రుచి

చిటపట చినుకుల్లో చాట్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయంత్రం వేళ స్నాక్స్ అంటే పానీపూరీనే గుర్తొస్తుంది పిల్లలకైనా.. పెద్దలకైనా.. ముఖ్యంగా చిటపట చినుకులు పడుతుంటే సమోసాచాట్, పావ్‌బాజీ వంటివి గుర్తొచ్చి నోట్లో నీళ్లూరతాయి. అయితే రోడ్ల పక్కన పానీ పూరీ బండ్లలో పానీపూరీ తినడానికి తల్లులు ససేమిరా ఒప్పుకోరు. కాబట్టి ఇంట్లోనే శుచి, రుచిగా చేసుకుంటే.. పిల్లలు ఎంత తిన్నా ఇబ్బంది ఉండదు. మరి అలాంటి చాట్ రకాలు ఇంట్లో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం..

బ్రెడ్ కటోరి చాట్
కావలసిన పదార్థాలు
బ్రెడ్ స్లైసులు: ఆరు
ఉడికించిన బంగాళాదుంపలు: అరకప్పు
ఉడికించిన స్వీట్ కార్న్: పావుకప్పు
ఉడికించిన తెల్ల సెనగలు: రెండు చెంచాలు
కీరాదోస ముక్కలు: రెండు చెంచాలు
టొమాటో ముక్కలు: రెండు చెంచాలు
ఉల్లిపాయ ముక్కలు: రెండు చెంచాలు
పెరుగు: అరకప్పు
ఉప్పు: రుచికి సరిపడా
చాట్ మసాలా: ఒక చెంచా
నల్ల ఉప్పు: పావు చెంచా
సన్న కారప్పూస: ఒక చెంచా
నూనె: ఒక చెంచా
పంచదార: ఒక చెంచా
కొత్తిమీర తరుగు: మూడు చెంచాలు
చింతపండు చాట్ చట్నీ: అరకప్పు
తయారుచేసే విధానం
ముందుగా పెరుగులో పంచదార కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక్కో బ్రెడ్ అంచులను తీసేసి తెల్లని భాగాన్ని చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. ఆ తరువాత మఫిన బేకింగ్ ట్రేలోని గుంతలకు నూనె రాసి, వత్తి పెట్టుకున్న బ్రెడ్‌లను వాటిలో పెట్టి గట్టిగా అదిమి గుంతల గోడలకు అంటించాలి. తరువాత వీటిని 190 డిగ్రీలు లేదా 370 ఫారన్‌హీట్ ప్రీ హీట్ చేసిన ఒవెన్‌లో పావుగంటసేపు ఉంచి తీయాలి. అప్పుడు కరకరలాడే బ్రెడ్ కటోరీలు తయారవుతాయి. ఆ తరువాత కొత్తిమీర, సన్న కారప్పూస తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ ఒక గినె్నలో వేసి బాగా కలిపి బ్రెడ్ కటోరీలలో వేసి వాటి పైన పెరుగు, కొత్తిమీర, సన్న కారప్పూస వేసి పిల్లలకు అందించాలి. ఒక్కో కప్పు వారు ఎంతో ఆస్వాదిస్తూ తింటారు.

