రుచి

కూరగాయలతో వడలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయంత్రం స్నాక్స్ అనగానే ఏ బజ్జీలో, పునుగులో గుర్తొస్తాయి. పిల్లలకైతే
ఫాస్ట్ ఫుడ్ గుర్తొస్తుంది. కూరగాయలతో ఏదైనా చేసి పెడితే ఇష్టంగా తినకపోగా.. ముఖం పక్కకు తిప్పేస్తారు. అలాంటి వాళ్ల కోసం కూరగాయలతో ఇతర పదార్థాలను కలిపి కరకరలాడే వేడివేడి వడలను వేస్తే ఇష్టంగా తింటారు. మరి అవేంటో చూద్దామా..

సొరకాయతో...

కావలసిన పదార్థాలు
సొరకాయ: చిన్నది ఒకటి
మినపప్పు: రెండు కప్పులు
పచ్చిమిర్చి: రెండు
జీలకర్ర: చెంచా
కరివేపాకు: రెండు రెబ్బలు
అల్లం ముక్క: చిన్నది
నూనె: వేయించడానికి సరిపడా
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
ముందుగా మినపప్పును నాలుగు గంటల పాటు నానబెట్టి నీళ్లు ఒంపేసి గారెల పిండిలా రుబ్బి పెట్టుకోవాలి. తరువాత సొరకాయ చెక్కుతీసి తురమాలి. దీనికి కొద్దిగా ఉప్పు కలిపి శుభ్రమైన వస్త్రంలో మూటకట్టి అరగంట పాటు ఉంచితే.. ఇందులోని నీరంతా పోతుంది. ముందుగా రుబ్బి పెట్టుకున్న మినప్పిండిలో ఈ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కరివేపాకు తరుగు, అల్లం తరుగు, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలపాలి. దీన్ని కొద్దిగా తీసుకుని వడల్లా చేసుకుని కాగే నూనెలో వేయించి తీసుకోవాలి. ఇవి వేడివేడిగా తింటే బాగుంటాయి.

అరటికాయ, క్యారెట్‌తో...

కావలసిన పదార్థాలు
అరటికాయ: ఒకటి
బియ్యప్పిండి: కప్పు
క్యారెట్ తురుము: కప్పు
ఉల్లిపాయ: ఒకటి
వెల్లుల్లి రెబ్బలు: పది
పచ్చిమిర్చి: ఐదు
కొత్తిమీర తురుము: అరకప్పు
ఉప్పు: తగినంత
జీలకర్ర: చెంచా
నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం
ముందుగా అరటికాయను తొక్కతోసహా ఉడికించుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా ఉప్పును మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. తరువాత ఓ గినె్నలో ఉడికించిన అరటికాయను తొక్కతీసి మెత్తగా చిదుముకోవాలి. దీనిలో క్యారెట్ తురుము, బియ్యప్పిండి వేసుకుని కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ముందుగా తయారుచేసి పెట్టుకున్న పేస్టుతో పాటు తగినంత ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు వేసి వడల పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాగుతున్న నూనెలో గారెల్లా వత్తుకుని వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీస్తే రుచికరమైన అరటికాయ క్యారెట్ వడలు రెడీ.

బొబ్బర్లతో...

కావలసిన పదార్థాలు
బొబ్బర్లు: రెండు కప్పులు
పచ్చిమిర్చి: నాలుగు
అల్లం: చిన్నముక్క
జీలకర్ర: టీ స్పూన్
కొత్తిమీర: పావుకప్పు
కరివేపాకు: పావుకప్పు
ఉప్పు: తగినంత
నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
బొబ్బర్లను సుమారు ఆరుగంటలపాటు నానబెట్టాలి. నానాక నీళ్లు వంపేసి మిక్సీలో అల్లం, పచ్చిమిర్చి, బొబ్బర్లు, ఉప్పు వేసి కచ్చాపచ్చాగా రుబ్బాలి. అది గినె్నలో తీసుకున్నాక కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర వేసి కలిపి వడల్లా చేసి కాగిన నూనెలో ఎర్రగా వేయించుకోవాలి.

