కృష్ణ

జీరో బ్యాలెన్స్ బాంకు ఖాతాల్లో గిన్నీస్ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 1: భారతదేశంలో ప్రతి ఒక్కరూ బ్యాంక్ ఖాతాకల్గి ఆపై ఆర్థిక లావాదేవీలు జరుపుకోవాలన్న ఆకాంక్షతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నతాశయంతో 2014 ఆగస్టు 28న ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన్ పథకాన్ని ప్రారంభించారు. కేవలం ఐదు మాసాల్లోనే ఏకంగా 15కోట్ల 59 లక్షల ఖాతాలు జీరో బ్యాలెన్స్‌తో ప్రారంభించబడినాయి. ఈ పథకాన్ని ప్రధాన మంత్రి స్వయంగా పర్యవేక్షిస్తూ అన్ని స్థాయిల్లో నిర్దేశిత లక్ష్యాలను విధించడంతో బ్యాంకర్లు కూడా ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేశారు. నయాపైసా ఖర్చు లేదు కదా అని గ్రామాల్లో ఓటర్లను చేర్పించడంలో ఘనులైన గ్రామ పెద్దలు రాజకీయ దళారులు సైతం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తమ తమ ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి బ్యాంకు ఖాతాలను ప్రారంభింపచేయగల్గారు. ఏది ఏమైనా ఇప్పటికే దేశవ్యాప్తంగా 21 కోట్ల 81 లక్షల ఖాతాలు ప్రారంభించబడ్డాయి. గ్రామాల్లో 61 శాతం మంది బ్యాంకు ఖాతాలు కల్గి ఉంటే వారిలో 52శాతం మంది మహిళలు ఉన్నారు. ఈ పథకం గిన్నీస్‌బుక్‌కి ఎక్కింది. ఇంతవరకు బాగానే ఉంటే రెండో దశలో ప్రధానమంత్రి అమల్లోకి తెచ్చిన బీమా పాలసీలు కూడా కొందరిపాలిట వరంగా మారబోతున్నాయని ఆంధ్రభూమి ప్రతినిధి సర్వేలో వెల్లడయింది. ప్రధానంగా ఉత్తరాది ప్రాంతంలో కొన్ని రాష్ట్రాల్లో అనాథలు, వృద్ధుల పేరిట బీమా పాలసీలు తీసుకొని ఆపై బీమా సొమ్ము కోసం నామినీదారులు వారిని రోడ్డు ప్రమాదాల ద్వారా హత్యలు చేయించిన సంఘటనలు అనేకం చూశామని ఓ సాధారణ బీమా కంపెనీ అధికారి, అలాగే ఓ సర్వేయర్ ఆంధ్రభూమి ప్రతినిధితో అన్నారు. నామినీదారులైన కుటుంబ సభ్యులతో పాటు సంరక్షకులు (ఎలాంటి బంధుత్వం లేనివారు) కూడా ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది.
తాజాగా కేంద్ర ప్రభుత్వం అతి స్వల్ప మొత్తాలపై రెండు బీమా పథకాలను ప్రారంభించింది. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ సౌజన్యంతో సంవత్సరానికి కేవలం రూ.12లు ప్రీమియంపై రెండు లక్షల వరకు ప్రమాద బీమా వర్తించే ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పిఎస్‌బివై) పథకం అమల్లోకి వచ్చింది. 