రివ్యూ

అర్థం లేని దర్బార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* దర్బార్
*
తారాగణం: రజనీకాంత్, నయనతార, సునీల్‌శెట్టి, నివేదా థామస్, ప్రతీక్ బబ్బర్, యోగిబాబు, జ్యోతి సర్నా, నవాబ్ షా తదితరులు
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: సంతోష్ శివన్
నిర్మాత: సుభాస్కరన్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మురుగదాస్
*
ఓ స్టార్ డైరెక్టర్ ఓ సూపర్‌స్టార్‌తో చేసే సినిమా సక్సెస్ కావాలంటే -కంటెంట్‌లో బలమైనావుండాలి. క్యారెక్టరైజేషన్‌లో దమ్ముండాలి. ఫార్మాట్ పాతదైనా.. సక్సెస్‌కు సింపుల్ రోడ్ ఇదే. ఈ ఫ్రేమ్‌నుంచి బయటికొచ్చి సినిమాలు చేసినోళ్లూ లేకపోలేదు. కాకపోతే -వాటి ఫలితం.. పాతాళంలో ఉండొచ్చు. ఎవరెస్ట్‌కైనా ఎక్కొచ్చు.
**
స్టార్ డైరెక్టర్ -మురుగదాస్. సూపర్‌స్టార్ -రజనీకాంత్. వీళ్లిద్దరూ ఫస్ట్‌టైం సినిమాకు కమిటైనపుడు.. ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ ఓ రేంజ్‌కెళ్లాయి. అందుక్కారణం -ముందు చేసిన సినిమాలతో మురుగదాస్ ఇంటిలెక్చ్యువల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. సామాజిక సమస్యపై అతను స్పందించే తీరే వేరని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక రజనీ వింటేజ్ ఇమేజ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఏ కథనైనా.. తన స్టయిల్లోకి తెచ్చుకోగల తలైవా అతను. వీళ్లిద్దరి నుంచీ వచ్చిన సినిమా -దర్బార్. కథాబలం, క్యాచీ క్యారెక్టరైజేషన్ లేకుండా ఇద్దరి కాంబో ఇమేజ్‌పై నమ్మకంతో చేసిన సినిమా ఇది. -ఫలితం పాతాళంలో ఉందో, ఎవరెస్ట్‌కెక్కిందో సమీక్షలో చూద్దాం.
**
ఢిల్లీలో ఐపీఎస్ ఆఫీసర్ ఆదిత్య అరుణాచలం (రజనీకాంత్). ఎంటరవ్వడమే రౌడీ బ్యాచ్‌ని విచ్చలవిడిగా కాల్చేస్తుంటాడు. ఆ తరువాతే -ముంబయిలో అదుపుతప్పిన క్రైమ్‌ని కంట్రోల్ చేయడానికొచ్చిన సిటీ కమిషనర్ అని తెలుస్తుంది. ఆక్రమంలోనే ముంబయి డ్రగ్ మాఫియాను నడిపిస్తున్న అజయ్ మల్హోత్రా (ప్రతీక్‌బబ్బర్)ను అరెస్ట్ చేస్తాడు. శిక్షపడిన అజయ్ -తన పొలిటికల్ బ్యాగ్రౌండ్‌తో మారువ్యక్తిని సెల్‌లోపెట్టి విదేశాలకు చెక్కేస్తాడు. ముంబయి పోలీసుల అహం దెబ్బతింటుంది. విషయం తెలుసుకున్న ఆదిత్య -తెలివైన ప్లాన్ ప్రయోగిస్తాడు. అజయ్‌ని ఇండియాకు రప్పించడమే కాదు, తప్పించినవాళ్లే జైల్లో అతన్ని మట్టుబెట్టాల్సిన పరిస్థితి కల్పిస్తాడు. అజయ్ ఎన్‌కౌంటర్ సెనే్సషనవుతుంది. ఇంటర్నేషనల్ మాఫియా డాన్ చైర్‌లో కూర్చోబోతున్న హరి చోప్రా (సునీల్‌శెట్టి)కు ఈ బ్యాడ్ న్యూస్ తెలుస్తుంది. హరిచోప్రా సీన్‌లోకి దిగుతాడు. ఆదిత్య -హరి మధ్య వార్ మొదలవుతుంది. అసలు హరిచోప్రా ఎవరు? అజయ్‌తో సంబంధమేమిటి? అజయ్ ఎన్‌కౌంటర్‌తో ఆదిత్య ఎలాంటి టార్గెట్లు ఫేస్ చేశాడు? ఈ డాన్ కేసుని ముంబై పోలీసులు ఎంతకంత సీరియస్‌గా తీసుకున్నారు. దాని వెనకున్న కథేమిటి? లాంటి ప్రశ్నలకు సమాధానాలే మిగతా సీన్లు.
