రంగారెడ్డి

వృద్ధుల మనోవికాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఫిబ్రవరి 19: రాష్ట్రంలోని అన్ని పట్టణ, మండల కేంద్రాలలో వృద్ధుల మనోవికాస కేంద్రాల (డే కేర్ సెంటర్స్ ఫర్ సీనియర్ సిటిజన్స్)ను ఏర్పాటు చేయాలని హోం శాఖ మంత్రి మహమూద్ అలీకి ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పీ.నర్సింహారావు, ప్రధాన కార్యదర్శి ఎం.ప్రకాష్ రావు, కోశాధికారి జీ.కుమార స్వామి వినతి పత్రం అందజేశారు. తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం 2007 నియమావళి 2011లోని అన్ని అంశాలను తుచ తప్పకుండా అమలు చేయాలని, అర్హులైన వృద్ధ దంపతులకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించాలన్నారు. రెవెన్యూ డివిజన్లలో మెయింటనెన్స్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు కాలేదని, వాటిని గుర్తించి సత్వరమే ఏర్పాటు చేసినట్లయితే వృద్ధులపై జరుగుతున్న వేధింపులను అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు. చట్టం 2007లోని సెక్షన్ 21 నియమావళి 2011లోని రూల్ 21 ప్రకారం వృద్ధులకు పోషణ, ప్రాణాలకు, ఆస్తులకు పోలీసు శాఖ ద్వారా సంపూర్ణమైన రక్షణ కల్పించాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్పోరేట్ వైద్య సంస్థలలో ఉచిత మెరుగైన వైద్య సేవలను అందించాలని, అందుకోసం ప్రత్యేక క్యూలైన్లు, బెడ్‌లు, వార్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఆర్టీసీ బస్సులలో 50శాతం రాయితీ కల్పించి, టూరిజం కార్పోరేషన్ ప్యాకేజీలలో 50శాతం అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. ప్రతి జిల్లా కేంద్రాలలో వృద్ధాశ్రమంను ఏర్పాటు చేసి, తల్లిదండ్రులను మంచిగా ప్రేమగా చూసుకోవాలని వారి పిల్లలకు చట్టంపై అవగాహన కల్పించాలని చెప్పారు. వృద్ధుల పట్ల అనుసరించవలసిన విధానాలపై ఒకటో తరగతి నుంచి పదవతరగతి వరకు పాఠ్యాంశాలలో చేర్చాలని, వృద్ధుల సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలుచేసి పర్యవేక్షించుటకు ప్రభుత్వంలో ప్రత్యేక శాఖను తగిని నిధులతో ఏర్పాటు చేసినట్లయితే రాష్ట్రంలోని 40లక్షల మంది వయోవృద్ధులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. పై విషయాలపై పరిశీలించి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసికెళ్లి పరిష్కరించేందుకు సంబంధిత శాఖలకు ఆదేశాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు హోం శాఖ మంత్రి మహమూద్ అలీ హామీ ఇచ్చినట్లు అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు.

కార్మికులకు గుర్తింపు కార్డులివ్వాలి
* సీఐటీయు శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కవిత
షాద్‌నగర్, ఫిబ్రవరి 19: మధ్యాహ్న భోజన కార్మికులకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఐటీయు శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కవిత డిమాండ్ చేశారు. మంగళవారం కేశంపేట మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికులతో సమావేశాన్ని నిర్వహించి గుర్తింపు కార్తులను సీఐటీయు మండల కన్వీనర్ పీ.శ్రీను నాయక్ ఆధ్వర్యంలో అందజేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు కల్పించడంతోపాటు మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్రకు అప్పగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని వివరించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. సకాలంలో బిల్లులు అందక ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తుంటే ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రయత్నిస్తుందని, దీన్ని పూర్తి స్థాయిలో ఖండించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 21వ తేదిన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉంటుందని, దీన్ని విజయవంతం చేసేందుకు అన్ని వర్గాల కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు సత్తమ్మ, వెంకటమ్మ, రాములు, అనిత పాల్గొన్నారు.
