ఈ వారం స్పెషల్

మరో మనిషి రోబో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిమానవుడు ఆధునిక మనిషిగా మారాడు. విలాసం కోసం, వినోదం కోసం ఎన్నో మార్గాలను వెతుకుతున్నాడు. తమ అవసరాలు తీర్చుకోవడానికి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. కూర్చున్న చోటు నుండి కదలకుండా అన్ని పనులూ జరిగిపోయేలా యాంత్రిక జీవనానికి అలవాటుపడుతున్నాడు. అలాంటి జీవితానికి దోహదం చేసే యంత్రాలే రోబోలు.నిన్నటి వరకూ రోబోలను మర మనుషులు అని చెప్పినా, నేడు ఆధునిక కాలంలో మనిషి కోరుకుంటున్నవన్నీ చేసిపెట్టే మరో మనిషి రోబో. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఇందుకు దోహదం చేయబోతోంది.

రోబోల గురించి చెప్పనక్కర్లేదు, తెలుగులో రోబో సినిమా రావడానికి ముందే హాలీవుడ్‌లో ఐ రోబోట్ సంచలనం సృష్టించింది. రోబోలపై ప్రపంచానికి క్రేజ్ కలిగించిన చిత్రం అది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోబోలను ఈ సినిమాలో రూపొందించారు. అన్ని పనుల్లోనూ అవి సాయం చేస్తుంటాయి. కాని తనను తయారుచేసిన సృష్టికర్తనే చంపాలని అనుకుంటుంది. తనలాంటి ఎన్నో రోబోలను తయారుచేసి విధ్వంసానికి కాలుదువ్వుతుంది. డైరెక్టర్ శంకర్ తీసిన రోబో సినిమా కూడా మన దేశంలో ఒక సంచలనం. ఇందులో మరమనిషి అనేక విన్యాసాలను చేస్తుంది. అలాగే టివిల్లో వచ్చే కార్ల కంప్యూటర్ల ప్రకటనల్లో కూడా మరమనిషిని చూస్తున్నాం. అవి మనల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. భారీ పరిశ్రమల్లో అతి క్లిష్టమైన పనులను కూడా చేయడానికి 50 ఏళ్ల క్రితమే మరమనుషుల్ని ఉపయోగించినట్టు ఆధారాలున్నాయి. మనిషి కూడా చేయలేని పనులను సునాయాశంగా మర మనిషి చేయగలుతోంది. అయితే మరమనిషి ముప్పును సినిమాల్లో ప్రదర్శించారు. రోబో సినిమాలో చిప్ మార్చడంతో జరిగిన ప్రళయం కళ్లకుకట్టినట్టు చూపించారు. దేశ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని తయారు చేసిన ఈ రోబో చిప్ మార్చడంతో భయానకంగా విరుచుకుపడుతుంది. రోబోల ఉత్పత్తిలో అనూహ్యంగా ప్రగతి సాధిస్తున్న తరుణంలో శాస్తవ్రేత్తలకు , ప్రజలకు ఆ చిత్రాలు ఒక హెచ్చరిక. ముందున్న ముప్పును గుర్తుచేశాయి. కాని అలాంటి సంఘటనలే ఇటీవల నాలుగైదు చోటు చేసుకోవడంతో రోబోల గురించి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. రోబోలు వినాశకారిగా మారడం మనం సినిమాల్లోనే చూశాం. కాని ఇప్పుడవి నిజంగానే అనుభవంలోకి వచ్చాయి. పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న రోబోలు సహ కార్మికులను చంపేస్తున్నాయి. సహాయకారిగా ఉండాల్సిన రోబో మనుషులను ఎందుకు చంపేస్తున్నాయి? ఓ సినిమాలో చెప్పినట్టు ఈ రోబోలు భవిష్యత్‌లో వినాశకారిగా మారితే మనిషి పరిస్థితి ఏమిటి?
