రివ్యూ

నిజమైన పండగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగుంది*** ప్రతిరోజూ పండగే
***
తారాగణం: సాయితేజ్, సత్యరాజ్, రావు రమేష్, రాశిఖన్నా, విజయ్‌కుమార్, హరితేజ, శ్రీకాంత్ అయ్యంగార్, సుహాస్, అజయ్, రాజేష్, ప్రవీణ సంగీతం: ఎస్‌ఎస్ థమన్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు
సినిమాటోగ్రఫీ: జైకుమార్
బ్యానర్: జీఏ 2 పిక్చర్స్, యువీ క్రియేషన్స్
నిర్మాత: బన్నీవాస్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మారుతి
***
రెక్కలొచ్చిన పిల్లలు ఎక్కడెక్కడికో ఎగిరిపోతే -గూడు చెదిరి, గుండె ఒంటరైన బతుకుల్లోని అంతర్మథనం సినిమాకు ఏనాడో కథావస్తువైంది. పిల్లల బిజీ లైఫ్‌లో -‘పేరెంట్స్’ లీస్ట్ ప్రయారిటీ అన్న విషయాన్ని చూపిస్తూ చాలా సినిమాలే వచ్చాయి. అంతకుమించి కళ్లముందూ అలాంటి కుటుంబాలు కనిపిస్తున్నాయి. అలాంటి కథావస్తువుతోనే కొద్దిరోజుల క్రితం శతమానంభవతి వచ్చింది. ఇప్పుడు -దర్శకుడు మారుతి కూడా అలాంటి ప్రయత్నమే చేశాడు. కాకపోతే -కొంత తెలివిగా, ఒకింత వెటకారంగా.. ఇంకొంత భావోద్వేగంగా.. మరికొంత సామాజిక బాధ్యతగా.
కథ మారలేదు. సో, -మారుతోన్న యాంత్రిక ధోరణిని పచ్చిగా చూపించాలనుకున్నాడు. మారాల్సిన కాలాన్ని కథావస్తువు చేశాడు. అందుకే -నాలుగైదు వారాల్లో నాన్న పోతాడని తెలిశాక.. వారానికెన్ని రోజులు, రోజుకెన్ని గంటలో లెక్కలేసుకునే ‘యాక్యురసీ రోబో కిడ్స్’ని ఈడ్చి డొక్కలోతన్నాడు. ‘లాస్ట్ బ్రెత్’కు ‘అల్టిమేట్ గిఫ్ట్’నిచ్చే హ్యాపీ కుటుంబాలు పుట్టుకొచ్చే కాలాన్ని ఆశించాడు. బాధ్యతలు మర్చిపోతున్న సంతానంపై ఇదొక సోషల్ సెటైర్. చివరి శ్వాస వరకూ పోయే ప్రాణాన్ని ఆనందంగా ఉంచటమే ఫీస్ ఫెస్టివ్. ఈ రెండూ కలిపి వండిన డెత్ సెలబ్రేషన్ కానె్సప్టే -ప్రతీరోజూ పండగ.
రఘురామయ్య (సత్యరాజ్)ది రాజమండ్రిలో పెద్ద ఇల్లు. రెక్కలొచ్చిన పిల్లలు ప్రపంచం మీదికి ఎగిరిపోయాక -గూడు చిన్నదైంది. గుండె బరువైంది. లంగ్ క్యాన్సర్‌తో చావు దగ్గరపడుతుంది. చావెప్పుడో కరెక్ట్‌గా తెలిస్తే తప్ప -అమెరికా నుంచి కదిలి రాలేనన్న -‘ప్రాక్టికల్’ పెద్ద కొడుకు నుంచి కథ మొదలవుతుంది. కొడుకుకు క్షణంకూడా దూరంగా ఉండలేని తండ్రి -తన నాన్నా అలాగే ప్రేమిస్తుంటాడని గ్రహించడు. యాంత్రిక జీవనంలో రఘురామయ్య సంతానమంతా బిజీ కావడంతో -తండ్రి పోవడానికి వారం అటూ ఇటూ మాత్రమే ఇంటికెళ్దామని కూడబలుక్కుంటారు. తాత పరిస్థితి తెలుసుకున్న మనవడు మాత్రం క్షణం ఉండలేకపోతాడు. ఉన్నఫళంగా రాజమండ్రి చేరుకుంటాడు. చివరి ఘడియల్లో తాతకు తోడుంటాడు. అతన్ని సంతోషంగా ఉంచే ప్రయత్నం చేస్తాడు. మనసులోని కోర్కెలకు ముసుగుతీస్తూ -తాతలో కొత్త ఉత్సాహం, కొంత ఆయుష్షు నింపుతాడు. తాత చివరి కోర్కెగా -ఊళ్లో అమ్మాయినే పెళ్లి చేసుకోడానికీ సిద్ధపడతాడు. ఇటు తండ్రి చావు, అటు కొడుకు పెళ్లి.. పెద్దకొడుక్కి అమెరికా నుంచి కదలక తప్పదు. చావులోగా సాగాల్సిన పెళ్లి కోసం రఘురామయ్య సంతానమూ రాజమండ్రి చేరుతుంది. వచ్చిన వాళ్లతో ఇల్లు కళకళలాడుతుంది. పండగ వాతావరణం వస్తుంది. తరువాత ఏమైందన్న తాత- మనవల కథను తెరపై చూడాలి. కామెడీతోనే కథ చెబుతున్నా మారుతి వేసే చురకలు మాత్రం -మనకు వాతల్లా కనిపిస్తాయి.
