రివ్యూ

*మనవూరి రామాయణం (అదో టైపు స్టోరీ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులిరాజుకి అప్పుడప్పుడు బిరియానీ తినాలనిపించొచ్చు. ఎప్పుడూ ఇంట్లో పచ్చడి, పప్పన్నం నచ్చదుగా. పదిమంది కళ్లలో పడకుండా ‘బిరియాని’ లాగించాలనుకుంటే -కొంత రిస్క్ తప్పదు. అట్లాంటి సారాంశమున్న కథాంశంతో మలయాళంలో విజయవంతమైన ‘షట్టర్’ చిత్రానికి రీమేకే -తెలుగులో ప్రకాష్‌రాజ్ దర్శకత్వంలో రూపొందించిన ‘మనవూరి రామాయణం’. తమిళంలో సత్యరాజ్ హీరోగా ‘ఒరునాళ్ ఇరవిల్’గా రూపొందింది. కన్నడంలోనూ ప్రకాష్‌రాజ్ ‘ఇదొల్లె రామాయణ’గా అందించారు. అంటే ఇదొక మంచి రామాయణమని అర్థం. ఇందులో మంచి చూడాలంటే కథలోకెళ్లాలి.
కథేంటి?
అందమైన వూరు. ఊళ్లో అందరిచేత పెద్దమనిషిలా గౌరవం పొందే భుజంగయ్య (ప్రకాష్‌రాజ్). అందరూ గౌరవించాలని, తననెవరూ వేలెత్తి చూపకూడదని ఆశిస్తుంటాడు. ఇంట్లోవాళ్లకు మాత్రం భుజంగయ్య రావణాసురుడే. అతని మానసిక పరిస్థితిని భార్య అర్థం చేసుకున్నా, పెళ్లీడుకొచ్చిన కూతురికి తండ్రి పద్ధతి నచ్చదు. చిన్న వయసులోనే కూతురికి పెళ్లి చేసెయ్యాలన్నది భుజంగయ్య ప్రయత్నం. అది ఇష్టంలేని కూతురు తండ్రిని ఎదిరించలేక మదనపడుతుంటుంది. శ్రీరామనవమి రోజున ఊళ్లో తనకునచ్చిన పెద్దలతో బాగా తాగుతాడు. అతని బంటు శివ (సత్యదేవ్) ఆటోలో ఇంటికి చేర్చడానికి సిద్ధమవుతాడు. అర్థరాత్రిపూట వెళ్తుండగా దారిలో సుశీల (ప్రియమణి) కనిపిస్తుంది. మొదట భయపడినా, తరువాత ఆమె వేశ్య అని తెలుసుకొని ఆ రాత్రికి ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. కానీ ఇంటి ముందున్న ఓ చిన్న షాపులో శివ ఇద్దరినీ పెట్టి తాళం వేసి వెళ్లిపోతాడు. ఒక అరగంటలో వస్తాడనుకున్న శివ, మద్యం సేవించి పోలీసులకు చిక్కి పోలీస్ స్టేషన్‌లో ఇరుక్కుపోతాడు. ఇక్కడ భుజంగయ్య, సుశీల ఆ షాపులోనుండి బయటికి వచ్చే మార్గంలేక ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటుంటారు. పెద్దగా అరిచి తన పరువు తీయొద్దని, ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానని భుజంగయ్య సుశీలను ప్రాధేయపడుతుంటాడు. ఆమెకు గంటగంటకి బుకింగ్ ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి. కానీ, ఆమె బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఇరుక్కుపోయిన కారణంగా తాను చాలా నష్టపోతున్నానని, ఆ నష్టాన్ని ఎవరు పూడుస్తారని యాగీ చేస్తుంది సుశీల. ఈ గొడవ భయంలో ఆమెతో ఎంజాయ్ చేయాలనే విషయానే్న మర్చిపోతాడు భుజంగయ్య. చివరికి భుజంగయ్య పరువు సంగతి ఏమైంది? రావణాసురుడిగా ఇంట్లో వాళ్ళు భరించే అతనేంచేశాడు? సుశీల ఎవరు? అనేది మిగతా కథ.
ఎలా వుంది?
ఉపమానంగా వాడుకున్న ఊరి రామాయణంలో రావణాసురుడి పాత్రలా భుజంగాన్ని చూపించడం, తెలుగు చిత్రాలకు భిన్నమైన ఆలోచన తప్ప సినిమాలో కొత్తగా ఫీలవ్వడానికి ఏమీ ఉండదు. తనలోవున్న దర్శకుడిని బయటపెట్టడానికి ప్రకాష్‌రాజ్ చేసిన ప్రయత్నాన్ని మాత్రం అభినందించాలి. సహజంగా పల్లెటూరి కథలెలా ఉంటాయో అలాగే చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కథనంలో సినీ రచయిత పాత్ర (పృధ్వీ)ను చొప్పించిన విధానం బావుంది. మధ్యమధ్యలో సినీ హీరోల కార్వాన్ కథనాలు, తన చుట్టూ మూగే మూకను తిప్పించుకునే సినిమా వ్యక్తుల వ్యక్తిత్వాలపై అక్కడక్కడా చెణుకులు వేశారు. అసలు సుశీల ఎవరు? సినిమా రచయితకు ఆమె డబ్బు ఎందుకిచ్చింది? చివరికి ఎక్కడికెళ్లింది? అనేది జవాబులేని ప్రశ్నలు. క్లాసికల్ స్టోరీలలో బహుమతి పొందిన కథలా చివరికి రైలెక్కే సుశీల సన్నివేశంపై శుభం కార్డు వేయడంతో చిత్రానికి నిండుదనం రాలేదు. ఉన్నంతలో ప్రకాష్‌రాజ్, ప్రియమణి, పృధ్వీ తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు. కానీ, ఇలాంటి కథలున్న సినిమాలు మలయాళ, కన్నడ భాషల్లో వర్కవుట్ అవుతాయి కానీ తెలుగులో కష్టమే అనిపిస్తుంది. కాదు.. ఓసారి వెరైటీ చూసొద్దాం అనుకుంటే మాత్రం మనవూరి రామాయణం చూడొచ్చు. చాలాకాలం తరువాత ఇళయరాజా సంగీత మధురిమ మాత్రం ప్రేక్షకుడికి హాయనిచ్చింది.

తారాగణం: ప్రకాష్‌రాజ్, ప్రియమణి, అచ్యుత్‌కుమార్,
రంగాయన రఘు, రఘుబాబు, పృధ్వీ,
సత్యదేవ్ తదితరులు
సంగీతం: ఇళయరాజా
సినిమాటోగ్రఫీ: ముఖేష్
దర్శకత్వం: ప్రకాష్‌రాజ్

-సరయు