సబ్ ఫీచర్

పళ్లు కొరికే అలవాటు పది విధాల చేటు (అంధమె ఆనందం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగా పెళ్లయిన ఆమెకు అత్తారింట్లో భర్త పక్క పడుకున్నప్పుడు రాత్రిళ్లు ఏవో శబ్ధాలు వినిపించేవి. కంగారుగా లేచి ఏంటా శబ్ధాలని వెతికేది. ఏం తెలిసేది కాదు. రాను రాను ఈ శబ్ధాలు ఆమెకో పెద్ద సమస్యగా మారాయి. శబ్ధాలు వినిపిస్తున్నాయి కానీ దానికి కారణం ఏంటో ఆమెకు తెలియట్లేదు. కొన్ని వారాలకి ఆమె ఆ శబ్ధాలకి కారణం పసిగట్టింది. అవి ఆమె భర్త నిద్రలో పళ్లు గట్టిగా కొరకడం వల్ల వస్తున్న శబ్దాలు. పళ్లు కొరకడం చూసి అతను మేల్కొని ఉన్నాడనుకొని ‘యావండీ, యావండీ’ అని పిలిచింది. అతని దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు. ఆమెకర్థమయింది. అతను మెలుకువగా లేడు నిద్రలో ఉన్నాడని. మరుసటి రోజు ఇదే విషయం అతనితో ప్రస్తావించే ప్రయత్నం చేసింది. అంతా నీ భ్రమ అని కొట్టిపారేశాడు. ప్రతి రాత్రి నిద్రలో భర్త చేస్తున్న శబ్ధాల్ని వినీ ఆమె భయం పెరిగింది. భర్తకున్న అలవాటుని ‘బ్రక్సిసమ్’'(BRUXISM) అంటారు. అంటే కింది దవడను ముందుకి, పక్కకి జరుపుతూ పైపళ్లని కొరికే ప్రయత్నం చేయడం. నిద్రలో ఇలా చేస్తున్నట్టు అతనికి కూడా తెలీదు. ఆధారాలతో తనకి చూపిస్తే కానీ నమ్మలేదు. నమ్మాక తనకి తగిన చికిత్స చేయడం జరిగింది.
అసలు ‘బ్రక్సిసమ్’ అంటే ఏంటి?
నిద్రలో కింది దవడను ముందుకు పక్కకి జరుపుతూ పళ్లు కొరికే అలవాటుని బ్రక్సిసమ్ అంటారు.
ఈ అలవాటు ఏ కారణంగా వస్తుంది?
ఏ కారణం చేత వస్తుందో చెప్పటం కష్టం కానీ 70 శాతం మందిలో ఒత్తిడి, ఆందోళన, ఆత్మన్యూనత వల్ల కలుగుతుంది. చిన్న వయసు, చాలా చదువుకున్నవారిలో, పొగాకు, మద్యం బాగా సేవించేవారిలో, పని ఒత్తిడి వల్ల నిద్ర సరిగా రాని వారిలో, నిద్రపోవడానికి, ఒత్తిడికి, ఆందోళనకి మందులు వాడేవారిలో ఈ అలవాటు కనిపిస్తుంది. మగవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ అలవాటుతో పాటు గురక ఉండడమో, ఊపిరి అందక నిద్రలోంచి మెలకువ రావడమో, నిద్రలో మాట్లాడటం, విపరీతమైన కలలు రావడం లాంటివి కలిసుంటాయి.
ఈ అలవాటు వున్నట్టు ఆ బాధితులకు తెలీదా?
చాలామందికి తమతోపాటు పడుకునేవారు చెప్పేంతవరకు తెలీదు. చాలా సందర్భాలలో వారు నమ్మరు. అటువంటి వారికి ఆధారాలు చూపే ప్రయత్నం చేస్తాం.
ఈ అలవాటువల్ల కలిగే సమస్యలు
ముఖానికి సంబంధించిన సమస్యలు
ఈ అలవాటు లేనివారిలో కంటే ఉన్నవారిలో తలనొప్పి మూడు రెట్లు అధికంగా ఉంటుంది.
ముఖం కండరాల నొప్పి
చెవి పోటు
క్రింది దవడ కీలులో నొప్పి
పొద్దున లేవగానే నోరు పూర్తిగా తెరుచుకోలేకపోవడం
పొద్దున లేవగానే దవడ, మెడ పట్టేసినట్టు ఉండటం.
శబ్దం వల్ల తోడుగా పడుకున్నవారికి అసౌకర్యం.
నోటికి సంబంధించిన సమస్యలు