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు కల్గినవారు అర్హులు. తొలి ఏడాది ప్రీమియం గడువు గత మే 31తో ముగిసింది. రెండో ఏడాది ఈ పాలసీ కోసం గతంలో కంటే అధికంగా పాలసీదారులు ముందుకు వచ్చారు. జీరో బ్యాలెన్స్ ఖాతా కల్గిన వారు కూడా కనీసం రూ.20 నుంచి వంద రూపాయలు వరకు తమ ఖాతాల్లో జమ చేశారు. రెన్యువల్ అయితే బ్యాంకు మేనేజర్లు ఖాతాలోనుంచి రూ.12 జమచేస్తే కొత్తవారు రూ.12లు నేరుగా దరఖాస్తు ఫారంతో అందించారు. ఇక రెండో పథకం ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ సౌజన్యంతో రూ.330లు ప్రీమియంపై రెండు లక్షల వరకు జీవిత బీమా వర్తించే ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం అమల్లోకి వచ్చింది. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు కలవారు మాత్రమే అర్హులు. ప్రతి ఏటా మే 31న బ్యాంకు ఖాతా నుంచి ప్రీమియం సంబంధిత బీమా కంపెనీకి జమ అవుతుంది. అయితే దీనికంటే రూ.12ల ప్రీమియం కల్గిన రెండు లక్షల ప్రమాద బీమాకే ఎక్కువ స్పందన కన్పించింది. అనాథ, వృద్ధాశ్రమాలు నడిపే వారిలో కొందరు వైట్ కాలర్ నేరస్థులు కూడా తాము సంరక్షకులమంటూ రూ.12 చొప్పున ప్రీమియం చెల్లించి పోటాపోటీగా వందల సంఖ్యలో పాలసీలు చేయించారు. ఆ పాలసీదారులలో ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ రెండు లక్షలు బీమా సొమ్ము తమపరం కాగలదని వారు భావిస్తున్నారు. దీనిపై ఒక బ్యాంకు మేనేజర్‌ను సంప్రదించగా ఈ పాలసీలపై తమకు ఎలాంటి విధి విధానాలు రాలేదని, పాలసీదారునికి ఆధార్, బ్యాంక్ ఖాతా ఉంటే చాలు, ఇక నామినీకి కుటుంబ సభ్యులే అవసరం లేదు, వారి సంరక్షకులు అయితే చాలని తెలిపారు. సంరక్షకుడు అంటే పాలసీదారుడు ఫలానా వారిపై ఆధారపడి ఉన్నట్లు సంతకం చేస్తే చాలని ఆ తర్వాత క్లెయిమ్ చెల్లింపు సమయంలో సర్వేయర్‌లు చూసుకుంటారని తెలిపారు. నామినీకి ఆధార్, బ్యాంక్ ఖాతా ఉంటే చాలన్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. కోటి 50 లక్షల మంది అసంఘటిత కార్మికుల కోసం పథకం ఉద్దేశించబడింది. ఈ పథకం కింద ప్రమాద మరణ బీమా రూ.5 లక్షలు చెల్లించబడుతుంది. పాలసీదారుడు ప్రమాదంలో మరణిస్తే ఆ మొత్తం సొమ్ము నామినీకే చెల్లుతుంది. దీంతో అనేక మంది అనాథలను తమ తమ ఇళ్లల్లో లేదా వ్యాపార సంస్థల్లో పనిచేసేవారిగా చూపేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇంకా దరఖాస్తు ఫారాలు విడుదల కాలేదు. ఈ ఐదు లక్షల ప్రమాద బీమా పథకం ఆగస్టు నుంచి అమలుకానుంది. ప్రతి ఒక్కరికి జన్‌ధన్ ఖాతా కల్గిన అసంఘటిత కార్మికులందరూ అర్హులే. ప్రతి ఒక్కరికి జన్‌ధన్ ఖాతా కల్గి ఉండాలి. కేవలం రూ.15లు రుసుం చెల్లిస్తే సరిపోతుంది. ఆధార్ నెంబర్ ఉండాలి. ఇలాంటి బీమా పథకాలు బోగస్ నామినీల పరం కాకుండా అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది.
కొసమెరుపు ...
ఎవరికి తెలియదు భారీ బోగస్ క్లెయిముల చెల్లింపు సమయంలోనే బీమా కంపెనీల సర్వేయర్లు కొందరు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తుండటం చూస్తున్నాం.

