రాష్ట్రీయం

రూటు మారదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాత డిజైన్‌లోనే మెట్రో
అసెంబ్లీ ముందు నుంచే రైలు పరుగులు
సుల్తాన్‌బజార్‌లోనూ త్వరలో పనులు
ఎల్ అండ్ టికి సర్కారు ఆదేశాలు
నేడు బంద్‌కు వ్యాపారుల పిలుపు

హైదరాబాద్, నవంబర్ 26: మెట్రోరైలు ఎలాంటి మార్పులు లేకుండా ముందుగా ప్రతిపాదించిన రూట్‌లోనే పరుగులు తీసే విధంగా పనులు చేపట్టేందుకు ఎల్ అండ్ టి సిద్ధమవుతోంది. ప్రభుత్వం ఈ మేరకు తమకు అధికారికంగా ఆదేశాలు కూడా ఇచ్చినట్లు హైదరాబాద్ మెట్రోరైలు పనులు చేపడుతున్న కన్సార్టియం ఎల్ అండ్ టి మేనేజింగ్ డైరెక్టర్ వి.బి.గాడ్గిల్ వెల్లడించారు. గురువారం ఉప్పల్ మెట్రోయార్డులో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ గతంలో ప్రతిపాదించిన రూట్‌లోనే మెట్రోరైలు కొనసాగుతుందని, అదే కారిడార్లలో పరుగులు తీస్తుందని వివరించారు. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు ప్రతిపాదించిన మొదటి కారిడార్‌లో కొద్దినెలల క్రితం ప్రభుత్వం అసెంబ్లీ ముందునుంచి కాకుండా వెనక నుంచి కారిడార్‌ను నిర్మించాలని భావించినా, వెనక భాగంలో ఇప్పటికే రైల్వే లైన్లు ఉండటం, అక్కడ మెట్రో కారిడార్ నిర్మాణానికి అనుకూలంగా లేకపోవటంతో అసెంబ్లీ ముందు నుంచే పనులు చేపట్టేందుకు ఎల్ అండ్ టికి ప్రభుత్వం అనుమతిచ్చినట్లు ఆయన తెలిపారు. అదే విధంగా సికిందరాబాద్ జెబిఎస్ నుంచి ఆర్టీసి క్రాస్‌రోడ్డు, సుల్తాన్‌బజార్ మీదుగా ఫలక్‌నుమా వరకు ప్రతిపాదించిన మూడో కారిడార్‌లో కూడా అదే రూట్‌లో పనులు జరుగుతాయని ఆయన వివరించారు. అయితే పాతబస్తీలో హైదరాబాద్ మెట్రోరైలు అలైన్‌మెంట్‌కు సంబంధించి ఇంకా చర్చలు జరుగుతున్నాయని, సర్కారు ఈ చర్చలపై తుది నిర్ణయం తీసుకోవల్సి ఉందని ఆయన సూత్రప్రాయంగా చెప్పారు. అసెంబ్లీ ముందు, సుల్తాన్‌బజార్‌లో మెట్రోరైలు అలైన్‌మెంట్ మార్చేందుకు సర్కారు కసరత్తు చేసిందని, అయితే అది సాధ్యపడకపోవటంతో గతంలో ప్రతిపాదించిన రూట్‌లోనే పనులు చేపట్టాలని అధికారికంగా ఆదేశాలు జారీ చేసినందున, వీలైనంత త్వరగా పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
అడ్డుకుంటాం!
సుల్తాన్‌బజార్ మీదుగా మెట్రోరైలు పనులు చేపడుతున్నట్లు ఆ సంస్థ చేసిన ప్రకటనకు నిరసనగా శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చినట్లు సుల్తాన్‌బజార్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సి. మధుసూదన్‌రావు తెలిపారు. సుల్తాన్‌బజార్ మీదుగా మెట్రో పనులు చేపడితే సుమారు 5వేల మంది వ్యాపారులు, లక్షలాది మంది ఉద్యోగులు జీవనోపాధి కోల్పోతారని గతంలో తాము వివరించటంతో సర్కారు సానుకూలంగా స్పందించినట్లు ఆయన వివరించారు. అవసరమైతే ఒకటి, రెండురోజుల్లో ముఖ్యమంత్రిని కలిసి పనులు నిలిపివేయాలని కోరనున్నట్లు ఆయన తెలిపారు.
మెట్రో స్టేషన్లలో రిటైల్ స్టోర్స్
నిరుద్యోగ యువతీ, యువకులకు స్వయం ఉపాధిలో భాగంగా నిర్మాణం పూర్తయిన నాగోల్-మెట్టుగూడ స్టేషన్లలో ప్రయాణికుల రోజువారీ అవసరాలను తీర్చే కన్వీయన్స్, గ్రోసరీ, కూరగాయలు, యాక్సెసరీ స్టోర్లు, క్విక్ సర్వీసు రెస్టారెంట్లు, లార్జ్ ఫార్మాట్ ఫుడ్‌కోర్టులు, ఏటిఎం, మెడికల్ స్టోర్స్, కిడ్స్, ఉమెన్, ఎలక్ట్రానిక్స్, లాండ్రీ సెంటర్లు, స్టేషనరీ, మొబైల్ తదితర స్టోర్లను పెట్టుకోవడానికి ఖాళీ స్థలం ఇవ్వనున్నట్లు గాడ్గిల్ తెలిపారు. ఒక్కో స్టేషన్‌లో మూడువేల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఆసక్తిగల్గిన యువతీ యువకులు స్టోర్లను పెట్టుకోవడానికి వాణిజ్య వ్యాపార సంస్థల ఎల్‌అండ్‌టి వెబ్‌సైట్ ద్వారా ఆయా ఖాళీలను బుక్ చేసుకోవచ్చని ప్రకటించారు. అంతకు ముందు ఆయన నాగోల్ స్టేషన్‌లో వాణిజ్య వ్యాపార సముదాయాన్ని ప్రారంభించారు.