బాధితులకు సీఎం చెక్కుల పంపిణీ
తలకొండపల్లి, ఫిబ్రవరి 19: మండలంలోని గట్టు ఇప్పలపల్లికి చెందిన డి.లక్షమ్మకు 13వేల చెక్కును, జి.చెన్నారెడ్డికి 26 వేల రూపాయల సిఎమ్ సహాయనిధి చెక్కులను మంగళవారం మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బాధితులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ, ఆకస్మికంగా ప్రమాదాలకు గురై ఆసుపత్రులలో చికిత్స పొందిన ప్రతి పేదవాడికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.
గోల్డెన్ బర్డ్స్ సీనియర్ సిటిజన్స్ సంఘం అధ్యక్షుడిగా వెంకట్ రెడ్డి
ఉప్పల్, ఫిబ్రవరి 19: గోల్డెన్ బర్డ్స్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఉప్పల్ కమిటీ నూతన అధ్యక్షుడిగా ఎం.వెంకట్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం సూర్యనగర్ కమ్యూనిటీ హాల్‌లో జరిగిన కార్యవర్గ సమావేశంలో సభ్యులైన వృద్ధులు పాల్గొని కార్యవర్గాన్ని నియమించారు. ఉపాధ్యక్షులుగా ఆర్.జగన్ మోహన్ రెడ్డి, ఎస్.యాది రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా దుబ్బాక నర్సింహా రెడ్డి, సంయుక్త కార్యదర్శిలుగా వెంకటయ్య గౌడ్, మనోహర్, కోశాధికారిగా సీహెచ్.మోహన్, కార్యనిర్వాహక కార్యదర్శిలుగా జీ.విజయ రావు, కే.వెంకటేశ్వర్లు, సలహాదారులుగా జెట్ట సుధాకర్, శామీర్‌పేట ధర్మారెడ్డి, ఎం.బాల్ రెడ్డి, డాక్టర్ టీ.జ్ఞానేశ్వర్, ఎన్.రఘు రామయ్య, వై.రాంరెడ్డి, కమిటీ సభ్యులుగా 12 మంది ఎన్నికైనట్లు ప్రధాన కార్యదర్శి నర్సింహా రెడ్డి పేర్కొన్నారు.
21న లబ్ధిదారుల ఎంపిక
షాద్‌నగర్ టౌన్, ఫిబ్రవరి 19: స్వయం ఉపాధి పథకం కింద లబ్ధిదారులను ఎంపిక కార్యక్రమాన్ని ఫిబ్రవరి 21వ తేదిన నిర్వహించనున్నట్లు షాద్‌నగర్ పురపాలక సంఘం కమిషనర్ శరత్‌చంద్ర తెలిపారు. షెడ్యుల్డ్ కులాల ఎస్సీ అభ్యర్థులకు స్వయం ఉపాధి పథకం ద్వారా ఎంపిక చేసేందుకు ఈనెల 21వ తేదిన ఉదయం 11 గంటలకు స్థానిక పురపాలక సంఘం కార్యాలయంలో వివిధ బ్యాంకుల అధికారుల ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

మహిళలకు గ్యాస్ సిలిండర్ల పంపిణీ
కొందుర్గు, ఫిబ్రవరి 19: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా మహిళలకు ఉచితంగా వంటగ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. మంగళవారం కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ మండలాల్లో అర్హులైన మహిళలకు ఉచితంగా వంటగ్యాస్ సిలిండర్లను బీజేపీ నాయకులు అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు చిట్టెం లక్ష్మీకాంత్‌రెడ్డి, విశ్వనాథ్‌పూర్ ఉప సర్పంచ్ గోపాల్, వార్డు సభ్యులు రాంరెడ్డి, కాటం రాజు, మొడ్సు మధు, నరేందర్, మాధవ రెడ్డితో పాల్గొన్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి
* పశు సంవర్ధకశాఖ అధికారి