కథాపరంగా రజనీకి సూటయ్యే లైన్ అయినా -కథనంలో మాత్రం మురుగదాస్ మార్క్ ఎక్కడా కనిపించదు. యూట్యూబ్‌లో ‘రజనీ స్టైల్’ అని కొడితే చాలు -కుప్పలు తెప్పలుగా వీడియో క్లిప్‌లు వచ్చిపడతాయి. వాటిలోంచి కొన్ని ఏరుకుని కథకు గుదిగుచ్చాడు మురుగదాస్. అందుకే -30ఏళ్ల క్రితంనాటి రజనీ సిగ్నేచర్ స్టైల్స్ చూస్తూ కూర్చోవటమే తప్ప, మురుగదాస్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేని ఎక్కడా ఫీలవ్వం.
దర్శకుడిగా మురుగదాస్‌కు ఓ స్టయిలుంది. కథాబలానికి బిగువైన కథనాన్ని జోడించి ఆడియన్స్‌ని సీటు ఎడ్జ్‌లో ఎలా కూర్చోబెట్టాలో తెలిసిన దర్శకుడు. కాని, దర్బార్‌లో మాత్రం తనదైన స్టయిల్‌ని వదిలేసి, రజనీ వింటేజ్ చరిష్మాపై డిపెండైపోయాడు. విషయంలేని కథతో ‘గన్ గరిడీ’ చేయడం మురుగదాస్‌కు సాధ్యం కాలేదు. మురుగదాస్ నుంచి వచ్చిన అత్యంత బలహీన చిత్రాల్లో దర్బార్‌ది అగ్రభాగం అనడంలో సందేహాలు అక్కర్లేదు.
**
కథలో స్టారిజం లేనపుడు స్టూపర్‌స్టార్‌కైనా హీరోయిజం వర్కౌట్ కాదు. ఈ విషయాన్ని దర్బార్ మరోసారి గుర్తు చేసింది. రజనీ స్టయిల్ నడక, వంకర్లుతిప్పి పెట్టుకునే కళ్లజోడు స్టయిల్, గుంపులు గుంపుల్ని ఇరగదీసే సింపుల్ టెక్నిక్, సరదాగా పాటేసుకుంటూ ఉన్నచోటునుంచి కదలకుండా నడుంతిప్పే స్టెప్స్, అభిమానుల్ని విజిల్స్ వేయించే పవర్‌ఫుల్ పంచ్ డైలాగ్స్... -ఈ సుగర్ కోటింగులన్నీ కథబలంగా ఉన్నపుడు ఓకే. అసలుదే మిస్సయితే, తలైవాలైనా సినిమాను తరువాతి మెట్టేక్కించలేరు. దర్బార్‌లో ఇదే జరిగింది. సినిమా మొత్తాన్ని వింటేజ్ స్టైల్‌తో హిప్నటైజ్ చేద్దామన్న రజనీ స్కెచ్ బెడిసికొట్టింది. దాంతో, దాదాపు మూడు గంటల నిడివి సినిమాను భరించటం కష్టమైంది. ఏళ్ల క్రితంనాటి స్టయిల్‌ను వదలడానికి రజనీ ఒప్పుకోలేదో, వదిలించడానికి మురగదాస్ ఆసక్తి చూపించలేదోకానీ -ఇద్దరూ కలిసి పేలవమైన కథకు ప్రాణం పోసే ప్రయత్నంలో విఫలమయ్యారు.
మురుగదాస్ తీసిన అనేక కథల్లో -విలన్ సింగిల్‌గా, సింపుల్‌గానే కనిపించినా.. ప్రతినాయకుడి ఎలివేషన్లో మురుగదాస్ ఎక్కడా దొరకడు. గ్రాఫ్ పడిపోకుండా -విలన్ పాత్రను బలంగా తీర్చిదిద్దడం అతని స్టయిల్. దాంతో హీరోయిజం మరింతగా వర్కౌట్ అవుతుందని అతనికి తెలుసు. కానీ, దర్బార్‌లో విలన్‌ని తేల్చేసి, రజనీని ఎలివేట్ చేయడం (కేవలం బీజీఎంతో)పైనే ఫోకస్ పెట్టడంతో -కథలో సంఘర్షణ కరవై చప్పగా తయారైంది. మొత్తం సినిమాలో ఒక్క ఎపిసోడ్ మాత్రమే ఒకే అనిపిస్తుంది. అందులోనూ లాజిక్ ఉండదు. కాకపోతే -విలన్ కొడుకుని మట్టుబెట్టడంలో పోలీస్ ఆఫీసర్ ఇంటిలిజెన్స్ అన్న ఎపిసోడ్ ఒక్కటే ఆసక్తికరం.
