రివ్యూ

ఫార్మాట్ ప్రేమాయణం ( * బాగోలేదు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు

తారాగణం:
రాజ్ తరుణ్, అర్తన, రాజా రవీంద్ర, ఎన్.శంకర్, షకలక శంకర్, రణధీర్, సురేఖావాణి, శ్రీలక్ష్మి, హేమ తదితరులు
సంగీతం: గోపీ సుందర్
నిర్మాతలు:
ఎస్ శైలేంద్రబాబు,
కెవి శ్రీ్ధర్‌రెడ్డి, హరీశ్ దుగ్గిశెట్టి
దర్శకత్వం:
శ్రీనివాస్ గవిరెడ్డి

తెల్లదొరల పాలన.. బ్రిటీష్ కాలంనాటి మాట. కరవు కాటకాలతో విలవిల్లాడుతున్న గ్రామ ప్రజలకు బ్రిటీష్ అధికారులు విసిరిన వల -క్రికెట్ ఆట. గెలిస్తే పన్ను మాఫీ. ఇంతకంటే ట్విస్ట్ ఇంకేంకావాలి. ‘లగాన్’తో ఆ ఛాన్స్ కొట్టేసింది బాలీవుడ్. అదే నేపథ్యం కాకండా -ప్రేమ కోసమై వలలో పడిన ఓ కుర్రాడు.. కబడ్డీ ఆటలో ప్రత్యర్థుల్ని గెలిస్తే.. ప్రియురాల్ని ఇచ్చేస్తాననటం -టాలీవుడ్ సాధించిన మరో ఘనకార్యం. ఇలాంటి కథలు అటు బాలీవుడ్‌నీ.. ఇటు టాలీవుడ్‌నీ ఏలేసి.. ఛాన్నాళ్లయిన తర్వాత -రాజ్ తరుణ్‌కి ఈ ‘రామాయణం’లో ఏంనచ్చిందో తెలీదుగానీ.. సగటు ప్రేక్షకుడికి ‘సినిమా చూపించేశాడు’. వంద పైచిలుకు ‘షార్ట్ ఫిలిమ్స్’ అనుభవంతో.. ‘ఉయ్యాల జంపాల’ ఆరంభించిన అతడి కెరీర్ ‘కుమారి 21ఎఫ్’తో ఒక గుర్తింపుకొచ్చింది. కథలపట్ల అతడికున్న అవగాహనకి హేట్సాఫ్. రొటీన్ స్టోరీలపట్ల ఏమాత్రం మొగ్గు చూపడన్న ఆలోచనా మెదలుతుంది. కానీ- ఈ ‘రామయ్య’ సిత్రాలు చూస్తే మాత్రం -అవన్నీ ఎందుకూ కొరకరానివని.. హీరో అన్న తర్వాత ‘రొటీన్’ కమర్షియల్ చేయాల్సిందేనన్న మాటల్లో ‘రామయ్య’ పడిపోయాడా అనిపిస్తుంది.
పైన ఉదహరించిన కథల్లోంచి ఓ ‘క్రికెట్’ కథ ‘సిత్రం’లోకి వచ్చేసింది. తిలకించండి. ఇంట్రడక్షన్ సీన్ అయిపోయి.. ఇంటర్వెల్‌కి దగ్గరగా వెళ్తూన్నప్పుడు రాము తన తల్లికి ఓ డైలాగ్ విసురుతాడు. ‘్ఫస్ట్ హాఫ్‌లో హీరోలు ఖాళీగానే తిరుగుతారు. సెకండ్ హాఫ్‌లో బిజీ అయిపోతారు’ -మళ్లీ కథ మొదటికి.
రాము (రాజ్ తరుణ్) టీవీలో క్రికెట్ చూసి -్ధనీ అంత పేద్ద క్రికెటర్ అవ్వాలనుకుంటాడు. తూచ్.. ‘పవన్’ సినిమా చూసి.. పేద్ద హీరో ఐపోదామనుకుంటాడు. మళ్లీ తూచ్.. ఇలా మాటిమాటికీ తన నిర్ణయాల్నీ ఆలోచనల్నీ మార్చుకుంటాడుగానీ.. ‘సీత’కి మాత్రం ఏనాటికైనా మొగుడై పోవాలన్నది అతడి చిరకాల కోరిక.
