రివ్యూ

ప్రతీకార పర్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగుంది*** మలంగ్
***
తారాగణం: ఆదిత్యరాయ్ కఫూర్, దిశాపటానీ, అనిల్ కఫూర్, కునాల్ ఖేము తదితరులు
బీజీయం: రాజు సింగ్
సినిమాటోగ్రఫీ: వికాశ్‌రామన్
ఎడిటింగ్: దేవేంద్ర ముర్దేశ్వర్
కథ: అసీమ్ అరోరా
స్క్రీన్‌ప్లే: అనిరుథ్ గుహ
దర్శకత్వం: మోహిత్ సూరి
***
సృష్టిలో ప్రతి ప్రాణీ తనలాంటి మరో ప్రాణిని సృష్టిస్తుంది. సృష్టించాలి కూడా! లేకుంటే లోకం ఆగిపోతుంది. తన కడుపులో తమ ప్రతిరూపం రూపుదాల్చుకుంటుందని తెలియగానే మాతృత్వపు మమకారం పెల్లుబుకుతుంది. అదే తండ్రికైతే మమకారంతోపాటు ఎన్నో బరువులు, బాధ్యతలు, బంధాలు గుర్తుకొస్తాయి. తమద్వారా ఈ లోకంలోకి మరో ప్రాణి రాబోతోందని తెలిస్తే, ఆ ఆనందమే వేరు. మనుషులు పెళ్లికాకముందు ఒకలా, పెళ్లయ్యాక ఒకలా, పిల్లలు పుట్టాక మరోలా మారిపోతుంటారు. ఎంత విచ్చలవిడి జీవితం గడిపినా, ఎంత కఠినాత్ముడైనా తన సంతాన వార్త వినగానే సాధువులా మారి కొత్త ప్రపంచ నిర్మాణానికి పూనుకుంటాడు. తనవారికోసం ఓ కొత్త లోక నిర్మాణంలో మునిగిపోతాడు. తాను, భార్య, పిల్లలు.. ఇలా అందమైన కల. ఈ కలని ఎవరైనా అన్యాయంగా చిదిమేస్తే.. మలంగ్.
లవ్ ఫిలిమ్స్ పతాకంపై టి సీరీస్ నిర్మాణంలో మోహిత్ సూరి దర్శకత్వం పర్యవేక్షణలో నిర్మితమైనదే -మలంగ్. అద్వైత్ (ఆదిత్యరాయ్ కపూర్) ఓ స్వేచ్ఛాజీవి. ఇంట్లో ఉండటం ఇష్టంలేక, ప్రపంచంమీద పడి కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్తూ జీవితాన్ని ఆస్వాదిస్తుంటాడు. వెళ్లిన ప్రతి ప్రదేశాన్నీ తన వీడియోలో బంధిస్తూ కాలం గడుపుతుంటాడు. సారా (దిశా పటాని)కు హిప్పీ జీవితం అంటే గౌరవం, ఇష్టం. తనకు నచ్చినట్టు తానుండాలి. తన జీవితంలో ఎదురయ్యే మగవాళ్లతో వైల్డ్ జీవితం గడపాలి. ప్రపంచంలోని అన్ని జంతువుల మాంసాన్ని రుచిచూడాలి. ఇలా చిత్ర విచిత్ర ఆలోచనలతో గడిపేస్తుంటుంది.
ఓసారి అనుకోకుండా అద్వైత్, సారా గోవాలో కలుసుకుంటారు. ఓ క్లబ్‌లో చిందులేస్తుంటే పోలీసుల రైడింగ్‌లో ఆమెను కాపాడుతాడు. అప్పటినుంచి వాళ్ల ఆలోచనలు కలిసి సహజీవనం చేస్తుంటారు. ఒకరోజు తాను గర్భవతి అని సారాకు తెలుస్తుంది. ఇంత విచ్చలవిడి జీవితానికి అలవాటుపడిన సారా, తనలోపలి ప్రాణాన్ని ప్రేమించడం మొదలెడుతుంది. అబార్షన్ చేయించుకోకూడదని నిర్ణయించుకుంటుంది. కానీ అద్వైత్ ఈ విషయం తెలిసి కంగారుపడిపోయి తన స్వేచ్ఛకు బ్రేక్ పడుతుందనే భయంతో సారాని గోవాలో ఒంటరిగా వదిలి దాదాపుగా పారిపోతాడు. కానీ మధ్యలో తన చిన్ననాటి స్నేహితులు ఇల్లు వాతావరణం చూశాక అతనిలో మార్పు. తనకూ భార్య, ఆమె కడుపులో పెరుగుతున్న తన ప్రతిరూపం గుర్తుకొచ్చి చాలావేగంగా సారా దగ్గరకు వచ్చేస్తాడు. రాగానే, తన సారా ఓ విచిత్ర పరిస్థితుల్లో వుంటుంది. ఆమెను కాపాడే క్రమంలో తాను పూర్తిగా ఆ భయంకర వలయంలో ఇరుక్కుపోతాడు. తన స్నేహితురాలి గర్భంపోతుంది. తాను కన్న కలలన్నీ తన కళ్లముందే నిర్దాక్షిణ్యంగా చిదిమివేయబడతాయి. ఈ భయంకర పరిస్థితినుండి బయటకువచ్చి అద్వైత్ ఏం చేశాడు? అతనికి ఇలాంటి పరిస్థితి కల్పించింది ఎవరు అనేదే సినిమా.
