రివ్యూ

‘అర్థ’ముంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు..అర్ధనారి

తారాగణం: అర్జున్ యజత్, వౌర్యాని, మురళీశక్తి, జ్యోతి, జూ.రేలంగి, హరికృష్ణ తదితరులు
కెమెరా: సాయి శ్రీనివాస్
సంగీతం: రవివర్మ
నిర్మాత: రవికుమార్ ఎం
రచన, దర్శకత్వం: భానుశంకర్ చౌదరి
**
తప్పు చేస్తే శిక్ష తప్పదన్న భయంతో తప్పు చేయడానికి భయపడతారు. ఓటు వేయకపోవడం తప్పుకాదని, అందుకు శిక్షలేదని ఆనందంగా బ్రతికేస్తుంటాడు బాధ్యతలేని భారతీయుడు. నో పార్కింగ్‌లో బైక్ పార్క్ చేస్తే ఫైన్. సిగ్నల్ క్రాస్ చేస్తే చలానాలాంటి భయాలు ఉండటంతో జాగ్రత్తగానే ఉంటున్నాడు సగటు పౌరుడు. మొదట్లో ఆధార్ కార్డు ఇస్తామంటే నాకెందుకన్నాడు? గ్యాస్ కావాలంటే ఆధార్ తప్పనిసరి అనేసరికి క్యూలో నిలబడ్డాడు. అందుకే -ఓటు వేయకపోతే రేషన్ కార్డు ఉండదన్న శిక్ష విధిస్తే, ప్రతి పౌరుడూ కచ్చితంగా ఓటేస్తాడన్నది చిత్రంలో హీరో భావన. ఓటింగ్ శాతం పెరిగితే ప్రశ్నించేవారి శాతం పెరుగుతుంది. దాంతో పనిచేసేవాడే అధికారానికి వస్తాడు. కుళ్లిన వ్యవస్థలో మార్పు ఓటు హక్కు వినియోగం నుంచి మొదలవ్వాలన్నది హీరో ఆలోచన. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే ప్రతిదీ ప్రైవేటు వ్యక్తుల కబంధ హస్తాల్లో ఇరుక్కోవడం వల్ల, సామాన్యుడి బతుకే దుర్భరమైందన్న ఆలోచనను వ్యక్తం చేశాడు. తప్పెవరు చేసినా నిలదీసి అడిగే ధైర్యం ప్రజలకు కావాలంటాడు. అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాల మాదిరిగానే ప్రభుత్వాఫీసులు, పోలీస్ స్టేషన్లలో సిసి కెమెరాలు పెడితే అడిగేవాడెవడో తెలుస్తుంది. పనిచేసేవాడి నిజాయితీకి గుర్తింపొస్తుంది. అన్యాయానికి గురవుతున్నామో, హాయిగా బతుకుతున్నామో ప్రజలకూ అర్థమవుతుంది. ఈ మార్పుల పరిణామక్రమంలో -పౌరుడికి దేశంపట్ల బాధ్యత పెరుగుతుంది. ప్రతి పౌరుడూ -మేరా భారత్ మహాన్ అవ్వాలన్నది అర్థనారి ఆశయం. ఆలోచన బావుంది. వింటుంటే ఇంకా ఆనందం కలుగుతుంది. ఆచరణకు వచ్చేసరికే అంతా ప్రశ్నార్థకం. అలాంటి అయోమయ స్థితిలో జీవితాన్ని దేశం కోసం అర్పించిన వ్యక్తి కథే అర్థనారి.
కథేంటి?