మెటీరియలిస్టిక్ పాత్రలు... మెటాలిక్ మనస్తత్వాలను ఎస్టాబ్లిష్ చేయటంలో మారుతి -యుక్తి, అతిశయోక్తి రెండూ ప్రదర్శించాడు. ‘నువ్వులేకుండా మేం బతగ్గలమా నాన్నా?’ అని అమెరికా వెళ్లేముందు పెద్దకొడుకుతో అడిగించటం -దర్శకుడిగా మారుతి చూపించిన యుక్తి. తండ్రి ప్రాణం పోతుందని తెలిసీ తన ప్రపంచం నుంచి బయటకు రాలేకపోవడం -కథకుడిగా ప్రయోగించిన అతిశయోక్తి. సంతానాన్ని విలన్లుగా చూపకుండానే -బిజీ లైఫ్‌లో బంధాలు ఎంత బలహీనం అవుతున్నాయన్న విషయాన్ని కొడుకులు, కోడళ్లు, కూతురి పాత్రలతో చూపించటం దర్శకుడి సమర్థత. ఈ వైరుధ్యం మధ్య కథను నడిపేందుకు దర్శకుడు ఎంచుకున్న పరికరం -సునిశితమైన హాస్యం. బరువైన విషయాన్ని అర్థమయ్యే రీతిలో ఆనందంగా, తేలిగ్గా చెప్పడంలో మారుతి ప్రయత్నం ఫలించింది.
ఫస్ట్ఫాలో ఏ హాస్యాన్ని యుక్తిగా వాడాడో -సెకెండాఫ్‌లో అదే హాస్యాన్ని అతిశయోక్తిగా ప్రయోగించాడు. కథా గాఢత పెంచడానికి ఆ సెటప్పే కలిసొచ్చింది. ప్రాణం పోయేవరకూ తాతను ఆనందంగా ఉంచుదామంటాడు మనవడు. ఆనందానికి విపరీతార్థాలు వెతుక్కున్న సంతానం -తండ్రిపై తమకున్న ‘ప్లాస్టిక్ ప్రేమ’ను ఒక్కోలా ప్రదర్శిస్తారు. చనిపోయిన తల్లి సమాధి పక్కన ‘డిజైన్డ్’ సమాధి కట్టేసి -బతికున్న తండ్రికి చూపిస్తాడు ఒక కొడుకు. ప్రపంచం చెప్పుకునేంత గొప్పగా, సౌకర్యవంతంగా శవయాత్రను ఎలా నిర్వహించబోతున్నామో -లైవ్‌లో చూపించే ప్రయత్నం చేస్తాడు మరో కొడుకు. ప్రాణం పోవడానికి గొంతులోపోసే తులసి నీళ్లు -మావయ్యకు టేస్ట్ చూపించాలనుకుంటుంది కోడలు. పిండ ప్రదానం, దినం భోజనాల మెనూ సైతం బతికుండగానే సిద్ధం చేస్తున్న సంతానాన్ని చూడాల్సిన ఖర్మ ఏ తండ్రికైనా వస్తే ఎలాగుంటుందో -అతిశయోక్తితోనే డ్రామా నడిపించటం బావుంది. ఆయా సన్నివేశాల్లో ఆడియన్స్ పెదాలపై నవ్వులు, రెప్పల మాటున కన్నీళ్లను ఒకేసారి పెట్టించటం మారుతి స్క్రిప్ట్ పదునుకు అద్దం పడుతుంది. సత్యరాజ్ పాత్ర తాలూకు పెయిన్‌ని చూపించటానికి అతిశయోక్తిని ఆశ్రయించినా -అది డ్రామాలో కలిసిపోయి.. పిల్లలు ఇలా ఉంటారా? ఇలా చేస్తారా? ఇలా జరుగుతుందా? అన్న లాజిక్స్ ఆడియన్స్ వెతుక్కోరు. తండ్రి చావుని భావోద్వేగంగా కాకుండా భారంగా చూస్తున్న పిల్లల మనస్తత్వాల్ని పచ్చిగా చూపించిన ఈ సన్నివేశాల్లో మారుతి సున్నితత్వాన్ని మర్చిపోలేదు. కథలో సత్యరాజ్‌ని హీరో చేయాల్సిన అవసరం లేదు కనుక -పిల్లల పెంపకంలో రఘురామయ్య విఫలమయ్యాడా? అన్న సందిగ్దానుమానాలు తలెత్తకుండా స్క్రీన్‌ప్లేను ప్రజెంట్ చేయడం దర్శకుడి యుక్తిగానే చూడాలి.
