రుచి

చలువ పానీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవి ఎండల్లో దాహానికి అందరూ మార్కెట్లో దొరికే పానీయాలను వాడతారు. కానీ పూర్వకాలం పెద్దవారు దాహానికి బార్లీ, సబ్బా, సగ్గుబియ్యం, దబ్బ ఆకులు, నిమ్మ ఆకులతో కుండల్లో వేసవి పానీయాలను తయారుచేసేవారు. మజ్జిగలో పంచదార వేసి స్వీట్ లస్సీ, నిమ్మకాయ లస్సీల్లా రకరకాల లస్సీలను తయారుచేసి పిల్లలకు తాగించేవారు. అలాగే పండ్లముక్కల్లో మీగడ పెరుగు వేసి పిల్లలు, పెద్దలు తినేవారు. ఇలా తినడం వల్ల శరీరంలోని వేడి తగ్గిపోయేది. దాహం కూడా ఎక్కువగా వేసేది కాదు. వడదెబ్బ తగలకుండా ఉండేది. మరి అలాంటి సంప్రదాయ పానీయాలను మనమూ చూసేద్దామా..

బార్లీతో..

కావలసిన పదార్థాలు
బార్లీ గింజలు: కప్పు
పంచదార: ఐదు చెంచాలు
నిమ్మరసం: నాలుగు చెంచాలు
ఉప్పు: చిటికెడు
మజ్జిగ: అర లీటరు
పచ్చికొబ్బరి కోరు: రెండు చెంచాలు
తయారుచేయు విధానం
బార్లీ గింజలను కడిగి ఒక చెంబు నీటిలో నానబెట్టాలి. ఇవి నానిన తరువాత వీటిని బాగా ఉడికించాలి. తరువాత ఈ నీటిని వడగట్టి చల్లార్చాలి. చల్లారిన బార్లీ నీటికి మజ్జిగ, ఉప్పు, పంచదార, కొబ్బరి కోరు అన్నీ చేర్చి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఎండవేళ ఈ నీటిని తాగాలి. తాగేముందు ఇందులో నిమ్మరసం కలుపుకుని చల్లచల్లగా సర్వ్ చేస్తే శరీరాన్ని నిర్జలీకరణం కాకుండా కాపాడవచ్చు.

సుగంధ లస్సీ
కావలసిన పదార్థాలు
సుగంధపొడి: ఐదు చెంచాలు
పెరుగు: ఐదు కప్పులు
పంచదార: అరకప్పు
ఉప్పు: ఒక చెంచా
నిమ్మరసం: రెండు చెంచాలు
పచ్చికొబ్బరి కోరు: ఒక చెంచా
ఐస్ ముక్కలు: తగినన్ని
కరివేపాకు: ఒక రెబ్బ
తయారుచేసే విధానం
ముందుగా పెరుగును బాగా గిలక్కొట్టుకోవాలి. తరువాత ఇందులో సుగంధపొడి, పంచదార వేసి బాగా గిలక్కొట్టుకోవాలి. లేదా మిక్సీలో వేసినా బాగుంటుంది. తరువాత దీనిలో కరివేపాకు, పచ్చికొబ్బరి కోరు, నిమ్మరసం చేర్చి ఫ్రిజ్‌లో పెట్టాలి. భోజనం తరువాత కానీ, సాయంత్రం కానీ ఈ లస్సీ తాగితే చాలా బాగుంటుంది.

కొబ్బరి నీళ్లతో..
కావలసిన పదార్థాలు
కొబ్బరినీళ్లు: నాలుగు గ్లాసులు
నిమ్మరసం: నాలుగు చెంచాలు
గ్లూకోస్: నాలుగు చెంచాలు
పంచదార: నాలుగు చెంచాలు
పుదీనా ఆకులు: అరకప్పు
తయారుచేసే విధానం
ముందుగా కొబ్బరి నీళ్లను వడకట్టుకుని పెట్టుకోవాలి. ఇందులో గ్లూకోస్, పంచదార, పుదీనా ఆకులను కలిపి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. సర్వ్ చేసేముందు ఇందులో నిమ్మరసం వేసి బాగా కలిపి చల్లచల్లగా సర్వ్ చేసుకోవాలి. అంతే.. వేసవికాలంలో దాహం తీర్చే కొబ్బరి నీళ్ల పానీయం తయారు..

సబ్జాతో..
కావలసిన పదార్థాలు
సబ్జా గింజలు: కప్పు
పంచదార: అరకప్పు
దబ్బ ఆకులు: నాలుగు
ఉప్పు: చిటికెడు
మజ్జిగ: అరలీటరు
పచ్చికొబ్బరికోరు: రెండు చెంచాలు
తయారుచేసే విధానం
సబ్జా గింజలను కడిగి నానబెట్టుకోవాలి. తరువాత ఒక్క ఉడుకు ఉడకనిచ్చి కిందకి దించి చల్లారనివ్వాలి. సబ్జా గింజల నీరు చల్లారిన తరువాత దీనికి మజ్జిగ, ఉప్పు, పంచదార, పచ్చికొబ్బరి కోరు, దబ్బ ఆకులు అన్నీ వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. సాయంత్రం వేళ ఈ పానీయాన్ని తాగితే శరీరానికి చాలా మంచిది.

సగ్గుబియ్యంతో
కావలసిన పదార్థాలు
సగ్గుబియ్యం: రెండు కప్పులు
పాలు: అరలీటరు
పంచదార: రెండు కప్పులు
యాలకులు: ఐదు
పచ్చికొబ్బరి కోరు: అరకప్పు
తయారుచేసే విధానం
సగ్గుబియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి. తరువాత సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. ఇది చల్లారిన తరువాత ఇందులో పాలు, పంచదార, యాలకులు, పచ్చికొబ్బరి తురుము కలిపి ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచాలి. సాయంత్రం వేళ చల్లగా ఓ గ్లాసు సగ్గుబియ్యం పానీయాన్ని తాగితే శరీరంలోని వేడి తగ్గిపోతుంది. ఇదేవిధంగా పాలకు బదులు పెరుగును కూడా వాడవచ్చు. అయితే పెరుగు చేర్చినప్పుడు ఉప్పు వేసుకోవాల్సి ఉంటుంది.

బాదం పాలు
కావలసిన పదార్థాలు
చిక్కటిపాలు: అరలీటరు
బాదంపొడి: అరకప్పు
సుగంధపొడి: ఒక చెంచా
జీడిపప్పులు: పనె్నండు
పిస్తాపప్పు: పనె్నండు
కిస్‌మిస్: పనె్నండు
యాలకులు: ఐదు
పంచదార: ఒక కప్పు
పచ్చికొబ్బరి కోరు: రెండు చెంచాలు
తయారుచేసే విధానం
పాలను కాచి కాసేపు సిమ్‌లోనే మరగనివ్వాలి. తరువాత ఇందులో పంచదార, బాదం పొడి, సుగంధ పొడి, జీడిపప్పు పలుకులు, పిస్తా పప్పులు, కిస్‌మిస్‌లు, పచ్చికొబ్బరి తురుము వేసి బాగా కలిపి దించేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత ఫ్రిజ్‌లో ఉంచి చల్లచల్లగా బాదంపాలను సర్వ్ చేయాలి. వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తాగుతారు. ఇందులో కొద్దిగా ఐస్‌క్రీమ్ వేసి సర్వ్ చేస్తే మరింత రుచిగా ఉంటుంది.