స్వీట్‌కార్న్, పల్లీలతో...

కావలసిన పదార్థాలు
స్వీట్‌కార్న్: కప్పు
పల్లీలు: కప్పు
పచ్చిమిర్చి: ఆరు
కొత్తిమీర తురుము: రెండు టేబుల్ స్పూన్లు
కరివేపాకు తురుము: రెండు టేబుల్ స్పూన్లు
జీలకర్ర: టీ స్పూన్
అల్లం: చిన్న ముక్క
ఉప్పు: తగినంత
నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం
ముందుగా పల్లీలను నాలుగు గంటలపాటు నాననివ్వాలి. తరువాత మిక్సీలో నానిన పల్లీలు, స్వీట్‌కార్న్, పచ్చిమిర్చి, అల్లం, తగినంత ఉప్పు వేసి కాస్త కచ్చాపచ్చాగా ఉండేట్లు రుబ్బాలి. ఈ పిండిలో జీలకర్ర, కరివేపాకు తురుము, కొత్తిమీర తురుము వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని వడల్లా వత్తుకుని కాగిన నూనెలో వేయించి తీస్తే రుచికరమైన పల్లీ వడలు రెడీ.

క్యాబేజీ, సెనగపప్పుతో...

కావలసిన పదార్థాలు
సన్నగా తరిగిన క్యాబేజీ: కప్పు
సెనగపప్పు: ముప్పావు కప్పు
మినపప్పు: టేబుల్ స్పూన్
బియ్యం: టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి: రెండు
అల్లం: చిన్న ముక్క
ఉల్లిపాయ: ఒకటి
కొత్తిమీర: కట్ట
ఉప్పు: తగినంత
నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం
రెండుగంటల ముందు సెనగపప్పు, మినపప్పు, బియ్యం నానబెట్టుకోవాలి. తరువాత ఈ మూడింటినీ మెత్తగా ముద్దలా చేసుకోవాలి.
ఇదేవిధంగా పచ్చిమిర్చి, అల్లం కూడా వేసి మెత్తగా చేసుకుని సెనగపప్పు ముద్దలో వేసుకోవాలి. ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వడల్లా అద్దుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుంటే ఎంతో రుచికరమైన క్యాబేజీ, సెనగపప్పు వడలు రెడీ.

అటుకులతో...

కావలసిన పదార్థాలు
అటుకులు: నాలుగు కప్పులు
పెరుగు: రెండు కప్పులు
బొంబాయ రవ్వ: అరకప్పు
పచ్చిమిర్చి: ఆరు
అల్లం తరుగు: రెండు చెంచాలు
జీలకర్ర: చెంచా
ఉల్లిపాయ ముక్కలు: అరకప్పు
కరివేపాకు రెబ్బలు: రెండు
పసుపు: అరచెంచా
కొత్తిమీర తరుగు: అరకప్పు
నూనె: వేయించడానికి సరిపడా
ఉప్పు: తగినంత

తయారుచేసే విధానం
ఓ గినె్నలో పెరుగు తీసుకోవాలి. ఇందులో పసుపు, బొంబాయిరవ్వ, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తరుగు వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు అటుకుల్ని నీళ్లలో నానబెట్టుకోవాలి. ఐదు నిముషాలు అయ్యాక నీళ్లు పిండేసి గట్టిగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచిన పెరుగులో వేయాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. బాణలిలో నూనె వేసి వేడిచేసి ఈ మిశ్రమాన్ని వడల్లా తట్టుకుని వేసుకోవాలి. ఎర్రగా వేగాక తీసేసుకుంటే పిల్లలు ఇష్టంగా తినే అటుకుల వడలు తయారు.