రుచి

ఆనందాన్ని పెంచే మిఠాయలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శుభకార్యమేదైనా నోటిని తీపి చేసుకోవడం మన సంప్రదాయం. రాబోయేది అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధాన్ని తెలియజేసే రాఖీపౌర్ణమి. ఆ వేడుక రోజున రాఖీలు మాత్రమే కొత్తగా ఉంటే సరిపోదు. ఆనందాన్ని పంచుకునేందుకు చేసుకునే మిఠాయిలు కూడా కాస్త కొత్తగా, భిన్నంగా ఉన్నప్పుడే పండుగకు నిండుదనం. అయితే మిఠాయిల్లో హల్వాను మించిన మిఠాయి మరొకటి ఉండదు కదా.. అందుకోసమే రకరకాల హల్వాలు మీకోసం..

ఓట్స్-బ్రెడ్‌తో..

కావలసిన పదార్థాలు
బ్రెడ్ స్లైస్‌లు: ఐదు ఓట్స్: కప్పు
నెయ్యి: అరకప్పు
పంచదార: ఒకటిన్నర కప్పు
కుంకుమపువ్వు: కొద్దిగా
యాలకుల పొడి: పావుచెంచా
ఎండుద్రాక్ష: నాలుగు చెంచాలు
జీడిపప్పు: యాభై గ్రాములు
పాలు: రెండు కప్పులు కోవా: ఐదు చెంచాలు
తయారుచేసే విధానం
రెండు చెంచాల పాలల్లో కుంకుమపువ్వును నానబెట్టుకోవాలి. బ్రెడ్‌స్లైసుల్ని నాలుగు భాగాలుగా కోసి నెయ్యిలో వేయించి తీసి పెట్టుకోవాలి. అదే బాణలిలో ఓట్స్‌ను కూడా వేయించి చల్లారనివ్వాలి.
అలాగే జీడిపప్పు, ఎండుద్రాక్ష పలుకులను కూడా వేయించుకోవాలి. చల్లారిన ఓట్స్‌ని పొడిచేసుకుని మరోసారి వేయించి అందులో బ్రెడ్డు ముక్కలు, పాలు చేర్చాలి. ఇందులో నానిన కుంకుమపువ్వును పాలతో సహా వేసి తరువాత యాలకులపొడి, పంచదార, కోవా చేర్చి సన్నని మంటపై ఉంచాలి. పదిహేను నిముషాలకు ఇది గట్టిపడుతుంది. మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు దింపేసి ఎండుద్రాక్ష, జీడిపప్పు పలుకులు వేసి మరోసారి కలిపితే సరిపోతుంది.

పిస్తాతో..

కావలసిన పదార్థాలు
కార్న్‌ఫ్లోర్: కప్పు
పంచదార: రెండు కప్పులు
మంచినీళ్లు: మూడు కప్పులు
నెయ్యి: ఒకటిన్నర కప్పులు
యాలకులపొడి: చెంచా
పిస్తా పప్పులు: కప్పు
గ్రీన్ ఫుడ్ కలర్: చిటికెడు
తయారుచేసే విధానం
మందపాటి బాణలిలో పంచదార, తగినన్ని నీళ్లు పోసి అది కరిగేవరకూ మరిగించాలి. విడిగా ఒక గినె్నలో కార్న్‌ఫ్లోర్ వేసి అందులో కప్పు నీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలపాలి. అందులోనే ఫుడ్ కలర్ కూడా వేసి బాగా కలపాలి. పంచదార పూర్తిగా కరిగాక అందులో కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుతూ ఉడికించాలి. అది చిక్కగా జెల్లీ మాదిరిగా పారదర్శకంగా అవుతుంది. ఇప్పుడు మంటను మీడియంలో ఉంచి కొంచెం కొంచెంగా నెయ్యి వేస్తూ ఉడికించాలి. హల్వా బాగా ఉడికిన తరువాత నెయ్యి బయటకు వస్తుంటుంది. ఇప్పుడు పిస్తా పప్పుల ముక్కలు వేసి నెయ్యి రాసిన ప్లేటులోకి మిశ్రమాన్ని వేసి, కావలసిన ఆకారంలో ముక్కలుగా కోయాలి. అంతే రుచికరమైన పిస్తా హల్వా తయారు.

అంజీరతో..
కావలసిన పదార్థాలు
ఎండు అంజీర: ఒకటిన్నర కప్పు
నెయ్యి: మూడు చెంచాలు
బాదంపొడి: అరకప్పు
పంచదార: ఐదు చెంచాలు
పాలపొడి: ఐదు చెంచాలు
యాలకుల పొడి: పావు చెంచా
వేయించిన జీడిపప్పు: పది
బాదం: పది
ఎండుద్రాక్ష: రెండు చెంచాలు
తయారుచేసే విధానం
ఒక గినె్నలో సగం వరకు నీళ్లు తీసుకుని అందులో అంజీర వేసి స్టవ్‌పై ఉంచాలి. అవి కాస్త మెత్తగా అయ్యాక దింపేసి నీళ్లు వంపేయాలి. వీటిని మిక్సీ జారులోకి తీసుకుని మెత్తని ముద్దలా చేసుకోవాలి. మరో బాణలిని స్టవ్‌పై ఉంచి నెయ్యి వేసి కరిగించి బాదం పొడి వేయాలి. రెండు నిముషాలయ్యాక ముందుగా వేసుకున్న అంజీర ముద్ద, పాలపొడి, పంచదార, అరకప్పు నీళ్లు పోసి మంట తగ్గించాలి. ఐదు నిముషాల తరువాత యాలకులపొడి వేయాలి. అది దగ్గరయ్యాక జీడిపప్పు, బాదంపప్పు, ఎండుద్రాక్ష వేసి దింపేస్తే సరిపోతుంది.