పళ్లు బాగా అరిగిపోవడం- దానివల్ల చల్లవి కానీ తీయని పదార్థాలు తిన్నప్పుడు పళ్లు జిల్‌మని లాగడం, పళ్లు అరగడంవల్ల పళ్ల ఎత్తు తగ్గి నోరు మూసినపుడు కింది ముఖంలో ముడతలు పడడం.
నిరంతర ఒత్తిడి వల్ల చిగుళ్ల వాపు మరియు చిగుర్లు జారి పళ్లు ఊగడం.
కొంతమందిలో ఎక్కువ వత్తిడివల్ల పళ్లు విరగడం లాంటి సమస్యలు చూస్తాం.
దీనికి చికిత్స
దీని చికిత్స మూడు విధాలుగా చేస్తారు.
1. రాత్రిపూట పళ్లమీద తొడిగే పరికరం (నైట్ గార్డ్)
దీనిని నైట్ గార్డ్ అంటారు. పడుకునే ముందు వీటిని పళ్లపై తొడిగితే నిద్రలో పళ్లు కొరుక్కోడం మూలాన పళ్లు అరిగే సమస్య ఉండదు. పై, కింది పళ్ల మధ్య ఈ పరికరం ఓ అడ్డులా ఉండి పళ్లు అరగకుండా, చిగుళ్లపై ఒత్తిడి పడి జారకుండా కాపాడుతుంది. దీనితో మంచి ఫలితాలు ఉంటాయి. కాకపోతే ఇవి తొడుక్కుని పడుకునే అలవాటు అవ్వడానికి సమయం పడుతుంది. బాధితులు ఓర్పుతో దీనిని వాడితే మంచి ఫలితాలు లభిస్తాయి.
2.కింది దవడ ముందు ఉంచే పరికరాలు
(Mandibular Advancement Devices)
ఇవి కూడా పళ్లకి తొడిగే పరికరమే కానీ దీనిని తయారుచేసేటప్పుడు కింది దవడని పైదవడకన్నా కొద్దిగా ముందుకు తెచ్చి, ఆ సంబంధం ప్రకారం తయారుచేస్తారు. సాధారణంగా పైదవడకి వెనుకగా ఉండే మన కిందిదవడ ఇవి తొడిగాక పైదవడకన్నా కొద్దిగా ముందుకి వస్తాయి. బ్రక్సిసమ్ బాధితులకి ఈ పరికరం నైట్ గార్డ్‌కన్నా అత్యున్నతమైన ఫలితాలని ఇస్తుంది. ఈ పరికరాన్ని నోట్లో తొడుక్కుని పడుకునే అలవాటు కాడానికి సమయం పడుతుంది. దీనిని వాడడంవల్ల గురక కూడా తగ్గేందుకు ఆస్కారం ఉంది.
3.వశీకరణ (HYPNOSIS)
ఈ వశీకరణ ద్వారా బాధితులని మానసికంగా బలపరిచి, వారి ఒత్తిడి, ఆందోళన, ఆత్మన్యూనతను తగ్గించే ప్రయత్నం చేస్తారు. కొంతమందిలో ఈ విధానం మంచి ఫలితాలను ఇస్తుంది.
ఓసారి ఓ వ్యాపారవేత్త తన భార్య పుట్టిన రోజుకు మంచి బహుమతి ఇద్దామని ఆమె నిద్రలేవగానే ‘‘పుట్టినరోజు శుభాకాంక్షలని’’ పలకరించాడు. ‘‘పలకరింపులేనా, బహుమానం ఏం లేదా?’’ అని అడిగింది ఆవిడ. ‘‘నీ బహుమతి నిన్న రాత్రే నీకు ఇచ్చా కదా’’ అన్నాడు. ‘‘ఏంటా అని’’ ఆని ఆలోచిస్తున్న ఆవిడతో తను ఇలా అన్నాడు. ‘‘నాతో పెళ్లయ్యాక నువ్వోటి కోల్పోయేవు. ఇప్పటిదాకా తిరిగి ఇవ్వలేకపోయాను. కానీ నిన్న రాత్రి నీకది తిరిగిచ్చేసాను’’ ఠక్కున ఆమెకు వెలిగింది. ‘‘పెళ్లయిన ఇరవై సంవత్సరాలలో ఇతని గురక, పళ్లు కొరికే అలవాటువల్ల రాత్రిళ్లు ఎన్నడూ ఆమె మంచినిద్ర పోలేదు. కానీ నిన్న రాత్రి అలా కాదు. ఎక్కడా మెలకువ రాని నిద్ర’’. ‘‘ఎలా అని ఆశ్చర్యంగా’’ అడిగింది. నోరు తెరిచి నోట్లో పెట్టుకున్న పరికరాన్ని చూపించాడు.

chitram
పళ్లమీద తొడిగే పరికరం

-డా. రమేష్ శ్రీరంగం, సర్జన్, ఫేస్ క్లినిక్స్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్ -డాక్టర్ రమేష్ శ్రీరంగం సెల్ నెం: 92995 59615 faceclinics@gmail.com