రోబోల చేతిలో మనిషి ప్రాణాలు పోగొట్టుకోవడం మనదేశంలో ఇదే మొదటిసారి. ఢిల్లీ సమీపంలోని గూర్గావ్‌లోని మానేసర్ ఎస్ కె హెచ్ మెటల్స్ కంపెనీలో 63 మంది కార్మికులు, 34 రోబోలు పనిచేస్తున్నాయి. ఒక రోబో చేతిలో 24 ఏళ్ల రామ్‌జీ లాల్ నలిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఫ్యాక్టరీలో అనేక రకాల పనులు చేసేందుకు ముందే ప్రోగ్రాం చేసిన రోబో అది. బరువైన మెటల్ షీట్లను అది ఎత్తుతుంది. రోబో ఎత్తిన ఒక షీట్ ఒకవైపు ఒరిగి పోయి ఉండడాన్ని గమనించిన రామ్ జీ లాల్ అది కింద పడితే డ్యామేజీ జరుగుతుందని భావించి దానిని సరిచేసేందుకు ముందుకువెళ్లాడు. అంతే రోబో అతనిని కూడా మెటల్‌కు సంబంధించినదిగా భావించి నలిపేసింది. గత ఏడాది జూన్ 29న జర్మనీలోని వోక్స్‌వేగన్ ఫ్యాక్టరీలోనే ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కార్మికుడిని రోబో ఒక లోహపు ప్లేట్‌కు అదిమి గుండెలపై గట్టిగా నొక్కి చంపేసింది.
1979లో మిచిగాన్ ఫోర్టు కర్మాగారంలోనూ లైన్ వర్కర్‌ను రోబో పొట్టనపెట్టుకుంది. తర్వాత 1984లో జపాన్‌లో ఇంజనీర్ కెంజి ఉరాడాను రోబో చంపేసింది. ఇవన్నీ ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలే అని సరిపెట్టుకోవాలా? లేదా హింసకు పాల్పడేలా ప్రోగ్రామింగ్ ఇన్ స్టాల్ చేశారా ఇలాంటి సాఫ్ట్‌వేర్ ఉంటుందా అనేది ఆలోచించాలి. రోబో ఒక యంత్రం కిందకే వస్తుంది కనుక యంత్రాల ముప్పుగానే దీనిని పరిగణించాలి.
మనిషి ఆవిష్కరణల్లో
మరో మైలు రాయి రోబో..
మనిషి దాహం తీరనిది, తన ఉనికిని కాపాడుకునేందుకు జాతి మనుగడకు రోజుకో ఆవిష్కరణ చేస్తునే ఉన్నాడు. మనిషి పరిణామ చక్రంలో లక్షల సంవత్సరాలు గడిచిపోయాయి. చక్రాన్ని ఆవిష్కరించిన తర్వాత యంత్ర పరికరాలు, వస్తు ఉత్పత్తి, పారిశ్రామికీకరణ, అంతర్జాతీయ వర్తకం, టెలిఫోన్, రేడియో, టివి, పర్సనల్ కంప్యూటర్, పేజర్లు, ఇంటర్‌నెట్, సెల్‌ఫోన్లు, స్మార్టు ఫోన్లు ఇలా స్వరూపం మారిపోతూ వస్తోంది. ఉత్తర ప్రత్యుత్తరాలు, వినోదం, ప్రయాణం, విజ్ఞానం, వైద్యం, షాపింగ్, ఆర్ధిక లావాదేవీలు అన్నీ ఫోన్లలోనే సాగిపోతున్నాయి. ఈ క్రమంలో వినూత్న ఆవిష్కరణ మర మనిషి. విపత్తు, వినాశనం, వికాసం మూడూ కలగలసిన విధ్వంసకర ఆవిష్కరణ మరమనిషి. మరమనిషి అని మనం రోబోను చెప్పుకుంటున్నాం. ఒక వాస్తవికమైన యాంత్రిక కృత్రిమ ఉపకరణమే మరమనిషి. దీనిని సాధారణంగా కంప్యూటర్ లేదా ఎలక్ట్రానిక్ ప్రోగ్రామింగ్ మార్గనిర్దేశంతో పనిచేసే ఒక విద్యుత్ యాంత్రిక ఉపకరణంగా పిలుస్తాం.