అల్లరి చిల్లరిగా తిరగటం.. స్నేహ బృందంతో టీకొట్టు దగ్గర బాతాఖానీ.. రాత్రిళ్లు ‘మందు’ కొట్టులో ఓపెనింగ్. ఇదీ రాము ఆషామాషీ లైఫ్. ఇన్ని చేసేవాడికి ఇంటర్ పాసవటం ఎలా? అన్న ఆలోచన మాత్రం ఉండదు. మధ్యమధ్యలో ‘సీత’ని పడేసేందుకు ఏంచేయాలా? అని ప్లాన్ వేస్తూంటాడు. అప్పటికి సీత ఎంచక్కా ఎంబిబిఎస్ చదివేస్తూంటుంది. త్వరలో మెడిసిన్ పూర్తి చేసే ఏ అమ్మాయైనా.. ఇంటర్ దాటడమే కష్టంగా భావించే ‘పోకిరి’గాణ్ణి ఇష్టపడుతుందా? అస్సలు పడదు. ఆ అమ్మాయికే కాదు.. ఆఖరికి వాళ్ల ‘బాబు’కి కూడా నచ్చదు. ఇక్కడ రొటీన్‌గా సినిమా‘ట్రిక్’ పని చేస్తుంది. రాము అనే మంచి బాలుడు ఓ శుభ ముహూర్తాన నిప్పుల గుండంపై నడిచేస్తాడు. అది చూసిన సీత కన్నీళ్లెట్టుకొని.. ఆపైన కౌగిలించేసుకొని.. తెగ ప్రేమలో పడిపోతుంది. ఈ అమ్మాయిలింతే! రాతియుగం మొదలుకొని.. వాట్సాప్ కాలం వరకూ -అదే ‘ట్రిక్’కి పడిపోతారు. అదే రామయ్య సిత్రం మరి.
ఇంకేముంది? సెకండ్ హాఫ్‌లోకి వచ్చేస్తే- రొటీన్‌గా సీత తండ్రికీ.. ఆమె అన్నలకీ అస్సలు పడదు. ఠట్ -మీరొప్పుకునేది ఏంటి? రఫ్ఫాడించేస్తానంటూ- ఛాలెంజ్ చేసిన రాముకి ఓ కండిషన్ పెడతారు. చిన్నప్పుడే వదిలేసిన గల్లీ క్రికెట్ బ్యాట్‌తో -ఆటలో నిష్ణాతులైన వారిని గెలవమని. హీరో కదా!? తన ఆవారా ఫ్రెండ్స్‌తో పక్కా ప్లాన్ గీసేసి.. క్రికెట్ బ్యాట్టుచ్చుకొని.. గ్రౌండ్‌లో వీరంగం ఆడేస్తాడు. ఇక సీతారాముల కళ్యాణం. శుభం కార్డు.
చెబుతుంటేనే ఇంత ఫన్నీగా ఉంటే.. ఇక చూస్తే?! ఇంతకుమించి ఏమీ ఉండదు. రాజ్ తరుణ్ పెర్‌ఫార్మెన్స్ తప్ప. పల్లెటూరి అందాలు తప్ప. పరమ రొటీన్‌గా వచ్చే సన్నివేశాలూ -లవ్ ప్రపోజ్ చేయమని వెంటపడే స్నేహ బృందం.. వాళ్ల వీరోచిత కామెడీ సీన్లూ.. ఆనక -బోలెడన్ని సాంగ్‌లూ.. విలన్ల తాలూకు ఆంక్షలతో -సినిమా తెగ జోరందుకుంటుంది.
ఈ కథని ఊహించటం అంత కష్టమేం కాదు. ఒక్కో సన్నివేశం తర్వాత ఏం జరగబోతోందన్నదీ తెలిసిందే. పాత సినిమాల తాలూకు -నెరేషన్ కనిపిస్తుంది. రాజ్ తరుణ్‌కి ఈ సినిమా ‘టైటిల్’ నచ్చేసిందేమో?! ఐతే -ఆ టైటిల్‌కి తగ్గట్టు కథ ఉండదుగాక ఉండదు. కెమెరా ఒక్కటే -సిత్రాలు’ చేసింది. పల్లెటూరి వాతావరణాన్నీ.. ఆ నేపథ్యాన్నీ ఎంతో చక్కగా చిత్రీకరించారు. సినిమా మొత్తం కలర్‌ఫుల్‌గా ఉంది. అదొక్కటే ప్లస్ పాయింట్. కానీ- ఏ సన్నివేశం కూడా మనసులోకి చొరబడదు. ఆఖరికి ‘లవ్’ సీన్‌లోనూ. అగ్ని గుండంలో నడిచేస్తే ప్రేమ పుట్టుకొస్తుందా? కావొచ్చునేమో?! గతంలో- ఓ సినిమాలో ‘బైక్’ మెకానిక్.. చకచకా బైక్ పార్ట్‌లన్నీ విప్పేసి.. సెట్ చేస్తే.. ఆ హీరోపట్ల హీరోయిన్‌కి ప్రేమ పుట్టింది. ఇది కొంచెం బెటర్!
ఎంతో ఊహిస్తూ -్థయేటర్ వెళ్తే.. అక్కడక్కడ నవ్వు పుట్టించే సన్నివేశాలతో.. రాజ్ తరుణ్ నటనతో.. అర్తన అందంతో.. భరించవచ్చు. కానీ -కథ జోలికి మాత్రం వెళ్లకండి. కళ్లప్పగించి చూట్టం మినహా చేయగలిగేదేమీ ఉండదు.

-ప్రనీల్