మిగిలిన సంతానం కంటే పెద్దకొడుకే కాస్త బెటరన్న భావవను కథనుంచి ఒక్కసారిగా తప్పించటం కూడా -దర్శకుడి కథా సమతుల్యతనే స్పష్టం చేసింది. ‘ఎక్కడికెళ్లినా నిమిషం అటూ ఇటూ కాకుండా వెళ్లిపొయే నువ్వు -చావు విషయంలో ఎందుకు టైమింగ్ మిస్సవుతున్నావ్’ అంటూ పెద్దకొడుకుతో ఫ్రస్ట్రేషన్‌లో ప్రశ్న వేయించి.. -కథలో భావోద్వేగాన్ని పరాకాష్టకు చేర్చాడు. ఈ కథను మరోలానూ చెప్పే అవకాశమున్నా -ఇంటెన్స్ సీన్స్‌తో చెప్పడానికి మారుడి ఫిక్సైనట్టు కనిపిస్తుంది.
పాత్రలను తీర్చిదిద్దటంలోనూ దర్శకుడి ప్రతిభ కనిపించింది. సత్యరాజ్ పాత్రలో ఆడియన్స్‌ని కూర్చోబెట్టగలిగాడు. రావు రమేష్ పాత్ర స్వభావాన్ని వాస్తవానికి దగ్గరగా చూపించటంలో మారుతి ఎక్కడా పట్టుతప్పలేదు. దర్శకుడి ఇంటెన్సిటినీ అనుభవ పూర్వక అవగాహనతో తెరపై చూపించటంలో సత్యరాజ్, రావురమేష్‌లు పూర్తిగా సక్సెస్ అయ్యారు. ఎమోషన్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయలేని పాత్రలో సత్యరాజ్, మనసును దాచుకోలేని పాత్రలో రావు రమేష్ -సినిమాకు పిల్లర్లుగా నిలిచారు. టిక్‌టాక్ సెలబ్రిటీగా రాశిఖన్నా పాత్ర -దర్శకుడి సునిశిత దృష్టికి దర్పణం పడుతుంది. సాయితేజ్ నటుడిగా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కథకు హీరోనన్న విషయాన్ని పక్కనపెట్టేశాడు. తాత గుండెకోత, అతని సంతానంపై కోపం.. కూల్ ఎక్స్‌ప్రెషన్స్‌గా చూపించటంలో సాయితేజ్‌లో మెచ్యూరిటీ కనిపించింది. మిగిలిన పాత్రలన్నీ మంచి నటనతో ఆకట్టుకున్నాయి. మంచి కంటెంట్, అందుకు తగిన సెటప్, సమర్థుడైన దర్శకుడు ఉండటంతో -మిగిలిన విభాగాలూ నాణ్యమైన అవుట్‌పుట్టే ఇచ్చాయి. సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్.. అన్నీ సినిమాకు ప్లస్‌లే అయ్యాయి. కీలెరిగి వాత పెట్టినట్టు -బాధ్యతను బావోద్వేగంతో గుర్తుచేశాడు మారుతి. చూడదగిన సినిమా -ప్రతిరోజూ పండగే.

-రాణీప్రసాద్