రివ్యూ

*** ప్రేమమ్ ( అనుభూతుల ప్రేమ జల్లు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*** ప్రేమమ్

తారాగణం: నాగచైతన్య, శృతిహాసన్, మడోన్నా సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్, ప్రవీణ్, బ్రహ్మాజీ, జీవా, పృథ్వీ, నాగార్జున (అతిథి పాత్రలో), వెంకటేష్ (అతిథి పాత్రలో) తదితరులు
కథ: ఆల్ఫోన్స్ పుత్రేన్
సంగీతం: రాజేష్ మురుగేశన్,
గోపీ సుందర్
ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం: చందు మొండేటి

పర భాషలో ఓ దృశ్యకావ్యంగా చరిత్ర సృష్టించిన కథని ‘టచ్’ చేయటం అంటే- ఒకవిధంగా ఫీల్‌ని కలిగించగలమా? అన్న సందేహం వెంటాడుతుంది. ఆ ఒరిజినాలిటీ దెబ్బ తింటుందేమో? సజీవ పాత్రల తాలూకు ‘్భవన’లు ఎక్కడికైనా పారిపోతాయేమో? కథ అడ్డం తిరుగుతుందేమో? ఇన్ని ఆలోచనలతో సతమతమయ్యే కంటే, ఆ కథ జోలికి వెళ్లకపోవటమే ఉత్తమం అన్న స్థిరాభిప్రాయానికి వచ్చిన సందర్భాలూ ఇండస్ట్రీలో ఉన్నాయి. గత ఏడాది మలయాళంలో ‘ప్రేమమ్’ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ సుందర కావ్యాన్ని కొద్దిగా అర్థమరుూ్య అర్థం కాకపోయినా -పర భాషా కళ్లతో చూసేసి.. తీయటి అనుభూతుల తెరల్ని మనసుకి కట్టేసుకున్న ప్రేక్షకులూ ఉన్నారు. మరి అలాంటి దృశ్య రూపకం మన భాషలో వస్తోందంటే.. డైరెక్టర్ ధైర్యాన్నీ.. యూనిట్ కృషినీ.. కథ తాలూకు సజీవ పాత్రల్లో నటీనటుల పరకాయ ప్రవేశాన్నీ చూద్దామన్న ఉత్సుకత రేకెత్తటం సహజం. ఇండస్ట్రీలోనే కాదు -జనంలోనూ ఆ నోటా ఈ నోటా తరచూ ప్రస్తావించుకొన్న మాటలే ఇవి. కథని ఏం చేశాడు? ఏవిధంగా మలచాడు? ఏయే మార్పులు చేశాడు? ఎక్కడెక్కడికి తీసుకెళ్లాడు? కథని ప్రేక్షకులకి దగ్గర చేయగలిగాడా? నటీనటుల పెర్‌ఫార్మెన్స్ ఎలా ఉంది? ఇత్యాది ఆలోచనలన్నీ కలగలిసి ‘ప్రేమమ్’ తీయటి అనుభూతుల వర్షపు జల్లుల్ని కురిపించిందా? అన్నది చూద్దాం.
కథ -విక్రమ్ (నాగచైతన్య) అనే కుర్రాడి మనసులోకి వేర్వేరు సందర్భాల్లో.. వయసులో ముగ్గురు అమ్మాయిలు ఎంటరవుతారు. టీనేజ్‌లో సుమ (అనుపమ పరమేశ్వరన్).. కాలేజీలో సితార (శృతిహాసన్).. లైఫ్‌లో సెటిల్ అయ్యాక సింధు (మడోన్నా సెబాస్టియన్)తో ప్రేమ. ఈ ముగ్గురమ్మాయిలు విక్కీ జీవితంలో ఏయే పాత్రల్ని పోషించారు? ఎలాంటి ప్రభావాన్ని చూపించారు? అన్నది క్లైమాక్స్.
