రంగారెడ్డి

ఏకగ్రీవ పంచాయతీలకు అందని ప్రభుత్వ నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, ఏప్రిల్ 23: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రభుత్వం నజరాన (నిధులు) ఇస్తామని చెప్పి నేటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. దాంతో ప్రభుత్వం నుండి నిధులు ఎప్పుడు వస్తాయని సర్పంచులు, వార్డు సభ్యులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. పంచాయతీల్లో నిధులు లేక అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే పూర్తిగా నిలిచిపోయాయని చెప్పవచ్చు. పంచాయతీలకు సర్పంచులు ఎన్నికై దాదాపు రెండు నెలలు గడుస్తున్నప్పటికి నేటి వరకు చెక్ పవర్ ఇవ్వకపోవడంతో పల్లెల్లో అభివృద్ధి ఆగిపోయిందని చెప్పవచ్చు. పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం తండాలు, గూడేలు, అనుబంధ గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. దాంతో తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఏకగ్రీవం వైపు నేతలు అడుగులు వేశారు. గతంలో కంటే ఈసారి ఎన్నికల్లో ఎక్కువ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడం విశేషం. కొన్ని పంచాయతీల్లో సర్పంచ్ ఏకగ్రీవం అవగా వార్డులకు ఎన్నికలు జరిగాయి. మరికొన్ని పంచాయతీల్లో వార్డులు ఏకగ్రీవం కాగా సర్పంచ్ పదవికి ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలు లేకుండా ఏకగ్రీవమైన పంచాయతీలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నజరానాలను (నిధులు) ప్రకటించింది. షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని కొత్తూరు, నందిగామ, కేశంపేట, జిల్లేడుచౌదరిగూడ, కొందుర్గు, ఫరూఖ్‌నగర్ మండలాల్లో మొత్తం 19గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అందులో ఫరూఖ్‌నగర్ మండలంలో ఆరు, కేశంపేట మండలంలో నాలుగు, చౌదరిగూడ మండలంలో మూడు, కొందుర్గు మండలంలో ఒకటి, కొత్తూరు మండలంలో మూడు, నందిగామ మండలంలో రెండు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. గతంలో జనాభా ప్రాతిపదికన ఒక్కో పంచాయతీకి రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు ప్రోత్సాహం అందించారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో నిధులు అందుతాయని అంతా భావించినప్పటికీ ఈ విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో..ఆయా పంచాయతీ పాలకవర్గాలు నిరుత్సాహానికి గురయ్యాయని చెప్పవచ్చు. 14వ ఆర్థిక సంఘం నిధులు మంజూరైనప్పటికి వివిధ కారణాలతో పంచాయతీలకు చేరలేదు. కొత్తూరు మండల పరిధిలోని కొడిచర్ల పంచాయతీ అనుబంధ గ్రామమైన కొడిచర్లతండాను ప్రభుత్వం ప్రత్యేక గ్రామ పంచాయతీగా గుర్తించింది. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహక నిధులు అందుతాయనే ఆశతో గ్రామస్తులు పంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన పాలకవర్గం కొలువుదీరి నెలలు గడుస్తున్నా పంచాయతీలో నిధుల్లేక గ్రామంలో ఇంకా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని పాలకులు పేర్కొంటున్నారు. తాగునీరు, మురుగు కాలువలు, అంతర్గత రహదారులు, వీధిదీపాల సమస్యలు వేధిస్తున్నాయని గ్రామస్తులు అంటున్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహక నిధులను వెంటనే విడుదల చేయాలని వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
నివేదికలను ప్రభుత్వానికి అందజేశాము: ఎంపీడీఓ
ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు నజరానాలు (నిధుల) కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపించామని కొత్తూరు ఎంపీడీఓ జ్యోతి వివరించారు. గతంలో ఇచ్చిన దానికంటే మరికొంత ఎక్కువగానే ప్రోత్సాహం అందించనున్నట్లు తెలిసిందని, స్పష్టమైన ఆదేశాలు ఏమి రాలేదని తెలిపారు. వరుస ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆలస్యం ఏర్పడిందని, త్వరలోనే నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.