రంగారెడ్డి

జలమే జీవనాధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, మార్చి 22: జీవకోటికి అత్యవసరమైన ప్రకృతి వనరు నీరు.. మానవాళి మనుగడలో జలానిదే ప్రధాన భూమిక అని హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బీ.్భక్షపతి అన్నారు. శుక్రవారం ఫరూఖ్‌నగర్ మండలం బూర్గుల గ్రామ శివారులోని చైతన్య సేవా సమితి ఆశ్రమంలో ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ, బీఆర్‌ఆర్ ప్రభుత్వ కళాశాల జడ్చర్ల సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ నీటి దినోత్సవాన్ని నిర్వహించారు. జస్టిస్ భిక్షపతి మాట్లాడుతూ గ్రహాలకు భిన్నంగా భూగోళంపై ప్రాణకోటి వృద్ధి చెందడానికి నీరే ప్రధానం. ప్రస్తుతం భూగర్భ జలాల మట్టం పాతాళానికి చేరుకోవడంతో వందలకొద్ది లోతుకు వెళ్లినా కడివెడు నీళ్లు వచ్చేవి చాలా కష్టంగా ఉన్నాయని వివరించారు. భవిష్యత్ తరాలకు నీరు అందించలేకపోతే మానవ మనుగడ ప్రశ్నార్ధకంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా జల సంరక్షణకు పాటు పాడాలని, నీటి హక్కు, జల వనరుల పట్ల సస్యశ్యామలం జరగాలని అన్నారు. ప్రపంచానికి నీరే జీవనాధారం.. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో చుక్కనీరు ఎంతో అవసరమని అన్నారు. తాగడానికి, కనీస అవసరాల కోసం నీరు లభించక నిత్యం ఎంతోమంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. నీటి విలువను ప్రతి ఒక్కరూ తెలుసుకొని ప్రతి నీటి చుక్కను పొదుపుగా వాడుకోవడం ఎంతో అవససరమని అన్నారు. ఇష్టారాజ్యంగా నీటిని వృథా చేస్తే ఆ నీటి కోసం భవిష్యత్‌లో అనేక అవస్థలు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు.
జలాల పెంపునకు
ఇంకుడు గుంతలు
భూగర్భ జలాలు పెంచేందుకు ప్రతి ఒక్కరూ విధిగా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని జస్టిస్ జి.బిక్షపతి అన్నారు. ప్రతి ఇంటి అవరణలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తే భూగర్భ జలాలు క్రమంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అధికారులు ఆ దిశగా ప్రజల్లో పూర్తి స్థాయిగా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయడంతో వర్షపునీరు భూగర్భంలోకి చేరి బోర్లు, బావులు ఎండిపోకుండా ఉండేందుకు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయకపోవడంతో వర్షపునీరు వృథాగా వెళ్లిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలను పునరుద్ధరించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో పర్యావరణ వేత్తలు పురుషోత్తం రెడ్డి, బీవీ సుబ్బారావు, ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకుడు రమేష్ రెడ్డి, కే.లక్ష్మారెడ్డి, సదాశివయ్య, సుబాషిణి, ప్రొగ్రాం కోఆర్డినేటర్ కే.కృష్ణ, ప్రతినిధులు ఉమా మహేశ్వర్ రెడ్డి, కోటేష్, వెంకటేష్, రాజు పాల్గొన్నారు.

అనుమానాస్పద స్థితిలో ఐటీ ఉద్యోగి మృతి
గచ్చిబౌలి, మార్చి 22: అనుమానాస్పద స్థితిలో హాస్టల్ గదిలో ఐటీ ఉద్యోగి మృతి చెందిన సంఘటన గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. గచ్చిబౌలి పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. కర్నూల్ జిల్లా నంద్యాల టౌన్‌లోని ఎన్‌జీఓ కాలనీకి చెందిన బుజీటి సందీప్ రెడ్డి (24) గచ్చిబౌలిలోని టీసీఎస్‌లో సంవత్సరం నుండి ఐటీ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. కొంత కాలంగా గచ్చిబౌలి హౌసింగ్ బోర్డు కాలనీలోని కార్తీకేయ మెన్స్ హాస్టల్‌లోని రూమ్ నెంబర్ 502లో మరో ఐటీ ఉద్యోగితో కలసి ఉంటున్నాడు. సందీప్‌తో కలసి ఉండే రూమ్మేట్ బంధుల ఇంట్లో వివాహానికి ఊరికి వెళ్లడంతో మృతుడు ఒక్కడే గదిలో ఉంటున్నట్లు హాస్టల్ నిర్వాహకులు తెలిపారు. 19వ తేదీ మంగళవారం రాత్రి భోజనం చేసి రూములోకి వెళ్లిన సందీప్ రెండు రోజుల నుంచి తల్లిదండ్రులు ఫోన్ చేసినా స్పందించకపోవడతో కుటుంబసభ్యులు నగరంలో ఉంటున్న అతని బావకు ఫోన్ చేసి సందీప్ గురించి తెలుసుకోమని చెప్పారు. బావ ఉదయం హాస్టల్‌కు వచ్చి నిర్వాహకులతో కలిసివెళ్లి గది తలుపులు తెరిచేందుకు ప్రయత్నించగా లోపలి నుంచి తాళం వేసి ఉండడంతో మారు తాళంతో రూము తెరిచారు. గదిలో బెడ్‌పై చనిపోయి దుర్వాసన వస్తుండడంతో మృతదేహానికి పంచనామాచేసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు. చిన్నతనం నుంచి అప్పుడప్పుడు ఫిట్స్ వచ్చేవని కుటుంబ సభ్యులు తెలిపారు. విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేదంటే గుండెపోటుతో మరణించాడా అనే విషయం పోస్టుమార్టం నివేదికలో తెలుస్తుందని పోలీసులు చెప్పారు. గచ్చిబౌలి ఎస్‌ఐ ధర్మేష్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

