రుచి

ఈ వంటలు వెరీ‘గుడ్డు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చలి వణికిస్తోంది. పగటి సమయం బాగా తగ్గింది. ఇలాంటి సమయంలో సాధారణ ఆహారాన్ని ఎవరూ ఇష్టపడరు. వేడివేడిగా ఉన్న మసాలా వంటకాలనే ఇష్టపడతారు. కానీ ఈ వంటకాలే రోజూ తింటే పోషకాహార లోపం ఏర్పడుతుంది. అందుకే పూర్తి పోషకాహారానికి పేరుగా చెప్పుకునే గుడ్డుతో వేడివేడి ఆహారపదార్థాలను చేసుకుని తింటే ఆ మజాయే వేరు. మరి ఆ ఆహారపదార్థాలేంటో చూసేద్దామా..

స్పైసీ వెజిటబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్

కావలసిన పదార్థాలు

బాస్మతీ బియ్యం: పావుకిలో
ఎండుమిర్చి: మూడు
వెల్లుల్లి రెబ్బలు: నాలుగు
అల్లం తురుము: ఒక చెంచా
నెయ్యి లేదా నూనె: రెండు చెంచాలు
క్యారెట్లు: రెండు
చైనీస్ క్యాబేజీ తురుము: కప్పు
గుడ్లు: రెండు
ఉల్లికాడలు: మూడు
తాజా బఠాణీలు: 200 గ్రాములు
సోయాసాస్: చెంచా
ఉప్పు: తగినంత
కొత్తిమీర: కొద్దిగా

తయారీ విధానం

బాస్మతీ బియ్యం పలుకుగా వండి పెట్టుకోవాలి. గుడ్లలో చిటికెడు ఉప్పు వేసి బాగా గిలకొట్టాలి. మిక్సీలో వెల్లుల్లి, ఎండుమిర్చి, ఉప్పు వేసి మెత్తగా నూరాలి. బాణలిలో నూనె వేసి వేగాక, అల్లం తురుము వేసి వేయించాలి. తరువాత క్యారెట్ ముక్కలు వేసి ఐదు నిముషాలు వేయించాలి. క్యాబేజీ తురుము, ఉల్లికాడల తురుము, బఠాణీలు, మిర్చి ముద్ద వేసి ఓ నిముషం పాటు వేయించాలి. తరువాత సోయాసాస్ వేసి కలపాలి. ఇప్పుడు ఉడికించిన అన్నం, ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని బాణలిలోనే ఓ పక్కకు నెట్టి గిలక్కొట్టిన గుడ్ల మిశ్రమాన్ని అట్టులా వేయాలి. అది రెండువైపులా బాగా కాలాక దాన్ని చిదిమినట్లుగా చేసి అన్నం మిశ్రమంలో కలిపేసి, కొత్తిమీర తురుము చల్లి వేడివేడిగా వడ్డించాలి.

ఫ్లాట్ రైస్ నూడుల్స్ విత్ ఎగ్

కావలసిన పదార్థాలు

నానబెట్టిన ఫ్లాట్ రైస్ నూడుల్స్: 200 గ్రాములు
గుడ్లు: రెండు
శుభ్రం చేసిన రొయ్యలు: ఆరు
క్యాబేజీ తరుగు: అరకప్పు
నూనె: చెంచా
ఉల్లిపాయ: ఒకటి
వెల్లుల్లి రెబ్బలు: ఐదు
పల్లీలు: అరకప్పు
ఉల్లికాడల తరుగు: పావు కప్పు
చింతపండు రసం: కప్పు
టొమాటో కెచెప్: పావు కప్పు
బెల్లం తరుగు: అరకప్పు
లైట్ సోయాసాస్: పావుకప్పు
డార్క్ సోయాసాస్: చెంచా
ఎండుమిర్చి గింజలు: చెంచా
పైనాపిల్ రసం: పావుకప్పు
ఉప్పు: తగినంత

