రివ్యూ

ఇద్దరి లోపం ఒకటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* ఇద్దరి లోకం ఒకటే
*
తారాగణం: రాజ్‌తరుణ్, షాలినీ పాండే, నాజర్, రోహిణి, పృధ్వీ, భరత్, సిజ్జు, కల్పలత, సన, ప్రదీప్ తదితరులు
కెమెరా: సమీర్‌రెడ్డి
సంగీతం: మిక్కీ జె మేయర్
సమర్పణ: దిల్ రాజు
నిర్మాత: శిరీష్
నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
దర్శకత్వం: జిఆర్ కృష్ణ
*
తెలుగేతర కథని తెలుగులోకి అనువదించేటప్పుడు మూలకథకు ముప్పురాకుండా, భాషా పరిమళాలు మిస్సవకుండా తెరపై ఆవిష్కరిస్తేనే అలరిస్తుంది. ఈ ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి టర్కిష్ చిత్రాన్ని ‘ఇద్దరి లోకం ఒకటే’ పేరిట తెలుగులోకి దర్శకుడు జిఆర్ కృష్ణ తేవడంవలన ఎక్కడా అలరించలేదు. సరికదా అసలీ చిత్రానికి ‘పర్పస్’ ఏమిటి? అన్న ప్రశ్న మనకి మనం వేసుకునేలా చేసింది. అన్నట్టు చిత్ర నాయిక వర్ష (షాలినీ పాండే) కూడా సినిమాలో పదే పదే ‘నీ లైఫ్‌కో పర్పస్ ఉన్నట్టుంది’ అంటూంటుంది. దురదృష్టవశాత్తూ సినిమా రెండు గంటల ఆరు నిమిషాలు నడిచినా -‘ప్రయోజనం’ మాత్రం శూన్యం. విషయానికొస్తే -ఒక రోజు తేడాతో ఊటీలో పుట్టిన వర్ష, మహి (రాజ్‌తరుణ్) అనంతరం వేరేచోట్ల పెరిగినా పద్ధెనిమిదేళ్ల అనంతరం హైదరాబాద్‌లో కలుస్తారు. అప్పుడే ఒకరి జ్ఞాపకాలు మరొకరు గుర్తు చేసుకుంటూ సన్నిహితులవుతారు. ఇది జరుగుతున్నపుడే రాహుల్ -వర్ష పెళ్లికి ఇరు కుటుంబాలూ సమాయత్తమవుతాయి. ఇది తెలిసి మహి కొద్దిగా దూరం జరుగుతుంది కానీ వారిమద్య వున్న విడదీయరాని అనుబంధం మళ్లీ దగ్గరికే తోస్తూంటుంది. మరి చివరకు ఏమైంది? అన్నది ముగింపు. ఈ మాదిరి కథాసూత్రం కోసం టర్కీని ఆశ్రయించటం మనల్ని కొంత ‘ఇర్క్’కి గురిచేస్తుంది. ఎందుకంటే ఇలా ఒకర్ననుకొని మరొకరితో ప్రేమలో పడటంవంటి తతంగాలు, ప్రేమకథల సంఘర్షణ ఎప్పటినుంచో మనకి సుపరిచితాలే. వెళితే వెళ్లారు కానీ తెలుగువారికేం నచ్చుతుందో తెలుసుకోకుండా సినిమాను వదిలేయడం ఒకరకంగా అనవసర సాహసం చేసినట్లే.
ఫస్ట్ఫా వచ్చేవరకూ సినిమా దిశ ఏమిటో తెలియదు. ఇక రెండో సగంలో కథనెలా చక్కబెట్టాలో అన్న హడావిడే కనబడింది తప్ప కూల్‌నెస్ ఫీల్ లేదు. దానికితోడు ఏవేవో చిక్కుముడులు పెట్టేయాలన్న తలంపుతో కొన్ని సీనే్లశారు. మచ్చుకు.. సినిమాలో వర్ష తల్లి (రోహిణి) ఆమె భర్తతో వేరుపడినట్టు చూపుతారు. అదీ తొలిభాగంలో కాదు. సినిమా గంటన్నర గడిచాక.. ‘నీ పెళ్లికి తండ్రికి శుభలేఖ ఇవ్వకు. నాకు ఆయన మొహం చూడడం ఇష్టంలేదు’ అని రోహిణి పాత్ర చేత చెప్పిస్తారు. దానికి సరైన సమన్వయం చేయలేదు. పోనీ ఇది ‘నీకోసం మూడేళ్లుగా వెయిట్ చేస్తున్నాడు రాహుల్ కనుక మంచివాడు’ అని చెప్పడం తల్లి ఉద్దేశ్యమైనా ‘మనం కలిసి తిరిగిన మూడేళ్లలో ఒక్కటంటే ఒక్కటైనా మెమొరబుల్ మూమెంట్ ఉందా? చెప్పు’ అని అదే రాహుల్‌ని వర్ష మరో సందర్భంలో అడుగుతుంది. మరి ఇలాంటి తన ఉద్దేశ్యాన్ని తల్లిముందు వర్ష చెప్పలేదెందుకు? అన్న సందేహమూ కలుగుతుంది. ఇలాంటి పరస్పర విరుద్ధ సన్నివేశాలు