మనిషి చేసే ప్రతి పనిని చేయగలిగే శక్తిసామర్ధ్యాలు రోబోలకు ఉన్నాయి. కర్మేంద్రియాలే కాదు, జ్ఞానేంద్రియాలు కూడా రోబోలకు ఉన్నాయని చెప్పవచ్చు. త్వక్కు, చక్షువు, రసన, శ్రోతం, ఘ్రానం రోబోలకు ఉంటున్నాయి. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంథం, మనస్సు, బుద్ధి రోబోలకు దక్కుతున్నాయి. తాజాగా అహంకారం కూడా కలుగుతోందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇచ్చిన ప్రోగ్రాం ఆధారంగా సొంతంగా పనులు నిర్వహించగలుగుతోంది. భౌతిక రోబోలు, వాటి సాఫ్ట్‌వేర్ ఉపకరణాలను కలిపి మనం రోబోట్ అంటున్నాం. రోబోట్‌లతో చాలా ప్రయోజనాలున్నాయన్నది నిర్వివాదాంశం. రానున్న రోజుల్లో ఇంటి పని నుండి యుద్ధాల వరకూ రోబోలు చేయని పని అంటూ ఉండదు. ఆ విధంగా చూస్తే భవిష్యత్ మొత్తం మరమనుషులదే. కానీ మనిషి తనకు సాయపడుతుందని తయారుచేసుకున్న రోబోలు చివరికి మనిషి ప్రాణానికే సంకటమవుతున్నాయి
1960లో జార్జి చార్లెస్ డోవోల్ అనే శాస్తవ్రేత్త తొలిసారిగా పారిశ్రామిక మరమనిషిని డిజైన్ చేశాడు. ఏంజెల్ బెర్జర్ సహకారంతో డోవోల్ తయారు చేసిన మొట్టమొదటి రోబోట్‌ను జనరల్ మోటార్స్‌కు విక్రయించారు. 1961లో డోవెల్ ఫ్యాక్టరీ నుండి యునిమేట్ అనే పేరుతో తొలి పారిశ్రామిక మరమనిషిని తయారుచేసి న్యూజెర్సీలోని జనరల్ మోటార్స్‌కు అమ్మేశాడు. ఆ తర్వాత పరిశోధనలు కొనసాగించి డిజైన్‌లో లోపాలను సరిచేసి విస్తృత స్థాయిలో 1966 నుండి రోబోల ఉత్పత్తి మొదలైంది. న్యూజెర్సీలో ఇన్‌స్టాల్ చేసిన తొలి రోబోను డై కాస్టింగ్ మెషిన్ నుండి ఎర్రగా కాల్చిన ఇనుప ప్లేట్లను తీసి దొంతరగా పేర్చడానికి రోబోట్‌లను వాడారు.
కదిలే సామర్ధ్యం ఉండటం, యాంత్రిక అవయవం కలిగి ఉండటం, వాటిచుట్టూ ఉన్న వాతావరణాన్ని గ్రహించి నియంత్రించగలగడం, మేథావి ప్రవర్తనను ప్రదర్శించడం, ముఖ్యంగా మానవులు లేదా ఇతర జంతువుల ప్రవర్తనను అనుకరించడం రోబోల నిత్యకృత్యంగా ఉంది. గతంలో మానవ ప్రమేయం లేకుండా వాటి సాఫ్ట్‌వేర్ ఆధారంగా నియంత్రించబడే పరికరాలను పిలిచేందుకు మాత్రమే ఉపయోగించేవారు. స్వయంచాలక నియంత్రణ, పునఃక్రమణిక చేయగలిగే బహుళ ఉపయోగ యంత్రమే రోబో. పదార్థాలు, భాగాలు, సాధనాలు తరలించే పునఃక్రమణిక చేయగలిగే బహుళ క్రియా ఉపకరణాలు లేదా వైవిధ్యభరితమైన క్రియలు నిర్వర్తించేందుకు వివిధ క్రమణిక చర్యలు ద్వారా పనిచేసే ప్రత్యేకించిన పరికరాలను రోబోట్‌లుగా నిర్వచించవచ్చు. అనూహ్యమైన జోక్యం చేసుకోవలసిన క్లిష్టత ఉన్న కఠిన నియంత్రణ పర్యావరణాల్లో రోబోలను ఉపయోగిస్తున్నారు. అవయవాలను నియంత్రించే సామర్థ్యం ఉండటంతో పాటు మానవ లక్షణాలను కలిగి ఉన్న లేదా మానవ ప్రవర్తననే జంతు భాషలో చెప్పగలిగితే అటువంటి వాటిని రోబోలుగా చెబుతున్నాం. స్వయం చాలక పియానో కూడా రోబోనే.
