రివ్యూ

మామూలు మామే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు** వెంకీమామ
**
తారాగణం: వెంకటేష్, నాగచైతన్య, పాయల్ రాజ్‌పుత్, రాశిఖన్నా, నాజర్, ప్రకాష్‌రాజ్, విద్యుల్లేఖ రామన్, రావు రమేష్, దాసరి అరుణకుమార్, చమ్మక్ చంద్ర తదితరులు
సంగీతం: ఎస్‌ఎస్ థమన్
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల
ఎడిటర్: ప్రవీణ్ పూడి
నిర్మాతలు: సురేష్‌బాబు, టిజి విశ్వప్రసాద్
దర్శకత్వం: కెఎస్ రవీంద్ర (బాబీ)
**
కంసుడు విలన్. కనుక -కృష్ణుడి చేతిలోపోయాడు. అదే కంసుడు -కృష్ణుడిని అమితంగా ప్రేమించే మామయ్యుంటే? అయినాకానీ, మేనల్లుడి చేతిలోనే మృత్యువు తప్పదన్న రాత -అతని నుదిటిన విధాత అచ్చేసివుంటే..? ఓహ్! ఈ కంటెంట్, కాన్‌ఫ్లిక్ట్ చాలు.. -అద్భుతమైన సెటప్‌తో తెలుగు సినిమాను రక్తికట్టించటానికి. బహుశ -దర్శకుడు కెఎస్ రవీంద్ర (బాబీ) టీం కూడా అలాంటి మూడ్‌నే ఆడియన్స్‌కివ్వాలని అనుకునుంటుంది. కాకపోతే -కథలోని రెండు పాత్రల్నీ హీరోల్ని చేయాల్సిన కంపల్షన్ వచ్చిపడింది. అది దాటలేక పోవడంతో బేసిక్ థాట్ దగ్గరే కథ బొల్తాకొట్టింది. హీరోల సమ ప్రాధాన్య కథనం పంచకు కథను లాగేయడంతో, వెంకీమామ నుంచి ఆడియన్స్‌కి అందాల్సిన సారం అతిసారమైపోయింది.
మేనమామ మేనల్లుడన్న రియల్ లైఫ్ రిలేషన్‌ను రీల్ లైఫ్‌కి అప్లై చేస్తూ -వెంకటేష్, నాగచైతన్యలతో దర్శకుడు కెఎస్ రవీంద్ర తెరకెక్కించిన మల్టీస్టారర్ ‘వెంకీమామ’. నిజానికి కంటెంట్ కంటే.. కాంబినేషనే సినిమాకు ప్రాణం. ఎందుకంటే -తాతా మనవడు, మేనమామా మేనల్లుళ్ల మధ్య బాంధవ్యాన్ని వెచ్చగా, గాఢంగా, మెత్తగా, బలంగా.. ఇలా చాలా రకాలుగా చాలా చాలా సినిమాలే చూపించేశాయి. వెంకీమామ కథా అదే. హీరోల రియల్ లైఫ్ రిలేషనే -ఇక్కడ ఫ్రెష్ ఫీల్.
కథ: కలిసిన మనసులు, కలవని జాతకాల మధ్య పెళ్లి చేసుకున్న ఓ జంట -బిడ్డ (కార్తీక్ శివరామ్)కు జన్మనిచ్చి ఏడాది దాటకుండానే ప్రమాదంలో ప్రాణాలు పొగొట్టుకుంటారు. నష్టజాతకుడిని ఇంట్లోకి తేవొద్దన్న తండ్రి (నాజర్)ని ఎదిరించి -‘మామా’ అని మొదటిమాటన్న మేనల్లుడిని అక్కున చేర్చుకుంటాడు మేనమామ (వెంకటేష్). తన జీవితాన్నీ మేనల్లుడికే ధారబోసి, వాడే సర్వస్వమన్నట్టు పెంచుతాడు. కథ హాయిగా సాగుతోన్న తరుణంలో -విధి వింత నాటకం ఆడుతుంది. జాతకం పేరిట అద్వితీయ బాంధవ్యాన్ని విడదీసే విచిత్ర నాటకానికి తెరలేపుతుంది. కృష్ణుడి జాతకాంశలో పుట్టిన మేనల్లుడి కారణంగా మేనమామకు ప్రాణగండం ఉండటంతో -ఇద్దరూ విడిపోక తప్పని పరిస్థితి. వీళ్లిద్దరిపై పగబట్టిన విధి గెలిచిందా? ఆ విధిని వీళ్ల ప్రేమ గెలిచిందా? అన్నది ముగింపు కథ.