రజనీ ఇంట్రో, పోలీస్ క్యారెక్టర్‌లో వేగం, నయనతారతో రొమాన్స్, కూతురు వల్లీతో ట్రావెల్‌లాంటి ఎడిసోడ్స్‌తో ఫస్ట్ఫా ఒకింత కుదురుగానే ఉన్నా, సెకెండాఫ్ మాత్రం ఏ విశేషం లేకుండా సాగి -ఆడియన్స్‌ని నీరుగార్చేసింది. ప్రీ క్లైమాక్స్‌లో ఇంటర్నేషనల్ డాన్ ఎంటరైన తరువాతైనా కథ పరిగెడుతుందని అనుకుంటే, అక్కడ మరీ చల్లబడిపోయింది. ఓవరాల్‌గా కూతురి సెంటిమెంట్‌తో సాగే రివేంజ్ డ్రామా పరమ రొటీన్ కావడంతో -దర్బార్‌ని తలైవా సైతం రక్షించలేకపోయాడు. కొన్ని సన్నివేశాలు చూస్తున్నపుడు -ఇది మరుగదాస్ తీసిన సినిమయేనా? అన్న సందేహాలూ మస్తిష్కంలో తళుక్కుమంటాయి. విలన్‌పైనున్న కసిని రజనీ హావభావాల్లో చూపిస్తుంటే.. ఆయనలోని రెండో కోణాన్ని మురుగదాస్ బయటకు తీస్తున్నాడా అన్న సందేహాలూ ముసురుతాయి. ఉద్యోగం నిలబెట్టుకోవడానికి రజనీ ఫిట్నెస్ ఎపిసోడ్ మరింత హాస్యాస్పదం కావడంతో -కథలోని ఇంటెన్సిటీని వదిలేసి కామెడీ చేస్తున్నారా? అన్న డౌట్లూ రాకపోవు. ఇలాంటి ఎపిసోడ్స్‌తో దర్బార్ గ్రాఫ్ పాతాళంలోకి పోయింది.
70 ఏళ్ల వయసులో రజనీకాత్ చూపించిన ఉత్సాహం ఒక్కటే సినిమాకు సింపతీ. కుర్రహీరోలా హుషారుగా కనిపించడానికి రజనీ వయసుకు మించి చేసిన కృషి ఓకే. రజనీ లుక్ బాగుంది. ఆయన సిగ్నేచర్ స్టైల్స్‌లో ఎక్కడా వేగం తగ్గలేదు. రజనీ నుంచి కొత్తగా తీసుకోవడానికి అవకాశమిచ్చే సీన్స్ లేవు కనుక- పోలీస్ పాత్ర టైలర్‌మేడ్ అయిపోయింది. నయనతార రేంజ్‌కి తగిన పాత్ర ఆమెకు లేదు. అంతకంటే, నివేదా థామస్‌కు ప్రాధాన్యత కలిగిన పాత్ర దక్కింది. విలన్‌గా సునీల్‌శెట్టి, ప్రతీక్‌బబ్బర్ చేయడానికేమీ లేదు. యోగిబాబు పూర్తిగా బోర్ కొట్టించాడు. మిగతా పాత్రలన్నీ చెప్పుకునేంత లేవు. అనిరుథ్ రవిచందర్ బీజీఎం -సినిమాను నిలబెట్టడంకంటే రజనీ వింటేజ్ స్టైల్‌ను ఒప్పించడానికే ఎక్కువ పనికొచ్చింది. పాటల్లో దుమ్ము ధూళి బాగున్నా -తమిళ ఫ్లేవరే డామినేట్ చేసింది. సినిమాటోగ్రఫీతో మెస్మరైజ్ చేసే అవకాశం సంతోష్ శివన్‌కూ దక్కలేదు. మూమూలు కథనూ రజనీ లెవెల్లో చూపించే ప్రయత్నంలో -లైకా ప్రొడక్షన్స్ కాంప్రమైజ్ కాలేదు. మిగతా సాంకేతిక విభాగాలు శక్తిమేరకు పని చేశాయి. దర్శకుడు మరుగదాస్ తెచ్చిన పేలవమైన పోలీస్ స్టోరీ -మిగతా విభాగాల పనితీరును పూర్తిగా మింగేసింది. దర్బార్.. రజనీ ఫ్యాన్స్‌కూ ఓ మామూలు సినిమా.

-మహాదేవ