రుచి
నోరూరించే అట్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అట్లతద్దోయ్.. ఆరట్లోయ్.. ముద్దపప్పోయ్.. ముడట్లోయ్.. అన్న పాట అట్లతద్ది రోజు పాడుకోవడం ఆనవాయితీ.. పండుగరోజు తెల్లవారుజామునే తోటి పిల్లలతో కలిసి ఈ పాట పాడుకుంటూ ఉయ్యాలలూగుతూ సందడి చేస్తుంటారు. అట్లతద్ది నోములో అమ్మవారికి అట్లు నైవేద్యంగా పెడతారు. నవగ్రహాలలో ఒకడైన కుజునికి అట్లంటే ప్రీతి. వీటిని ఆయనకు నైవేద్యంగా పెడితే కుజుని వల్ల కలిగే దోషాలు పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులు రావనేది విశ్వాసం. మరి అలాంటి అట్లతద్ది రోజు వేసుకునే రకరకాల అట్ల గురించి తెలుసుకుందామా..
రాగి పిండితో..
కావలసిన పదార్థాలు
బియ్యప్పిండి: కప్పు
మైదా: అర కప్పు
రాగిపిండి: అర కప్పు
పుల్లటి పెరుగు: ముప్పావు కప్పు
మంచినీళ్లు: తగినన్ని
పచ్చిమిర్చి: ఆరు అల్లం: చిన్నముక్క
ఉల్లిపాయ: ఒకటి
జీలకర్ర: టీ స్పూన్
ఉప్పు: రుచికి తగినంత
తయారుచేసే విధానం
బియ్యప్పిండిలో మైదా, రాగిపిండి, ఉప్పు వేసి బాగా కలపాలి. పుల్లపెరుగు, తగినన్ని మంచినీళ్లు పోసి బాగా గిలక్కొట్టాలి. పచ్చిమిర్చి, అల్లం ముక్క, ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని బియ్యప్పిండి మిశ్రమంలో వేయాలి.
ఇందులో జీలకర్ర కూడా వేయాలి. తరువాత మజ్జిగలా చేసుకున్న పుల్లటి పెరుగును బియ్యప్పిండి మిశ్రమంలో పోస్తూ నెమ్మదిగా ఉండలు కట్టకుండా కలిపి ఒక గంట నాననివ్వాలి. స్టవ్ పై అట్ల పెనం ఉంచి అర టీ స్పూన్ నూనె వేసి నానబెట్టిన పిండిని అట్లలా వేసుకుని రెండు వైపులా కాల్చి తీసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన రాగి అట్లు తయారు.
సొరకాయతో..
కావలసిన పదార్థాలు
సొరకాయ: ఒకటి
పెసలు: కప్పు
బియ్యం: కప్పు
పచ్చిమిర్చి: నాలుగు
అల్లం: చిన్న ముక్క
జీలకర్ర: ఒక స్పూన్
కొత్తిమీర తరుగు: ఒక స్పూన్
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
పెసలు, బియ్యాన్ని ఆరుగంటల పాటు నాననివ్వాలి. సొయకాయను చెక్కుతీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెసలు, బియ్యం, సొయకాయ ముక్కలు, ఉప్పులను మిక్సీ జార్‌లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అల్లం ముక్కను సన్నగా తరిగి ఈ సొరకాయ మిశ్రమంలో వేయాలి. ఇందులో జీలకర్ర, కొత్తిమీర తరుగు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. స్టవ్‌పై దోసె పెనాన్ని ఉంచి సొయకాయ పిండిని అట్లుగా వేసుకుని కాల్చుకోవాలి.
గోధుమ పిండితో..
కావలసిన పదార్థాలు
గోధుమపిండి: కప్పు
బియ్యప్పిండి: అర కప్పు
మైదా: పావు కప్పు
సెనగపిండి: పావు కప్పు
ఉప్పు: తగినంత
జీలకర్ర: ఒక స్పూన్
పచ్చిమిర్చి: ఆరు
ఉల్లిపాయ: ఒకటి
తయారుచేసే విధానం
వెడల్పాటి గినె్నలో గోధుమపిండి, బియ్యప్పిండి, మైదా, సెనగపిండి, ఉప్పులను వేసి బాగా కలపాలి. ఇందులో నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా దోసెల పిండిలా కలుపుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను సన్నగా తరిగి గోధుమ పిండి మిశ్రమంలో వేసి ఒక అరగంట నాననివ్వాలి. తరువాత స్టవ్‌పై దోసె పెనం ఉంచి అట్లను వేసుకోవాలి.
