రుచి

పనసతో పసందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పనస కాయ నీకున్న రోజునే పెద్దలు తద్దినమన్నారు..’ అంటాడు ఓ కవి. అలాంటి పనస పండును ఆరోగ్య ప్రదాయిని అంటారు. వైద్యపరంగా పనికి వచ్చే అనేక గుణాలు పనసచెట్టు అని భాగాల్లో ఉన్నాయని శాస్ర్తియంగా ఇప్పటికే రుజువైంది. పనసను ఆంగ్లంలో జాక్‌ఫ్రూట్ అంటారు. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల వ్యాధినిరోధక శక్తి మెరుగుపడుతుంది. దీనిలో యాంటీ యాక్సిడెంట్లు, ఐసోప్లెవిన్స్ కేన్సర్ వ్యాధి నిరోధకంగా పనిచేస్తుంది. కొబ్బరిచిప్పలు, పనస ఆకులు, మొక్కజొన్న కాల్చి చేసిన పొడిని వాడటం వల్ల శరీరంపై ఎప్పటినుంచో ఉన్న పుండ్లు కూడా నయమవుతాయి. అధికబరువు, జీర్ణ సమస్యలు, ఒత్తిడి వంటి సమస్యల్ని కూడా పనస తగ్గిస్తుంది. అలాంటి పనస ఏప్రిల్ నుంచి జులైలో ఎక్కువగా వస్తుంది. మరి పనసతో చేసే వంటకాలేమిటో చూసేద్దామా..

పనస పొట్టు కూర

కావలసిన పదార్థాలు
చిన్న పనస కాయ
చింతపండు గుజ్జు: అరకప్పు
ఆవాలు: మూడు చెంచాలు
ఎండు మిర్చి: ఆరు
పచ్చిమిరపకాయలు: ఆరు
పొట్టు మినపప్పు: చెంచా
సెనగపప్పు: చెంచా
కరివేపాకు: రెండు రెబ్బలు
ఆవాలు: చెంచా ఇంగువ: చిటికెడు
పసుపు: అర చెంచా
పల్లీలు: గుప్పెడు జీడిపప్పు: గుప్పెడు
నూనె: తగినంత
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
ముందుగా పనసకాయను పొట్టుగా కొట్టుకోవాలి. ఇప్పుడు మార్కెట్లో పనసకాయను పొట్టు చేసి ఇచ్చేవాళ్లు కూడా ఉన్నారు. ఈ పొట్టు ఎంత సన్నగా ఉంటే కూర అంత రుచిగా ఉంటుంది. ఈ పనస పొట్టును బాగా కడగాలి. తరువాత స్టవ్‌పై వెడల్పాటి బాణలిని ఉంచి నూనె వేయాలి. కాగిన తరువాత పొట్టు మినపప్పు, సెనగపప్పు, ఆవాలు, పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపును వేయాలి. ఇవి కాస్త వేగాక ఇందులో పల్లీలు, జీడిపప్పు కూడా వేయాలి. ఇవి వేగాక, కడిగి ఉంచుకున్న పనసపొట్టును కూడా వేయాలి. తరువాత దీన్ని బాగా కలిపి చింతపండు పులుసు, ఉప్పు వేసి బాగా కలిపి మూతపెట్టేయాలి. స్టవ్ మంటను మధ్యకు పెట్టి వదిలేయాలి. ఇందులో పులుపు ఎక్కువ, తక్కువ కాకుండా చూసుకోవాలి. ఒక పది నిముషాలు అయిన తరువాత మూత తీసి ముక్క ఉడికిందో, లేదో చూసుకోవాలి. ఇప్పుడు మూత తీసి కూర పొడి పొడి అయ్యేంత వరకు స్టవ్ మంటను మధ్యకే ఉంచాలి. ఈ సమయంలో కావాలంటే కొద్దిగా నూనెను కూడా కలుపుకోవచ్చు. చివరగా పొయ్యి కట్టేసిన తరువాత ఆవ కోసం తీసుకున్న ఆవాలను కాసిన్ని నీళ్లు పోసి బాగా నూరి కూర చల్లారిన తరువాత అందులో వేయాలి. అంతే కూర తినడానికి తయారు. మామూలుగా అన్ని ఆవ పెట్టిన కూరలలాగానే, పులిహోర వలెనే ఈ కూర కూడా మరునాటికి చాలా బాగుంటుంది.

