రుచి

వేడివేడిగా.. టేస్టీటేస్టీగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చలికాలంలో సాయంత్రం స్కూలు నుంచి వచ్చిన తరువాత కానీ, సెలవురోజుల్లో కానీ పిల్లలు వెరైటీ ఐటమ్స్ కావాలని మారాం చేస్తుంటారు. తల్లిదండ్రులు విసుక్కోకుండా ఇలాంటి ఐటమ్స్ చేసి పెడితే వారు లొట్టలు వేసుకుంటూ తింటారు. అంతేకాదు ఇవి ఎంతో ఆరోగ్యం కూడా.. మరి వాటి తయారీ విధానం చూసేద్దామా!

స్వీట్ పొటాటో బాల్స్

కావలసిన పదార్థాలు
చిలగడదుంపల గుజ్జు: మూడు కప్పులు
చీజ్: నాలుగు స్పూన్లు
టొమాటో సాస్: మూడు స్పూన్లు
మైదాపిండి: పావు కప్పు
గుడ్లు: రెండు
పాలు: అర స్పూన్
బ్రెడ్ పౌడర్: పావు కప్పు
నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
ముందుగా ఒక వెడల్పాటి గినె్నను తీసుకుని అందులో చిలగడ దుంపల గుజ్జు, చీజ్, టొమాటో సాస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్‌లో మైదాపిండిని తీసుకోవాలి. మరో బౌల్‌లో పాలు, గుడ్లు తీసుకుని బాగా గిలక్కొట్టాలి. మరో బౌల్‌లో బ్రెడ్ పౌడర్ తీసుకోవాలి. స్టవ్‌పై బాణలి పెట్టుకుని నూనె పోసుకోవాలి. నూనె కాగిన తరువాత ముందుగా తయారుచేసి పెట్టుకున్న చిలగడదుంప బాల్స్‌ని మొదట మైదాపిండి బౌల్‌లో ముంచాలి. తరువాత దీన్ని కోడిగుడ్డు మిశ్రమంలో ముంచి బ్రెడ్ పౌడర్‌లో దొర్లించి.. కాగుతున్న నూనెలో వేయాలి. బంగారు రంగు వచ్చేవరకు వేయించుకుని తీసి.. వేడివేడిగా టొమాటో సాస్‌తో తింటే భలే రుచిగా ఉంటాయి.

ఖీమా పకోడి
కావలసిన పదార్థాలు
ఖీమా: రెండు కప్పులు
ఉల్లిపాయ: ఒకటి
పచ్చిమిర్చి: నాలుగు
శనగపిండి: ఒక కప్పు
టొమాటొ: ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్ట్: ఒక చెంచా
గరంమసాల: ఒక చెంచా
కబాబ్ మసాల: ఒక చెంచా
ఉప్పు: తగినంత
నూనె: రెండు కప్పులు
తయారుచేసే విధానం
ముందుగా ఖీమా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలను ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తరువాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. అలాగే ఉప్పు, కీమా మసాలా, గరం మసాలా కూడా ఖీమా మిశ్రమంలో వేయాలి. అన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఖీమా మిశ్రమంలో శనగపిండి జోడించి, అరకప్పు నీళ్ళు పోసి కొద్దిగా చిక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు చేత్తోనే కొద్దికొద్దిగా ఖీమా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని పకోడీల్లా చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్‌పై బాణలిని ఉంచి అందులో నూనెపోసి వేడిచేయాలి. ఇందులో ఖీమా పకోడీలను వేయాలి. మంటను పూర్తిగా తగ్గించి మూత పెట్టి అన్నివైపులా కాలే విధంగా పది నిముషాలు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. అంతే నోరూరించే ఖీమా పకోడీలు రెడీ. వీటిని సర్వింగ్ ప్లేట్‌లో అమర్చి, ఉల్లిపాయ రింగులు, పుదీనా చట్నీతో సర్వ్ చేయాలి.

బేబీకార్న్ పకోడి

కావలసిన పదార్థాలు
బేబీకార్న్: పది
కార్న్‌ఫ్లోర్: నాలుగు చెంచాలు
బియ్యప్పిండి: ఒక చెంచా
మైదా: ఒక చెంచా
వంటసోడా: చిటికెడు
ఉప్పు: తగినంత
కారం: రెండు చెంచాల
అల్లం వెల్లుల్లి ముద్ద: చెంచా
కరివేపాకు: కొద్దిగా
నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
వెడల్పాటి గినె్నను తీసుకుని అందులో కార్న్‌ఫ్లోర్, మైదా, బియ్యప్పిండి, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, ఉప్పు, వంటసోడా వేసి అందులో కొద్దిగా నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. మందబాటి బాణలిని స్టవ్‌పై ఉంచి, అందులో నూనె పోసి వేడిచేయాలి. నూనె కాగిన తరువాత బేబీకార్న్ ముక్కలను కలుపుకున్న కార్న్‌ఫ్లోర్ మిశ్రమంలో ముంచి కాగిన నూనెలో వేయాలి. ఇవి బంగారు రంగు వచ్చిన తరువాత తీసేయాలి. దీనిపై వేయించిన కరివేపాకు వేసి సర్వ్ చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