తలకొండపల్లి, ఫిబ్రవరి 19: గ్రామీణ ప్రాంతాలలో ఉద్యోగ రీత్యా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజల భాగస్వామ్యం ఉంటేనే పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధ్యం అవుతుందని, గ్రామాలలోని మూగ జీవాలను రోగాల బారీ నుండి కాపాడుకోవచ్చునని రంగారెడ్డి జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి కేవీఎల్ నర్సింహారావు అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి, గట్టు ఇప్పలపల్లి గ్రామాలలోని పశువైద్యశాల కేంద్రాలను మంగళవారం నర్సింహారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈకార్యక్రమంలో తలకొండల్లి వైద్యాధికారి శంకర్, గట్టు ఇప్పలపల్లి వైద్యాధికారి అగ్నివేష్, ఆమనగల్లు పంచాయతీరాజ్‌శాఖ ఎఈ సందీప్, గట్టు ఇప్పలపల్లి సర్పంచ్ వెంకటయ్య, ఉప సర్పంచ్ బాలస్వామి రైతులు పాపిరెడ్డి, డేవిడ్, సజ్జుపాషా, సత్తయ్య, కృష్ణయ్య, చంద్రవౌళి పాల్గొన్నారు.
ప్రణాళికాబద్ధంగా గ్రామాభివృద్ధికి కృషి
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 19: ప్రాధాన్యతాక్రమంలో పనులు చేపట్టి, ప్రణాళికాబద్ధంగా గ్రామాలను అభివృద్ధి చేయడానికి కృషి చేద్దామని ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణా రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మండల పరిధిలోని తులేకలాన్ గ్రామంలో సీడీఎఫ్ నిధులు రూ.13 లక్షలతో చేపట్టిన సిమెంటు రోడ్డు పనులను సర్పంచ్ చిలుకల యాదగిరి, ఎంపీటీసీ బాసాని కళావతిరాజిరెడ్డి, వార్డు సభ్యులతో కలిసి ప్రారంభించారు. గ్రామాల్లో వౌళిక వసతులకల్పనకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులందరి పైనా ఉన్నదని అన్నారు. గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి, పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత సర్పంచ్, వార్డు సభ్యులందరి పైనా ఉన్నదని అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బీరప్ప, పంచాయతీ కార్యదర్శి విక్రమ్, టీఆర్‌ఎస్ నాయకులు మల్లారెడ్డి, అంజయ్య పాల్గొన్నారు.
కంటి వైద్య శిబిరానికి స్పందన
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 19: వివిధ స్వచ్ఛంద సంస్థలు, ఆసుపత్రుల ఆధ్వర్యంలో నిర్వహించే వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కప్పపహాడ్ గ్రామ సర్పంచ్ సామల హంసమ్మ యాదగిరి రెడ్డి సూచించారు. మంగళవారం మండల పరిధిలోని కప్పపహాడ్ గ్రామంలో కౌండిన్య క్లియర్ విజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబింరంలో కంటి వైద్యులు డాక్టర్ రమేష్‌గౌడ్ ఆధ్వర్యంలో సుమారు 60 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమున్న వారికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన జవాన్లకు ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నిట్టు జగదీశ్వర్, వార్డు సభ్యులు జంగిలి అరుణ, దేవరకొండ ఇందిర, పారిజాత, నాయకులు దాసు, మహిపాల్, ఎస్‌ఎంసీ చైర్మన్ విఘ్నేష్, మల్లారెడ్డి, శ్రీనివాస్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
మేడ్చల్, ఫిబ్రవరి 19: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి బాధితుడికి అందజేశారు. మేడ్చల్ మునిసిపాలిటీ పరిధిలోని అత్వెల్లికి చెందిన దర్శనాల సమ్మయ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్జీ చేసుకోగా మంజూరైన రూ. 60 వేల చెక్కును సుధీర్‌రెడ్డి తన నివాసంలో సమ్మయ్యకు అందజేశారు. కార్యక్రమంలో కేటీఆర్ సమితి అధ్యక్షుడు జకట శ్రీనివాస్, ప్రేమ్‌దాస్, రాములు, ప్రకాశ్, ఆంజనేయులు, సామయ్య పాల్గొన్నారు.
