రివ్యూ

హైపవర్ ఓకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు **హైపర్
**
తారాగణం: రామ్, రాశీఖన్నా, సత్యరాజ్, రావు రమేష్, మురశీశర్మ, సుమన్, తులసి, పోసాని తదితరులు.
మాటలు: అబ్బూరి రవి
సంగీతం: జీబ్రాన్
కెమెరా: సమీర్‌రెడ్డి
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
సంతోష్ శ్రీనివాస్
**
ప్రభుత్వ కార్యాలయాలలో సామాన్యులకు ఓ పనికావాలంటే, ఎన్నో చేతులు తడపాలి. అదే ఓ రాజకీయ నాయకుడు తన పని కావాలంటే అధికారులే వచ్చి చేతులు కట్టుకుని మరీ ఆ పని చేసిపోతారు. కానీ నిజమైన ప్రభుత్వ అధికారి ఇలాంటి నీచమైన రాజకీయాలకు లోనుకాడు. నిజాయితీగా వ్యవహరించే చిరు ఉద్యోగి అయినా సరే కొండకున్న బలంతో సమానం. అతన్ని ఎవరూ కదపలేరు. ఒక్కసారి కనుక ఈ పనిచేయకూడదు అని అతను నిర్ణయించుకున్నాడంటే, బ్రహ్మాదులు వచ్చినా ఆ పని చేయడు. అటువంటి ఓ నిజాయితీగల ప్రభుత్వ ఉద్యోగి సంతకం విలువ ఎంత వుంటుందో అర్థం చేసుకున్న దర్శకుడు కొత్తదనానికి స్వాగతం పలుకుతున్న ప్రేక్షకుల నాడిని పట్టుకుని ఓ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ కథనాన్ని అల్లుకుని, రామ్ కథానాయకుడిగా రూపొందించే ప్రయత్నం చేశాడు.
కథేంటి?
ప్రభుత్వ ఉద్యోగి సూర్యనారాయణమూర్తి (సత్యరాజ్) ఏకైక సుపుత్రుడు సూర్య (రామ్). సూర్యకు తండ్రి అంటే ఎనలేని అభిమానం, ప్రేమ. అది పుట్టినప్పటినుంచి అందరూ గుర్తిస్తారు. తండ్రికి నచ్చిన అమ్మాయినే ప్రేమించి పెళ్లిచేసుకోవడానికి సిద్ధపడతాడు సూర్య. మొదటి సగమంతా సూర్యకు తండ్రిపై వున్న విపరీతమైన ప్రేమ తాలూకు సన్నివేశాలతో సాఫీగానే గడిచిపోతుంది. మంత్రిగా ఎదిగిన గుండప్ప (రావురమేష్) నిర్మిస్తున్న 300 కోట్ల ఓ మాల్‌కు సంబంధించిన ప్లాన్ విషయంలో ప్లానింగ్ అధికారి సూర్యనారాయణమూర్తి ప్లాన్‌లో వున్న అవకతవకలను చూపుతూ ధృవీకరించడానికి నిరాకరిస్తాడు. నువ్వు ఒక్క సంతకంపెడితే లోకమేమి పాడైపోతుందా? అని మంత్రి అడుగుతాడు. ఒక్కసారి సంతకంపెడితే దాదాపు వంద సంవత్సరాలపాటు ప్రజల బాగోగులను నిర్లక్ష్యం చేసినట్లేనని అధికారి వాదిస్తాడు. ఈ నేపథ్యంలో ఇద్దరిమధ్య యుద్ధం ప్రారంభం అవుతుంది. ఎలాగైనా సరే నీ చేత సంతకం పెట్టిస్తానని మంత్రి, ప్రాణం ఉన్నంతవరకూ అలాంటి ప్రజాకంటమైన పనులను చేయనని ఉద్యోగి భీష్మించుకు కూర్చుంటారు. ఈ నేపథ్యంలో రౌడీలు, కొట్లాటలు, దొమీలు, కిడ్నాప్‌లు వంటి పలు అంశాలన్నీ తెరపైకి వచ్చేస్తాయి. ఈ అంశాలన్నింటికీ మూలకర్త సూర్యనే. వాటిని పరిష్కరించేది కూడా సూర్యనే. తన తండ్రి చుట్టూ ఇంత పెద్ద విషవలయం అల్లుకుంటుందన్న సంగతి సూర్య గుర్తించేసరికే పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లిపోతారు. అప్పటికి విషయం తెలుసుకున్న సూర్య ఏం చేసి తన తండ్రిని మంత్రి ఆగడాలనుంచి కాపాడాడు అన్నదే కథనం.
