుస్తుంది. ప్రధానంగా సినిమా కథకు కావాల్సిన ‘సంఘర్షణ’ను సరిగ్గా ఎలివేట్ చేయలేకపోయాడు సుధీర్‌వర్మ. దానివల్ల ముఖ్యమైన సీన్స్ పేలవమైపోయాయి. హీరో కాన్‌ఫ్లిక్ట్ ప్రజాప్రతినిధి సింహాచలంతో అనుకుందామా? అంటే ఆ పాత్రను తానే (దేవా) కారు ప్రమాదం పేరిట పెట్రోల్‌పోసి సజీవ దహనం చేస్తాడు. పోనీ స్థిరాస్తి వ్యాపారి అజయ్ పాత్రతో అనుకుందామన్నా, అందుకు అనుగుణమైన సన్నివేశాలపై డైరెక్టర్ చొరవ చూపలేదు. ఈ కారణాలవల్ల ప్రధాన ఆసక్తికోణం ఆవిరైపోయింది. ఇక సీన్స్ కూర్పులో లాజిక్‌కి లేశమంతమైనా స్థానమివ్వలేదు. ఓ నేరం చేసినవాడు అన్నిటినుంచీ తప్పించుకోవడానికి విదేశాలకు పారిపోతే, చట్టం తన పని తాను చేయడం మానేస్తుందా? కాని, కథానాయకుడు వైజాగ్ నుంచి స్పెయిన్ పారిపోతాడు. అక్కడ శాంతిగా బ్రతుకుతాడన్న భావనను కల్గింపచేయడం ఎంతగా కరెక్టో దర్శకుడే చెప్పాలి. ఇక నువీ పనులన్నీ మానేస్తే నిన్నిచ్చి పెళ్లిచెయ్యడం మా నాన్నకు ఇష్టమే అన్న అభిమతాన్ని గీత దేవాతో వ్యక్తపరుస్తుంది ఓ చోట. వాస్తవానికి అప్పటికి దేవ విస్తరణ చాలా చిన్నస్థాయిలోనే ఉంది. కానీ నావాళ్ల (స్నేహితులు.. తదితరులు అనుకోవచ్చు) కోసం ఈ పనులు మాననంటాడు హీరో. కానీ అదే నాయిక తన పెళ్లిని ఓ ఫ్రాడ్‌తో తప్పించిన కృతజ్ఞతలో ‘నేనే నిన్ను పెళ్లిచేసుకుంటా’ అని వచ్చేయడం వింత. నిజానికి అతని చీకటి సామ్రాజ్యం గతంలోకంటే విస్తరించినట్లు అపుడు చూపారు కూడా. అంటే లాజిక్ కంటే, కథ నడపడానికి కావాల్సిన కన్వీనియెన్స్‌కే ప్రాధాన్యమిచ్చారని. ఆ పరిస్థితుల్లో కల్పించిన సన్నివేశాల్లో జీవం ఎక్కడనుంచి వస్తుంది? అదేవిధంగా ఇరువర్గాల మధ్యా జరిగిన పోరుక్రమాన్ని చూపడంలో భాగంగా చూపిన సన్నివేశాల శైలిని చెప్పడానికి ‘దారుణం’ అన్న పద వ్యక్తీకరణ కూడా చాలా చిన్నది. ఎందుకంటే ఒక వర్గానికి చెందిన వ్యక్తి, మరోవర్గం చేతిలో సముద్రపు ఒడ్డున శవమై తేలితే, ఆ వర్గం వ్యక్తులు మర్నాడు తలక్రిందులుగా మరోచోట శవాలై కనిపిస్తారు. ఇదంతా 1995లో వైజాగ్‌లో జరిగినట్టు చూపారు. పోలీసులు అనేకానేక కారణాలవల్ల విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తారేమో కానీ, అసలు నేర నివారణకు, అనంతర పరిశోధనకూ ఉక్రమించనే ఉపక్రమించనట్టు చూపడం ధర్మంకాదు. నాయకుని పోరాటమంతా వాళ్లకోసమే అన్నట్టు చూపుతూ, ఇలాంటి తీవ్రాతి తీవ్ర భయానక వాతావరణం సృష్టించడం అసమంజసమే కాదు, సమాజంపట్ల చిత్రబృందానికున్న చిన్నచూపుని తెలియజేస్తుంది. అయితే ఇలాంటి అపసవ్యతల మధ్య సైతం సినిమాను చూడగలిగే అంశాలూ ఉన్నాయి. ఇందులో ప్రధానమైనది శర్వానంద్, కల్యాణి ప్రియదర్శన్‌ల నటన. దేవగా శర్వాపోషించిన పాత్ర అంతరంగాన్ని తొలుత ఇరవై అయిదేళ్ల యువకుడిగా, అనంతరం నలభై ఐదేళ్ల మధ్యవయస్కుడిగా నిగ్రహ నటన చూపించి ఆకట్టుకున్నారు. అయితే