చెక్ రచయిత కారెల్ కాపెక్ తొలిసారి రోబో అనే మాటను వినియోగించాడు. రస్సుమ్స్ యూనివర్సల్ రోబోట్స్ అని తన నాటకంలో వాడాడు. రోబోలుగా పిలిచే కృత్రిమ మనుషులను తయారుచేసే కర్మాగారంలో ఈ నాటకం ప్రారంభం అవుతుంది. ఇక్కడ యాండ్రాయిడ్స్ (యంత్ర మనుషులను ) తయారుచేస్తుంటారు. మనుషుల ఆధునిక భావాలకు దగ్గరగా అవి ఉంటాయి. కారెల్ కాపెల్‌కు ముందు దీనిని చిత్రకారుడైన తన సోదరుడు జోసఫ్ కాపెక్ దీనిని ఉపయోగించారని కూడా చెబుతుంటారు. గాడిద చాకిరి చేసే కఠోర పరిశ్రమ చేయగలిగే ఒక యంత్ర బానిసే రోబో. అలాంటి రోబోల గురించి వివరంగా అర్ధం చేసుకునేందుకు విస్తరించిన శాస్తమ్రే రోబోటిక్స్. రోబోలు నేడు బాగా అభివృద్ధి చేయబడుతున్నాయి. ఆధునికీకరించబడుతున్నాయి. రోబోట్ల ప్రవర్తనను ఏ విలువలు నియంత్రిస్తాయనే ప్రశ్నలతో పాటు ఏదైనా సాంఘిక , సాంస్కృతిక నైతిక లేదా న్యాయపరమైన హక్కులు పొందగలవా అంటూ నిపుణులు, పరిశోధకులు పెద్ద ఎత్తున చర్చను ప్రారంభించారు. కంప్యూటర్లు, రోబోట్లు మానవుల కంటె తెలివిగా వ్యవహరించే రోజు వస్తుందని వెర్నోర్ వింజే పేర్కొన్నాడు. దీనిని అతడు ఏకైతత్వంగా వ్యవహరించాడు. ఈ పరిస్థితి మానవులకు కొంత వరకూ లేదా బహుశా తీవ్ర ప్రమాదకారిగా చెప్పవచ్చు. 2009లో కంప్యూటర్లు, రోబోలు స్వతంత్రత సాధించగలగాలి అనే అంశంపై చర్చించారు. వాటి సామర్థ్యాలు ఎంత వరకూ ముప్పు కలిగిస్తాయి లేదా ప్రమాదాన్ని తెచ్చిపెడతాయన్నది కూడా చర్చించారు. కొన్ని రోబోలు వివిధ రూపాల్లో పాక్షిక స్వాతంత్య్రతను సాధిస్తాయని నిపుణులు తేల్చారు. సొంతంగా విద్యుత్ వనరులను గుర్తించడం, ఆయుధాలతో దాడి చేసేందుకు లక్ష్యాలను స్వతంత్రంగా ఎంచుకునే స్థితికి వస్తాయని వారు గుర్తించారు. కొన్ని కంప్యూటర్ వైరస్‌లను నాశనాన్ని తప్పించుకోగలవని, అవి బొద్దింక మేథాశక్తిని సాధించగలిగాయని పేర్కొన్నారు. వైపరీత్యాలు, ప్రమాదాలకు కూడా అవకాశం ఉందని వారు గమనించారు. వివిధ ప్రాంతాల్లోని వేర్వేరు పోకడలు కలిసి