ప్రేక్షకుడిని గందరగోళానికి గురిచేస్తాయి. ఇంకో సింపుల్ ఇష్యూ అర్థంకానిదేమిటంటే, వాళ్లిద్దరిమధ్యా అంతటి గాఢమైన గురుతులు వెన్నాడుతుంటే, విడిపోయిన పద్ధెనిమిదేళ్లలో ఒక్కసారైనా ఒకరి గురించి మరొకరు తెలుసుకోవాలన్న తహతహ కనబర్చారా? అని. అయితే ఈ ప్రశ్నకు సమాధానంగా వర్ష ‘అప్పటి ఫొటోలూ, వగైరా నావద్ద ఏమీ లేవు’ అన్నా, అంతగానప్పని సమాధానం చెప్పినా, నిత్యం వర్ష చిన్ననాటి ఫొటో ముందుపెట్టుకుని తదేక ధ్యానం చేసే మహి కూడా మరే ప్రయత్నం చెయ్యడా? అన్నదానికి ఎలాంటి క్లారిటీ సమాధానమూ లేదు. సాధారణంగా సినిమాలో కథానాయకుడో, మరో పురుష పాత్రో డామినేటింగ్ నటన కనపరిస్తే దానిని ‘వన్ మేన్ షో’గా అభివర్ణిస్తారు. అలాంటప్పుడు ఈ సినిమాను ‘వన్ ఉమెన్ షో’ అనాలి. వర్షగా నటించిన షాలినీ పాండేయే అంతా తానై నటించింది. ఒకరంగా ‘అర్జున్‌రెడ్డి’లో విజయ్ దేవరకొండ ఎలాగైతే విజృంభించాడో, ఇందులో అదేస్థాయిలో అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ‘ఇరగదీసింది’. అర్జున్‌రెడ్డి- షాలినీపాండే అనగానే ఆ అంశమైన లిప్‌లాకింగ్ సీన్లు ఇందులోనూ ఉన్నాయి. కానీ వాటి సుదీర్ఘత కథకు అంతగా అతకలేదు. సినీ హీరోయిన్ అవ్వాలన్న తన కోర్కెను వ్యక్తపరిచే దశలోనూ, మహితో ట్రావెల్ చేసిన సందర్భంలో అనుభవించిన ఆత్మీయతానుభూతిని వ్యక్తపర్చిన తీరులోనూ చక్కటి నటన ప్రదర్శించిందామె. అలాగే ఆమె గుండెను మహికి అమర్చిన అనంతరం (హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్) వర్ష మనసుతో మాట్లాడించిన వైనమూ బావుంది. దానికింకాస్త క్లారిటీ ఇస్తే ఇంకా బాగా ఆడియెన్స్‌లో రిజిస్టరయ్యేది. మహిగా రాజ్‌తరుణ్ తనకలవాటైన జోనర్‌ను విడిచి సీరియస్ రోల్‌లో సిన్సియర్‌గానే నటించాడు. కానీ పాత్ర రూపకల్పనలో వున్న అసమగ్రతవల్ల ప్రేక్షకులకు అది చేరలేదు. మిగతా పాత్రల్లో నాజర్, రోహిణిలనే కాస్త పరిగణనలోకి తీసుకోదగ్గవి. ‘సూర్యుడొస్తే ఆడుకోవడం, చంద్రుడొస్తే పడుకోవడం..’ అంటూ బాల్య దశకు సంకేతంగా చెప్పిన సంభాషణ సహజంగా వుంది. అదేవిధంగా ‘నవ్వు-ఏడుపు’, ‘చీకటి-వెలుగు’ సామ్యంగా చెప్పిన డైలాగ్సూ బావున్నాయి. ప్రాబ్లమ్స్ వచ్చినపుడే ఫ్రెండ్‌షిప్ స్ట్రాంగవుతుంది అన్నదీ ఎన్నదగ్గ సంభాషణే. ప్రేమకథలకి సంగీతం ఎప్పుడూ ప్రాధాన్యత వహించే అంశమే. ఇందులోనూ సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ తన వంతు ప్రతిభను శక్తివంచన లేకుండా చేశారు కానీ, ఎందుకో ఒకేపాట సినిమా మొత్తం అన్ని సందర్భాల్లోనూ వచ్చిన భావన కలిగింది. ఉన్నంతలో కిట్టు విస్సాప్రగడ రాసిన ‘అదే ఊరు, అదే ఏరూ..’ పాట సాహిత్యపరంగా బావుంది. ఊటీ అందాల్ని సమీర్‌రెడ్డి కెమెరా బాగా చూపింది. ఆధార చిత్రానికి విధేయతా సూత్రంతోపాటు తెలుగుదనం కోసం దర్శకుడు జిఆర్ కృష్ణ కృషిచేసి ‘ఇద్దరి లోకం ఒకటే’ని రూపొందించి ఉంటే లోకంలో వారందర్నీ ఆకట్టుకునేది. అప్పుడు చిత్రబృందం ప్రచారం చేసుకున్నట్లు పిక్చర్ ఇంటికి వెళ్లినా గుర్తుండిపోయేది. ప్చ్.. ఇప్పుడా ఛాన్స్ లేదు మరి.

-అనే్వషి