రివ్యూ

రంగేళిరాజా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగుంది*** జవానీ.. జానెమన్
***
తారాగణం: సైఫ్ అలీఖాన్,
ఆలియా ఫర్నీచర్‌వాలా, టబు
బీజీఎం: కేథన్ సోడా
సినిమాటోగ్రఫీ: మనోజ్ కుమార్ కటోయ్
ఎడిటింగ్: సచిందర్ వాట్స్,
చందన్ అరోరా
బ్యానర్: పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత: జాకీ భగ్నానీ
దర్శకత్వం: నితిన్ కక్కర్
***
జీవితం -కొన్ని అనుకున్న, మరికొన్ని అనుకోని సంఘటనల సమాహారం. ఈ జీవితాన్ని నేను నా ఇష్టం వచ్చినట్టు, నాకు నచ్చినట్టు జీవిస్తాను. కట్టుబాట్లకు లొంగను. నేను వీటికి అతీతుడిని -అని అడ్డదిడ్డమైన దారుల్లో వెళ్తుంటే కాలం చూస్తూ ఊరుకోదు. దాంతో నువ్వెంత ఆడుకోవాలని చూస్తే అది నీతో వందరెట్లు ఎక్కువ ఆటాడుతుంది. నువ్వు కాలాన్ని, జీవితాన్ని ఎంత గౌరవిస్తే అది నిన్ను అంతకుమించి గౌరవిస్తుంది. తేడా వచ్చిందా.. వాతపెట్టి మరీ జీవితపాఠం నేర్పిస్తుంది.
మనని మనం అర్థం చేసుకోకుండా, యవ్వనాన్నీ శక్తిని దేనికి వాడాలో దానికి వాడకుండా.. విచ్చలవిడిగా జీవిస్తే ఏమవుతుందో హస్యంతో చెప్పే ప్రయత్నమే -జవానీ జానెమన్.
పూజా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై దర్శకుడు నితిన్ కక్కడ్ తెరకెక్కించాడు. నిర్మాత జాకీ భగవతి సారథ్యంలో రూపుదిద్దుకున్న చిత్రమిది.
జస్విందర్‌సింగ్ అలియాస్ జాక్స్ (సైఫ్ అలీఖాన్) రియల్ ఎస్టేట్ బ్రోకర్. అమ్మా, నాన్న, తమ్ముడికి దూరంగా ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకొని ఒంటరిగా ఉంటుంటాడు. అతని జీవిత లక్ష్యం -మందు, విందు, పొందు. వయసు 40ల పైమాటే. రోజూ పబ్బులు, క్లబ్బులు తిరుగుతూ.. తాగుతూ, పరిచయమైన అమ్మాయిలతో శృంగారం చేస్తూ అదే ఆనందం అదే జీవితమనుకుని గడిపేస్తుంటాడు. ఎవరైనా పెళ్లి మాటెత్తితే.. నేను పులిని, పెళ్లి చేసుకుంటే పిల్లినవుతాననే ధోరణిలో మాట్లాడుతుంటాడు. డబ్బు కూడా ఆ ఆనందాలకు సరిపడా మాత్రమే సంపాదిస్తుంటాడు.
