రుచి
కూరగాయలతో.. పెరుగు పచ్చడులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రోజూ పెరుగు తినాలంటే బోరుగా అనిపిస్తుంది. అలాగే రోజూ అవే కూరగాయలతో.. పప్పులు, పులుసులూ తినాలంటే కూడా చికాకే.. అందుకని అప్పుడప్పుడు కమ్మటి, చిక్కటి పెరుగుతో కూరగాయలను కలిపి పెరుగు పచ్చడి చేసుకుంటే ఆ రుచే వేరు.. పైగా ఆరోగ్యం, చలువ కూడా.. మరి రకరకాల కూరగాయలతో చేసే పెరుగుపచ్చడులను తెలుసుకుందామా!
ముల్లంగితో..
కావలసిన పదార్థాలు
ముల్లంగి: రెండు
పచ్చిమిర్చి: రెండు
నువ్వుల పొడి: రెండు చెంచాలు
పెరుగు కప్పు
ఉప్పు: తగినంత
కొత్తిమీర: చెంచా
నూనె: చెంచా
నిమ్మరసం: అరచెంచా
ఆవాలు: కొద్దిగా..
మినపప్పు: కొద్దిగా
కరివేపాకు: రెండు రెబ్బలు
తయారుచేసే విధానం
ముందుగా ముల్లంగిని శుభ్రం చేసి తురమాలి. బాణలిలో నూనె వేడిచేసి ఆవాలు, మినపప్పును వేసి వేయించాలి. ఆ తరువాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేయాలి. నిముషం తరువాత ముల్లంగి తురుము వేసి మూతపెట్టి మంట తగ్గించాలి. ఇది మూడు వంతులు ఉడికాక తగినంత ఉప్పు కలిపి నువ్వుల పొడిని వేయాలి. రెండు నిముషాల తరువాత నిమ్మరసం కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు కొత్తిమీర తరుగు వేయాలి. దీన్ని వేడి చల్లారనిచ్చి పెరుగులో వేస్తే సరిపోతుంది. కమ్మటి ఈ పెరుగు పచ్చడిని రొట్టెలతో కూడా తినొచ్చు.
బూడిద గుమ్మడికాయతో..
కావలసిన పదార్థాలు
బూడిద గుమ్మడికాయ తురుము: కప్పు
ఉల్లిపాయ: ఒకటి
పచ్చిమిర్చి: ఐదు
పెరుగు: రెండు కప్పులు
కరివేపాకు: రెండు రెబ్బలు
కొత్తిమీర: చెంచా
ఆవాలు: అరచెంచా
జీలకర్ర: అరచెంచా
పుట్నాల పొడి: మూడు చెంచాలు
నూనె: చెంచా
ఉప్పు: తగినంత
పసుపు: చిటికెడు
తయారుచేసే విధానం
ఉల్లిపాయను, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి. స్టవ్‌పై బాణలిని ఉంచి నూనె వేయాలి. వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేయాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను వేయాలి. ఇవి కొద్దిగా వేగాక ఉప్పు, పసుపు వేయాలి. ఇవి కాస్త మగ్గాక బూడిద గుమ్మడికాయ తురుము వేయాలి. తురుముకోవడం ఇష్టం లేని వాళ్లు సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. బూడిద గుమ్మడికాయ మగ్గిపోయిన తరువాత పుట్నాల పొడి వేసుకోవాలి. బాగాకలిపి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరను కూడా కలపాలి. చల్లారాక పెరుగులో ఈ మిశ్రమాన్ని వేసి బాగా కలిపి వడ్డించాలి. అంతే ఎంతో రుచికరమైన బూడిద గుమ్మడికాయ పెరుగుపచ్చడి రెడీ..
సగ్గుబియ్యంతో..
కావలసిన పదార్థాలు
సగ్గుబియ్యం: కప్పు
పెరుగు: రెండు కప్పులు
ఆవాలు: సగం చెంచా
మినపప్పు: ఒక చెంచా
ఎండుమిర్చి: రెండు
కరివేపాకు: రెండు రెబ్బలు
పచ్చిమిర్చి: రెండు
ఉప్పు: తగినంత
నూనె లేదా నెయ్యి: తగినంత
కొత్తిమీర తరుగు: ఒక చెంచా
తయారుచేసే విధానం
ముందుగా స్టవ్‌పై బాణలి ఉంచి కొద్ది నూనె లేదా నెయ్యివేసి సగ్గుబియ్యాన్ని సన్నటి సెగపై వేయించాలి. తరువాత పెరుగులో ఉప్పు వేసి బాగా కలపాలి. వేయించుకున్న సగ్గుబియ్యాన్ని పెరుగులో వేయాలి. ఇప్పుడు సగ్గుబియ్యం వేయించి తీసిన నెయ్యిలోనే మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేసి బాగా వేగాక, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించి తీసి పెరుగు మిశ్రమంలో కలపాలి. చివరగా కొత్తిమీర తరుగు కూడా వేసి బాగా కలిపి ఓ అరగంట తర్వాత వడ్డించాలి. ఇది బిర్యానీ, ఫ్రైడ్‌రైస్, పలావుల్లోకి చాలా బాగుంటుంది.