రోబోట్ కచ్చితత్వం, స్వతంత్రత విస్తృతమయ్యేందుకు దోహదం చేయగలవని వివిధ మాధ్యమ వర్గాలు , శాస్ర్తియ వర్గాలు చెబుతున్నాయి. మిలటరీ పోరులో రోబోల వినియోగాన్ని నిపుణులు , పరిశోధకులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని ఆయుధ సహిత రోబోట్‌లను ఇతర రోబోటు నియంత్రించి ఉంచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. అసోసియేషన్ ఆఫ్ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ ఆర్ట్ఫిషియల్ ఇంటిలిజెన్స్ సంస్థ ఈ అంశాలను లోతుగా అధ్యయనం చేస్తోంది. స్నేహపూర్వకంగా, మానవత్వంతో వ్యవహంరిచేలా చేసేందుకు ఉద్దేశించిన చర్యలతో రోబోలను అనుసంథానం చేస్తున్నారు. జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు రోబోట్లను భద్రతా వ్యవస్థల సాధన సామగ్రిని అమర్చేందుకు పాటించాల్సిన నియమాలు అమలులోకి తేవడం ప్రారంభించాయి. అవి అసిమోవ్స్ రోబోటిక్స్ మూడు సూత్రాలను పోలిన చట్టాలు. సర్వీసు రోబోలను జపాన్ పూర్తిస్థాయి వాణిజ్య కార్యకలాపాల్లో భాగం చేసేసింది. ఈ క్రమంలోనే ప్రామాణిక కంప్యూటర్ నిర్వహణ వ్యవస్థ ఏర్పాటుచేయాల్సిన అవసరం ఏర్పడింది. రోబోట్‌ల నిర్వహణ వ్యవస్థ అనేది కొన్ని క్రమణికలు (ప్రోగ్రాంలు) ఉండే సర్వ ప్రవేశ (ఓపెన్ సోర్స్) వ్యవస్థ. దీనిని స్టాన్‌ఫోర్టు విశ్వవిద్యాలయం , మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , జర్మనీలోని మ్యూనిచ్ సాంకేతిక విశ్వవిద్యాలయం అభివృద్ధి చేస్తున్నాయి. ఉపయోగించిన నిర్దిష్ట హార్టువేర్‌తో సంబంధం లేకుండా ఒక రోబోట్ మార్గనిర్దేశకం , అవయవాలను ప్రోగ్రాం చేసేందుకు రోబోట్ నిర్వహణ వ్యవస్థ ఉపయోగపడుతుంది. రోబోట్ కంప్యూటర్‌పై బూట్ అయినపుడు అన్ని రకాల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని గ్రహిస్తుంది. మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా రోబోటిక్స్ డెవలపర్స్ స్టుడియోలో రోబోట్‌ల వ్యవస్థ కోసం విండోస్‌ను రూపొందించింది.