కథ విన్న తర్వాత -ఎక్కడో ఈ ‘రీల్’ తిరిగినట్టుందే అనిపిస్తుంది కదా! ‘నా ఆటోగ్రాఫ్ మై స్వీట్ మెమొరీస్’ కథలా రీళ్లు తిరుగుతుంది గానీ.. అది లీలగా కనిపిస్తూన్నప్పటికీ -‘ప్రేమమ్’ తీయదనం వేరు. ప్రతి ఒక్కరూ ‘కనెక్ట్’ కావటానికి కావల్సినన్ని ‘జ్ఞాపకాలు’ వెంటాడుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇటువంటి సందర్భాలూ సన్నివేశాలూ.. టీనేజ్ తాలూకు మెమొరీస్ ఉంటాయి కాబట్టి -ఆయా సన్నివేశాల్లో సగటు ప్రేక్షకుడు సైతం జొరబడి ఆయా పాత్రల భావోద్వేగాల్నీ.. టీనేజ్ ప్రేమకథల్ని నెమరువేసుకొంటూంటాడు. ఇటువంటి కథల్లో నాటకీయత ఉండకపోవటం వల్ల -ఒరిజినాలిటీ పట్టి కుదిపేస్తుంది. ఏ అక్షరానికీ అందని భావాలు మనసులో అలజడి సృష్టిస్తాయి.
ఓ అమ్మాయి పట్ల కలిగేది -ఇష్టమా? ఆకర్షణా? ప్రేమా? అంటే -చెప్పే వయసు కాదది. అప్పటి ప్రేమ?! కాలేజీలో అడుగుపెట్టింత్తర్వాత -అంతగా తెలిసీ తెలియని వయసులో పుట్టేది ప్రేమ అన్న భావన తప్ప.. నిజానికి కాదేమో? అన్న సందిగ్ధత. ఆ స్థాయిలన్నీ దాటేసి- జీవితం అంటే ఒక అవగాహన ఏర్పడింత్తర్వాత కలిగేది నిజమైన ప్రేమా? ఇలాంటి ఆలోచనల సమాహారమే ఓ కుర్రాడి జీవితం.
మలయాళ ‘ప్రేమమ్’ని మనసులోకి రానీయకుండా.. చూట్టం మొదలుపెడితే.. ఎక్కడా ఆగే ఛాన్స్ ఉండదు. ‘శుభం’ కార్డు తర్వాత కూడా థియేటర్‌లోంచి కదల బుద్ధికాదు. ఏదో ‘మిస్’ అయి వెళ్లిపోవాలా? ఇంకొద్దిగా ఉంటే బావుణ్ణు అనిపిస్తుంది. ఇక్కడ కథలోని గొప్పతనం ఇదైతే.. దర్శకుడు చందు మొండేటి -మలయాళ కథలోని పట్టు ఏమాత్రం సడలనీకుండా ‘మొండి’ పట్టుపట్టాడు. దీంతో ఒరిజినల్ కథకి చేసిన మార్పులు కూడా అద్భుతంగా కొసమెరుపుల్లా అనిపిస్తాయి.
సినిమా చూస్తున్నంతసేపూ -్భవుకత పరిమళాల్ని ఆస్వాదిస్తూ.. ఇటువంటి లైఫ్‌లోకి ఒక్కసారిగా తొంగి చూడాలనిపిస్తుంది. అందంగా పొయిటిక్‌గా సాగిపోతూ.. ఆ అమ్మాయిల సరసన ఉండిపోవాలనిపిస్తుంది. ఇక్కడ ఏ కథకి ఆ కథ పలకరించి.. పెదవులపై నవ్వుల్ని మెరిపించి.. ఆనక కంటతడి పెట్టించి.. పిల్లతెమ్మెరల్లా వెళ్లిపోతాయి.
నటనాపరంగా -నాగచైతన్య మరింత పరిణతి చెందాడనిపిస్తుంది. మూడు దశల్లో సాగే అతడి జీవితంలోని పరిణామాల్ని చక్కగా ఎక్స్‌ప్రెస్ చేయగలిగాడు. అనుపమ.. శృతిహాసన్.. మడోన్నా ఎవరికి వారు ఆయా పాత్రల్ని సమర్థవంతంగా పోషించి -సన్నివేశాల్ని రక్తికట్టించారు. బ్రహ్మాజీ, ప్రవీణ్, నర్రా శీను, శ్రీనివాస్‌రెడ్డి చక్కటి హాస్యాన్ని వొలికించారు. వెంకటేశ్, నాగార్జున క్యామియోలు సినిమాని పైస్థాయికి తీసుకెళ్లేందుకు ఉపయోగపడ్డాయి. సంగీతం, ఛాయాగ్రహణం సినిమాకి మరో ప్లస్ పాయింట్. ఇలా ఏ శాఖకి ఆ శాఖ తమతమ నైపుణ్యాన్నీ.. కృషినీ చూపటంతో ‘ప్రేమమ్’ సినీ చరిత్రలో మరో మజిలీగా మిగిలిపోతుంది.

-BNK