తయారీ విధానం

ముందుగా పల్లీలను వేయించుకుని పొట్టుతీసుకోవాలి. తరువాత థాయ్ సాస్ తయారుచేసుకోవాలి. అందుకోసం చింతపండురసం, టొమాటో కెచెప్, బెల్లం తరుగు, లైట్‌సోయాసాస్, డార్క్ సోయాసాస్, ఎండుమిర్చి గింజలు, పైనాపిల్ రసాలను కలిపి బాణలిలో వేసుకుని స్టవ్ మీద ఉంచాలి. బెల్లం కరిగి, మిశ్రమం బాగా మరిగి సగం
అయ్యాక దింపేయాలి. గుడ్లను పగలగొట్టి ఒక గినె్నలో తీసుకుని గిలకొట్టాలి. బాణలిలో సగం నూనె వేసి వేడిచేసి వెల్లుల్లి, ఉల్లిపాయ తరుగూ వేయాలి. ఇందులో గుడ్లసొన, కొద్దిగా ఉప్పు వేసి ఆమ్లెట్‌లా అయ్యాక దింపేయాలి. దీన్ని ముక్కల్లా కోసుకోవాలి. అలాగే మిగిలిన నూనె వేసి వేడిచేసి రొయ్యలు వేయించుకోవాలి. ఇవి మెత్తగా అయ్యాక నీరు, క్యాబేజీ తరుగు, నానబెట్టుకున్న నూడుల్స్ వేసి మూత పెట్టేయాలి. నూడుల్స్ ఉడికాక ముందుగా చేసుకున్న సాస్‌లో సగం సాస్ వేసి బాగా కలపాలి. ఈ నూడుల్స్ దగ్గరకు అయ్యాక దింపేసి వేయించిన పల్లీలు, ఉల్లికాడల తరుగూ వేసి అలంకరించి ఆమ్లెట్ ముక్కలతో కలిపి వడ్డించాలి. అంతే ఎంతో రుచికరమైన ఫ్లాట్ రైస్ నూడుల్స్ విత్ ఎగ్ రెడీ. దీన్ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

ఎగ్ కట్‌లెట్

కావలసిన పదార్థాలు

గుడ్లు: మూడు
పెద్ద బంగాళాదుంపలు: రెండు
ఉల్లిపాయ ముక్కలు: అరకప్పు
అల్లం వెల్లుల్లి ముద్ద: ఒకటిన్నర చెంచా
పచ్చిమిర్చి: ఒకటి
కరివేపాకు: ఒక రెబ్బ
పసుపు: అరచెంచా
కారం: ముప్పావు చెంచా
ధనియాల పొడి: చెంచా
గరంమసాలా: అరచెంచా
కొత్తిమీర తరుగు: పావుకప్పు
బ్రెడ్‌పొడి: ముప్పావుకప్పు
నూనె: వేయించడానికి సరిపడా..

తయారీవిధానం

రెండు గుడ్లను ఉడికించి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బంగాళాదుంపలను కూడా ఉడికించి మెత్తగా చిదిమి పెట్టుకోవాలి. తరువాత స్టవ్‌పై బాణలిని పెట్టి చెంచా నూనె వేయాలి. ఇది వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి ముద్ద, కరివేపాకు తరుగు, కాస్త ఉప్పు వేసి వేయించాలి.
ఉల్లిపాయ ముక్కలు వేగాక పసుపు, కారం, ధనియాలపొడి, గరంమసాలా వేయాలి. ఇందులో చిదిమిన బంగాళాదుంప వేసి మరోసారి కలపాలి. చివరగా ఉప్పు సరిచూసి కొత్తిమీర చల్లి బాగా కలిపి దించేయాలి. తరువాత చేతికి నూనె రాసుకుని ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి.
తర్వాత ఓ ముద్దను తీసుకుని కాస్త వెడల్పుగా చేసి ఇందులో గుడ్డు ముక్కను ఉంచి చుట్టూ మూసేయాలి. ఇలా మిగిలినవాటినీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌పై బాణలిని ఉంచి నూనె పోసి వేడిచేయాలి. తరువాత ఓ వెడల్పాటి గినె్నలో కోడిగుడ్డును గిలక్కొటి ఉంచాలి. పక్కన ఉంచుకున్న కట్‌లెట్‌లను గుడ్డుసొనలో ముంచి, బ్రెడ్‌పొడిలో అటూ ఇటూ దొర్లించాలి. వీటిని కాగుతున్న నూనెలో వేసి బంగారురంగు వచ్చేవరకు వేయించాలి. ఇవి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి.