తనకారణంగా పెళ్లికి దూరమైన మేనమామకు -అందమైన హిందీ టీచర్ (పాయల్ రాజ్‌పుత్)ని సెట్ చేసే పనిలో ఉంటాడు మేనల్లుడు. తనమీది మమకారంతో ప్రేమకు దూరమైన మేనల్లుడి దగ్గరకు గాళ్‌ఫ్రెండ్ (రాశిఖన్నా)ని చేర్చే ప్రయత్నంలో ఉంటాడు మేనమామ. ఫన్‌తో కథను కదిలించటానికి పెట్టుకున్న సెటప్‌కు పార్లల్‌గా -హీరోయిజం ఎలివేషన్ కోసం విలేజ్ పాలిటిక్స్ యాక్షన్ సీన్లు సెట్ చేశారు. కమర్షియల్ మూవీ అనడానికి -ఇద్దరు హీరోయిన్ల గ్లామర్, ఈలలేయించే పాటలు, మసాలా డైలాగులూ ఎలాగూ ఉన్నాయి కనుక -తను చెప్పదలచుకున్నది ఈ సెటప్‌లోకే సెట్ చేసి సినిమాను లాగించేశాడు దర్శకుడు. మూలం ముతకదే అయినా -అప్‌డేట్ వర్షన్‌ను చూస్తున్నామన్న భావన మాత్రం ఆడియన్స్‌కి ఇసుమంతైనా కలగదు. సన్నివేశాల్లోని ఫ్రెష్‌నెస్ ఫీల్ అందక -ఎప్పటికథ చూస్తున్నాం? అన్న డౌట్లే వినోదాన్ని డామినేట్ చేస్తాయి. తనదైన శైలిని ఆడియన్స్‌కి బలంగా కనెక్ట్ చేయగల వెంకటేష్ ఉన్నాడు కనుక -రొటీన్ సన్నివేశాలకూ పాస్ మార్కులుపడ్డాయి. లేదంటే -ఈ స్థారుూ అంది ఉండేది కాదేమో. స్క్రీన్‌మీద వెంకీ కనిపించినంత సేపూ సినిమాలో ఉన్నామన్న భావనకొచ్చిన ప్రేక్షకుడు -మిగిలిన సన్నివేశాల సమయంలో పేజీలు తిప్పుతున్నట్టే ఫీలయ్యాడు. కథకు కారణమైన నాగచైతన్య పాత్రకు ఎలాంటి ‘ప్రత్యేకత’ కనిపించదు. దీంతో -టైటిల్‌కు అనుగుణంగా తీర్చిదిద్దిన వెంకీమామ పాత్రా భావోద్వేగ సారాన్ని అందించలేకపోయింది. స్క్రీన్‌మీద వెంకీ కనిపించే సన్నివేశాల్లో -అతన్ని అనుసరించే క్యారెక్టర్ ఆర్టిస్టుగానే చైతూను చూపించటం.. ఆ పాత్ర ఔన్నత్యం పూర్తిగా దెబ్బతింది. కథా చైతన్యం కొరవడటానికి అదే కారణమైంది.
మేనమామ మేనల్లుళ్ల మధ్య అప్యాయతానుబంధం ఎంత గాఢంగా ఉంటుందో చూడటం తెలుగు ఆడియన్స్‌కి కొత్తకాదు. పాత సినిమాల కాలంనుంచే ఆ ఫీల్ అందుతోంది. అలాంటి ఫీల్‌ని ఆడియన్స్‌కి మరోసారి రుచి చూపించే బలమైన సన్నివేశాలనూ దర్శకుడు డిజైన్ చేయలేకపోయాడు. ‘మేనల్లుడే సర్వస్వ’మని మామ, ‘మావయ్యే ప్రాణ’మని అల్లుడు రిపీటెడ్‌గా చెప్పుకోవడం తప్ప.. అనుభూతిని అనుభవంలోకి తెచ్చే ఎమోషనల్ సీన్స్‌లో గాఢత కనిపించలేదు.