ఎలా వుంది?
తొలి సగమంతా తండ్రిపై ప్రేమ చూపించే గారాల కొడుకు చేసే కథనాలు, భానుమతి (రాశీఖన్నా) పీత కష్టాలు, వాటిని తొలగించే హీరోయిజం లాంటి అంశాలతో సాఫీగానే వెళ్లినా, సెకెండాఫ్‌లోకొచ్చేసరికి మళ్లీ పాత పాటే పాడినట్లయింది. ఇదే కథనాన్ని సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో రాసుకుని ఒక్క ప్రభుత్వ అధికారి సంతకం కోసమే ఇదంతా జరిగిందన్న విషయాన్ని చెబితే ప్రేక్షకులకు ఇంకాస్త కిక్ వుండేదేమో! జరగబోయేదేంటో తెలిసిపోతున్నపుడు, కథానాయకుడు ఏం చేయబోతున్నాడో అర్థమైనపుడు ఆ సన్నివేశాలను మరింత బిగువుగా రాసుకోవాల్సింది. క్లైమాక్స్ అర్థమవుతున్నపుడు ప్రేక్షకుడు సినిమా కథలో లీనమైపోడు. ఇక్కడ జరిగిందీ అదే! హైపర్ కథనం ముందుగానే అర్థమైపోయింది. కాకపోతే హీరో చేసే ట్రిక్‌లు, విలన్ బాధలు గతంలో కొన్ని సినిమాల్లో చూసినవే. కనుక ప్రేక్షకుడు సమస్యను బట్టి సమాధానాన్ని మనసులోనే ఆలోచించి పెట్టేసుకుంటాడు. ప్రేక్షకుడు అనుకున్నదే తెరపైకి వస్తుంది. దాంతో రెండవ భాగం కథనం తేలిపోయింది. నటీనటుల్లో రామ్‌కు యాక్షన్ హీరోగా హైఓల్టేజ్ సిలబస్‌ను తెరపై పలికించినా, కథనం ముందుగా అర్థమైపోవడంతో అతని కష్టం వృధా అయింది. భానుమతిగా రెండు షేడ్స్ వున్న పాత్రను రాశిఖన్నా ఓకె అనిపించింది. రెండో సగం పాటల్లో గ్లామర్‌ను తెరపై కుమ్మరించింది. సత్యరాజ్ సాత్వికంగా ఓకె అనిపించినా, రావురమేష్ నటన పావలాకి రూపాయి పావలా చేసినట్లయింది. కామెడీ ట్రాక్ ప్రత్యేకంగా లేకపోవడం ఓ రిలీఫ్. ఇక మిగతావారిలో కె.విశ్వనాధ్, జయప్రకాష్‌రెడ్డి, పోసాని లాంటివాళ్ళు తమకు కొట్టినపిండిలాంటి పాత్రలే కనుక చేసేశారు. ప్రభుత్వ అధికారి సంతకం వందేళ్ల శాసనం, తెలుగు అక్షరాలు ళ, ఱలను తీసేసినట్లుగా ప్రజలు నిజాయితీ అనే పదాలను తమ పెదాలనుంచి తీసేశారు, ఉద్యోగంలో రాజీపడితే దాంతో వ్యాపారం చేసినట్లే, బలగంకన్నా బలం గొప్పది, ఒక్క ప్రభుత్వ ఉద్యోగి సంతకం ప్రజలకు దిక్సూచి లాంటిది లాంటి సంభాషణలు ఆకట్టుకుంటాయి. జీబ్రాన్ సంగీత బాణీల్లో ఒక్కటీ ఆకట్టుకోలేదు. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకత్వపరంగా కొత్తదనాన్ని ఎలాగైనా తెరపై పండించాలన్న దర్శకుడి భారీ ప్రయత్నం కొంతవరకు ఓకే అనిపించింది. కానీ అనుకున్నంతగా హైపర్ స్పీడు మాత్రం ఉందని చెప్పలేం.

-సరయు