రుచి

కొబ్బరి వంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొబ్బరికి భారతీయ సంస్కృతిలో ఓ విశిష్ఠస్థానం ఉంది. పూజలు,వ్రతాలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, శుభకార్యాల్లో ఇది తప్పనిసరి. రుచికరమైన పలు వంటకాల తయారీలోనూ కొబ్బరిని విరివిగా వాడతారు. ఆరోగ్యరీత్యా కొబ్బరి నీళ్లు తాగడం మంచిదని వైద్యులు చెబుతుంటారు. నిస్సత్తువ, పైత్యం, వాంతులు, విరేచనాలు, జలుబు, దగ్గు, కామెర్లు, గర్భాశయ వ్యాధులు, అజీర్ణ వ్యాధులకు ఇది ఔషధంలా పనిచేస్తుంది. వంటల్లో లేత కొబ్బరి, పచ్చికొబ్బరి, ఎండుకొబ్బరి, కొబ్బరి పాలు వినియోగిస్తారు. కొబ్బరి కోరుతో పలురకాల స్వీట్లు, పచ్చళ్లు చేస్తారు. శెనగపప్పు, పెసరపప్పుతో కలిపి కూరగా వండుతారు. సాంబారు, పులుసు, వేపుడు కూరల్లో కొబ్బరి కోరు చల్లుతారు. చింతకాయ, క్యారెట్‌తో కలిపి కూడా రుచికరమైన వంటకాలు చేస్తారు.

బెల్లం ఉండలు

కొబ్బరి కోరు - 4 కప్పులు
బెల్లం కోరు - 2 కప్పులు
జీడిపప్పు - 24
యాలకులు - 12
నెయ్యి - 5 చెంచాలు
వెడల్పాటి గినె్నలో కాస్త నీళ్లుపోసి బెల్లం కోరు, కొబ్బరి కోరు వేసి బాగా ఉడకనివ్వాలి. అడుగంటకుండా కొబ్బరిపాలు పోసి కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత నెయ్యి పోసి, గినె్న నుంచి మిశ్రమం విడిపోతుండగా యాలకుల పొడి వేసి దింపేయాలి. చల్లారాక ఉండలుగా చేసుకోవాలి.

వడలు

కొబ్బరి కోరు - 5 కప్పులు
శెనగపప్పు - 2 కప్పులు
పచ్చిమిర్చి - 5
జీలకఱ్ఱ - 2 చెంచాలు
నూనె - 250 గ్రా.
ఉప్పు - 2 చెంచాలు
అల్లం - చిన్న ముక్క
కొత్తిమీర - కొంచెం
వేరుశెనగపప్పు - 1/2 కప్పు

శెనగపప్పు నానబెట్టి నీరు వాడ్చి మిక్సీ పట్టాక, అందులో పచ్చిమిర్చి, కొబ్బరి, జీలకఱ్ఱ, ఉప్పు, అల్లం, కొత్తిమీర కలిపి ముద్దగా చేసుకోవాలి. ఈ ముద్దను వడలుగా చేసుకుని నూనెలో దోరగా వేయించాలి.

కజ్జికాయలు

మైదాపిండి - 2 కప్పులు
ఉప్పు - 1/2 చెంచా
కొబ్బరి కోరు - 6 కప్పులు
పుట్నాలపొడి -2 కప్పులు
యాలకుల పొడి -1 చెంచా
ఎండుకొబ్బరి -1 కప్పు
బెల్లం కోరు - 1 కప్పు
నూనె - 250 గ్రా.
మైదాపిండిలో నీరు, ఉప్పువేసి పూరీ పిండిలా కలుపుకుని విడిగా ఉంచాలి. కొబ్బరి, బెల్లం, పుట్నాల పప్పు కలిపి బాగా ఉడికించాక చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. వత్తిన పూరీల్లో ఈ ఉండలు వేసి అంచులు మూసివేయాలి. ఈ పచ్చి కజ్జికాయలను నూనెలో దోరగా వేపాలి.

రైస్‌తో..

కొబ్బరి కోరు - 5 కప్పులు
యాలకులు - 5
జీడిపప్పు- 28
దాల్చిన చెక్క, లవంగాలు - 6
నెయ్యి - 1 కప్పు
పచ్చిమిర్చి - 6
అల్లం పేస్ట్ - 4 చెంచాలు
ఉప్పు - 2 చెంచాలు
వరి బియ్యం- 2 కప్పులు
జీలకఱ్ఱ - 2 చెంచాలు
క్యారెట్ ముక్కలు - 1 కప్పు
బంగాళాదుంపల ముక్కలు- అర కప్పు
బఠాణీలు - 1 కప్పు
నేతిలో మసాలా వేయించాక 4 కప్పుల నీరు, ఉప్పు, పచ్చిమిర్చి, క్యారెట్ కోరు, బంగాళాదుంపల ముక్కలు వేసి ఉడికించాలి.
ఆ తర్వాత కొబ్బరి కోరు, బియ్యం పోసి అత్తెసరు మాదిరిగా ఉడకనివ్వాలి. చివరగా జీడిపప్పు, నానబెట్టిన బఠాణీలు వేసి బాగా కలపాలి.

మిల్క్ లడ్డూలు

మిల్క్ పౌడర్ - 2 కప్పులు
కోవా- 1 కప్పు
కొబ్బరి పొడి - 4 కప్పులు
పంచదార - 1 కప్పు
యాలకులు - 6
జీడిపప్పు- 24
నెయ్యి - 4 చెంచాలు
కిస్‌మిస్ - 12
ముందుగా మిల్క్‌పౌడర్, కోవా, పంచదార, కొబ్బరి కోరు, కాస్త నీరు కలిపి సన్నని మంటపై ఉడికించాలి. ఆ తర్వాత నెయ్యి వేసి చల్లారాక ఉండలుగా చేసుకోవాలి. చివరగా యాలకుల పొడి, జీడిపప్పుతో అలంకరించాలి.

పాయసం

కొబ్బరి కోరు - 2 కప్పులు
శెనగపప్పు - 1 కప్పు
పెసరపప్పు - 1 కప్పు
బెల్లం - 2 కప్పులు
పాలు - 1/2 లీటరు
కొబ్బరి పాలు - 2 కప్పులు
యాలకులు - 6
నెయ్యి - 1/2 కప్పు
జీడిపప్పు, కిస్‌మిస్ -40
నేతిలో శెనగపప్పు, పెసరపప్పు వేయించాక నీరుకలిపి ఉడికించాలి.
మెత్తగా అయ్యాక పాలు, కొబ్బరిపాలు వేసి ఉడికించాక బెల్లం కోరు, యాలకుల పొడి వేసి కిందకు దింపాలి. చివరగా పాయసంలో జీడిపప్పు, కిస్‌మిస్ వేయాలి.

-చంద్రిక