రివ్యూ

బోర్డర్ దాటని లవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు** వరల్డ్ ఫేమస్ లవర్
**
తారాగణం: విజయ్ దేవరకొండ, రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ ధ్రెస్సా, ఇజిబెల్లా, ప్రియదర్శి, జయప్రకాష్ తదితరులు
సినిమాటోగ్రఫీ: జయకృష్ణ గుమ్మడి
సంగీతం: గోపీసుందర్
నిర్మాత: కెఏ వల్లభ
దర్శకత్వం: క్రాంతిమాధవ్
**
దిసీజ్ మై లాస్ట్ లవ్ స్టోరీ. ఇదీ -ప్రమోషన్స్ టైంలో యంగ్ సెనే్సషన్ విజయ్ వదిలిన ప్రచారాస్త్రం. ‘అర్జున్‌రెడ్డి’లాంటి సినిమాతో లవ్‌లో కొత్త ఫేజ్ చూపించిన కుర్రాడిలో ఎంతలో ఎంత మార్పు? అనుకున్నారంతా. లవ్ స్టోరీతో సెనే్సషన్ అయిన విజయ్ -ఒకేసారి మూడు ప్రేమ కథలు చెయ్యడంతో బహుశ బోర్ కొట్టేసిందేమో అనుకున్నారు కూడా. కానీ -విజయ్ ఆ డైలాగ్ వదలడానికి కారణం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చూశాక మాత్రం కచ్చితంగా అర్థమవుతుంది.
ఈ కథకు -రచయిత, దర్శకుడు క్రాంతిమాధవ్. భావోద్వేగ ఆద్యంతాలను -కుక్కికుక్కి చూపించాలనుకునే ఆయన ప్రయోగాత్మక రచనలు ఒక్కోసారి ‘ఆహా’ అనిపిస్తే, మరోసారి ‘ఓహ్’ అనిపించినవీ ఉన్నాయి. ఈసారీ ‘ప్రేమకోసం ఆలోచనల పరంపరలో ఫ్రేములు దాటెళ్లిన గౌతమ్ అనే కుర్రాడికి -జీవితం ఎలాంటి విచక్షణారహిత పాఠం నేర్పించింది’ అన్న సంక్షిప్త కథను భిన్న కోణాల్లో చూపించే ప్రయత్నం చేశాడు. కన్ఫ్యూజింగ్‌గా ఉంది కదూ. సింపుల్‌గా చెప్పుకోవాలంటే -హీరోగా విజయ్ దొరికాడు కనుక.. మూడు ప్రేమకథల్ని ఒకే టికెట్‌పై ఒకే సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు.
***
జీవితం ఏం నేర్పిందో -లాకప్‌లోని గౌతమ్ (విజయ్ దేవరకొండ) రివ్యూ చేసుకోవడంతో కథ మొదలవుతుంది. రచనలంటే గౌతమ్‌కి పిచ్చి. మంచి రైటర్‌గా పేరు తెచ్చుకోవడానికి -ఉద్యో ఉద్యోగాన్నీ వదిలేస్తాడు. ఆ క్రమంలో తారసపడిన యామిని (రాశిఖన్నా)తో లవ్ జర్నీ మొదలవుతుంది. రచయితగా తన సంకల్పం నెరవేర్చుకోడానికి సహకరించమంటాడు. లక్ష్యంవున్న గౌతమ్ నచ్చటంతో -సహజీవనానికి సిద్ధపడుతుంది. సహజీవన జర్నీలో యామినికి మునుపటి గౌతమ్ కనిపించడు. రచనపై దృష్టిపెట్టకుండా -కాలయాపన చేస్తున్న గౌతమ్ చిరాకు పుట్టిస్తాడు. జీవితాన్ని మత్తుగా సాగించే నీతో జర్నీ కష్టమంటూ బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది. తాను మారడానికి టైమ్ ఇవ్వాలంటూ -మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధపడిన యమినిని ప్రాథేయపడినా వినిపించుకోదు. ఆ సంఘటనతో గౌతమ్ -ఎటు జర్నీ చేశాడు. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు. బొగ్గు గనుల ప్రాంతం ఇల్లందులో ఐశ్వర్యతో సాగించిన వైవాహిక జీవితమేంటి? ప్యారిస్‌లో ‘ఈజా’ అనే పైలెట్‌తో ఎప్పుడు ప్రేమలో పడ్డాడు. ఇలా భిన్నమైన ప్రేమకథల్లో -గౌతమ్ పాత్రేంటి? చివరికి ఏం జరిగింది? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.