దారిదోపిడీ కేసుల్లో ఐదుగురి అరెస్టు
విజయవాడ (క్రైం), జూన్ 1: అర్ధరాత్రి వేళ నగరంలో సంచరిస్తూ దారిన పోతున్న వారిని అడ్డగించి బెదిరించి నగదు, సామగ్రి దోపిడీకి పాల్పడే ఐదుగురు స్నేహితుల ముఠాను సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, 7,200 రూపాయలు నగదు, రెండు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఐదు మాసాలుగా నగరంలోని పటమట, అజిత్‌సింగ్‌నగర్, సత్యనారాయణపురం, నున్న, కృష్ణలంక పోలీస్టేషన్ల పరిథిల్లో ఐదు దారి దోపిడీలకు పాల్పడినట్లు నగర జాయింట్ పోలీసు కమిషనర్ పి హరికుమార్ చెప్పారు. కమిషనరేట్‌లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన షేక్ జిలాని (20), షేక్ షబ్బిర్ అలియాస్ బడే (20), గుణపాటి చంద్రశేఖర్ (22), వల్లూరి లక్ష్మీనారాయణ (20), మానం శివనాగసాయి గణేష్ (20) అనే ఐదుగురు వ్యక్తులు ఉడ్ పాలిష్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరంతా స్నేహితులుగా పరిచయం అయిన తర్వాత మూకుమ్మడిగా కలిసి నేరాలు చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఈక్రమంలో ఈ ఏడాది జనవరి 14న నున్న పోలీస్టేషన్ పరిధిలో రాత్రి ఒంటిగంట సమయంలో సైకిల్‌పై ఇంటికి వెళ్తున్న పాయకాపురానికి చెందిన రాజా మంగరాజు అనే వ్యక్తిని అడ్డగించి బలవంతంగా రెండువేల రూపాయలు దోచుకుని పరారయ్యారు. ఈక్రమంలోనే పటమట బల్లెం వారి వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న సావిరెడ్డి వీరాగణేష్ అనే వ్యక్తిని అడ్డగించి కొట్టి నాలుగు వేల రూపాయలు నగదు బలవంతంగా లాక్కుని పరారయ్యారు.
ఇదేవిధంగా ఈ ఏడాది జనవరి 25న రాత్రి గాంధీనగర్ జింఖానా గ్రౌండ్స్ సమీపంలో ఒంటరిగా వెళ్తున్న కొదమల వినోద్‌కుమార్‌ను అడ్డగించి అతన్ని కొట్టి రెండు సెల్‌ఫోన్లు లాక్కుని పరారయ్యారు. ఇదే విధంగా ఫిబ్రవరి 10న కృష్ణలంక పోలీస్టేషన్ పరిధిలో బందరులాకులు డౌన్‌లో ఒకరిని కొట్టి అతని వద్దనుంచి 1200 రూపాయలు నగదు, సెల్‌ఫోను లాక్కున్నారు. ఈక్రమంలోనే 18న రాత్రి పైపుల రోడ్డు సమీపంలో ఒంటరిగా వెళ్తున్న ఓ వ్యక్తిని మోటారుసైకిళ్లపై వచ్చి అడ్డగించి సెల్‌ఫోను లాక్కుని పరారయ్యారు. ఈ విధంగా నిందితులు ఐదుగురు కలిసి గడిచిన ఐదు మాసాల్లో ఐదు దారి దోపిడీలకు పాల్పడినట్లు జాయింట్ పోలీసు కమిషనర్ హరికుమార్ చెప్పారు.

ఎపికి మొండిచెయ్య తగదు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జూన్ 1: ఆంధ్ర రాష్ట్రం విభజన జరిగి రెండేళ్ళయినా ఇంత వరకు విభజన హామీలను నెరవేర్చకుండా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మొండి చెయ్యి చూపడం తగదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర విభజన ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటిస్తే, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న బిజెపి ప్రత్యేక హోదా ఐదేళ్ళు చాలదని పదేళ్ళు కావాలని పార్లమెంట్‌లో ప్రకటించారని గుర్తు చేశారు. సిపిఐ నగర సమితి ఆధ్వర్యాన బుధవారం స్థానిక పంజాసెంటర్‌లో కృష్ణవేణి హోల్‌సేల్ క్లాత్ మార్కెట్‌లో గడపగడపకూ సిపిఐ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర పార్టీ కార్యవర్గ క్లాత్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు చీపిళ్ల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు మరోమాట చెప్పడం భూర్జువా పార్టీలకు పరిపాటిగా మారిందన్నారు. బిజెపి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తామనే ప్రకటించి అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చిందని దుయ్యబట్టారు. విరివిగా పాల్గొన్న క్లాత్ ముఠా కార్మికులు, పార్టీ కార్యకర్తలు కృష్ణవేణి క్లాత్ మార్కెట్‌లోని షాపుల్లో విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కృష్ణాజిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, నగర సహాయ కార్యదర్శి జి కోటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు పల్లా సూర్యారావు, లంక దుర్గారావు, సిహెచ్ శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు ఆర్ యాకోబు తదితరులు పాల్గొన్నారు.