‘చేవెళ్ల ప్రజల గొంతుకను పార్లమెంట్‌లో వినిపిస్తా’
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 22: చేవెళ్ల ప్రజల గొంతుకును పార్లమెంట్‌లో వినిపిస్తానని చేవెళ్ల టీఆర్‌ఎస్ అభ్యర్ధి జీ.రంజిత్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని మాజీ మంత్రి మహేందర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, యాదయ్య, మహేష్ రెడ్డితో కలిసి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేవెళ్ల నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నానని అన్నారు. నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీలోని అందరినీ కలుపుకొని గెలుపు కోసం పాటుపడతానని తెలిపారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా రంజిత్ రెడ్డికి అవకాశం ఇవ్వాడాన్ని తామంతా స్వాగతిస్తున్నట్టు ఎమ్మెల్యేలు తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు, అభివృద్ధిని చూసిన ప్రజలు రెండవ సారి అధికారాన్ని కట్టబెట్టారని అన్నారు. రాష్ట్రం మరింత అభివృద్ధిలో దూసుకుపోయేందుకు జాతీయ స్థాయిలో సైతం కీలక భూమిక వ్యవహరించాల్సిన అవసరం ఉందని, ముఖ్యమంత్రి 16 సీట్లు గెలవాలని లక్ష్యంగా నిర్ధేశించారని తెలిపారు. దానికి అనుగుణంగా ఉమ్మడి జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు శక్తివంచన లేకుండా పనిచేస్తామని భారీ మెజారిటీతో రంజిత్ రెడ్డిని గెలిపించుకుంటామని తెలిపారు. రాజేంద్రనగర్‌లో శుక్రవారం నామినేషన్లు దాఖలు చేసి, తిరిగి ఈనెల 25న మరోమారు నామినేషన్లు దాఖలు చేస్తానని రంజిత్ రెడ్డి తెలిపారు.
టీఆర్‌ఎస్ ప్రచార రథం ప్రారంభం
ఉప్పల్: పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి విజయం కోసం ఉప్పల్ పారిశ్రామికవాడలో తయారైన పార్టీ ఎన్నికల ప్రచార రథాన్ని మంత్రి మల్లారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్ బేతి స్వప్న పాల్గొన్నారు.