పానీపూరీ

కావలసిన పదార్థాలు
గోధుమరవ్వ: కప్పు
మైదా: మూడు చెంచాలు
బేకింగ్‌సోడా: పావుచెంచా
ఉప్పు: తగినంత
వంటనూనె: వేయించేందుకు సరిపడా
చింతపండు గుజ్జు: అరకప్పు
జీలకర్రపొడి: రెండు చెంచాలు
నీరు: రెండు కప్పులు
జీలకర్ర: మూడు చెంచాలు
కొత్తిమీర ఆకులు: అరకప్పు
పచ్చిమిరపకాయలు: మూడు
పుదీనా ఆకులు: కప్పు
నల్ల ఉప్పు: ఒక చెంచా
బంగాళాదుంపలు: రెండు
పచ్చిమిరపకాయలు: మూడు
ఉల్లిపాయలు: రెండు
తయారుచేసే విధానం
వెడల్పాటి గినె్న తీసుకుని అందులో గోధుమరవ్వ, ఉప్పు, మైదా, బేకింగ్ సోడా, వేడినీరు పోసి పూరీ పిండిలా కలుపుకుని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. వీటిని పూరీల్లా ఒత్తుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలి ఉంచి అందులో నూనె వేసి కాగాక ఒత్తుకున్న పూరీలను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. తరువాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, నల్ల ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నీళ్లతో కలపాలి. ఈ నీళ్లలోని చింతపండు గుజ్జు, జీలకర్ర కూడా కలుపుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోవాలి. తరువాత బంగాళాదుంపలను ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. చల్లారాక వీటిని గుజ్జుగా చేసి పొయ్యిపై పెనం పెట్టి నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలను వేయాలి. ఆ తరువాత వేయించిన జీలకర్రపొడి, ఉప్పు, కొత్తిమీర, ఉప్పు, వేసి గరిటెతో తిప్పుతూ వేడెక్కాక దింపేయాలి. అంతే స్టవ్ కూడా రెడీ. ఈ స్ట్ఫ్‌ను పూరీలో ఉంచి పానీలో ముంచి తింటుంటే ఆ మజాయే వేరు..

కార్న్‌ఫ్లేక్స్ చాట్

కావలసిన పదార్థాలు
కార్న్‌ఫ్లేక్స్: ఒకటిన్నర కప్పు
టొమాటో: ఒకటి
పచ్చిమిర్చి: ఒకటి
కారం: చిటికెడు
మిరియాలపొడి:చిటికెడు
తేనె: కొద్దిగా
ఉల్లి తరుగు:
రెండు చెంచాలు
చాట్ మసాలా: చిటికెడు
జీలకర్ర పొడి: పావు చెంచా
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు:
రెండు చెంచాలు
నెయ్యి: ఒక చెంచా
తయారుచేసే విధానం
టొమాటోను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. తరువాత కార్న్‌ఫ్లేక్స్ తప్ప మిగిలిన అన్ని పదార్థాలను ఒక పళ్లెంలోకి తీసుకుని వాటిని చేతితో నలపాలి. ఇలా చేయడం వల్ల ఆ పదార్థాల నుంచి తేమ బయటకు వస్తుంది. కాసేపటి తరువాత వీటిలో కార్న్‌ఫ్లేక్స్ వేసి కలపాలి. తరువాత ఇందులో నెయ్యివేసి మళ్లీ బాగా చేత్తో కలపాలి. పైన నిమ్మరసాన్ని చల్లుకుని ఆలస్యం చేయకుండా వెంటనే వడ్డించేయాలి.

కార్న్ చాట్

కావలసిన పదార్థాలు
ఉడికించిన కార్న్: కప్పు పనీర్ ముక్కలు: అరకప్పు
ఉల్లిపాయ: ఒకటి టొమాటో: ఒకటి
క్యారెట్: సగం పచ్చిమిర్చి: ఒకటి
కొత్తిమీర: చిన్న కట్ట చాట్ మసాలా: అరచెంచా
ఆమ్‌చూర్: చిటికెడు ఉప్పు: తగినంత
మిరియాలపొడి: చిటికెడు
తయారుచేసే విధానం
ఉల్లిపాయ, టొమాటోలను ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్‌పై పెనం ఉంచి కొద్దిగా బటర్ వేసుకోవాలి. దీనిలో కార్న్, పనీర్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, మిగిలిన అన్ని పదార్థాలను వేసి చివరగా కొత్తిమీర కూడా వేసి కలపాలి. తరువాత వీటిని గినె్నలోకి తీసుకుని ఉడికించిన పల్లీలతో అలంకరించుకుని తింటే ఇది మరింత టేస్టీగా ఉంటుంది.

