రుచి

నోరూరించే చేప రుచులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వానాకాలంలో చేపలను తినని వారు ఉండరేమో.. నదులు, సముద్రాలు, చెరువులు నీటితో నిండుగా కళకళలాడే ఈ రోజుల్లో చేపలకు లోటేంటి? పులస, కొరమీను, హిల్సా, చందువా.. ఇలా ఎన్నో రకాలు.. చేపల్లో అనేక పోషకాలుంటాయి. ముఖ్యంగా ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు చాలా సమృద్ధిగా ఉంటాయి. ఫలితంగా గుండె జబ్బులు, ఒత్తిడి, మతిమరుపు వంటివి రాకుండా ఉంటాయి. చర్మం ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ‘పుస్తెలమ్ముకొని అయినా పులస తినాలి..’ అని మన పెద్దవారు ఎప్పుడో చెప్పారు. కాబట్టి.. నచ్చిన చేపను ఎంచుకుని వండుకుని తిందామా..

పులసతో..

కావలసిన పదార్థాలు
పులస చేప: కిలో
గానుగ నూనె: 200 గ్రాములు
బెండకాయలు: పది
పచ్చిమిర్చి: ఎనిమిది
ఉల్లిపాయలు: నాలుగు
ధనియాలు: ఒకచెంచా
జీలకర్ర: ఒకచెంచా
వెల్లుల్లిపాయలు: ఒకటి
వెన్నపూస: 100 గ్రాములు
చింతపండు: 150 గ్రాములు
కారం: రెండు చెంచాలు ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
ముందుగా చింతపండును నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని సన్నని ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. చేపలను ఉప్పు, పసుపు వేసి బాగా కడిగి పక్కన పెట్టాలి. సాధారణంగా పులసలని మట్టికుండల్లోనే వండుతారు. వాటిల్లో వండుతేనే దానికి మరింత రుచి వస్తుందని నమ్మకం. కాబట్టి వీలైనంత వరకు చేపల పులుసు చేసుకునే మట్టి కుండను ఎంచుకోండి.. లేకపోతే మీకు నచ్చిన వెడల్పాటి పాత్రను ఎంచుకోవాలి. దీన్ని స్టవ్‌పై ఉంచి వేడిచేసుకోవాలి. ఇందులో నూనె వేసి కాగిన తరువాత బెండకాయలు, పచ్చిమిర్చి వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు రసం తీసి సిద్ధంగా ఉంచుకోవాలి. ఉల్లిపాయల్ని, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ రేకల్ని కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. అదే గినె్నలో మిగిలిన నూనె వేసి కాగిన తరువాత రుబ్బుకున్న పేస్ట్‌ను వేసి కమ్మని వాసన వచ్చేంతవరకూ వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత చేపముక్కలను వేసి వేయించుకోవాలి. తరువాత పసుపు, కారం, ఉప్పు వేసి ముక్కలు చెదరకుండా కలుపుకోవాలి. ఈ ముక్కల్లో చింతపండు గుజ్జుతో పాటు కావలసినన్ని నీళ్లు పోసుకోవాలి. ఈ పులుసు మరుగుతున్నప్పుడే ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. దీన్ని కనీసం అరగంటపాటు సన్నటి సెగపై మగ్గించాలి. కూర దగ్గరకు వస్తున్నప్పుడు వెన్నపూసను వేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన పులస పులుసు రెడీ.

భాపా

కావలసిన పదార్థాలు
హిల్సా చేప ముక్కలు: కిలో
నల్ల ఆవాలు: ఒకచెంచా
సాదా ఆవాలు: ఒకచెంచా
పచ్చిమిర్చి: మూడు
అల్లం: కొద్దిగా
ఆవనూనె: మూడు చెంచాలు
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
చేప ముక్కలను బాగా శుభ్రం చేసి పసుపు, ఉప్పు పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఆవాలు, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు, పసుపు వేసి అన్నింటినీ మెత్తని పేస్ట్‌లా రుబ్బుకోవాలి. ఒక పాన్‌లో చేప ముక్కలను వాటికి ముందుగా రుబ్బి సిద్ధం చేసుకున్న ఆవ మిశ్రమాన్ని చేప ముక్కలకి దట్టంగా పట్టించాలి. ఆ ముక్కలపై నుంచి ఆవనూనె పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌లో రెండు గ్లాసుల నీళ్లు పోసుకుని అందులో ఈ చేప ముక్కలున్న పాన్‌ని ఉంచి విజిల్ పెట్టకుండా మూత పెట్టేయాలి. ఆవిరిపై పది నిముషాల్లో చేప ఉడికిపోతుంది. ఆవ పెట్టి వండే ఈ చేప ఎంతో రుచిగా ఉంటుంది. ఆరోగ్యం కూడా..

