రుచి

‘పొడుల’ పసందు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్కోసారి కూరలు తినాలనిపించవు.. ముఖ్యంగా వేసవికాలంలో అన్నం సహించదు.. ఏ కూరలూ రుచించవు.. ఇలాంటి సమయాల్లో నోటికి కారంగా, కమ్మగా ఏదో తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు వేడివేడి అన్నంలో మనసుకు నచ్చిన పొడిని వేసుకుని, కాసింత నెయ్యి కలుపుకుని తింటే నోటికి ఎంతో రుచిగా అనిపిస్తుంది. అలాంటి రుచిని, ఆరోగ్యాన్ని అందించే రకరకాల పొడులను చూద్దామా..

తెలగపిండి

కావలసిన పదార్థాలు
తెలగపిండి: అరకప్పు
ఎండుమిర్చి: పది
జీలకర్ర: చెంచా
ధనియాలు: చెంచా
వెల్లుల్లి రెబ్బలు: ఆరు
ఉప్పు: తగినంత

తయారుచేసే విధానం

నూనె లేకుండానే బాణలిలో ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెబ్బల్ని వేయించుకోవాలి. వీటిని పక్కకు తీసుకుని బాణలి వేడిగా ఉన్నప్పుడే తెలగపిండిని కూడా దోరగా వేయించుకోవాలి. వీటన్నింటితో పాటు సరిపడా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన తెలగపిండి రెడీ. ఇది రెండు వారాల వరకు తాజాగా ఉంటుంది. బాలింతలకు ఈ తెలగపిండి చాలామంచిది.

బీరపొట్టుతో..

కావలసిన పదార్థాలు
బీరపొట్టు: రెండు కప్పులు
సెనగపప్పు: పావు కప్పు
మినపప్పు: పావుకప్పు
నువ్వులు: పావు కప్పు
ఇంగువ: చిటికెడు
ఎండుమిర్చి: ఎనిమిది
చింతపండు: కొద్దిగా
వెల్లుల్లి రెబ్బలు: ఆరు
కరివేపాకు: రెండు రెబ్బలు
నూనె: పావుకప్పు
ఉప్పు: తగినంత

తయారుచేసే విధానం

బాణలిలో రెండు చెంచాల నూనె వేసి వేడిచేసి బీరపొట్టును వేసి దోరగా వేయించుకోవాలి. పచ్చివాసన, నీరు పోయాక తీసేయాలి. తరువాత నువ్వుల్ని నూనె లేకుండా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నూనె వేసి వేడిచేసి మినపప్పు, సెనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ఇంగువ, కరివేపాకులను విడివిడిగా వేయించుకుని తీసుకోవాలి. ముందుగా వేయించిపెట్టుకున్న బీరపొట్టును మిక్సీలో మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత సెనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, చింతపండు, తగినంత ఉప్పు మిక్సీలో వేసుకుని పొడిలా చేసుకోవాలి. ఈ కారాన్ని పొడి చేసి పెట్టుకున్న బీరపొట్టు పొడిలో వేసి కలిపితే సరిపోతుంది. ఈ పొడిని వేడివేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ పొడి వారం వరకూ నిల్వ ఉంటుంది.

దోసగింజలతో..

కావలసిన పదార్థాలు
దోసగింజలు: అరకప్పు
ఎండుమిర్చి: ఆరు
పల్లీలు: పావుకప్పు
జీలకర్ర: రెండు చెంచాలు
ధనియాలు: చెంచా
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
ముందు దోసగింజల్ని దోరగా వేయించుకోవాలి. తరువాత ఎండుమిర్చి, జీలకర్ర, పల్లీలు, ధనియాలను కూడా వేరువేరుగా దోరగా వేయించుకోవాలి. వీటన్నింటినీ కలిపి సరిపడా ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా పొడిచేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన దోసగింజల పొడి రెడీ.

చింతచిగురుతో

కావలసిన పదార్థాలు
చింతచిగురు: కప్పు
పల్లీలు: రెండు చెంచాలు
ధనియాలు: రెండు చెంచాలు
సెనగపప్పు: రెండు చెంచాలు
ఎండుమిర్చి: పది
వెల్లుల్లి రెబ్బలు: మూడు
నూనె: పెద్ద చెంచా
ఉప్పు: తగినంత

తయారుచేసే విధానం

చింతచిగురును శుభ్రంగా కడిగి తడిపోయేదాకా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో రెండు చెంచాల నూనె వేసి వేడిచేసి పల్లీలు, ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, సెనగపప్పు వేసుకోవాలి. అన్నీ వేగాక ఓ పళ్ళెంలోకి తీసుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నూనె వేడిచేసి చింతచిగురును వేయించుకుని తీసుకోవాలి. తాలింపును మిక్సీ జారులోకి తీసుకుని తగినంత ఉప్పు చేర్చి మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత వేయించిన చింతచిగురు కూడా వేసి పొడిలా చేసుకుంటే సరిపోతుంది. ఇది అన్నంలోకే కాదు, ఇడ్లీ, దోశల్లోకి బాగుంటుంది.

ఉలవలతో..

కావలసిన పదార్థాలు

ఉలవలు: అరకప్పు
ధనియాలు: కప్పు
ఎండుమిర్చి: ఇరవై
కరివేపాకు: ఐదు రెబ్బలు
మినపప్పు: రెండు చెంచాలు
చింతపండు: చిన్న నిమ్మకాయంత
ఆవాలు: అరచెంచా
జీలకర్ర: అరచెంచా
ఉప్పు: తగినంత
నూనె: మూడు చెంచాలు

తయారుచేసే విధానం

బాణలిలో ఉలవల్ని వేసి నూనె లేకుండానే కరకరలాడేవరకూ వేయించుకుని తీసేసుకోవాలి. తరువాత అదే బాణలిలో చెంచా నూనె వేసి వేడిచేసి ధనియాలు, కరివేపాకు విడివిడిగా వేయించుకుని పక్కకు తీసుకోవాలి. తరువాత మినపప్పు, చింతపండు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చిలను కూడా వేరువేరుగా వేయించుకుని పక్కకు తీసుకోవాలి. ఈ పదార్థాలన్నీ చల్లారిన తరువాత తగినంత ఉప్పు వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడి వారం వరకు తాజాగా ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. బలవర్ధకం కూడా..

మునగాకుతో..

కావలసిన పదార్థాలు

మునగాకు: కప్పు
ఎండుమిర్చి: ఐదు
వెల్లుల్లిరెబ్బలు: ఐదు
పసుపు: చిటికెడు
ధనియాలు: చిన్న చెంచా
జీలకర్ర: అర చెంచా
సెనగపప్పు: రెండు చెంచాలు
కందిపప్పు: రెండు చెంచాలు
మినపప్పు: రెండు చెంచాలు
చింతపండు: కొద్దిగా
ఉప్పు: రుచికి సరిపడా..

తయారుచేసే విధానం

బాణలిలో మునగాకు వేసి నూనె లేకుండా వేయించి తీయాలి. తరువాత ఎండుమిర్చి, ధనియాలు, మినపప్పు, కందిపప్పు, సెనగపప్పులను ఒకదాని తరువాత ఒకటి విడివిడిగా వేయించుకుని తీసుకోవాలి. చల్లారాక అన్నింటినీ కలిపి తగినంత ఉప్పు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇది వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.