రివ్యూ

కామెడీ లేని కోతిగోల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* త్రీ మంకీస్
*
తారాగణం: సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, కారుణ్య చౌదరి, కౌటిల్య, ప్రియ, షకలక శంకర్ తదితరులు
సంగీతం: జి అనీల్‌కుమార్
కెమెరా: సన్నిదాము
నిర్మాత: నగేష్ జి
దర్శకత్వం: అనిల్‌కుమార్.జి
*
ఉప్పు ఉప్పగా ఉండాలి. పంచదార తియ్యగా ఉండాలి. అవి వాటి సహజ గుణం. అందుకు విరుద్ధంగావుంటే ఆస్వాదించడం కష్టం. అలాగే జబర్దస్త్ టీవీ ప్రోగ్రాం ద్వారా జనావళికి దగ్గరైన సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ ముఖ్య పాత్రధారులుగా పెద్దతెరపై ‘త్రీ మంకీస్’గా వస్తే వింత హంగామా ఉండాలని ఊహించుకుని వచ్చిన ప్రేక్షకులు ఒక్కసారిగా వీటి వాలకం చూసి విస్తుపోయారు. పోనీ, పైన చెప్పిన ఉప్పు ఉపమానం పక్కనపెట్టి ఇంకోకోణం నుంచి సినిమా చూద్దామా అంటే, అక్కడా ఫిలిం ఫ్లాటైపోయింది. అదెలా అంటే, ‘అడిగితే చేసేది దానం, అడగకుండా చేసేది సాయం’ అనే ఉదాత్త డైలాగ్‌తో సినిమా ఆరంభ సన్నివేశం నడుస్తుంది. అవి చూసి మిగతా సీన్స్ ఆ స్థాయిలో ఉంటాయనుకుని చూస్తే, నెక్స్ట్ సీన్‌లోనే ఓ పోలీస్ ఆఫీసర్ (కౌటిల్య) ఇంకో వ్యక్తిని చంపడం చూపించారు. దాంతో ఉదాత్తత హుష్ కాకి అయిపోయింది. ఇలా రెంటికీ చెడ్డ రేవడిలా త్రీ మంకీస్ చేష్టలు చేసేశాయి.
మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం చేస్తున్న సంతోష్ (సుడిగాలి సుధీర్), మంచి దర్శకుడు అయిపోదామని ప్రయత్నించే ఫణి (గెటప్ శ్రీను), సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆనంద్ (ఆటో రాంప్రసాద్) ముగ్గురూ స్నేహితులు. ఓ ఆనంద సందర్భంలో పార్టీ చేసుకొని ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఓ ఆశ (కారుణ్య చౌదరి)ను తెచ్చుకుంటారు. కానీ ఆ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంట్రీ టైమ్‌లోకి ఆశ ఓ మాత్ర వేసుకొని చనిపోతుంది. అది చూసిన ముగ్గురూ ఠారెత్తిపోయి గందరగోళానికి గురవుతారు. మరి ఆశ నిజంగా చచ్చిపోయిందా? అసలేం జరిగింది అన్న వాటి కథా గట్రా తర్వాత తెలిపి మనల్ని ఇంటికి పంపుతారు. దర్శకుడు అనిల్‌కుమార్ కామెడీ ఆర్టిస్టులతో వెరైటీగా ట్రాజెడీ సీన్స్ పండిద్దామని అనుకుని ఉంటారు. కానీ సినిమాలో ఓ పాటలో ‘అనుకున్నది జరగదు’ అన్న పదంలాగే సినిమా తెరపై కనపడింది. అసలు అనుకున్న సీన్స్ అనుకున్నట్టు అవ్వడానికి దర్శకుడు చేసిన ఏ ప్రయత్నం సరిపోదు. మచ్చుకి