మొట్టమొదటి భాగాల్లో ఆ పాత్రకు కావాల్సిన ‘మాస్’ ఊపుని ఇంకాస్త చేర్చి నటిస్తే బాగుండేదన్న భావనా ప్రేక్షకునికి కలిగింది. కల్యాణి ప్రియదర్శన్ గీతగా కనపడిన దాదాపు ప్రతి సీన్‌లోనూ అలరించింది. సినిమాకు అవసరమైన ప్రెష్‌నెస్‌ను అపారంగా అందించారామె. వాస్తవానికి సినిమాలో ఆమెకు చెందిన బయటకు వచ్చిన ఫొటోలకంటే చిత్రంలో ఇంకా బాగా కనిపించింది. ఇందుకు దివాకర్ మణి (్ఛయాగ్రాహకుడు) చేసిన మ్యాజిక్కు పనిచేసింది. సింహాచలంగా మురళీశర్మ ఓ రకమైన బేస్ వాయిస్‌తో బాగా ఆకట్టుకున్నాడు. సినిమాలో డాక్టర్‌గా అగ్రనటి కాజల్ అగర్వాల్ నటించిందన్న విషయాన్ని చెప్పుకోకుండా ఉంటేనే బావుంటుంది. ఎందుకంటే ఓ పరిధీ, పర్పస్ లేకుండా ఆ పాత్రను ఇరికించారిందులో. కాజల్‌ను పెట్టాం కదా? పాట పెట్టకపోతే ఎలా అన్న భావనతో సినిమా లాస్ట్‌లో టైటిల్స్ రోల్ అవుతున్న సమయంలో ‘పిల్లా పిక్చర్ పెర్‌ఫెక్ట్’ అన్న నిఖితాగాంధీ పాడిన పాటను పెట్టారు. కానీ అదేరకంగానూ ‘పర్‌ఫెక్ట్ ప్లేస్‌మెంట్ కాదు’. పాటల ప్రస్తావన వచ్చింది కనుక ఈ విభాగపరంగా సంగీత దర్శకుడు ప్రశాంత్ పిళ్లై అందించిన స్వరాల సంగతీ స్పృశిద్దాం. ‘సీతా కల్యాణమే..’ అన్న శ్రీహరి కె పాడిన పాట ఎత్తుగడ అలవాటైన బాణీలో ఉన్నా, అనంతరం మంచి వైవిధ్యంతో సాగింది. అందులో లిరిక్ ప్రకారంగా ఒకచోట ‘గడెయ్యక మరిచిన తలుపే వెయ్యండని సైగలు చేసే’ అన్నది చక్కగా సందర్భానికి కుదిరింది. అదే పాటలో మరోచోట ‘దూరం తరిగే, గారం పెరిగే.. జనం హడావిడితనం..’ పద ప్రయోగాలు చమత్కారంగా ఉన్నాయి. ఈ ప్రపంచంలో ‘డబ్బుతో కొనలేనిది డబ్బొక్కటే’ అన్న డైలాగుకి ఇంకాస్త వివరణ ఇస్తే బాగుండేది. ‘జీవితంలో టెన్షన్ పడటం వేరు, జీవితమే టెన్షన్‌తో గడపడం వేరు’, ‘నిన్ను పెంచారు, నేను పెరిగాను’ అన్న సంభాషణలు అర్థవంతంగా అనిపించాయి. అయితే ‘దాహాన్ని కోపాన్ని ఇంకొకరు శాసించే పరిస్థితి ఉండకూడదు’ అన్న డైలాగ్‌ని అర్థమయ్యేలా చెప్పించి ఉంటే అందరికీ చేరేది. ‘కూతురు లేని బాధ మేం అనుభవిస్తున్నాం. అదే బాధ నువ్వనుభవించకూడదు’ అంటూ నాయిక తల్లి పాత్ర చెప్పిన సంభాషణ మాత్రం అందర్నీ కదిలించింది. లిఫ్ట్‌లో చిత్రీకరించిన ఫైట్ బాగుంది. దర్శకుడు చిత్రం విషయంలో చేసిన మరో తెలివైన పని సినిమా ఆరంభంలో ‘ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కాపీ ఆఫ్ ఎ కాపీ ఆఫ్ కాపీ’ అన్న కార్డు వేయడం. దీనివల్ల ‘ఆ సీను అలా ఉందే, ఈ సీను ఇలా ఉందే’ అన్న ఆలోచన మనకు రాదు. అయినా సృష్టి మొత్తమే ఓ పెద్ద ప్రేరణామయం. కనుక అందులోనూ సినిమా విశే్లషణల్లో ఇది అంతగా ప్రధానాంశం కాకుండా పోయింది. మొత్తానికి సినిమా ఆవిష్కరణాంశంలో మిగతావాటితోపాటు సాధ్యాసాధ్యాలపట్ల డైరెక్టర్ ఓ లుక్కేసివుంటే ‘రణరంగం’ ఫర్వాలేదన్న స్థాయి దాటేది.

-అన్వేషి