తొలి రోజుల్లో గృహాల్లో కర్మాగారాల్లో రోబోట్‌లను ఉపయోగించినా, అనేక కొత్త అంశాలు కనుగొనేందుకు సుదీర్ఘకాల ప్రయోగాలు కొనసాగుతున్నాయి. 9 మీటర్ల పరిమాణంలో యంత్రాలు లేదా రోబోట్‌లను తయారుచేసేందుకు ఉద్దేశించిన నానో రోబోటిక్స్ ఇప్పటికీ ఎక్కువగా ఊహాత్మక సాంకేతిక పరిజ్ఞానంగానే ఉంది. వీటిని నానోబోట్‌లు లేదా నానైట్స్ అని పిలుస్తారు. వీటిని పరమాణు యంత్రాల నుండి రూపొందిస్తారు. పరిశోధకులు ఇంత వరకూ ఎక్కువగా సంక్లిష్ట వ్యవస్థలకు సంబంధించి బేరింగ్‌లు, సెన్సార్‌లు సింథటిక్ మాలిక్యులర్ మోటార్‌లను తయారుచేయగలిగారు. సూక్ష్మ స్థాయిలో పనిచేయగలిగే వైరస్‌లు లేదా బాక్టీరియా పరిమాణంలో ఉండే రోబోట్‌లను తయారుచేయడం కూడా సాధ్యపడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. సూక్ష్మ శస్తచ్రికిత్సల సమయంలో వీటిని వాడుతున్నారు. సిలికాన్ శరీర నిర్మాణంతో సౌకర్యవంతమైన యాక్యుయేటర్‌లు (వస్తువులను కదిపే సాధనాలు), ఎయిర్ మజిల్స్, ఎలక్ట్రోయాక్టివ్ పాలిమర్స్, ఫెర్రో ఫ్లూయిడ్‌లు వంటి వాటిని మనం సాఫ్ట్ రోబోట్‌లు అంటున్నాం. ఫిజిలాజికల్, న్యూరల్ నెట్‌వర్కుల వినియోగంతో నియంత్రించబడటంతో పాటు ధృడమైన అస్తిపంజరంతో రోబోట్‌లకు భిన్నంగా కనిపిస్తాయి. వివిధ రకాల ప్రవర్తనను ప్రదర్శించగలిగే శక్తి వీటికి ఉంటుంది.
రీకాన్ఫిగరబుల్ రోబోట్‌లు కూడా రూపొందబోతున్నాయి. అంటే ఒక ప్రత్యేకమైన పనికోసం తమ భౌతిక రూపాన్ని మార్చుకోగలిగే రోబోట్‌లను తయారుచేయడం కూడా సాధ్యపడుతుందని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. దీనికి పోలిన సూపర్ రోబోలు క్యూబ్ , చతురస్రాకారాల్లోకి ఇప్పటికే మారుతున్నాయి. చీమలు, తేనెటీగలు వంటి పురుగుల సమూహాల స్ఫూర్తితో పరిశోధకులు వేలాదిసూక్ష్మ రోబోలను తయారుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దాగి ఉన్నవాటిని కనుగొనడం, శుభ్రపరచడం, గూఢచర్యం చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. చీమల దండు సమూహ తెలివితేటలు ప్రదర్శిస్తున్నట్టే మహాజీవవ్యవస్థగా పనిచేసేలా రోబో సమూహాలు తయారు చేస్తున్నారు. ఇంత వరకూ సృష్టించిన వాటిలో అతిపెద్ద సమూహాల్లో ఐరోబోట్ స్వార్మ్ ఒకటి.
రోబోల్లో సగభాగం ఆసియా ఖండంలోనే ఉన్నాయి. 32 శాతం రోబోలు ఐరోపాలోనూ, 16 శాతం అమెరికాలోనూ, ఒక శాతం ఆస్ట్రేలియాలోనూ, ఒక శాతం ఆఫ్రికాలోనూ ఉన్నాయి. మొత్తం రోబోట్‌లలో 30 శాతం జపాన్‌లోనే ఉన్నాయి. అంతేకాదు ప్రపంచ రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానానికి జపాన్ నేతృత్వం వహిస్తోంది. జపాన్, దక్షిణ కొరియా దేశాల్లో భవిష్యత్ రోబోట్‌లకు సంబంధించిన ఆలోచనలు సానుకూలంగా ఉన్నాయి. ప్రసిద్ధ ఆస్ట్రోబాయ్ కారణంగా ఇక్కడ రోబోటిక్ అనుకూల సమాజం ప్రారంభం కావడం సాధ్యంగానే కనిపిస్తోంది. ఆసియా సమాజం రోబోలను మానవులతో సమానంగా భావిస్తున్నాయి. వృద్ధుల సంరక్షణ, పిల్లలతో ఆడుకోవడం, వారికి బోధనలు చేయడం లేదా పెంపుడు జంతువుల స్థానాన్ని భర్తీ చేయడం వంటి వాటికి వినియోగిస్తున్నారు.
