రివ్యూ

మధ్యతరగతి మందహాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు..మనమంతా

**
తారాగణం: మోహన్‌లాల్, గౌతమి, ఊర్వశి, విశ్వంత్, రైనారావు, అనీషా ఏంబ్రోస్, చంద్రమోహన్, నాజర్, గొల్లపూడి, బ్రహ్మాజీ, వెనె్నల కిషోర్, ఎల్‌బి శ్రీరాం, ప్రదీప్, హర్షవర్ధన్, అశోక్‌కుమార్, ధన్‌రాజ్, అనితాచౌదరి.
సంగీతం: మహేష్ శంకర్
నిర్మాత: రజని కొర్రపాటి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
చంద్రశేఖర్ ఏలేటి.

ఒక కథతో సినిమా తీసి ప్రేక్షకుల్ని ఒప్పించడమే కష్టమనుకుంటే, ఒకే సినిమాలో నాలుగు కథల్ని జొప్పించి మనల్నందరినీ అలరించే ప్రయత్నం ‘మనమంతా’ ద్వారా చేయడం నిజానికి స్వాగతించతగ్గ ప్రయత్నమే! మరి ఆ ప్రయత్నంలో దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి ఎంతవరకూ కృతకృత్యులయ్యారో చూద్దాం.
పెద్ద డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న సాయిరాం (మోహన్‌లాల్) ఉద్యోగంలో ఎదగాలన్న తపనతో తన పోటీదారు విశ్వనాథ్ (హర్షవర్ధన్)ని ఆపే ప్రయత్నం చేస్తాడు. కానీ అది వికటించి విశ్వనాథ్ ప్రాణంమీదకు తెస్తుంది. దాన్నుంచి అతనెలా బయటపడ్డాడు అన్నదే కథ. మహతి (రైనారావు) అనే పదకొండేళ్ల పిల్లకి దయాగుణం ఎక్కువ. దాని దరిమిలా ఓ వీధి బాలుడిని చదివించే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రక్రియలో ఒకనాడు స్కూల్‌కెళ్లి వస్తూంటే ఆ బాబు కిడ్నాప్ అవుతాడు. అతన్ని వెదికి తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేరవేయగలిగిందా? లేదా? అన్నది రెండో కథ. అక్కడెక్కడో ఉన్న హోల్‌సేల్ దుకాణానికి వెళ్లి సరుకులు కొంటే సొమ్ము ఆదా అవుతుందనే మధ్యతరగతి తలంపులకు ముమ్మూర్తుల ప్రతినిధి గాయత్రి (గౌతమి). ఆమెకు అనుకోకుండా సింగపూర్‌లో ఓ మంచి ఉద్యోగ అవకాశం వస్తుంది. కుటుంబం తాను లేకుండా ఉండలేదన్న తలంపునకు భిన్నంగా మిగతా కుటుంబ సభ్యులు స్పందిస్తారు. దాంతో అయిష్టంగానే సింగపూర్ వెళ్లడానికి సంసిద్ధురాలవుతుంది. మరి ఆమె అక్కడికి వెళ్లిందా? అన్నది మూడో కథ. తన చదువుద్వారా ఉన్నత స్థానం సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్లే అభిరామ్ (విశ్వంత్)కు ఓ సందర్భంలో తారసపడిన ఐరా (అనీషా ఏంబ్రోస్) మైకంలో పడతాడు. కానీ అతని ప్రేమను ఒప్పుకోదు ఐరా. తర్వాత అభి పరిస్థితేమిటి అన్నది ఆఖరి కథ. అసలీ నాలుగు పాత్రలకూ ఉన్న సంబంధమేమిటి? అన్నది పతాక సన్నివేశంలో తెలియడం ద్వారా శుభం పడుతుంది. ఇవన్నీ కూడా మానవ ఆలోచనలకీ, భావోద్వేగాలకీ చాలావరకూ ప్రతిబింబాలే. అయితే కొన్నిచోట్ల లాజిక్ మిస్సయింది. ప్రధాన పాత్రల సంబంధాలు చివరివరకూ తెలుపకపోయినా, చిత్రానికిచ్చిన ఉప శీర్షిక (ఒక ప్రపంచం- నాలుగు కథలు) వల్ల వీరందరికీ ఏదో