రివ్యూ

పక్కాగా కుదరని తిక్క!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు ..తిక్క

తారాగణం: సాయిధరమ్ తేజ్, లరిస్సా బోన్సీ, మనారాచోప్రా, రాజేంద్రప్రసాద్, అలీ, అజయ్, ముమైత్‌ఖాన్, తా.రమేష్, రఘుబాబు తదితరులు
సంగీతం: ఎస్‌ఎస్ థమన్
సినిమాటోగ్రఫీ: గుహన్
ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్
నిర్మాత: సి రోహిణికుమార్‌రెడ్డి,
దర్శకత్వం: సునీల్‌రెడ్డి

సినిమాలకీ, వాటికి పెట్టే పేర్లకి సాధారణంగా పొంతన కుదరదు. అందుకే ఫిలిమ్ రివ్యూస్ రాసేటప్పుడు సినిమాకూ పేరుకీ జస్ట్ఫికేషన్ కుదరలేదని వ్యాఖ్యానిస్తూ ఉంటారు. కానీ, ‘తిక్క’ సినిమా విషయంలో అలాంటి ఇబ్బందేంలేదు. చిత్రానికిచ్చిన పేరు (తిక్క)కి ముమ్మూర్తులా ఇందులోని దాదాపు ప్రతి సన్నివేశం, క్యారెక్టర్ పూర్తి న్యాయం చేకూర్చేలా వంద శాతం కృషి జరిగింది. అదెలాగో పరిశీలిద్దాం.
అందరి అబ్బాయిల్లాగే (ఇంచుమించుగా) ఓ గమ్యం లేకుండా జీవితం గడిపే ఆదిత్య (సాయిధరమ్‌తేజ్)కు యాక్సిడెంటల్‌గా ఓ యాక్సిడెంట్‌లో అంజలి (లరిస్సా బోన్సీ) కలుస్తుంది. ఆదిత్య అంజలిని ఇష్టపడతాడు -ఆ తొలి ప్రమాద ఘటనలోనే. అయితే మొదట అంజలి, ఆదిత్యని ఇష్టపడకపోయినా పోనుపోను ఏర్పడ్డ పరిచయాల్లో ఇష్టం ఏర్పడుతుంది. కానీ ఆదిత్య చంచల (దీనే్న ‘తిక్క’ అందామా?) మనస్తత్వాన్ని చూసి బ్రేకప్ చెప్పేసినట్టు నటించి ఓ లెటర్ ఆదిత్య జేబులో పెట్టేసి వెళ్ళిపోతుంది అంజలి -అప్పటి పరిస్థితులకు అనుగుణంగా. ఈ సంఘటనతో విసిగిపోయిన ఆదిత్య ఫ్రెండ్స్‌తో బ్రేకప్ పార్టీ పెట్టుకుంటాడు. అసలు అంజలి రాసిన లెటర్‌లో ఏముంది? ఏం జరిగింది అన్నది వీలైనంత గందరగోళ రూపంలో దర్శకుడు దాదాపు రెండుగంటల పందొమ్మిది నిమిషాల రూపంలో ‘తిక్క’ని తిరుగులేకుండా ఆవిష్కరించేశారు. ఎంత గందరగోళమంటే ఏ క్యారెక్టర్ ఎప్పుడు ప్రవేశిస్తుందో, ఎలా నిష్క్రమిస్తుందో అన్నది కూడా తెలియనంతగా. ఆఖరికి సినిమా ప్రారంభంలోనూ, విరామ సమయంలోనూ చూపే ‘మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం...’ అన్న మాటల్నీ ‘తిక్క’తిక్కగానే అనిపించారు. దీన్ని సెన్సారు ఎలా ఆమోదించిందో! అసలు భారీ చిత్రమంటే, లెక్కలేనన్ని పాత్రలు పెట్టేసి కోట్లు వెచ్చించేయడమన్న భావమే చిత్ర బృందంలో నాటుకుపోయిందేమోనన్న అనుమానమే అడుగడుగునా సినిమాలో కనిపించింది. కేవలం ఆదిత్య, అంజలి ప్రేమ బ్రేకప్, తిరిగి తప్పు తెలుసుకోడం లాంటి సాదాసీదా సూత్రంతోనే కథనల్లి ఆసక్తికర కథనంతో దర్శకుడు సునీల్‌రెడ్డి చిత్రాన్నితీసి రంజింపచేయవచ్చు. అవకాశాన్ని విడిచిపెట్టి కిడ్నాప్‌లు, గ్యాంగ్‌లూ అంటూ అడ్డూఅదుపు లేకుండా సీన్స్‌ని నడిపించేశారు. ఫలితం- సినిమాకిచ్చిన