బాదంతో..
కావలసిన పదార్థాలు
బాదం: కప్పు
పంచదార: కప్పు
పాలు: రెండు కప్పులు
నెయ్యి: కప్పు
కుంకుమపువ్వు: కొద్దిగా
తయారుచేసే విధానం
బాదంను నానబెట్టి పొట్టుతీసి రుబ్బాలి. నాన్‌స్టిక్ పాన్‌లో రెండు చెంచాల నెయ్యి వేసి పాన్ అంతా రాసి అందులో అరకప్పు నీళ్లు పోసి మరిగించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అందులో పంచదార వేసి కరిగించాలి. తరువాత మరో బాణలి తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి బాదం ముద్ద, పాలు, కుంకుమపువ్వు వేసి మీడియం మంటపై కలుపుతూ ఉడికించాలి. ఇష్టమైతే మిఠాయి రంగు కూడా వేసుకోవచ్చు. మిశ్రమం చిక్కబడి ముద్దలా అయ్యాక నెయ్యిలో ముప్పావువంతు వేసి మరో పది నిముషాల పాటు సిమ్‌లో ఉడికించాలి. నెయ్యి అంతా హల్వాలో ఇంకిపోయి అంచుల నుంచి వేరవుతుండగా స్టవ్ ఆఫ్ చేసి మిగిలిన నెయ్యి కూడా వేసి కలిపి కాస్త చల్లారాక మనకు కావలసిన ఆకారంలో ముక్కలుగా కోయాలి. అంతే ఎంతో రుచికరమైన బాదం హల్వా రెడీ.
బీట్‌రూట్‌తో..
కావలసిన పదార్థాలు
బీట్‌రూట్ తురుము: మూడు కప్పులు
బొంబాయి రవ్వ: ముప్పావు కప్పు
మంచినీళ్లు: ఒకటిన్నర కప్పులు
నెయ్యి: పది చెంచాలు
పంచదార: రెండు కప్పులు
జీడిపప్పు: రెండు చెంచాలు
ఎండుద్రాక్ష: రెండు చెంచాలు
బాదం: పది
యాలకులపొడి: అరచెంచా
తయారుచేసే విధానం
బీట్‌రూట్ తొక్కు తీసి సన్నగా తురమాలి. పాన్‌లో ఒక చెంచా నెయ్యివేసి బొంబాయి రవ్వ వేసి సుమారు ఐదు నిముషాలు వేయించి తీసి ఆరనివ్వాలి. అదే పాన్‌లో మరో చెంచా నెయ్యి వేసి సన్నగా తరిగిన బాదం, జీడిపప్పు వేసి వేయించాలి.
తరువాత ఎండు ద్రాక్ష కూడా వేసి వేగాక అన్నీ తీసి పక్కన ఉంచాలి. ఇప్పుడు అదే బాణలిలో మిగిలిన నెయ్యి, బీట్‌రూట్ తురుము వేసి మీడియం ఫ్లేమ్‌లో వేయించాలి. అందులో నీరంతా పొయ్యి సగమయ్యేవరకూ అంటే పది నిముషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు వేయించిన బొంబాయిరవ్వ కూడా వేసి బాగా కలపాలి. తరువాత మంచినీళ్లు, పంచదార వేసి కలపాలి. ఇప్పుడు మూతపెట్టి మీడియం మంటపై నీరంతా ఆవిరయ్యేవరకూ ఉడికించాలి. తరువాత యాలకులపొడి, వేయించిన జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష అన్నీ వేసి కలిపి దించాలి.

అరటిపండుతో..
కావలసిన పదార్థాలు
బాగా పండిన అరటిపండ్లు: మూడు
ఖర్జూరపండ్లు: నాలుగు
పంచదార: కప్పు
నెయ్యి: కప్పు
జీడిపప్పు: నాలుగు చెంచాలు
తయారుచేసే విధానం
బాగా పండిన అరటిపండ్లను తీసుకోవాలి. ఒకవేళ అలా పండినవి దొరక్కపోతే వాటిని పాలిథీన్ కవర్‌లో రెండు, మూడు రోజులు ఉంచితే మిగల పండుతాయి. అలాంటి పండ్ల గుజ్జును, ఖర్జూరాలను మిక్సీలో వేయాలి. అందులోనే పంచదార కూడా వేసి బాగా మెత్తగా రుబ్బాలి. రుబ్బేటప్పుడు నీళ్లు పోయకూడదు. స్టవ్‌పై ఒక చిన్న బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు ముక్కల్ని వేయించాలి. ఇప్పుడు అరటిపండు మిశ్రమాన్ని నాన్‌స్టిక్ పాన్‌లో వేసి మీడియం మంటపై కలుపుతూ ఉండాలి. మిశ్రమం బాగా ఉడికి రంగు మారి, చిక్కబడుతుండగా మిగిలిన నెయ్యి కొంచెం కొంచెం వేస్తూ ఉడికించాలి. హల్వా బాగా ఉడికి అందులోని నెయ్యి తేలుతుండగా వేయించిన జీడిపప్పు ముక్కలు వేసి కలపాలి. ఒకసారి మిశ్రమాన్ని చేత్తో పట్టుకుని చూసి అది ఇంకా జిగురుగా అంటుకుంటుంటే మరో రెండు, మూడు నిముషాలు ఉడికించాలి. మిశ్రమం పూర్తిగా పాన్ అంచుల నుంచి వేరవుతుండగా దించి నెయ్యి రాసిన ప్లేటులో వేసి చల్లారాక ముక్కలుగా కోసి అందించాలి.