రివ్యూ

మత్తొదిలించే మాదక దృశ్యం ( ఉడ్తా పంజాబ్) *** బాగుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం:
షాహిద్ కపూర్, అలియా భట్, కరీనా కపూర్, దిల్జీత్ దోసంఝ, తదితరులు
స్క్రీన్‌ప్లే: అభిషేక్ చౌబే, సుదీప్ శర్మ
మాటలు: సుదీప్ శర్మ
కెమెరా: రాజీవ్ రవి
నిర్మాతలు: శోభాకపూర్, ఏక్తా కపూర్,
అనురాగ్ కాశ్యప్
దర్శకత్వం: అభిషేక్ చౌబే

రివ్యూకి ఇది ‘అసంగతి’ కావొచ్చు. అయితే- సినీ నేపథ్యం తాలూకు నీలినీడల వాస్తవాస్తవాలూ, గణాంకాలూ.. రాజకీయ పద చదరంగాలూ -సెన్సార్‌బోర్డ్ ‘అతి’ వ్యూహ రచన.. నిహ్లానీ దూడుకుతనం కలగలిసి -ఈ సినిమాకి ‘మెలోడ్రామా’ని జోడించాయేమోనన్న భ్రమలో ప్రేక్షకుడు ఉండొచ్చు. కానీ- ఇదొక నగ్నసత్యం. తెర వెనుక -పంజాబ్‌లోని మారుమూల పల్లెల్లో సైతం ‘మాఫియా’ ఎంతగా వేళ్లూనుకుందో.. అక్కడి యువతని కొన్ని దశాబ్దాలుగా ‘మత్తు’లో ఎలా ముంచెత్తి నిర్వీర్యం చేస్తోందో? ఆ లెఖ్కలు చూస్తే.. వణుకు పుడుతుంది. ఏదో బూతు మాటల్తో.. వల్గారిటీని భుజాని కెత్తుకొని.. డ్రగ్స్ నేపథ్యం చాటున ‘సి’ గ్రేడ్ సినిమాకి శ్రీకారం చుట్టారన్న భ్రాంతిలో ఉన్న వాళ్లని ఈ సినిమా నిలదీస్తుంది.
‘ఉడ్తా పంజాబ్’పై సెన్సార్ బోర్డ్‌కి ఎందుకంత కసి? 89 కట్స్ చెప్పి ఆ కసిని ఎందుకు వెళ్లగక్కింది? పంజాబ్ పేరుని ఎక్కడా ప్రస్తావించకూడదని, ఆయా ఊరి పేర్లు సైతం కనిపించకూడదని, పంజాబ్ యాసనూ.. సామాన్యుడు వాడే పదజాలంలోని ‘వల్గారిటీ’ని ఎత్తిచూపి -అభ్యంతరాలను వ్యక్తం చేసింది. దీంతో ముంబై కోర్టు కలగజేసుకొని.. ‘అమ్మమ్మ కబుర్లు’ చెప్పొద్దని.. కేవలం ఒక్క కట్‌తో సినిమాని రిలీజ్ చేయమని ఆదేశాలు జారీ చేసింది. ఇక- ఇందులో నిజమెంతో తెలీదుగానీ -ఉన్నఫళంగా ‘సెన్సార్ కాపీ’ వాటర్ మార్క్‌తో ‘ఉడ్తా పంజాబ్’ ఆన్‌లైన్‌లో తళుక్కుమంది. ఆ ‘పని’ సెన్సార్ బోర్డ్ చైర్మన్ ప్రమేయంతోనే జరిగిందని యూనిట్ ఆరోపణ. ఓ విధమైన అచేతనావస్థలో కొట్టుమిట్టాడుతూన్న సినీ యూనిట్ తక్షణం మేల్కొని.. ఆన్‌లైన్ వర్షన్ చూడకండి.. అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇన్ని తర్జనభర్జనలు.. ఆవేశకావేశాల అనంతరం ‘ఉడ్తా పంజాబ్’ సహజంగానే జనం నోళ్లలో నానింది. ఈ సినిమాలో ‘ఏదో’ (?) ఉందన్న ఆలోచనతో థియేటర్ వైపు పయనించిన సామాన్యుడు కూడా తెర పైని వాస్తవంతో ఏకీభవించాడు.
అసలు కథేంటి?