బిరియాని

కావలసిన పదార్థాలు
పనస ముక్కలు: పావు కిలో
నూనె: అరకప్పు
నెయ్యి: కొద్దిగా
బాసుమతి బియ్యం: రెండు కప్పులు
పచ్చిమిర్చి: ఆరు
క్యారెట్: ఒకటి
ఉల్లిపాయ: ఒకటి
బఠాణీ: మూడు చెంచాలు
టొమాటో: ఒకటి
అల్లం-వెల్లుల్లి పేస్ట్: రెండు చెంచాలు
లవంగాలు: మూడు చెక్క: కొద్దిగా
యాలకులు: మూడు బిర్యానీ ఆకులు: మూడు
గరంమసాలా: అర చెంచా
ధనియాల పొడి: రెండు చెంచాలు
పసుపు: చిటికెడు కారం: అరచెంచా
ఉప్పు: తగినంత కరివేపాకు: మూడు రెబ్బలు
కొత్తిమీర: మూడు చెంచాలు
పుదీనా: మూడు చెంచాలు

తయారుచేసే విధానం
ముందుగా కూరగాయలను అన్నింటినీ సన్నటి ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. బాసుమతి బియ్యాన్ని కడిగేసుకుని కొద్దిగా నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌పై కుక్కర్ పెట్టుకుని అందులో నూనె, నెయ్యి వేసుకోవాలి. వేడిచేశాక హోల్ గరంమసాలా దినుసులు వేసుకుని వేయించాలి. ఇందులో అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. పచ్చివాసన పోయాక ఇందులో ఉల్లిపాయల ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగాక పనస ముక్కలు వేసి వేయించాలి. ఇందులో కరివేపాకు, పుదీనా వేసి వేయించాలి. ఇందులో బఠాణీ, క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి. ఇవి కాస్త మగ్గాక టొమాటో ముక్కలు వేసి వేయించాలి. ఇవి పూర్తిగా మగ్గాక ఇందులో నానబెట్టుకున్న బాసుమతి బియ్యాన్ని వేసుకోవాలి. ఇందులో మూడు కప్పుల నీళ్లను పోసుకోవాలి. ఇందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి. తరువాత కుక్కర్‌పై మూత పెట్టేయాలి. రెండు విజిల్స్ వచ్చేంతవరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. ప్రెషర్ పోయాక కుక్కర్‌ను తీసి ఇందులో కొత్తిమీర తరుగు వేసి వేడివేడిగా వడ్డించాలి. అంతే ఎంతో రుచికరమైన పనసకాయ బిర్యానీ రెడీ. ఇలాగే పనస పొట్టుతో కూడా చేసుకోవచ్చు.

గింజలతో..

కావలసిన పదార్థాలు
పనస గింజలు: ఒక కప్పు
పునాస మామిడి: ఒకటి
పచ్చిమిర్చి: మూడు
నూనె: ఒక చెంచా
మెంతులు: అర చెంచా
ఆవాలు: అర చెంచా
ఎండుమిర్చి: నాలుగు
పచ్చికొబ్బరి కోరు: పావు కప్పు
జీలకర్ర: పావు చెంచా
పసుపు: పావు చెంచా
లవంగాలు: రెండు
కరివేపాకు: నాలుగు రెబ్బలు
ఉల్లిపాయ: పెద్దది ఒకటి
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
పనస గింజల్ని చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. ఈ ముక్కలను కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించాలి. మామిడికాయ, ఉల్లిపాయను కూడా ముక్కలుగా కోసుకోవాలి. పచ్చికొబ్బరి కోరు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, లవంగాలు, పసుపు, జీలకర్రలను మెత్తని పేస్టులా చేసుకోవాలి. తర్వాత పనస ముక్కలు ఉడికించిన కుక్కర్లో మామిడి ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు వేసి ఉడికించాలి. మామిడికాయ ముక్క మెత్తబడ్డాక పప్పు గుత్తితో పనసగింజలను, మామిడి ముక్కలను మెదపాలి. ఇందులో పచ్చికొబ్బరి పేస్టుని కలిపి సన్నని సెగపై మరికొద్దిసేపు ఉంచాలి. ఒక బాణలిని తీసుకుని అందులో నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లితరుగుతో తాలింపు పెట్టి కూరలో వేసేయాలి. ఈ కూర అన్నంతో చాలా చాలా రుచిగా ఉంటుంది.

పిక్కల వేపుడు

కావలసిన పదార్థాలు
పనస గింజలు: అర కిలో
పసుపు: అర చెంచా
ఎండుమిర్చి: నాలుగు
కారం: ఒక చెంచా
మిరియాలు: పావు చెంచా
మైదా: 30 గ్రాములు
నూనె: 50 గ్రాములు
మినపప్పు: 15 గ్రాములు
ఆవాలు: ఐదు గ్రాములు
జీలకర్ర: ఆరు గ్రాములు
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
పనస గింజల్ని ఉడికించి తొక్కతీసి ముక్కలుగా చేసుకోవాలి. ఎండుమిర్చి, మినపప్పు, జీలకర్రలను నూనెలో దోరగా వేయించి పొడి చేసుకుని అందులో పనస గింజలను కలపాలి. తరువాత మిరియాలను, ఆవాలను పొడి చేసుకుని మైదా, కారాలను పనస గింజలకు పట్టించాలి. వీటిని నూనెలో వేయించుకోవాలి. ఇవి అన్నం, పులుసుకూరల్లో నంజుకుని తినడానికి బాగుంటాయి.

