రంగారెడ్డి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్వాల్, డిసెంబర్ 20: అల్వాల్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఘటనతో లోతుకుంట - అల్వాల్ బొల్లారం మధ్య ట్రాఫిక్ నిలిచిపోయింది. బొల్లారం పోలీసుల కథనం ప్రకారం తిరుమలగిరి బొల్లారంలోని కెవిలరీ బ్యారెక్సు ప్రాంతంలో నివాసం ఉండే ప్రతాప్(26), అతని మిత్రుడు నాని(20) స్థానికంగా పెయింటింగ్ పనులు చేసుకొని జీవిస్తున్నారు. మంగళవారం ఇద్దరూ మోటార్‌సైకిల్‌పై అల్వాల్ రైల్వే బ్రిడ్జి నుంచి లోతుకుంటవైపు వెళ్తున్నారు. మార్గమధ్యంలో సత్య పెట్రోల్ బంక్ ఎదురుగా ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడు చూసి మోటారుసైకిల్ వేగాన్ని తగ్గించారు. వెనుక నుంచి వస్తున్న మరో వాహనం బలంగా ఢీకొనడంతో ఇద్దరూ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. లోతుకుంట నుంచి బొల్లారం రోడ్డు మధ్య పడ్డారు. అదే సమయంలో వేగంగా వచ్చిన డిసిఎం కింద పడి మృతిచెందారు. ప్రమాదంతో ఇరువైపులా ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. మృతుల వద్ద దొరికిన ఆధారాలతో తిరుమలగిరి బొల్లారంలోని కెవిలరీ బారెక్సు ప్రాంతవాసులుగా గుర్తించారు. బొల్లారం సిఐ మహేశ్వర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సత్య పెట్రోల్ బంకు వద్ద ఉన్న సిసి కెమరాల ఫుటేజీ ఆధారంగా ఘటనకు కారణమైన ఇరువైపుల వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రమాదానికి బారికేడే కారణం
సత్య పెట్రోల్ బంక్ వద్ద పోలీసులు ట్రాఫిక్‌ను అదుపు చేయడానికి రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పెట్రోల్ బంక్ పక్క నుంచే వెంకటాపురం దారి ఉంది. అక్కడ బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు మలుపు తిరగాలంటే ఇబ్బంది పడుతున్నారు. వెంకటాపురం నుంచి లోతుకుంట, సికింద్రాబాద్ వైపు వెళ్లాలంటే, లోతుకుంట, సికింద్రాబాద్ వైపు నుంచి బొల్లారం వెళ్లే బస్సులతోపాటు సిద్దిపేట, గజ్వేల్, కరీంనగర్, మంచిర్యాల, సిరిసిల్ల, వేములవాడ బస్సుల రద్దీని అదుపు చేయటానికి ఇటీవల పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. అల్వాల్ రైల్వే బ్రిడ్జి నుంచి లోతుకుంట వరకు, లోతుకుంట నుంచి అల్వాల్ తెలంగాణ తల్లి విగ్రహం వరకు ఎప్పుడు రద్దీగా ఉంటుంది. బారికేడ్ల వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.

శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతర నిఘా
షాద్‌నగర్, డిసెంబర్ 20: షాద్‌నగర్ నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతర నిఘా నిర్వహించి నేరాలను, ప్రమాదాలను నివారించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు షాద్‌నగర్ ఏసిపి శ్రీనివాస్ తెలిపారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా షాద్‌నగర్ నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాలో కలవడం పోలీస్ స్టేషన్‌లు సైబరాబాద్ పరిధిలోకి వెళ్లిన తరువాత తొలిసారి షాద్‌నగర్ ఏసిపిగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ ‘ఆంధ్రభూమి’తో మాట్లాడారు. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు దాబాలలో మద్యం విక్రయించే వారిపై, సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. షాద్‌నగర్ నియోజకవర్గంలో సంఘ వ్యతిరేక కార్యకాలాపాలను అరికట్టేందుకు చర్యలను చేపడుతున్నట్లు తెలిపారు. పెద్దనోట్ల రద్దుతో వైట్‌కాలర్ నేరాలు పెరిగే అవకాశం ఉన్నందున వాటిపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఇతరుల ప్రాణాలను తీస్తున్న బైక్ రేసింగ్, డ్రంక్ డ్రైవ్, ఓవర్‌స్పీడ్‌లపై ప్రత్యేక నిఘా నిర్వహించి కఠిన చర్యలు తీసుకోనున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్‌లలో ఈవ్‌టీజింగ్‌ను అరికట్టేందుకు షీ టీంలతో నిఘా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై మొదటగా అవగాహన కల్పించామని, ఆతరువాత ట్రాఫిక్ నిబంథనలను పాటించకపోతే చాలన్లను విధించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలు ఏసమస్య ఉన్నా నిర్భయంగా పోలీస్‌స్టేషన్లకు వచ్చి ఫిర్యాదులు చేయాలని కోరారు. పట్టణ పరిసర ప్రాంతాలలో రాత్రివేళల్లో గస్తీని ఏర్పాటు చేసి దొంగతనాల నివారణకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. పట్టణంలో అవసరం ఉన్న చోట్ల సిసి కెమెరాలను అదనంగా ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎప్పటికప్పుడు నిఘా సారించామని పేర్కొన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎసిపి శ్రీనివాస్ కోరారు.