టామీసింగ్ అలియాస్ గబ్రూ అనే పాప్ సింగర్ (షాహిద్ కపూర్) డ్రగ్స్ మత్తులో మునిగి తేలుతూ.. నిస్తేజంగా రోజులు వెళ్లబుచ్చుతూంటాడు. క్రీడాకారిణిగా తన జీవితాన్ని అందంగా మలచుకోవాలనుకొనే ఓ సగటు అమ్మాయి తన పొలంలో లభ్యమైన పొట్లంలోని 3 కిలోల ‘సరకు’ను అమ్మి హాయిగా కాలాన్ని గడిపేయాలనుకొని.. ఆఖరికి ఆ ‘మాల్’ ఊబిలో ఇరుక్కుపోతుంది. కిరాణా దుకాణంలో 50 రూపాయలకే ఇంజక్షన్‌గా దొరికే డ్రగ్స్‌కి అలవాటు పడిన ఓ టీనేజ్ కుర్రాడు.. అవినీతి కేరాఫ్‌గా బతికేస్తూన్న పోలీసు అధికారి.. ఆ ఊళ్లో డ్రగ్స్‌కి యువత అలవాటు పడుతోందన్న నిజం తెలిసినప్పటికీ తనదాకా వస్తేగానీ కళ్లు తెరవని ఓ వ్యక్తి.. డ్రగ్స్ మత్తులో జీవితాల్ని పోగొట్టుకుంటున్న యువతలో మార్పు కోసం ప్రయత్నించే ఓ లేడీ డాక్టర్..
ఈ ఐదు జీవితాలు ఎటువైపు ఏ రీతిన మలుపు తిరిగాయన్నది ‘నగ్నంగా’ పలకరించే సన్నివేశాల గాఢత ప్రేక్షకుల్ని కలవరపెడుతుంది. ప్రారంభ సన్నివేశమే -మనల్ని వెంటాడుతుంది. ఏం జరగబోతోంది? ఉడ్తా పంజాబ్ ఏ సత్యాల్ని వెల్లడించబోతోంది? అన్న ఆలోచనల్లోకి నెట్టేసి.. ఆ ఆలోచనల ముసురులో ‘డ్రగ్’ తాలూకు మత్తు ఎంతగా వేళ్లూనుకుందో వెల్లడిస్తుంది. ఉక్కిరిబిక్కిరి చేయటం అనే మాట ఇక్కడ చాలా చిన్నది. పంజాబ్‌లో హరిత విప్లవాన్ని గురించి, పచ్చదనాన్ని గురించి ఏవేవో వార్తా కథనాల్ని విన్న ప్రేక్షకుడికి అక్కడి పచ్చదనం మాటున ఇంత పచ్చిదనం ఉందా? అని ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఇది సినిమా కాదు. వాస్తవ సంఘటనలు కళ్ల ముందు కదలాడుతూన్న భ్రాంతి కలిగిస్తుంది. నటీనటులెవ్వరూ నటించలేదు. ‘డ్రగ్’ నిర్వీర్యం తాలూకు ఆవేదననీ.. సమాజం ఎటు కొట్టుకుపోతోందో? అన్న ఆలోచననీ రేకెత్తిస్తూ.. ప్రశ్నిస్తారు. ఉన్నపళంగా పంజాబ్ నేపథ్యం గురించి వెబ్‌సైట్లు వెతికేసి అక్కడి కల్లోలిత వాతావరణాన్ని తరచి చూడాలన్పించేట్టు.. ఉత్కంఠతకి గురై.. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవాలని ప్రేరేపించేట్టు చేశారు. పంజాబ్, ఆ రాష్ట్ర సరిహద్దుల్లోని యువత నూటికి 50మంది మాదక ద్రవ్యాలకు అలవాటుపడి ఉంటారని సర్వేలు వెల్లడిస్తే.. ఒక ‘సత్యాన్ని’ అడ్డుకోడానికి ఇంత రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంది? అనిపిస్తుంది. కంట తడి మనసు పొరల్లోంచి ఉబికి ఒక్క క్షణం దిగ్భ్రాంతి కలుగుతుంది. సినిమా జనాన్ని ఇంతగా ప్రభావితం చేస్తుందా? అంటే చేస్తుంది. ఆలోచనల వొరవడిని కలిగిస్తుంది. ఆ ఆలోచనలు ఏదో దారిపట్టి.. అక్కడి యువతను సన్మార్గంలో పయనించేట్టు చేయవచ్చు. సినిమాని సినిమాగా చూసినా.. ఇచ్చిన సందేశం బుర్రలో తళుక్కుమని మెరిసినా.. సినీ కథకి సార్థకత చేకూరినట్టే.

- B N K