రంగారెడ్డి

ట్యాంకర్లే దిక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, ఏప్రిల్ 17: మిషన్ భగీరథ నీటి ట్యాంకులను సకాలంలో పూర్తిచేసి ప్రజలకు తాగునీటిని సరఫరా చేయాల్సి ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం..కాంట్రాక్టర్ల అలసత్వం కారణంగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని చెప్పవచ్చు. ఎండల తీవ్రత ఎక్కువగా పెరిగిపోయిన నేపధ్యంలో గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నల్లాలు ఎప్పుడు వస్తాయో అని ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. నల్లాలు రాని ప్రాంతాల్లో నీటి ట్యాంకులే దిక్కయ్యాయని ప్రజలు పేర్కొన్నారు. ఎండల వేడిమికి భూగర్భ జలాలు ఒక్కసారిగా పడిపోవడం, బోర్లల్లో నీటి శాతం అకస్మాత్తుగా పడిపోవడం వంటి కారణాలతో తాగునీటికి ప్రజలు తంటాలు పడుతున్నారు. మిషన్ భగీరథ జలాలు సమృద్ధిగా ఉన్నప్పటికి సక్రమంగా నిల్వచేసి ప్రజలకు సరఫరా చేసే విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ ట్యాంకుల నిర్మాణాలు పూర్తి స్థాయిలో కాలేదు. ఫలితంగా ఆ నీళ్లను ట్యాంకర్ల ద్వారా తెచ్చుకునే పరిస్థితులు నెలకొంటన్నాయి. మరోవైపు మిషన్ భగీరథ పైపులైన్ల లీకేజీల కారణంగా పలుచోట్ల పెద్ద మొత్తంలో నీరు వృథా అవుతోంది. వేసవిలో నీటి సమస్యలు ఎదురవుతాయని తెలిసి కూడా ట్యాంకుల నిర్మాణం విషయంలో అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య సమన్వయం లేకపోవడమే ఇందుకు నిదర్శనమని చెప్పవచ్చు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ, కేశంపేట, ఫరూఖ్‌నగర్ మండలాల్లో ఇప్పటికే చాలాచోట్ల భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. వెయ్యి అడుగల లోతుకు తవ్వినా నీరు రాని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రత్యేక చొరవతో నియోజకవర్గానికి అందరికన్నా ముందే మిషన్ భగీరథ జలాలను తీసుకువచ్చారు. నీటి నిల్వ కోసం గ్రామాలు, తండాలకు ట్యాంకులను మంజూరు చేశారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ షాద్‌నగర్ పురపాలిక, ఆర్‌డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులతో వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటుచేసి ఈ వేసవికి ముందే ట్యాంకుల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. కానీ ఎక్కడ కూడా ట్యాంకుల నిర్మాణం పూర్తి స్థాయిలో జరగలేదని చెప్పవచ్చు. పల్లెలు, తండాలు, పట్టణంలో 40శాతం పనులు ఇంకా మిగిలే ఉన్నాయి. దాంతో నీళ్లు పుష్కలంగా ఉన్నా.. నిల్వ చేసుకోలేని దుస్థితి నెలకొంది. గ్రామాల్లో ఇంకా పలుచోట్ల నీటి సమస్యలకు పరిష్కారం లేకపోగా, పురపాలికలో ఇప్పటికీ ట్యాంకర్ల ద్వారానే నీటిని సరఫరా చేస్తున్నారు. పురపాలిక పరిధిలోని అంబేద్కర్ కాలనీ, రాంనగర్, మల్లికార్జునకాలనీ, శ్రీనగర్‌కాలనీలతో పాటు ఫరూఖ్‌నగర్ మండలం చింతగూడ, మొగిలిగిద్ద తదితర చోట్ల ట్యాంకుల నిర్మాణం పూర్తి కాలేదు. కొందుర్గు మండలానికి 35ట్యాంకులు మంజూరు కాగా వీటిలో ఇప్పటి వరకు కేవలం తొమ్మిది ట్యాంకులు మాత్రమే పూర్తయ్యాయి. ఆగిర్యాల, వెంకిర్యాల, శ్రీరంగాపూర్, రేగడిచిల్కమర్రి, తంగెళ్లపల్లి, గంగన్నగూడెం, బైరంపల్లి లాంటి గ్రామాల్లో నీటి సమస్య ఉన్నా ట్యాంకుల నిర్మాణం చేపట్టలేదు. జిల్లేడు చౌదరిగూడ మండలంలో చౌదరిగూడ, గుర్రంపల్లి, చింతకుంటపల్లి, వీరన్నపేట తదితర గ్రామాల్లో నిర్మాణాలు చేపడుతున్నా..పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. కేశంపేట మండల కేంద్రంతో పాటు పాపిరెడ్డిగూడ, లేమామిడి, గాంధీ శంకర్‌పల్లి, కొండారెడ్డిపల్లి గ్రామాల్లో ట్యాంకుల నిర్మాణం జరగాల్సి ఉంది. కొత్తూరు, నందిగామ మండల కేంద్రాలతో పాటు రంగాపూర్, తాడిగడ్డతండా, చేగూరు, నర్సప్పగూడ, ధన్‌సింగ్‌తండాలలో ట్యాంకులు పూర్తి కావాల్సి ఉంది. అధికారులు స్పందించి కాంట్రాక్టర్లతో నీటి ట్యాంకుల నిర్మాణం పనులు వేగంగా పూర్తి చేయిస్తేనే ఇంటింటికీ నల్లా నీళ్ల కల సాకారం అవుతుందని చెప్పవచ్చు. దాంతో తాగునీటికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని పలువురు విశే్లషకులు భావిస్తున్నారు.