కబాబ్

కావలసిన పదార్థాలు
సొరచేప : అరకిలో
అల్లం వెల్లుల్లి పేస్ట్: రెండు చెంచాలు
ఉల్లిపాయ పేస్ట్: రెండు చెంచాలు
సెనగపిండి: ఆరు చెంచాలు
నూనె: మూడు చెంచాలు
కారం: అరచెంచా
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
చేప ముక్కల్ని కాసిని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ముక్కలు చల్లారిన తరువాత చేత్తో మెత్తగా మెదిపి పెట్టుకోవాలి. ఇందులో ఉల్లిపాయ పేస్ట్, ఉప్పు, సెనగపిండి వేసి మొత్తం అన్నీ బాగా చేత్తో కలుపుకోవాలి. దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని అరచేత్తో కబాబ్‌ల మాదిరిగా ఒత్తుకోవాలి. ఇప్పుడు పెనంపై నూనె వేసి కబాబ్‌లను గోధుమరంగులోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. టొమాటో సాస్‌తో తింటే ఈ కబాబ్‌లు రుచిగా ఉంటాయి.

పత్రాని మచ్చి

కావలసిన పదార్థాలు
చందువా చేపలు: రెండు చిన్నవి
కొబ్బరి తురుము: చెంచా
పచ్చిమిర్చి: మూడు
కొత్తిమీర తరుగు: పావుకప్పు
నిమ్మరసం: కొద్దిగా
వెల్లుల్లి: ఐదు రెబ్బలు
జీలకర్రపొడి: చెంచా
అరిటాకులు: రెండు చిన్నవి
తయారుచేసే విధానం
ముందుగా చేపలపై నిమ్మరసం, ఉప్పు చల్లి పావుగంటసేపు పక్కన ఉంచాలి. కొబ్బరి తురుము, జీలకర్ర, కొత్తిమీర, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముద్ద కలిపి ముద్దను పక్కన పెట్టుకోవాలి. ఒక్కో చేప ముక్కను ఒక్కో అరిటాకులో పెట్టి మసాలా పేస్ట్‌ను ముక్కలకు రెండు వైపులా పట్టించాలి. అరిటాకును పొట్లంలా మడిచి వాటిని దారంతో కట్టుకోవాలి. వాటిని ఆవిరిపై పది నిముషాల పాటు ఉడికించి ప్లేట్‌లోకి తీసుకుని పొట్లం విప్పి సర్వ్ చేసుకోవాలి.

కొరమీను వేపుడు

కావలసిన పదార్థాలు
కొరమీను చేపలు: కిలో
కొబ్బరిపొడి: రెండుచెంచాలు
జీలకర్ర పొడి: ఒకచెంచా
ధనియాల పొడి: రెండుచెంచాలు
మెంతిపొడి: పావుచెంచా
పసుపు: తగినంత
కారం: ఒకచెంచా
అల్లం వెల్లుల్లిముద్ద: ఒకచెంచా
చింతపండు పులుసు: మూడు చెంచాలు
నిమ్మకాయ: ఒకటి
నూనె: వేయించడానికి సరిపడా
కొత్తిమీర: కట్ట
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
ముందుగా చేప ముక్కల్ని శుభ్రం చేసుకుని నిమ్మరసం ముక్కలకి పట్టించాలి. ఒక గినె్నలో అల్లం వెల్లుల్లిముద్ద, కారం, పసుపు, జీలకర్రపొడి, మెంతిపొడి, కొబ్బరిపొడి, ఉప్పు, చింతపండు పులుసు, కొద్దిగా నూనె వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి చేపకు రెండు వైపులా పట్టించాలి. ఈ చేపముక్కలని అరగంటపాటు పక్కన పెట్టుకుని పెనంపై నూనె వేసుకుని నిదానంగా రెండు వైపులా కాల్చుకోవాలి. కొత్తిమీర, నిమ్మకాయ ముక్కలతో అలంకరించుకోవాలి.

అపోలో ఫిష్

కావలసిన పదార్థాలు
చందువా చేప: అరకేజీ
నిమ్మకాయ: అరచెక్క
కొత్తిమీర తరుగు: అరకప్పు
పెరుగు: అరకప్పు
గుడ్డు: ఒకటి
మైదా: మూడెవంతు కప్పు
మొక్కజొన్న పిండి: మూడు చెంచాలు
మిరియాల పొడి: ఒకచెంచా
కరివేపాకు: రెండు రెబ్బలు
పచ్చిమిర్చి: ఆరు
క్యాప్సికం: ఒకటి
ఫుడ్‌కలర్: చిటికెడు
నూనె: సరిపడా
ఉప్పు: తగినంత

తయారుచేసే విధానం

ముందుగా చేపను రెండు అంగుళాల ముక్కలుగా కోసి వాటికి నిమ్మరసం, మిరియాలపొడి, ఉప్పు కలిపి ముక్కలను అరగంటసేపు మారినేట్ చేసి పెట్టుకోవాలి. ఒక గినె్నలో గుడ్డు గిలక్కొట్టి దానిలో మొక్కజొన్న పిండి, మైదా, రంగు కలిపి మారినేట్ చేసిన చేప ముక్కల్ని పిండిలో ముంచి నూనెలో డీప్‌ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో రెండు చెంచాల నూనె వేసి అందులో నిలువుగా కోసిన పచ్చి మిరపకాయలు, క్యాప్సికం ముక్కలు, కరివేపాకు వేసి కొంచెం వేయించి పెరుగు, డీప్‌ఫ్రై చేసిన చేపముక్కల్ని కూడా వేసి పెరుగు ఇరిగి పోయేంతవరకు వేయించుకుని తీసుకోవాలి.