ఆవకాయ

కావలసిన పదార్థాలు
పచ్చి పనస ముక్కలు: కిలో
ఆవనూనె: 350 గ్రాములు
పచ్చి మామిడి కాయలు: రెండు
సోంపు: నాలుగు చెంచాలు
మెంతులు: మూడు చెంచాలు
ఆవాలు: ఐదు చెంచాలు
కారం: నాలుగు చెంచాలు
పసుపు: చెంచా
ఉప్పు: తగినంత
ఇంగువ: తగినంత
తయారుచేసే విధానం
పచ్చి పనస ముక్కలని ఆవకాయ ముక్కల సైజు కంటే కాస్త పెద్దగా తరిగి పెట్టుకుని గింజలు తీసేయాలి. ఈ ముక్కలకు తగినన్ని నీళ్లు తీసుకుని అందులో పసుపు, ఉప్పు వేసుకుని పూర్తిగా కాకుండా ముక్క మూడొంతులు ఉడికే వరకూ ఉంచి నీళ్లను వడకట్టుకోవాలి. ఈ ముక్కలను తడి లేకుండా ఎండలో నూలు వస్త్రంపై పరిచి ఐదారుగంటలపాటు ఎండబెట్టుకోవాలి. దీనిలో ఎక్కడా తడి ఉండకూడదు. తరువాత ఓ బాణలిని తీసుకుని అందులో నూనె లేకుండా సోంపు, మెంతులను వేయించుకుని ఆవాలతో కలిపి పొడి చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆవనూనె వేసి వేడిచేసుకుని స్టవ్ కట్టేయాలి. ఈ నూనెలో సోంపు, మెంతులు, ఆవపొడి మిశ్రమం, కారం, ఉప్పు, ఇంగువ వేసుకుని మామిడికాయ ముక్కలు, పనసకాయ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జాడీలో నింపుకుని వారం రోజుల పాటు మంచి ఎండలో ఉంచి తీసి లోపలపెట్టాలి. ఈ పచ్చడి వారం తర్వాత ఊరి బాగుంటుంది. ఇందులో రెండు చెంచాల వెనిగర్ వేస్తే పచ్చడి పాడు కాకుండా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది.

మసాలా కూర

కావలసిన పదార్థాలు
పనస కాయ ముక్కలు: రెండు కప్పులు
పచ్చికొబ్బరి పేస్ట్: అరకప్పు
ఉల్లిపాయ పేస్ట్: అరకప్పు
అల్లం-వెల్లుల్లి పేస్ట్: ఒక చెంచా
గసగసాలు, జీడిపప్పు పేస్ట్: అర కప్పు
వేయించిన పల్లీల పేస్ట్: అర కప్పు
చింతపండు: కొద్దిగా
బెల్లం: కొద్దిగా
గరంమసాలా: ఒక చెంచా
పసుపు: చిటికెడు
నూనె: మూడు చెంచాలు
ఉప్పు: తగినంత
కారం: తగినంత
కొత్తిమీర: కొద్దిగా
తయారుచేసే విధానం
పనస కాయను శుభ్రం చేసుకుని ముక్కలుగా కోసుకోవాలి. వీటిలో ఉప్పు, పసుపు, నీళ్లు పోసుకుని ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత బాణలిలో నూనె వేసుకుని కాగిన తరువాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, కారం, గరంమసాలా వేసుకుని వేయించుకోవాలి. తరువాత ఇందులో అల్లం-వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఉంచుకుని తరువాత జీడిపప్పు-గసగసాల పేస్ట్‌ను కూడా వేసుకోవాలి. ఇది బాగా వేగిన తరువాత పచ్చికొబ్బరి పేస్ట్‌ను వేయాలి. ఇది బాగా కలుపుకున్న తరువాత ఇందులో వేయించిన పల్లీల పేస్ట్ వేయాలి. దీన్ని కూడా బాగా కలిపి వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో పనస ముక్కలు వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. దీన్ని కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి.
నూనె తేలిన తరువాత చివరగా కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర తరుగు కూడా వేసి దించేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన పనస కాయ మసాలా కర్రీ తయారు.