రేవంత్ నామినేషన్ ర్యాలీకి తరలిన శ్రేణులు
జీడిమెట్ల, మార్చి 22: మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి శుక్రవారం నామినేషన్‌ను వేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున రేవంత్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు తరలివెళ్లారు. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ నేతృత్వంలో, యూత్ కాంగ్రెస్ నాయకుడు కూన శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో షాపూర్‌నగర్ నుంచి కీసరకు ర్యాలీగా నేతలు తరలివెళ్లారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలంటే కాంగ్రెస్‌ని గెలిపించాలని అన్నారు.
ఎల్బీనగర్ నుంచి..
వనస్థలిపురం: మాల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఏ.రేవంత్ రెడ్డి నామినేషన్‌కు ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు పెద్దఎత్తున తరలి వెళ్లారు. కాంగ్రెస్ కార్యాలయం నుంచి ఎల్బీనగర్ టౌన్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి, కొప్పుల నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు మేడ్చల్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో డప్పు వాయుద్యాలు, ఆటపాటలతో కార్యకర్తల ఉత్సాహంగా నామినేషన్‌కు వెళ్లి రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు. ఎల్బీనగర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జక్కిడి ప్రభాకర్ రెడ్డి, కొప్పుల నర్సింహా రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నామినేషన్ ర్యాలీ రేవంత్ రెడ్డి విజయోత్సవ ర్యాలీని తలపించిందని, మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఓటర్లు రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డికీ ఓట్లు వేసి గెలిపించడానికీ సిద్ధంగా ఉన్నారని గుర్తుచేశారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రజలు పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి, తెలంగాణలో ప్రతిపక్షాన్ని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిలుక మధుసూధన్ రెడ్డి, ధన్‌రాజ్, భీమిడి రామకృష్ణా రెడ్డి, గుర్రం శ్రీనివాస్ రెడ్డి, కళ్లెం సుజాత రెడ్డి, నరేష్, శశీధర్ రెడ్డి, అప్సర్ ఖాన్, షరీష్ పాల్గొన్నారు.
హబ్సిగూడ, రామంతాపూర్‌లో ర్యాలీ
ఉప్పల్: మల్కాజిగిరి పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి నామినేషన్ వేసిన సందర్భంగా శుక్రవారం హబ్సిగూడ, రామంతాపూర్, ఉప్పల్, చిల్కానగర్ మీదుగా పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ఇన్‌చార్జి రాగిడి లక్ష్మా రెడ్డి, పీసీసీ కార్యదర్శి పసుల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ మైనారిటీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ బుడేసాహెబ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మేకల సుధాకర్ రెడ్డి, సుధాకర్ శెట్టి, పెద్దిరెడ్డి.. కీసర కలెక్టర్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తరలివెళ్లారు.

సికింద్రాబాద్ అభ్యర్థిగా ఎంఎన్‌ను ప్రకటించాలి

హైదరాబాద్, మార్చి 22: సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా నగర టీడీపీ అధ్యక్షుడు ఎం ఎన్ శ్రీనివాస్ రావు పేరును ప్రకటించాలని నగర తెలుగు తమ్ముళ్లు అధిష్థానాన్ని కోరారు. శుక్రవారం నగర పార్టీ ఆఫీసులో సమావేశమైన నేతలు ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేశారు. అంతేగాక, ఈనెల 20వ తేదీన నామాలగుండులోని బీఎన్‌ఆర్ గార్డెన్స్‌లో జరిగిన సికిందరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కూడా ఎంఎన్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఇప్పటికే ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు టీడీపీ నగర అధ్యక్షుడు ఎం.ఎన్.శ్రీనివాస్‌తో పాటు నగర కార్యనిర్వాహక అధ్యక్షుడు మేకల సారంగపాణి, మరో నాయకుడు బీఎన్ రెడ్డి కూడా ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ నగర టీడీపీ అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస్ రావు అధ్యక్షతన శుక్రవారం కమిటీ ముఖ్య నేతలు మాత్రం అవకాశాన్ని శ్రీనివాస్ రావుకు ఇవ్వాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు పంపనున్నట్లు తెలిపారు. టీడీపీ నేత, అంబర్‌పేట నియోజకవర్గం కోఆర్డినేటర్ వనం రమేశ్, గోషామహల్ నియోజకవర్గం ఇన్‌చార్జి బజరంగ్ శర్మ, చార్మినార్ ఇన్‌చార్జి అలీ మస్కతీ, సికిందరాబాద్ ఇన్‌చార్జి మేకల సారంగపాణి, రాష్ట్ర బీసీ అధ్యక్షుడు కూన వెంకటేశ్ గౌడ్‌లు ఎంఎన్ శ్రీనివాస్‌రావును అభ్యర్థిగా ప్రకటించి, పోటీ చేసే అవకాశం కల్పించాలని ఏకగ్రీవ తీర్మానం చేసిన నేతల్లో ఉన్నారు.

వేసవిలో
నీటిఎద్దడి నివారణ
కలెక్టర్ ఎంవీ రెడ్డి
కీసర, మార్చి 22: కలెక్టరేట్‌కు నామినేషన్లు వేసేందుకు అభ్యర్థుల వెంట వచ్చే కార్యకర్తలకు తాగునీరు ఏర్పాటు చేయాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్‌లో నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ముందు జాగ్రత్తగా 108 వాహనం, అగ్నిమాపక వాహనం అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నామినేషన్ ప్రక్రయ పకడ్బందీగా చేపట్టాలని, అభ్యర్ధులకు కలిగే సందేహాలను నివృత్తి చేయాలని, సరైన సమాచారాన్ని అందించేందుకు హెల్ప్‌డెస్క్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.