****

చాలా వరకూ రోబోట్లు నిర్దేశిత పనినే చేస్తాయి. అయితే సాధారణ ఉపయోగార్ధం స్వతంత్ర రోబోట్‌లు వివిధ పనులను స్వతంత్రంగా నిర్వర్తించగల సామర్ధ్యం కలిగి ఉంటాయి. తెలిసిన ప్రదేశాల్లో స్వతంత్రంగా కదలగలుగుతాయి. వాటి సొంత రీ చార్జింగ్ అవసరాలను తీర్చుకోవడంతో పాటు ఎలక్ట్రానిక్ డోర్లు, ఎలివేటర్లతో సంకర్షణ జరపడం, ఇతర ప్రాథమిక విధులను నిర్వర్తించడం చేస్తాయి. కంప్యూటర్లు మాదిరిగానే నెట్‌వర్కులు, సాఫ్ట్‌వేర్‌లతో అనుసంథానం అవుతాయి. వ్యక్తులను, పక్షులను, వస్తువులను , జంతువులను గుర్తించడం, మాట్లాడటంతో పాటు సహచర్యాన్ని అందించగలుగుతాయి. ఉపయోగకరమైన పనులు చేయగలుగుతాయి. అంతే కాదు ఏకకాలంలో వివిధ రకాల పనులు కూడా చేయగలుగుతాయి. వివిధ సందర్భాల్లో వేర్వేరు పాత్రలను పోషిస్తాయి కూడా. కొన్ని రోబోట్‌లు మానవులను అనుకరించేందుకు , వ్యక్తుల ఆకారాన్ని ప్రతిబింబించేందుకు ప్రయత్నిస్తాయి. ఇటువంటి వాటినే మనం హ్యుమనాయిడ్ రోబోట్‌లు అంటున్నాం. మానవుల కంటే అధిక ఉత్పాదకత, కచ్చితత్వం, సహనం ప్రదర్శించగలిగే సామర్థ్యం రోబోట్‌లకు ఉంది. ఆటోమొబైల్ రంగంలో రోబోట్‌ల ఆధిపత్యం మొదలైంది. ప్రతి కర్మాగారంలో రోబోట్‌ల వినియోగం పెరిగింది. కనే్వయర్‌పై ఉన్న వాహన చట్రం వెల్డింగ్ చేయడం, అంటించడం, రంగు వేయడం చేస్తోంది. ప్యాకేజింగ్ కంపెనీల్లో వస్తువులను భద్రపరచడం, కనే్వయర్ బెల్టుపై నుండి డ్రింక్ కార్టన్లను వేగంగా తీయడం, వాటిని పెట్టెల్లో పెట్టడం, యంత్ర కేంద్రాల్లో బరువులు ఎక్కించడం లేదా దించడం చేస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో రోబోలు ఖండాలు లేదా పళ్లేల నుండి సూక్ష్మమైన ఎలక్ట్రానిక్ కాంపొనెంట్‌లను తీసుకుని ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులపై అత్యంత ఖచ్చితత్వంతో అమరుస్తున్నాయి. ఇటువంటి రోబోలు గంటకు వేలాది భాగాలను అమర్చుతున్నాయి . ఆటోమేటెడ్ గైడెడ్ వెహికిల్స్‌గా కూడా రోబోలు పనిచేస్తున్నాయి. ఉపరితలంపై గుర్తులు లేదా తీగలు లేదా దృష్టిని ఉపయోగించే మొబైల్ రోబోలు సరకుల గిడ్డంగులు కంటైనర్ పోర్టులు లేదా ఆస్పత్రుల వంటి భారీ వసతుల్లో సరకులు రవాణా చేసేందుకు ఉపయోగిస్తున్నారు.

-బి.వి.ప్రసాద్