శివకుమార్ (అర్జున్ యజత్) తన కళ్లముందు జరిగే అన్యాయాన్ని సహించలేడు. వెంటనే స్పందించడం, తగిన సమాధానమో, సహన్యాయమో అందించాలనుకోవడం అతని తత్వం. ఆ విషయంలో నేతలైనా, రౌడీలైనా.. ఎవరినీ ఉపేక్షించడు. అతని దెబ్బకి ముఖ్యమంత్రి కూడా హడలి ‘వెంటనే వాణ్ణి చంపేయండి. వాడి ప్రతి మాటా ప్రజల గురించే. దానివల్ల మనకు ఒరిగేదేంటి?’ అంటాడు. అన్యాయాన్ని ఎదిరించే నేపథ్యంలో భార్యను, కొడుకును పోగొట్టుకుంటాడు శివకుమార్. దుర్మార్గపు వ్యవస్థతో పోటీపడలేని స్థితిలో అర్థనారి అవతారం ఎత్తుతాడు. అనూహ్య ఆలోచనలు, ఎవరూ పసిగట్టలేని వేగంతో తనకు అన్యాయం చేసిన వారినందరినీ మట్టుపెట్టే పోరాటానికి దిగుతాడు. ఆ పోరాటంలో చివరికి గెలిచాడా? ఓడాడా? అనేదే కథనం.
ఎలా వుంది?
మొదటినుండీ అర్ధనారి చేష్టలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ అతనిలో గూడుకట్టుకున్న పగకు సంబంధించిన కథనాన్ని చివరిదాకా బిగి సడలకుండా చిత్రీకరించడం సినిమాకు ప్రాణమైంది. కాకపోతే భారతీయుడు, అపరిచితుడు, ఆపరేషన్ దుర్యోధన చిత్రాల ప్రభావం అర్ధనారిపైనా పడింది.
ఎగస్పార్టీవాళ్ళు డబ్బులిచ్చారు కనుక బస్సు తగలబెట్టాను అని చెప్పే అసాంఘిక శక్తులు, ఉద్యమకారుల రూపంలోవున్న సంఘ వ్యతిరేక శక్తులు ప్రజల ఆస్తులను ఏవిధంగా నాశనం చేస్తున్నారోనన్న పాయింట్ బాగా చూపించారు. రాజకీయ నాయకుల కోసం వంటిపై పెట్రోల్ పోసుకుని సమ్మెలకు దిగే వ్యక్తుల వెనుక ఎలాంటి రాజకీయాలు ఉన్నాయి? చివరికి సమిథల్లా కాలి బూడిదైపోయిన అమాయకుల కథనాలు ఎలా సాగాయి అనేది చిత్రంలో వివరించారు. ప్రజల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించని ప్రజానాయకులు, అలా ఆలోచించే వ్యక్తులను చూస్తే ఎలా తట్టుకోలేరో చిత్రంలో చూస్తాం. చానల్స్ చిన్న వార్త దొరికినా హైలెట్ చేసి న్యూస్ న్యూసెన్స్ విధానాన్ని ఎండగట్టింది. దానికితోడు వాళ్ళు చెప్పేది ఏదో గొప్ప విషయమైనట్టు ప్రజలనుండి ఎస్‌ఎంఎస్‌లను ఆహ్వానించడాన్ని ఎత్తిచూపించారు. ‘డ్యూటీ చేయకపోతే గవర్నమెంట్‌ను లూటీ చేసినట్టే’, ‘బాధ్యత లేనివాడికి భారతదేశంలో బ్రతికే హక్కులేదు’లాంటి సంభాషణల చతురోక్తి, సీరియస్‌నెస్ ఆకట్టుకుంటుంది. నటీనటుల్లో అర్జున్ యజత్, వౌర్యాని పాత్రలకు తగ్గట్టు నటించారు. నేపథ్య సంగీతం సన్నివేశాలకు బలం చేకూర్చింది. ‘ఏదో ఏదో తెలియని వింత, తొలి హాయి నా తనువంతా’ పాట ఒక్కటే ఆకట్టుకుంటుంది. కెమెరా పనితనం బాగుంది. దర్శకత్వపరంగా కథబాగున్నా, కథనం అక్కడక్కడా బీభత్సంగా, భయానకంగా సాగడం కొన్నివర్గాలకే నచ్చుతుంది.

-శేఖర్