జాతక ప్రభావంతో పెట్టిన ‘గండం’ తాలూకు సంఘటనలూ ఎఫెక్టివ్‌గా చూపించకలేకపోవడంతో -కాన్‌ఫ్లిక్ట్ సైతం బలహీనమైపోయింది. కథాబీజాన్ని విస్తరించటంలో ఎంత పేలవమైన ప్రతిభను చూపించారన్న విషయం ఇక్కడే అర్థమైపోతుంది. ఫస్ట్ఫాలో స్క్రీన్ మొత్తం కలర్‌ఫుల్‌గా కనిపించినా -‘కోకోకోలా పెప్సీ’లాంటి పాటలు మూడ్‌ని డిస్ట్రర్బ్ చేయడానికే ఉపయోగపడ్డాయి. రెండు గంటల నిడివిలో నడిపించే కథ కరవవ్వడంతో -ఏమాత్రం సంబంధంలేని కాశ్మీర్ బ్యాక్‌డ్రాప్ సర్జికల్ స్ట్రయిక్ సీన్లు ఇరికించాల్సి వచ్చింది. ఇక్కడే మరో తప్పు జరిగింది. కథ ఊరు శివార్లుదాటి ఎప్పుడేత బోర్డర్‌కు వెళ్లిపోయిందో.. -వెంకీమామ సైతం కథను (మేనల్లుడిని) వెతక్కుంటూ వెళ్లడం తప్ప ఇంకేమీ చేయలేకపోయాడు.
వెంకీమామ గురించి ఏకొంతైనా గొప్పగా చెప్పుకోవాలంటే -అది వెంకీ పెర్ఫార్మెన్స్ గురించే. పెరుగుతున్న వయసుతో పెర్ఫార్మెన్స్ స్టామినా కూడా పెరుగుతోందని మరోసారి నిరూపించాడు. తన పాత్ర సపోర్టింగ్ హీరోకే పరిమితమవుతుందని చైతూ గ్రహించినా -మామకోసం ఈ సినిమా చేసుండేవాడే. ఇక హీరోయిన్లను షో’కాల్డ్ సీన్లు, మసాలా పాటలకే పరిమితం చేశారు. ‘ఇంగ్లీష్’ మానరిజం డైలాగ్‌తో రావ్ రమేష్, బ్రిగేడియర్ పాత్రలో ప్రకాష్ రాజ్, జ్యోతిష్యుడి పాత్రలో నాజర్ అలవాటైన పెర్ఫార్మెన్స్‌తో సినిమాను కాస్త ఒడ్డుకు చేర్చారు. టైటిల్‌కు అనుగుణమైన వెంకీ మామ, కథతో సంబంధంలేని కోకోకోలా రెట్రో సాంగ్‌లు థమన్‌ని గుర్తు చేస్తాయి. అద్భుతమైన బీజీఎం ఇవ్వడానికి గాంభీర్యమైన సన్నివేశాలేమీ లేవుకనుక -చర్చించాల్సిన పని లేదు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు మల్టీస్టారర్ చిత్రానికి తగినట్టున్నాయి. మామా అల్లుళ్ల అనుబంధం పాత సంప్రదాయమే తప్ప, పాత సన్నివేశ ధోరణిలో చెప్పాల్సిన పని లేదని దర్శకుడు గ్రహించి వుంటే -సినిమాలో ముతకతనం మాయమై వుండేది. ఫైనల్‌గా -వెంకీమామలో హైలెట్ పాయింట్ కాంబినేషన్ క్రేజ్. వెంకటేష్ ఇమేజ్ మీద ఊపిరి నిలబెట్టుకోవాల్సిన మాస్ ఎంటర్‌టైనర్.

-మహాదేవ