చైనీస్ ఎగ్ రోల్స్

కావలసిన పదార్థాలు

క్యారెట్ తురుము: కప్పు
క్యాబేజీ తురుము: కప్పు
బఠాణీలు: కప్పు
వెల్లుల్లి రెబ్బలు: మూడు
ఉల్లిపాయ: ఒకటి
ఉల్లికాడలు: ఎనిమిది
పుట్టగొడుగులు: అరకప్పు
బ్రకోలీ: పావు కప్పు
కాలీఫ్లవర్: పావు కప్పు
సోయాసాస్: ఒక చెంచా
మిరియాల పొడి: ఒక చెంచా
ఉప్పు: అర చెంచా
కార్న్‌ఫ్లోర్: ఒక చెంచా
ఎగ్‌రోల్ రేపర్లు: పది
నూనె: వేయించడానికి సరిపడా..

తయారీ విధానం

పాన్‌లో నూనె వేసి వేడిచేయాలి. ఇప్పుడు సన్నగా తరిగిన వెల్లుల్లి తురుము, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత సోయాసాస్, మిరియాల పొడి, ఉప్పు వేసి కలపాలి. ఒక్క నిముషం తరువాత మిగిలిన అన్ని కూరగాయల ముక్కలు వేసి వేయించాలి. తరువాత నీళ్లలో కలిపిన కార్న్‌ఫ్లోర్ వేసి కలిపి దించాలి.
ఈ మిశ్రమం కాస్త చల్లారాక ఒక్కో ఎగ్‌రోల్‌లో మూడు టేబుల్ స్పూన్ల మిశ్రమం వేసి జాగ్రత్తగా చుట్టి అంచుల్ని మూసేయాలి. ఇలాగే అన్నింటినీ చేసుకుని కాగిన నూనెలో వేసి ముదురు గోధుమరంగులోకి మారేవరకు వేయించి తీయాలి. వీటిని టొమాటో సాస్‌తో తింటే బాగుంటాయి.

చిల్లీ ఎగ్ ఇడ్లీ

కావలసిన పదార్థాలు

బటన్ ఇడ్లీలు: 15
ఉడికించిన గుడ్లు: రెండు
ఉల్లిపాయ: ఒకటి
అల్లం: అంగుళం ముక్క
వెల్లుల్ల రెబ్బలు: మూడు
పచ్చిమిర్చి: రెండు
కరివేపాకు: రెబ్బ
క్యాప్సికమ్: ఒకటి
చిల్లీసాస్: ఒక చెంచా
షెజువాన్‌సాస్: ఒక చెంచా
టొమాటో కెచప్: ఒక చెంచా
ఉల్లికాడల తురుము: కొద్దిగా
కొత్తిమీర తురుము: కొద్దిగా
నూనె: ఒక చెంచా
ఉప్పు: తగినంత

తయారీ విధానం

బటన్ ఇడ్లీలే కాదు పెద్ద ఇడ్లీలను కూడా ఇందుకు ఉపయోగించవచ్చు. వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. బటన్ ఇడ్లీ అయితే ఒకదాన్ని రెండు ముక్కలుగా చేసుకోవచ్చు. ఉడికించిన కోడిగుడ్లలో పచ్చసొనలను తీసేయాలి. తెల్లసొనను కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగాక సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు వేసుకోవాలి. తరువాత ఉల్లిముక్కలు వేసి వేగాక క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు కూడా వేసి వేయించాలి. అవి వేగాక చిల్లీసాస్, టొమాటో కెచప్, షెజువాన్ సాస్ వేసి కలపాలి. తరువాత ఇడ్లీ ముక్కలు వేసి బాగా కలపాలి. చివరగా తెల్లసొన ముక్కలు వేసి ఒక నిముషం వేగాక ఉల్లికాడల తురుము, కొత్తిమీర తురుము వేసి బాగా కలిపి వేడివేడిగా వడ్డించాలి.