ఓ సీన్ చూద్దాం. ఆశకు చాలా అరుదైన తీవ్రమైన వైద్యం అవసరం. నిరంతరం కొట్టుకోవాల్సిన గుండె ఒక్కోసారి ఆగిపోతుంది. మరో పరిసర శబ్ద ప్రభావమో, మరో కారణంవల్లనో తిరిగి కొట్టుకోవడం వంటిది జరుగుతుంది. మరి ఇలాంటిదాన్ని కొద్దిగా వివరంగా చెబితే బాగుండేది. ఇలా చెప్పకపోవడం వల్ల గుండె ఆగిపోవడం, తిరిగి కొట్టుకోవడం చాలా హాస్యాస్పద అంశంగా అనిపించింది. అలాగే మిగతా సన్నివేశాల కూర్పు దర్శకుని అనుభవరాహిత్యాన్ని చూపింది. ఇక హాస్యం కోసం సృష్టించిన డా.బాలి (షకలక శంకర్)తో చూపిన డబుల్ మీనింగ్ కామెడీ కాలం చెల్లిపోయింది. ఆ గ్రహింపూ చిత్ర బృందానికి కలగకపోవడం ఆశ్చర్యకరం. ఇక సినిమాలో వాడినవన్నీ టాయిలెట్ సీన్స్ సంబంధించిన మాటలతో బహుశా ఇటీవలికాలంలో ఏ సినిమాలోనూ వచ్చి ఉండవు. ఇదేమి ఆలోచనా ధోరణో అర్థంకాదు. సినిమాలో ఏ ట్విస్ట్ అనుకోని విధంగా లేదు, ఒక్కటి తప్ప. చిన్ననాట చిన్నగా సంతోష్ చేసిన ధన సహాయంతోనే తల్లి దహన సంస్కారం చేసిన వ్యక్తి పోలీస్ ఆఫీసరై వీరికి సాయం చేయడం అన్న మలుపు బాగుంది. నటులుగా మంచి టైమింగ్‌తో జబర్దస్త్ ద్వారా ప్రూవ్ చేసుకున్న ముగ్గురూ స్క్రిప్ట్ పరిధి మేరకు బాగానే నటించారు. ఆ ముగ్గురిలో ఫణి పాత్రధారి గెటప్ శ్రీనును ముందు చెప్పుకోవాలి. కథను నమ్ముకుంటాను తప్ప అమ్ముకోను అన్న తను, చివరకు పరిస్థితులు మనిషి నమ్మకాన్ని అమ్ముకునేలా చేస్తాయి అన్న సన్నివేశాల్లో శ్రీను ఎన్నదగిన నటన కనబరిచారు. మొదట సన్నీలియోన్‌గా తర్వాత ఆశగా కారుణ్య చౌదరి ఓకె. మిగిలిన పాత్రలు వేటికీ సినిమాలో చెప్పుకొనేంత స్థాయి ఇవ్వలేదు. సంభాషణల్లో సాఫ్ట్‌వేర్ వాళ్లకు జీతం ఎక్కువ జీవితం తక్కువ వంటివి బాగున్నాయి. అనిల్‌కుమార్ పాటల్లో జేసుదాసు గాత్రం ఛాయలు కలిగిన మధుబాలకృష్ణన్ పాడిన ‘పయనం బరువైపోయెనా? నయనం నీరై పోయెనా’ బాగుంది. ఇందులో ఒకచోట ‘క్షణకాలం క్షణికాలై చెరసాలై పోయెనా’ అంటూ వాడిన పదం అర్థవంతంగా వుంది. కానీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అవసరమైన స్థాయికంటే చాలా ఎక్కువగా వుంది. దీనివల్ల కొన్ని ముఖ్యమైన సీన్స్‌లో పాత్రధారులు మాట్లాడే మాటలు వినబడలేదు. ఎంచుకున్న స్క్రిప్ట్‌పై పకడ్బందీ ఎక్స్‌ర్‌సైజ్ చేసి సీన్స్ కన్విన్సింగ్‌గా వచ్చేంతవరకూ సినిమాను తెరపైకి తేకూడదన్న ‘ఆన ఆన ఆన’ (ఆన ప్రయోగం ఈ సినిమాలోదే)ను చిత్ర సంబంధీకులు వేసుకుని పాటించి తదుపరి చిత్రాలు అందిస్తే అవి ప్రేక్షకుల్ని అలరించవచ్చు.

-అనే్వషి