ఉప సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు హర్షం
మహేశ్వరం, ఫిబ్రవరి 19: మహేశ్వరం మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ 7వ వార్డు సభ్యుడు దోమ శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు జాల్లా మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎంఎ.సమీర్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలో ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. సమీర్ మాట్లాడుతూ మహేశ్వరం గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేష్ వార్డు సభ్యులతో కలిసి వారిని అబినందించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నేతల అల్లే శ్రీశైలం, ఎంఎ సలీం, హజీబాబ హైమద్ పాల్గొన్నారు.
నులి పురుగుల నివారణ కు ప్రతి ఒక్కరి కృషి అవసరం
మహేశ్వరం, ఫిబ్రవరి 19: నులిపురుగుల నివారణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పాఠశాల ప్రధాన ఉపాధ్యాడు జీ.శ్రీశైలం, ఎఎన్‌ఎం నీర్మల తెలిపారు. మంగళవారం మండల పరిధిలో పెండ్యాల ఉన్నత పాఠశాలతో పాటు మండలంలో ప్రభుత్వం, ప్రవేటు పాఠశాలల్లో 19 జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం పురస్కారించుకొని పిల్లలకు నులిపురుగుల మాత్రలు వేయించారు. మాట్లాడుతూ నులిపురుగుల నివారణతో పిల్లల పురుగుదలకు దోహద పడుతుందని రెండు సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వరకు పిల్లలకు తప్పనిసరిగా అల్జెండజోన్ మాత్రలు వేయించామని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధాయ్యులు పాల్గొన్నారు.
వైభవంగా పద్మావతి, వేంకటేశ్వరస్వామి రథోత్సవం
యాచారం, ఫిబ్రవరి 19: పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి జాతరను పురస్కరించుకొని మండల పరిధిలోని తక్కళ్ళపల్లి గ్రామంలోని దేవాలయ ఉత్సవమూర్తుల రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. జాతర ఉత్సవాలు, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించగా భక్తులు పాల్గొన్నారు. యాచారం సీఐ మధుకుమార్, ఎస్‌ఐలు వెంకటయ్య, సురేశ్‌బాబు, కొత్తపల్లి గ్రామ ఎంపీటీసీ గడాల మాధవి మల్లేష్, మాజీ సర్పంచ్, సంతోష, ఉపసర్పంచ్ పగడాల శ్రీశైలం, పీఆర్‌జీ ఫౌండేషన్ అధ్యక్షులు రవీందర్‌గుప్త రథోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేసారు.
ఆధార్ సేవలు ఇకపై తహాశీల్ కార్యాలయంలోనే
బొంరాస్‌పేట, ఫిబ్రవరి 19: ప్రజల సౌలభ్యం కొసం ఇకపై ఆధార్ సేవలు తహాశీల్దార్ కార్యాలయంలోనే అందించబడుతాయని తహశీల్దార్ వరప్రసాద్ అన్నారు. మంగళవారం తహశీల్దార్ కార్యాలయంలో ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించారు. తహాశీల్దార్ వరప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం మేరకు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ కార్యాలయంలోనే ఆధార్ కేంద్రాల ఏర్పాటు నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ తహాశీల్దార్ రాజేందర్ రెడ్డి, జూనియర్ అసిస్టేంట్ శ్రీకాంత్, బొంరాస్‌పేట, మెట్లకుంట వీఆర్‌వోలు వెంకటయ్య, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.