రుచి

కమ్మ.. కమ్మని కుల్ఫీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుల్ఫీ పేరు చెప్పగానే నోట్లో నీరు ఊరని వారు ఎవరుంటారు చెప్పండి. ముఖ్యంగా మలై కుల్ఫీ అనగానే పిల్లల నుంచి ముసలివారి వరకూ ప్రతి ఒక్కరూ పెదవులను తడుపుకునేవారే.. కానీ చాలామంది బయట అమ్మే కుల్ఫీలను తినడానికి ఇష్టపడరు. అలాంటివారు ఇంట్లోనే రకరకాల కుల్ఫీలను తయారుచేసుకోవచ్చు.. ఆనందంగా ఆరగించవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. కుల్ఫీలపై ఓ లుక్కేద్దామా!
బాదాం కుల్ఫీ
కావలసిన పదార్థాలు: నానబెట్టి తొక్కతీసిన బాదంపప్పు: రెండు కప్పులు, కండెన్స్‌డ్ మిల్క్: రెండు కప్పులు, పాలు: అరకప్పు, ఫ్రెష్ క్రీము: ఎనిమిది టేబుల్ స్పూన్లు, కుంకుమపువ్వు: కొద్దిగా, పిస్తా: కొద్దిగా, గార్నిషింగ్‌కి.., బాదంపప్పు: రెండు టేబుల్ స్పూన్లు, కుంకుమపువ్వు: కొద్దిగా
తయారీ విధానం: నానబెట్టిన బాదంపప్పులను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీనిలో క్రీము, కండెన్స్‌డ్ మిల్క్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్‌పై బాణలి పెట్టి దానిలో పాలను వేయాలి. పాలు మరిగేటప్పుడు అందులో కుంకుమపువ్వు వేసి బాగా కలపాలి. తరువాత స్టవ్ ఆపేసుకుని దీన్ని చల్లారనివ్వాలి. ఈ పాలు చల్లారిన తరువాత దీనిలో బాదాం మిశ్రమంను వేసి బాగా కలపాలి. అప్పుడు అది చిక్కటి మిశ్రమంగా మారుతుంది. మరో పాన్ తీసుకుని వేడిచేయాలి. దానిలో ముక్కలు చేసిన బాదంపప్పు, పిస్తా పప్పులను వేసి వేయించాలి. నూనె ఏమీ వేయకూడదు సుమా.. ఇవి వేగిన తరువాత పక్కకు తీసుకుని కుల్ఫీ కప్పులలో చిక్కటి బాదాం మిశ్రమం, వేయించుకున్న బాదాం, పిస్తా పలుకులను వేయాలి. మధ్యలో ఐస్‌క్రీం పుల్లను పెట్టాలి. దీన్ని ఓ నాలుగు గంటలపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. బయటకు తీసిన తరువాత కుంకుమపువ్వు, బాదంపప్పు పలుకులతో చల్లచల్లగా సర్వ్‌చేయాలి. అంతే పూర్తి పోషణను అందించే రుచికరమైన బాదాం కుల్ఫీ రెడీ.

మలై కుల్ఫీ
కావలసిన పదార్థాలు: ఫుల్ క్రీం పాలు: రెండు కప్పులు
పంచదార: పావు కప్పు, బాదంపప్పు: పది
పిస్తా పప్పు: పది, యాలకులు: రెండు
కుంకుమపువ్వు: కొద్దిగా
పంచదార కలపని పాలకోవా: పావుకప్పు
తయారీ విధానం: పంచదార, బాదంపప్పు, పిస్తా, యాలకులు, కుంకుమపువ్వులను కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక పాన్‌లో పాలను పోసి కాచాలి. పదిహేను నిముషాలు పాలను సిమ్‌లో పెట్టి కాస్తే పాలు దగ్గరిగా వచ్చేస్తాయి. దీనికి పంచదార మిశ్రమాన్ని కలపాలి. బాగా కలియబెట్టిన తరువాత దీనికి పాలకోవాను కలపాలి. వీటిని సన్న సెగన మీద తిప్పుతూ ఉండాలి. ఈ మిశ్రమం కాస్త గట్టిపడిన తర్వాత స్టవ్‌పై నుంచి దించేయాలి. ఇది చల్లారిన తరువాత కుల్ఫీ కప్పులలో ఈ మిశ్రమాన్ని పోసి, ఐస్‌క్రీమ్ పుల్లను ఉంచి డీప్‌ఫ్రిజ్‌లో ఆరు నుంచి ఎనిమిది గంటలపాటు ఉంచితే చాలు. చల్లచల్లని మలై కుల్ఫీ తయారు.
మ్యాంగో కుల్ఫీ
కావలసిన పదార్థాలు: పాలు: ఒకటిన్నర కప్పు
బాగా మరిగించిన పాలు: పావు కప్పు
పంచదార: పావు కప్పు, కార్న్‌ఫ్లోర్: చెంచా
మామిడిపండు గుజ్జు: అరకప్పు
యాలకులపొడి: పావు చెంచా
తయారీ విధానం: ఓ గినె్నలో పాలు, పంచదార తీసుకుని స్టవ్‌పైన పెట్టాలి. అవి సగం అయ్యాక కార్న్‌ఫ్లోర్ కలపాలి. బాగా కాగాక బాగా మరిగించిన పాలనుపోసి మంట తగ్గించి కలుపుతూ ఉండాలి. ఐదు నిముషాల తర్వాత యాలకులపొడి వేసి బాగా కలిపి దింపేయాలి. కాస్త చల్లారాక ఈ మిశ్రమంలో మామిడిపండు గుజ్జును వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుల్ఫీ కప్పులలో వేసుకుని, ఐస్‌క్రీమ్ పుల్లను ఉంచి ఎనిమిది గంటల పాటు ఫ్రీజ్ చేస్తే సీజనల్ మామిడిపండు కుల్ఫీ తయారు.
కివీ కుల్ఫీ
కావలసిన పదార్థాలు: కివీపండ్లు: మూడు, నిమ్మరసం: ఒక టేబుల్ స్పూన్
కొబ్బరిపాలు: నాలుగు కప్పులు
కార్న్‌ఫ్లోర్: ఒక టేబుల్ స్పూన్
పంచదార: అరకప్పు, యాలకులు: మూడు
తయారీ విధానం: అడుగుమందంగా ఉన్న పాన్‌ను తీసుకుని అందులో కొబ్బరిపాలు, కార్న్‌ఫ్లోర్ కలిపి స్టవ్‌పై ఉంచాలి. ఈ పాలు సగానికి మరిగాక అందులో పంచదార, యాలకులపొడి వేసి మంటను తగ్గించి సిమ్‌లో పెట్టుకోవాలి. పంచదార కరిగిపోయాక స్టవ్‌ను ఆపేయాలి. ఈ మిశ్రమం చల్లారాక ఇందులో కివీపండ్లు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. నచ్చిన వారు పుదీనా పేస్ట్‌ను కానీ, ఆకుల్ని కానీ వేసుకోవచ్చు. తరువాత ఈ మిశ్రమాన్ని మెత్తగా మిక్సీపట్టాలి. ఈ మిశ్రమాన్ని కుల్ఫీ కప్పుల్లోకి తీసుకుని ఫ్రీజ్ చేయాలి. అంతే ఎంతో ఆరోగ్యాన్ని అందించే పుల్లపుల్లని, చల్లచల్లని, తియ్యతియ్యని కివీ కుల్ఫీ రెడీ.