ఓరోజు క్లబ్బులో ఓ అందమైన అమ్మాయి పరిచయమవుతుంది. పేరు టియా (ఆలియా ఫర్నీచర్‌వాలా) 20ఏళ్ల అందమైన అమ్మాయి. ఆ అమ్మాయిని తన ఫ్లాట్‌కి తీసుకొచ్చి మందుపోసి తనకలవాటైన పనికి సన్నద్ధం చేస్తుంటాడు. అపుడు ఆ అమ్మాయి -నేను మా నాన్నను వెదుక్కుంటూ వచ్చాను అంటుంది. కొద్దిసేపటి తరువాత ‘ఆ నానె్నవరో కాదు, మీరే’ అంటూ బాంబు పేలుస్తుంది. జాక్స్‌కి మతిపోతుంది. నేను మీ నాన్నను కానంటూ ఎన్నిరకాలుగా చెప్పినా వినదు. పైగా తన తల్లితో అతను తీయించుకున్న ఫొటోని చూపిస్తుంది. ‘నా తల్లి అనన్య (టాబు)కి నువ్వు మాజీ ప్రియుడివి. నీవల్లే నేను పుట్టాను’ అంటూ సాక్ష్యాలు చూపిస్తుంది. డిఎన్‌ఏ పరీక్ష వరకూ వెళ్తుంది. చివరికి తండ్రీ కూతుళ్లుగా మారిపోతారు. అప్పటికే జాక్స్ జీవితం అల్లకల్లోలమైపోతుంది. ఇది చాలదన్నట్లు తన కూతురు గర్భవతి అని తెలుస్తుంది. గర్భం చేసినవాడు బ్రేకప్ చెప్పి వెళ్లిపోయాడని, లోపలవున్న నీ మనవడిని లేదా మనవరాలిని నువ్వే చూసుకోవాలన్నట్టుగా మాట్లాడుతుంది. అసలు పెళ్లి చేసుకోకుండా ‘రంగేళి రాజా’లా బతకాలని కలలుగన్న జాక్స్ జీవితంలోకి కూతురు, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు తాత అవ్వాల్సి వస్తుంది.
ఇది చాలదన్నట్టు విచ్చలవిడి జీవితం (హిప్పి) గడిపే తన మాజీ ప్రియురాలు అనన్య (టబు) -మళ్లీ అతని జీవితంలోకి వస్తుంది. ఆమెతోపాటు గర్భం చేసి వెళ్లిపోయిన టియా బాయ్‌ఫ్రెండూ వస్తాడు. జాక్స్‌కి ఇప్పుడు భార్య, కూతురు, అల్లుడు, మనవడు, అమ్మా , నాన్న, తమ్ముడు. అసలు కుటుంబమే వద్దంటూ ప్లేబోయ్‌గా బ్రతికిన అతని జీవితంలో ఇంత పెద్ద కుటుంబాన్ని అతడు ఎలా సమన్వయం చేశాడు అనేది చూడాల్సిందే!
నటన విషయానికి వస్తే సైఫ్ అలీఖాన్ ఓ అద్భుతం సృష్టించాడని చెప్పొచ్చు. చాలా సినిమాల్లో అతడిని ఓ ఫైటర్‌గానో, మరోలానో చూసిప్తారు. కానీ ఈ సినిమాలో ఓ ప్లేబోయ్ పాత్రకు పూర్తి న్యాయం చేసి పాసయ్యాడు. అతని డైలాగ్స్ బాగున్నాయి. పెళ్లికాగానే ప్రతి మగవాడు -నేను మగవాడ్ని అని మీసం తిప్పుతారు. కానీ భార్య గర్భవతి అని తెలియగానే మగతనం జారిపోయి బాధ్యతలు గుర్తుకొస్తాయి అంటాడు. చివరలో అతను తాతగా మారి మనవడిని ఆడించటం ఓ అద్భుత ఘట్టం. ఇక ఓ హిప్పీగా టాబు కనిపించింది కాసేపే కాని పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసింది.
సినిమాకి ఆయువుపట్టు ఆలియా (టియా). తను నిజంగా ఓ అద్భుతం. నటనని నటనలాకాక ఓ జీవితంలా చూపించింది. వీళ్ల ముగ్గురితోనే సినిమా నిలబడిందని చెప్పాలి. దర్శకుడు నితిన్ కక్కడ్ ప్రతిభ చాలా ఫ్రేముల్లో కన్పించింది. సైఫ్‌లోని మరో నటుడిని పరిచయం చేశాడు. పంజాబీ స్టైల్‌లో పాటలు బావున్నాయి. రిచ్ సీన్స్ తీశాడు. సినిమాని చాలావరకూ నవ్వులతో ముంచెత్తాడు. సినిమా బిగుతు ఎక్కడా చెడకుండా కాపాడాడు. మొత్తంగా 2 గంటల హాస్యపు జల్లులతో తడిసి ముద్దయ్యేలా చేశాడు.

-మధుర మురళి