జొన్న పిండితో..
కావలసిన పదార్థాలు
బొంబాయిరవ్వ: రెండు కప్పు
బియ్యప్పిండి: ఒక కప్పు
జొన్న పిండి: ఒక కప్పు
పచ్చిమిర్చి: నాలుగు
అల్లం ముక్క: చిన్నది
ఉల్లిపాయ: ఒకటి
కొత్తిమీర: కొద్దిగా
జీలకర్ర: ఒక స్పూన్
పచ్చి కొబ్బరిముక్కలు: ఒక స్పూన్
ఉప్పు: తగినంత
మంచినీళ్లు: తగినన్ని
తయారుచేసే విధానం
ఒక వెడల్పాటి గినె్నలో బొంబాయిరవ్వ, బియ్యప్పిండి, జొన్నపిండి, ఉప్పులను వేసి బాగా కలపాలి. ఇందులో సన్నగా తరిగిన అల్లం ముక్క, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీరలను వేయాలి. ఇందులో ఎక్కువ నీళ్లు పోసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి. ఇందులో జీలకర్ర, పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వేసి ఒక గంట పాటు నాననివ్వాలి. స్టవ్‌పై దోసె పెనాన్ని పెట్టి ఉల్లిపాయ ముక్కతో రుద్ది నానబెట్టిన పిండితో అట్లను వేసుకోవాలి. అంతే ఎంతో ఆరోగ్యకరమైన జొన్న అట్లు రెడీ.
అటుకులతో..
కావలసిన పదార్థాలు
బియ్యం: రెండు కప్పులు
ఉప్పుడు బియ్యం: కప్పు
అటుకులు: అర కప్పు
మినపప్పు: అర కప్పు
పెరుగు: అర కప్పు
జీలకర్ర: ఒక స్పూన్
మంచినీళ్లు: తగినన్ని
బేకింగ్ సోడా: పావు టీస్పూన్
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
ఒక గినె్నలో పెరుగువేసి, తగినన్ని మంచినీళ్లు వేసి బాగా గిలక్కొట్టాలి. మరో గినె్నలో బియ్యం, ఉప్పుడు బియ్యం, అటుకులు, మినపప్పు వేసి బాగా కడగాలి. తరువాత తయారుచేసి పెట్టుకున్న మజ్జిగ బియ్యంలో వేసి నాలుగు గంటలు నాననివ్వాలి. నానబెట్టిన బియ్యం మిశ్రమాన్ని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. దోసెపిండిలా జారుగా అయ్యేవరకూ రుబ్బి ఇందులో బేకింగ్ సోడా, తగినంత ఉప్పు, జీలకర్ర వేసి ఎనిమిది గంటల పాటు పులియనివ్వాలి. తరువాత దోసెల పెనంపై అట్టు వేసి రెండు వైపులా నూనె వేస్తూ కాల్చుకోవాలి. అంతే అటుకల అట్లు తయారు.
సగ్గుబియ్యంతో..
కావలసిన పదార్థాలు
బియ్యప్పిండి: ఒక కప్పు
బొంబాయిరవ్వ: అర కప్పు
సగ్గుబియ్యం: ఒక కప్పు
పెరుగు: ఒక కప్పు జీలకర్ర: ఒక స్పూన్
ఉల్లిపాయ: ఒకటి పచ్చిమిర్చి: ఆరు
క్యారెట్: ఒకటి
కొత్తిమీర తురుము: ఒక స్పూన్
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
ముందుగా సగ్గుబియ్యాన్ని రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈలోగా బొంబాయిరవ్వలో పెరుగు వేసి బాగా కలిపి రవ్వను కూడా ఒక గంట పాటు నాననివ్వాలి. సగ్గుబియ్యం నానిన తరువాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దీన్ని బొంబాయిరవ్వ, పెరుగు కలిపిన మిశ్రమంలో వేయాలి. ఇందులోనే బియ్యప్పిండి కూడా వేసి జారుగా, దోసెల పిండిలా కలుపుకోవాలి.
పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యారెట్లను సన్నగా తరిగి సగ్గుబియ్యం మిశ్రమంలో వేసుకోవాలి. దీనికి కొత్తిమీర తరుగు, ఉప్పు, జీలకర్రలను కూడా చేర్చి బాగా కలపాలి. దీన్ని ఓ అరగంట సేపు పక్కన ఉంచి తరువాత దోసెల పెనంపై అట్లలా వేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.