అద్వైత్‌గా నటించిన ఆదిత్య నూటికి నూరుమార్కులు కొట్టేస్తాడు. నాణ్యమైన అద్భుతమైన నటనని కురిపించేశాడు. బాధ్యతలనుండి పారిపోయి ఒంటరిగా, టూరిస్టుగా బ్రతకాలనే ఓ బాధ్యతారాహిత్యమైన పాత్ర. తనవల్ల ఓ అమ్మాయిలో తన ప్రతిరూపం పెరుగుతుందని, ఇక తాను పారిపోలేనని, ఈ అందమైన తండ్రి బాధ్యతని మోయాలని తపనపడే మరో పాత్ర, తన అందమైన ప్రపంచాన్ని అతలాకుతలం చేసినవాళ్లని నిర్దాక్షిణ్యంగా హతమార్చే ఓ క్రూర స్వభావి పాత్ర.. ఇలా మూడు పాత్రలకు పూర్తి న్యాయం చేశాడు. కండలు తిరిగిన దేహంతో టఫ్‌గా కన్పిస్తూ చలాకీగా నటించాడు.
సారాగా దిశాపటాని చాలా సింపుల్‌గా ఈజ్‌తో నటించింది. డ్రగ్స్, శారీరక సంబంధాలు, బాధ్యతలులేని ఓ కేర్‌లెస్ అమ్మాయిగా చాలా అందంగా నటించింది. తన కడుపులో బిడ్డ పెరుగుతుందని తెలిసి.. ఆ నటనలో ఎంత హుందాతనం.. రెంటినీ చాలా జాగ్రత్తగా పోషించింది. కడుపులోని ఈ పాపని పెరగనిద్దాం, దాన్ని చంపే హక్కు మనకు లేదు అన్నపుడు ఎక్కడో హృదయ లోతుల్లో గుచ్చుకుంటుంది. ఇదికదా అసలైన జీవితం అని తెలుసుకున్నట్టుగా పరిపక్వ నటన అద్భుతం.
ఆంజనేయ అఘసే (అనీల్‌కపూర్) పాత్ర ఓ మంచి సృష్టి. మంచి పోలీసు ఆఫీసర్‌గా గోవాలో పని చేస్తుంటాడు. తన కూతురు ఓ డ్రగ్స్ క్లబ్‌లో కాల్పుల్లో మరణిస్తుంది. తాను ఎంతగానో ప్రేమించే తన కూతురు తన కళ్లముందే ఒరిగిపోవడం భరించలేకపోతాడు. అప్పటినుంచి ఓ రాక్షసుడిలా మారి విపరీతంగా డ్రగ్స్ తీసుకుంటూ ఏ రూల్స్ పాటించకుండా డ్రగ్ మాఫియావాళ్లను ఎన్‌కౌంటర్ చేస్తుంటాడు. ఇలాంటి పాత్రలు ఆయనకు టైలర్‌మేడ్. అలవాటైన నటనని ఆడుతూ పాడుతూ చూపించాడు అనీల్. పిల్లల విచ్చలవిడి జీవితాలవల్ల తల్లిదండ్రులు ఎలా మారాతారనే విషయాన్ని అనీల్ పాత్ర ద్వారా దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు. సినిమాలో జరిగే విషయాలకు, ఆంజనేయకు నిజానికి చాలావరకూ సంబంధమే లేనట్లు, కొన్నిచోట్ల బలవంతాన ఆ సంఘటనలు కలిపినట్టు మాత్రం కన్పిస్తాయి.
ఇక చివరగా మైఖేల్ (కునాల్ ఖేము) పాత్ర. అసలు సినిమా ఇతనిదే. తనకున్న ఓ బలహీనతని కప్పిపుచ్చుకోవడానికి తనకున్న పోలీసు పోస్టుని అడ్డుపెట్టుకుని చేసే అరాచకాలు సినిమాకు ఆయువుపట్టు. అతని నటన ఈ సినిమాకే హైలెట్. ఓ సిన్సియర్ ఆఫీసర్‌గా నటిస్తూ, తన బలహీనతని ప్రశ్నించేవాళ్లను మట్టుబెడుతూంటాడు. డైలాగులు బాగున్నాయి. ప్రతీకారం తీర్చుకోవాలంటే రెండు సమాధులు తవ్వాలి. ఒకటి నీది, రెండవది చచ్చేవాడిది అంటాడు. నువ్వు మానసికంగా, వాడు శారీరకంగా! స్ర్తిలను గౌరవించనివారు మగాడు అని చెప్పడానికి పనికివస్తాడు. నిజంగా కాదు అంటుంది. పాటలు సందర్భానికి తగినట్లున్నాయి. ముఖ్యంగా హీరో వెళ్లిపోయేటప్పుడు ‘కబీనా ఆవూంగా (ఎప్పుడూ రాను)’ అంటూ సాగే పాట హృద్యంగా ఉంది.
సినిమా అంతా గోవాలోనే కాబట్టి కల్చర్ అలాగే చూపెట్టారు. దిశ గోవా బీచ్ బికినీ పాటలు వగైరా వగైరా.. దర్శకుడు మోహిత్ సూరి సినిమాపట్ల ఇష్టం, ప్రేమపట్ల అవగాహన చాలా ఫ్రేమ్స్‌లో కన్పిస్తుంది. మంచి లొకేషన్లు చూపించారు. హీరో హీరోయిన్స్‌ని హింసించే సీన్స్ ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించేలా తీశాడు. అనీల్‌కపూర్ పాత్రని సినిమా కథకి ఇంకొంచెం కలిపితే బావుండేది. అతనిది వేరే కథ అన్నట్టుగా రెండు సినిమాలు చూస్తున్నట్టుగా అన్పిస్తుంది. దర్శకుడు సినిమాను స్టైల్‌గా చూపించటంలో చాలావరకు విజయం సాధించాడు.

-మధుర మురళి