పేరుతత్వం ప్రేక్షకుల్ని కూడా ఆవహించడం. పోనీ అలా నడిపిన సన్నివేశాలకైనా రవ్వంతైనా సహజత్వ ఛాయలు ఉన్నాయా? అంటే అదీ శూన్యమే. తండ్రీ (రాజేంద్రప్రసాద్) కొడుకుకి (సాయిధరమ్‌తేజ్) దుర్వ్యసనాలు నేర్పినట్టు అవీ కొనసాగినట్టు చూపారు. కనీసం వాటినుంచి విముక్తుడైనట్టు కూడా ఇద్దర్నీ చూపకుండా, ఇంకో సన్నివేశంలో ‘నా తండ్రినేమైనా చేస్తే...’ అంటూ హీరోతో అనిపించినపుడు సాధారణంగా సీన్ పండాలి. కానీ ఆడిటోరియంలో దీనికి హాస్యాస్పద ప్రతిస్పందన వచ్చింది. సాయిధరమ్‌తేజ్‌ది ఇందులో దాదాపు ఒంటరి పోరాటమై పోయింది. చిత్రంలో తనకిచ్చిన పాత్రకి ఇంచుమించు న్యాయం చేకూర్చడానికి ప్రయత్నించినా, దానికి ఆధారభూతమైన సీన్స్‌లోని బలహీనతవల్ల ఎక్కడా అది ఫలించలేదు. గొంతులో అనవసర జీర తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చిత్రం ద్వారా పరిచయమైన లరిస్సాబోన్సీ అంజలిగా ఆమెకు నటించడానికి పరిధి తక్కువ. కొన్ని ఏంగిల్స్‌లో నటి జెనీలియాలా ఉంది. హీరో తండ్రి పాత్రలో రాజేంద్రప్రసాద్‌ని చూస్తే జాలేసింది. అందుకు పాత్రకిచ్చిన పద్ధతి ప్రధాన కారణమైంది. అలీ, ముమైత్‌ఖాన్‌ల మధ్య సీన్స్‌లో కొన్నిచోట్ల దర్శకుడనుకున్న ద్వంద్వార్థాలు ఏమీ రాణించలేదు. పోసాని, వెనె్నల కిషోర్, రఘుబాబు ఇలా లెక్కలేనంతమంది నటులు కామెడీ పండించడానికి చేసిన ప్రయత్నాలూ నిష్పలమయ్యాయి. ఈ సినిమాలో చూపినట్టు రిహాబిలిటేషన్ సెంటర్‌లో ఆ రకంగా ఎవరూ తప్పించుకోలేరు. ఒకవేళ అలా జరిగినా తదుపరి అనుసరించే చర్యలలో వారిని తిరిగి పట్టుకుంటారు. ఇందులో సంఘటనని గాలికొదిలేయరు. థమన్ స్వరాల్లో ‘హల్లో హోమ్’ పాట మోస్తరుగా ఉంది. ఇందులో థమన్ కనిపించాడు కూడా. పాటల ప్లేస్‌మెంట్‌లో కనీస వ్యవధి విషయాన్ని కూడా ఇందులో పట్టించుకోలేదు. రెండు పాటలు చాలా తక్కువ గేప్‌లో ప్రేక్షకుల్ని తరిమేశాయి. ఇంకో పాట ఎక్కడ పెట్టాలో అన్న ఆలోచనతో ఓ పాత్రచేత ‘ట్రాజడీ పాటేసుకోండి’ అనిపించి సాంగు ఇరికించారు. విచిత్రమేమిటంటే ఆ పాట విషాదతత్వాన్ని తెలపకపోవడం. ఇదంతా మరి చిత్ర ‘నామ’ ప్రభావమేమో! అయితే ఆ పాటలో గుహన్ కెమేరా పనితనం బాగుంది. కార్తీక్ శ్రీనివాస్ (ఎడిటర్) కత్తెరకు మరింత పదునుపెడితే బాగుండేది. చిత్ర నిడివీ తగ్గేది. చిత్రాల కథల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్త సాయిధరమ్ తేజ్ ఎంతో ఉందన్నది ఈ సినిమా తప్పక తెలియజేస్తుంది. అలాగే నాన్‌స్టాప్ కామెడీ తీద్దామనే తలంపు దర్శకునికుండటం ఓకే అయినా, అందుకోసం అనుసరించవలసిన విధానం ఇది మాత్రం కాదన్నదీ దర్శకుడికి అర్థమై ఉండాలి. సరైన రూట్‌లో తీసుకుంటే ‘తిక్క’ పక్కాగా అందరికీ నచ్చేదేమో!

-అనే్వషి