సమోసా చాట్

కావలసిన పదార్థాలు
చనా మసాలా: తగినంత
ధనియాల పొడి: అరచెంచా
జీలకర్రపొడి: అరచెంచా
ఉప్పు: తగినంత
టొమాటో: ఒకటి
బటర్: ఒక చెంచా
ఉల్లిపాయలు: రెండు
చాట్‌మసాలా: అరచెంచా
కారం: రుచికి సరిపడా
సమోసాలు: రెండు
కాబూలి చనా: కప్పు
నీళ్లు: సరిపడా
పెరుగు: కొద్దిగా
గ్రీన్ చట్నీ: ఒక చెంచా
స్వీట్ చట్నీ: ఒక చెంచా
కొత్తిమీర: కట్ట
తయారుచేసే విధానం
బాణలిని స్టవ్‌పై ఉంచి కొద్దిగా బటర్ వేసుకోవాలి. తరువాత అందులో ఉడికించిన కాబూలి చనా, తరిగిన టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు రుచికి సరిపడా ఉప్పు, కారం, జీలకర్రపొడి, ధనియాల పొడి, చాట్ మసాలా వేసి కొద్దిసేపు వేయించి తరువాత నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు సమోసాలను ముక్కలుగా చేసి ఉడికించుకున్న చాట్‌లో వేసి కలపాలి. దీనిలో కొంచెం గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ వేసి కలుపుకోవాలి. తరువాత పైన పెరుగు వేసి కొద్దిగా కొత్తిమీర, సేవ్‌తో గార్నిష్ చేస్తే వేడివేడి సమోసా చాట్ రెడీ.

పావ్‌బాజీ

కావలసిన పదార్థాలు
పావ్: నాలుగు
తరిగిన ఉల్లిపాయలు: అరకప్పు
ఉడికించిన బఠాణీలు: అరకప్పు
ఉడికించిన క్యారెట్: అరకప్పు
ఉడికించిన ఆలు: ఒకకప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్: ఒక చెంచా
కారం: ఒక చెంచా
ధనియాలపొడి: ఒక చెంచా
జీలకర్రపొడి: ఒక చెంచా
పావ్‌బాజీ మసాలా: రెండు చెంచాలు
టొమాటో ప్యూరీ: ఒక కప్పు
టొమాటో కెచప్: రెండు చెంచాలు
తరిగిన కొత్తిమీర: అరకప్పు
బటర్: మూడు చెంచాలు
తయారుచేసే విధానం
ముందుగా స్టవ్‌పై పాన్ పెట్టుకుని ఒక చెంచా బటర్ వేయాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసుకోవాలి. రెండు నిముషాలు వేగిన తరువాత ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. పచ్చి వాసన పోయాక టొమాటో ప్యూరీ వేయాలి. దీన్ని రెండు నిముషాలు వేయించాలి. తరువాత ఉడికించిన క్యారెట్ ముక్కలు, బఠాణీలు, ఆలూలను వేయాలి. వాటిని బాగా వేయించి కొద్దిగా నీళ్లు పోసుకుని రెండు నిముషాల పాటు ఉడికించాలి. దీన్ని మాషర్‌తో బాగా మెత్తగా చేయాలి. తరువాత ఇందులో రెండు చెంచాల పావ్‌బాజీ మసాలా వేయాలి. తరువాత ఉప్పు, టొమాటో కెచప్ వేసి బాగా ఉడికించి దగ్గర పడిన తరువాత కొత్తిమీర తరుగు వేసి చివరగా ఒక చెంచా బటర్ వేయాలి. మరో స్టవ్‌పై చపాతీ పెనాన్ని ఉంచి దానిపై మిగిలిన బటర్ వేసి వేడయ్యాక పావ్‌ను విడదీసి రెండు వైపులా దోరగా వేయించాలి. తరువాత పావ్‌ను, కర్రీని వేడివేడిగా పిల్లలకు అందించాలి. అంతే ఎంతో రుచికరమైన పావ్ బాజీ తయారు.