సంబంధం ఉంటుందన్న భావనకు ఆడియన్స్ చిత్రం మొదట్లోనే ఫిక్సయ్యారు. చివర్లో అది భార్యా, భర్త, కూతురు, కొడుకు ద్వారా వాస్తవమవడంలో సంతృప్తి చెందారు వీక్షకులు. చెప్పిన కథల్లో కొంత వైరుధ్యం కనపడటంతో సహజత్వం అదృశ్యమైంది. తన భర్త (మోహన్‌లాల్) చేస్తున్నది ఓ పెద్ద సూపర్ మార్కెట్‌లో అయినా తక్కువ ధరలకోసం గాయత్రి ఎంతో దూరం వెళ్లడం హాస్యాస్పదం. అలాగే తన లక్ష్య సాధన కోసం కృషిచేసే అభిరామ్ ఐరా ప్రేమలో పడటం, ఆమె కాదంటే కృంగిపోవడం సరిగ్గా లేదు. ఎందుకంటే, పలు సందర్భాలలో ఐరా మనిద్దరి మధ్యా ఉన్నది ‘స్నేహమే’ అని స్పష్టం చేస్తుంది. ఆ సంకేతాల ద్వారానైనా తన పంథా మార్చుకోవచ్చు అభిరామ్. అలాకాకుండా తాను ప్రేమించాను కనుక, ఐరా కూడా ప్రేమించాలని హఠం వేయడం ఆశ్చర్యకరం. అయితే ఈ మొత్తం సినిమావల్ల సందేశం ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం నేరుగా దొరక్కపోయినా మానవ ఆలోచనలు -(ముఖ్యంగా మధ్యతరగతి) ఎలా ఉంటాయో అన్నదానికి ‘మనమంతా’ ఒక నమూనా అని మాత్రం చెప్పవచ్చు. కొన్నిచోట్ల ‘దృశ్యం’ చిత్రాన్ని ఇది గుర్తుచేస్తుంది. నటీనటుల్లో మోహన్‌లాల్ సాయిరాంగా చక్కటి భావప్రకటనలు చేశారు. కానీ తన పాత్రకుతానే డబ్బింగ్ చెప్పడం ద్వారా గొంతులో ఎక్కువగా వారి మాతృభాష మలయాళం యాస వచ్చింది. దాంతో కాస్త కృతకంగా తోస్తుంది. అలాగే చాలాకాలం తర్వాత గౌతమి తెలుగు తెరపై గాయత్రిగా కనిపించారు. ఒక రకం ఫ్రెష్‌నెస్ దీని ద్వారా వచ్చింది. ఇప్పుడు చెప్పుకుంటున్న అందర్నీ అధిగమించిన నటనని ప్రదర్శించింది. మహతి పాత్రధారిణి రైనారావు. ఎక్కడా నటిస్తుందన్న భ్రాంతి మనకు కలగకుండా ఆమె ఇందులో ఎక్కువ మార్కులు సంపాదించింది. విశ్వంత్ తన పాత్ర (అభిరామ్) పరిధిలో నటించేశారు. మిగిలిన పాత్రలు కథ(లు) నడవడానికి ఉపకరించాయి. నందమూరి తారకరత్న మహతికి సహాయపడిన ఓ పాత్రలో తళుక్కున మెరిసారు. ‘కష్టాల్లో కూడా నిద్ర వస్తుందేమో కానీ, తప్పుచేసిన వాడికి నిద్రరాదు...’, ‘బ్రతకడం నేర్చుకున్నాను అనుకున్నా కానీ, మనిషిగా బ్రతకడం మర్చిపోయాను..’. ‘దేవుడికి మన నమ్మకాలతో పనిలేదు. ఆయన పని ఆయన చేసుకుంటూపోతాడు’ అన్న మంచి సంభాషణలు ఇందులో చోటుచేసుకున్నాయి. మహేష్ శంకర్ స్వరాల్లో ‘బుట్టబొమ్మ...’ పాట బాగుంది. ఫస్ట్ఫాలో ఊర్వశి- గౌతమి పాత్రలు చీరలు, సరుకులు, బోటుషికారు సంగతుల నిడివి తగ్గిస్తే సినిమా రెండు గంటల నిడివికి వచ్చి పట్టుపెరిగేది. దాస్ పాత్ర అంతమైన తీరు వగైరాలవల్ల సినిమాలో ఉత్కంఠపాలు బాగా పండింది. మనకున్న ఈ తరం మంచి దర్శకుల్లో నిశ్చయంగా చంద్రశేఖర్ ఏలేటి ఒకరు. అయితే సహజత్వానికి ఇంకాస్త స్థానమిచ్చి ‘మనమంతా’ని తీర్చిదిద్దుంటే తప్పకుండా మనందరికీ ఇంకా ఎక్కువ స్థాయి చేరువయ్యుండేది.

-అనే్వషి