చింతచిగురుతో..
కావలసిన పదార్థాలు
పెరుగు: కప్పు
చింతచిగురు: రెండు కప్పులు
నెయ్యి: రెండు చెంచాలు
పచ్చిమిర్చి: ఐదు
కొబ్బరి తురుము: కప్పు
మినపప్పు: రెండు చెంచాలు
సెనగపప్పు: రెండు చెంచాలు
ఆవాలు: చెంచా
జీలకర్ర: చెంచా
కరివేపాకు: రెండు రెబ్బలు
వేరుసెనగపొడి: రెండు చెంచాలు
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
ముందుగా చింతచిగురు గినె్నలో వేసి శుభ్రం చేసి ఆవిరిపై మగ్గనిచ్చి దించాలి. చల్లారాక కొబ్బరి తురుము, పచ్చిమిర్చి ముక్కలు, పెరుగు, ఉప్పు కలపాలి. తరువాత స్టవ్‌పై బాణలిలో నెయ్యి వేసి పోపు దినుసులు వేసి వేగాక పెరుగు మిశ్రమాన్ని వేసి కలపాలి. చివరగా వేరుసెనగపొడి కలిపితే రుచిగా ఉంటుంది.
కాకరతో..
కావలసిన పదార్థాలు
కాకరకాయ: ఒకటి
పెరుగు: కప్పు
పచ్చిమిర్చి: రెండు
కొబ్బరి తురుము: అరకప్పు
ఆవాలు: చెంచా
ఎండుమిర్చి: ఒకటి
నూనె: వేయించడానికి సరిపడా
ఉప్పు: తగినంత
కరివేపాకు రెబ్బలు: రెండు
తయారుచేసే విధానం
కాకరకాయను నాలుగు ముక్కల్లా చేసుకుని ఉప్పు, చల్లి కాసేపు పక్కన ఉంచాలి. కాసేపయ్యాక నీరంతా గట్టిగా పిండేసి ముక్కల్ని నూనెలో వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, సగం ఆవాల్ని తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి.
పెరుగులో ఈ మిశ్రమం, వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు బాణలి వేడిచేసి చెంచా నూనె వేసి మిగిలిన ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు రెబ్బలు వేయించి పెరుగుపై వేసి కలిపేయాలి. చిరు చేదుతో కాకరకాయ పెరుగుపచ్చడి అన్నంలోకి చాలా బాగుంటుంది.
ఆలూతో..
కావలసిన పదార్థాలు
ఆలు: నాలుగు
పెరుగు: మూడు కప్పులు
సెనగపిండి: రెండు చెంచాలు
ఆవాలు: చెంచా
మెంతులు: చెంచా
జీలకర్ర: చెంచా
ఇంగువ: చిటికెడు
పచ్చిమిర్చి: నాలుగు
మిరియాలపొడి: అరచెంచా
పసుపు: అరచెంచా
కారం: అరచెంచా
శొంఠిపొడి: అరచెంచా
ఉప్పు: తగినంత
కొత్తిమీర తరుగు: చెంచా
నూనె: చెంచా
తయారుచేసే విధానం
బంగాళాదుంపలు ఉడికించి పొట్టుతీసి ముక్కలుగా కోయాలి. తరువాత బాణలిలో కొద్దిగా నూనె వేసి ముక్కలుపై ఉప్పు చల్లి వేయించి పక్కన ఉంచాలి. పెరుగులో తగినన్ని నీళ్లు పోసి గిలక్కొట్టి మృదువుగా చేయాలి. సెనగపిండిలో కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా చేసి పెరుగులో వేసి ఉండలు కట్టకుండా కలపాలి. బాణలిలో నూనెవేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ, పసుపు వేయాలి. తరువాత ఉడికించి, వేయించిన బంగాళాదుంప ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు స్టవ్‌ను సిమ్‌లో ఉంచి మిరియాలపొడి, కారం, శొంఠిపొడి, ఉప్పు వేసి ఓ నిముషం మగ్గిన తరువాత సెనగపిండి కలిపిన పెరుగువేసి నెమ్మదిగా తిప్పుతూ మరిగించి దించి కొత్తిమీరతో అలంకరించాలి. పెరుగు వేసేటప్పుడు గరిటెతో తిప్పుతూనే ఉండాలి.