రుచి

చేపతో రుచులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇతర మాంసాహారం, పాల ఉత్పత్తులతో పోలిస్తే సముద్రపు ఆహారంలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి, గుండెకు చాలామంచివి. రక్తంలోని కొవ్వు శాతాన్ని నియంత్రిస్తాయి. చేపలను తరచుగా తినడం వల్ల గుండె పోటును యాభై శాతం వరకు తగ్గించవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. అందుకే చేపలను వారానికి రెండుసార్లు తినమని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. అలాంటి చేపలతో చేసే వంటలను ఒకసారి చూద్దామా..

ఆవిరి కొరమీను

కావలసిన పదార్థాలు:

కొరమీను: ఎనిమిది వందల గ్రాములు
అల్లం: వంద గ్రాములు
వెల్లుల్లి: వంద గ్రాములు
పుదీనా ఆకు: రెండు వందల గ్రాములు
పచ్చిమిర్చి: పదిహేను
నూనె: ఒక కప్పు
తాజా కొబ్బరి తురుము: వంద గ్రాములు
ఉప్పు: రుచికి సరిపడా
వాము: చెంచా
అరటి ఆకులు: నాలుగు

తయారుచేసే విధానం

ముందుగా కడిగిన పుదీనా ఆకులు, అల్లం తరుగు, కొబ్బరి తురుము, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి తీసుకుని నీళ్లు చేర్చకుండానే మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. ఇందులో వాము, ఉప్పు కలపాలి. ఇప్పుడు ఒక్కో అరటి ఆకును చతురస్రాకారంలో కత్తిరించి దానికి నూనె రాయాలి. నాలుగు చేపముక్కల్ని ఒక్కో ఆకుపై ఉంచి.. పైన మసాలా మిశ్రమం రాసి చుట్టూ మూసేయాలి. అవసరమైతే దారం చుట్టాలి. వీటిని ఆవిరిపై ఇరవై నిముషాలు ఉడికించి తీసేయాలి. వీటిని వేడివేడిగా స్నాక్‌లా తింటే మహా రుచిగా ఉంటాయి.

పాబ్డా మసాలా స్నాక్

కావలసిన పదార్థాలు

పాబ్డా ఫిష్: ఒకటి
నిమ్మకాయ: ఒకటి
ఉప్పు: రుచికి సరిపడా
ఎండుమిర్చి: పది
లవంగాలు: ఏడు
దాల్చిన చెక్క: చిన్న ముక్క
యాలకులు: ఐదు
జీలకర్ర: పావు చెంచా
నల్ల మిరియాలు: పావు చెంచా
అల్లం: కొద్దిగా
వెల్లుల్లి: ఒకటి
ఉల్లిపాయ: ఒకటి
నూనె: ఒక పెద్ద చెంచా
పంచదార: చెంచా
వెనిగర్: కొద్దిగా

తయారుచేసే విధానం

ఎండుమిర్చి, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, జీలకర్ర, మిరియాలను కాసిని నీటిలో నానబెట్టాలి. అల్లం, వెల్లుల్లిని వెనిగర్‌లో నానబెట్టాలి. ఆ తరువాత వీటన్నింటినీ మిశ్రమంలా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో చెంచా నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కల్ని వేయించి పంచదార చల్లాలి. రెండు నిముషాలయ్యాక ఉల్లిపాయ ముక్కల్ని సిద్ధం చేసుకున్న మసాలా మిశ్రమానికి కలపాలి. చేపను శుభ్రం చేసి విడిపోకుండా ముక్కల్లా తరగాలి. ఇందులో తయారుచేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని కూరి సరిపడా ఉప్పు, నిమ్మరసం చేపకు పట్టించి ఫ్రిజ్‌లో ఉంచాలి. గంట సేపయ్యాక తీసి పెనంపై మిగిలిన నూనె వేసి వేడి చేసి వేయించాలి. బంగారు వర్ణంలోకి వచ్చేదాకా రెండువైపులా కాల్చితే సరిపోతుంది. దీన్ని బ్రెడ్ లేదా రొట్టెలతో కలిపి తింటే ఆ రుచే వేరు.

పాబ్డా ఫిష్

కావలసిన పదార్థాలు

పాబ్డా ఫిష్: నాలుగు వందల గ్రాములు
ఆవాలు: చెంచా
గసగసాలు: చెంచా
పచ్చిమిర్చి: నాలుగు
పెరుగు: అరకప్పు
ఆవనూనె: అరకప్పు
పసుపు: అరచెంచా
ఉప్పు: రుచికి సరిపడా..
పంచదార: అరచెంచా

తయారుచేసే విధానం

పసుపు, ఉప్పుతో చేపను శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆవాలు, గసగసాలు, మూడు పచ్చిమిర్చి, కాసిని నీటితో మిక్సీలో మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి.
దీన్ని ఓ పాత్రలోకి తీసుకుని పెరుగు, ఆవనూనె, సరిపడా ఉప్పు, పంచదార కలపాలి. తరువాత వెడల్పాడి పాత్రలో చేపముక్కల్ని తీసుకుని పైన ఈ మిశ్రమం వేసి, నిలువుగా తరిగిన పచ్చిమిర్చి ఉంచి పది నిముషాలు ఆవిరిపై ఉడికించాలి. ఈ కూర అన్నంతో కలిపి తింటే చాలా బాగుంటుంది.