ప్రేమలో పడిన కుర్రాడికి కాలం నేర్పిన కఠిన పాఠం -అన్న పాయింట్‌ని మూడు ఎపిసోడ్స్‌గా విడదీశాడు క్రాంతిమాధవ్. హైదరాబాద్‌లో గౌతమ్-యామిని, ఇల్లందులో సువర్ణ, స్మిత, ప్యారిస్‌లో ఈజాతో సాగే ఎపిసోడ్స్ సారమే.. ఓవరాల్‌గా -వరల్డ్ ఫేమస్ లవర్. నిజాయితీగా కథ రాసుకున్నా -విజయ్ బాడీ లాంగ్వేజ్, ఇమేజ్ పరిధిలోకి కథను లాక్కురావడంతో -‘అర్జున్‌రెడ్డి’ ఫ్లేవర్‌లోకి వచ్చేసినట్టే అనిపించింది. గౌతమ్ లైఫ్‌లో రియల్ లవ్ యామిని. అందుకే -గౌతమ్ ఆలోచనల్లో పుట్టిన ప్రేమకథలను పరిమితంగా, ఆసక్తికరంగా చెప్పాడు దర్శకుడు. ప్రేమలోని రొమాన్స్, ఎమోషన్, అట్రాక్షన్ అన్న కోణాల్లో నలుగురు హీరోయిన్లను చూపిస్తూ -కమర్షియాలిటీ కోసం శత్రు పాత్రలో చిన్నపాటి విలనిజం.. అనూహ్య ఘటనతో తలెత్తిన యాక్షన్ ఎపిసోడ్స్‌తో ప్రేక్షకులకు కనెక్ట్ చేసే ప్రయత్నం చేసినా -కన్ఫ్యూజన్ పూర్తిగా డామినేట్ చేసేసింది. ఆడియన్స్‌లో ఆసక్తి రేకెత్తించేందుకు ఆశ్రయించిన చీటింగ్ స్క్రీన్ ప్లే -మొత్తంగా కథలోనే కన్ఫ్యూజన్‌కు కారణమైంది. విజయ్-రాశి లవ్‌స్టోరీ ఎపిసోడ్‌లో బిగింపు లేకపోవడం, సెకెండాఫ్‌లో ఇజబెల్లే ఎపిసోడ్ తరువాత కథనం పట్టుసడలుతూ -ప్రీక్లైమాక్స్‌కి చేరేసరికి సన్నివేశాలు సాగదీత అనిపిస్తూ సినిమా అంచనాలనుంచి దూరమైపోయింది. ఇంటెన్స్ క్లైమాక్స్ కూడా లేకపోవడంతో -వరల్డ్ ఫేమస్ లవర్.. గల్లీ ప్రేమ కథను దాటలేకపోయాడు. ఇల్లెందులో సాగే ఒక్క కథకే సినిమా తీసేంత స్పాన్‌వున్నా -దర్శకుడు ఎపిసోడ్‌గా మార్చేసుకున్నాడు.
గౌతమ్.. శీనయ్య పాత్రల పెర్ఫార్మెన్స్‌లో -సడెన్ బ్రేక్ తరువాత పికప్ తీసుకుంటున్న అర్జున్‌రెడ్డిలానే అనిపిస్తాడు విజయ్. బొగ్గు గని కార్మికుడిగా తెలంగాణ యాసలో విజయ్ పెర్ఫార్మెన్స్ మాత్రం ఆడియన్స్‌కి ఒకింత ఊరట. రాశిఖన్నా, కేథరిన్ థ్రెస్సా, ఇజాబెల్లే పరిధిమేరకు పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగారు. ఐశ్వర్య రాజేశ్ మాత్రం పాత్రపరంగాను, పెర్ఫార్మెన్స్‌పరంగా ముగ్గురినీ డామినేట్ చేస్తూ సహజమైన నటన చూపించింది. జయప్రకాశ్, శత్రు, ప్రియదర్శి పాత్రల పరిధిలో నటించారు. గోపీసుందర్ మ్యూజిక్ అద్భుతాలేం చేయలేదు. సన్నివేశాలకు ప్రాణం పోసేంత బీజీఎం లేదు. ఒక్క పాటకు కట్టిన బాణీ సినిమాలో ఉన్నంతసేపూ గుర్తుంటుంది. అద్భుతమైన విజువల్స్‌తో జయకృష్ణ గుమ్మడి మాత్రం సినిమాకు ప్రాణం పోశాడు. మనసుకు హత్తుకునే సంభాషణలు, అద్భుతం అనిపించే ఎడిటింగ్ నైపుణ్యం లేవు.
అప్పుడప్పుడూ అద్భుతమైన టైటిల్స్ -సినిమాపై అంచనాలు పెంచేస్తాయి. అందులోని తారాగణం -ఆడియన్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. పనిచేస్తున్న సాంకేతిక నైపుణ్యం -సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా అనుకునేలా చేస్తుంది. నిర్మాణ సంస్థను గుర్తు చేసుకున్నపుడు -ఆ సినిమా ఎంత గొప్పగా ఉండబోతుందోనని మనసూరిస్తుంది. ఇన్నీ చూసుకుని.. టికెట్ లెక్కలేసుకుని థియేటర్లకు వెళ్లి సినిమా చూశాక -అప్పుడు విషయం అర్థమవుతుంది. సినిమాను ముందుగా చూసుకుని, విషయాన్ని ముందే అర్థం చేసుకున్నాడు కనుకే -ఇకపై లవ్ స్టోరీలు చేయను అని విజయ్ అనుంటాడు. సినిమా చూస్తే -ఆ విషయం మీకే అర్థమవుతుంది.

-జీఆర్