వంజరం ఫ్రై

కావలసిన పదార్థాలు

వంజరం: పావుకిలో
పచ్చిమిర్చి ముద్ద: చెంచా
ఉప్పు: సరిపడా
మిరియాలపొడి: చెంచా
మొక్కజొన్న పిండి: మూడు చెంచాలు
కోడిగుడ్డు: ఒకటి
ఉల్లిపాయలు: రెండు
వెల్లుల్లి రెబ్బలు: పదిహేను
పసుపు: పావు చెంచా
కరివేపాకు రెబ్బలు: రెండు
చాట్‌మసాలా: అరచెంచా
కారం: అరచెంచా
నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం

ముందుగా చేపను శుభ్రం చేసి సన్నగా, పొడుగ్గా ముక్కల్లా కోయాలి. వీటిపై ఉప్పు, పచ్చిమిర్చి ముద్ద, మిరియాల పొడి అరచెంచా, మొక్కజొన్న పిండి ఒకటిన్నర చెంచా, కోడిగుడ్డు సొన వేసి ముక్కలకు మిశ్రమం బాగా పట్టేలా కలపాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి ఈ ముక్కల్ని వేయించి తీయాలి.
మరో బాణలిలో రెండు చెంచాల నూనె వేసి వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు చేర్చాలి. అవి కొద్దిగా వేగాక వేయించి పెట్టుకున్న చేపముక్కలు, కరివేపాకు, మిగిలిన ఉప్పు, మిరియాల పొడి, పచ్చిమిర్చి ముద్ద, పసుపు చేర్చి మరోసారి కలపాలి. రెండు నిముషాలయ్యాక మిగిలిన మొక్కజొన్న పిండిలో చాట్‌మసాలా, కారం ఈ ముక్కలపై వేసి బాగా కలపాలి. దగ్గరగా అయ్యాక దింపేస్తే సరి.

అవని చేప

కావలసిన పదార్థాలు

చందువా చేపలు: కిలో
వెల్లుల్లి: ఒకటి
పచ్చిమిర్చి: రెండు
కొత్తిమీర: కట్ట
మిరియాలు: చిన్న చెంచా
ఉల్లిపాయలు: రెండు
టొమాటో: ఒకటి
జీడిపప్పు: పది
ఉప్పు: రుచికి సరిపడా..

తయారుచేసే విధానం

చేపల్ని శుభ్రం చేయాలి. చేప విడిపోకుండా చీల్చి పొట్ట లోపల ఉన్నదంతా తీసేసి శుభ్రం చేసుకోవాలి. తరువాత గాట్లు పెట్టి ఉప్పు నీళ్లతో నాలుగైదుసార్లు శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ముక్కలకు ఉప్పు, పసుపు కలిపి పొట్టలోపలా, చేప పైన కూడా పట్టించి పది నిముషాల పాటు నాననివ్వాలి. వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, మిరియాలు, ఉల్లిపాయలు, టొమాటో, జీడిపప్పు అన్నీ కలిపి రుబ్బాలి. ఈ రుబ్బిన మిశ్రమాన్ని చేపలకు లోపలా, పైనా పట్టించి ఇరవై నిముషాలు నాననివ్వాలి. తరువాత పాన్‌లో నూనె వేసి నెమ్మదిగా రెండువైపులా వేయించి తీసే సరి.. దీన్ని అన్నంలోనే కాదు.. సాయంత్రం పూట పిల్లలకు స్నాక్‌గా ఇచ్చినా వారు ఆనందంగా తింటారు. ఆరోగ్యంగా కూడా ఉంటారు.

తందూరి జల్‌పారి

కావలసిన పదార్థాలు

చందువా: అరకిలో
అల్లం వెల్లుల్లి: చెంచా
ఎండుమిర్చి ముద్ద: అర చెంచా
గరం మసాలా: అర చెంచా
కసూరి మెంతి: చిన్న చెంచా
తందూరి మసాలా: చెంచా

తయారుచేసే విధానం

ముందుగా చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి అల్లం వెల్లుల్లి, గరం మసాలా, కసూరి మెంతి, తందూరి మసాలా, ఎండుమిర్చి ముద్ద.. అన్నింటినీ కలిపి పట్టించి అరగంటసేపు నాననివ్వాలి.
తరువాత పెనంపై నూనె వేసి వేడిచేసి ఈ చేపను వేసి రెండువైపులా వేస్తూ దోరగా కాలనిచ్చి తీసేయాలి. అంతే ఎంతో రుచికరమైన తందూరీ జల్‌పారీ తయారు.