ఖీమా సమోస
కావలసిన పదార్థాలు
చికెన్ ఖీమా: అర కిలో
మైదా: రెండు కప్పులు
బటర్: రెండు చెంచాలు
పెరుగు: రెండు చెంచాలు
నీళ్లు: తగినన్ని
నూనె: రెండు కప్పులు
ఉల్లిపాయలు: రెండు
తరిగిన అల్లం: రెండు చెంచాలు
తరిగిన కొత్తిమీర: రెండు చెంచాలు
తరిగిన పుదీనా: రెండు చెంచాలు
పచ్చిమిర్చి: ఐదు స్ప్రింగ్ ఆనియన్: అర కప్పు
పసుపు: కొద్దిగా కారం: ఒక చెంచా
జీలకర్ర పొడి: ఒక చెంచా
గరం మసాల: అర చెంచా
చికెన్ స్టాక్: ఒక కప్పు ఉప్పు: తగినంత
పంచదార: చిటికెడు
తయారుచేసే విధానం
ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. తరువాత మైదాలో కొద్దిగా ఉప్పు, బటర్, పెరుగు వేసి చపాతీపిండిలా కలుపుకోవాలి. దీనిపై ఓ తడిబట్టను కప్పి అరగంటపాటు ఉంచాలి. తరువాత చికెన్ ఖీమాను శుభ్రంగా కడిగి మొత్తం నీటిని పిండేసి పక్కన పెట్టుకోవాలి. పాన్‌ను స్టవ్‌పై ఉంచుకుని నూనె వేసి వేడిచేయాలి. నూనె వేడయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో మారేంత వరకూ వేయించుకోవాలి. తరువాత ఇందులో సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి వేసి పదిహేను నిముషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తరువాత ఇందులోనే శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ఖీమా, ఉప్పు కూడా వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఖీమా మెత్తగా వేగిన తరువాత అందులో కారం, పసుపు, జీలకర్ర వేయాలి. ఇప్పుడు మొత్తం మిశ్రమం మిక్స్ చేయాలి. తరువాత ఇందులో పంచదార వేయాలి. తరువాత ఇందులో చికెన్ స్టాక్ వేయాలి. తక్కువ మంటలో ఉడికించాలి. గరం మసాలా కూడా జోడించి చివరగా కొత్తిమీర, పుదీనా, స్ప్రింగ్ ఆనియన్స్‌ను కూడా చల్లుకోవాలి. మొత్తం మిశ్రమాన్ని మరోసారి మిక్స్‌చేసి స్ట్ఫింగ్‌ను సిద్ధం చేసుకోవాలి. తరువాత సమోస కొరకు పిండి నుండి కొద్దిగా తీసుకుని చిన్న చిన్న పూరీల్లా ఒత్తుకుని దీన్ని మధ్యలోకి కట్‌చేసి కోన్‌లా చేసుకోవాలి. ఇందులో చికెన్ స్ట్ఫ్‌ను ఉంచి క్లోజ్ చేసేయాలి. ఇలా అన్నింటినీ తయారుచేసుకుని అరగంటపాటు వీటిని ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. తరువాత బాణలిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసుకుని అందులో సమోసాలను వేసి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ ఖీమా సమోసా రెడీ. టొమాటో సాస్, మింట్ చట్నీ, పెరుగుతో ఇది బెస్ట్ కాంబినేషన్.

ఎగ్ ఆనియన్ రింగ్స్

కావలసిన పదార్థాలు
ఆనియన్ రింగ్స్: నాలుగు
గుడ్లు: నాలుగు
నూనె: వేయించడానికి సరిపడా
బ్రెడ్ పౌడర్: ఐదు స్పూన్‌లు
బటర్: మూడు స్పూన్‌లు
ఉప్పు: తగినంత
మిరియాల పొడి: కొద్దిగా
తయారుచేసే విధానం
ముందుగా ఒక వెడల్పాటి గినె్నను తీసుకుని అందులో బ్రెడ్ పౌడర్, బటర్, ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని ఆ మిశ్రమాన్ని ఆనియన్ రింగ్స్‌కి బాగా పట్టించాలి. తరువాత స్టవ్‌పై బాణలిని ఉంచుకుని అందులో నూనె పోసుకుని వేడిచేసుకోవాలి.
ఇప్పడు ఆనియన్ రింగ్స్‌ని వేసి డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్ రింగ్ పెట్టుకుని దానిలో గుడ్డు పగలగొట్టి వేసుకోవాలి. ఇప్పుడు కాసేపు దీనిపై మూత బెట్టి ఉడకనివ్వాలి. మిగిలిన రింగ్స్‌లో కూడా గుడ్లను ఇలానే వేసుకుని ఉడికించుకుని పైన మిరియాల పొడి వేసుకుంటే ఇవి భలే రుచిగా ఉంటాయి.

పబ్రెడ్ 65

కావలసిన పదార్థాలు
బ్రెడ్: నాలుగు స్లైసులు
ఉల్లిపాయ: ఒకటి
మిర్చి: నాలుగు
క్యారెట్ తురుము: కొంచెం
క్యాప్సికం: ఒకటి
ఉప్పు: తగినంత
కారం: తగినంత
పెరుగు: ఒక కప్పు
వెల్లుల్లి: నాలుగు రెబ్బలు
కరివేపాకు: రెండు రెబ్బలు
నూనె: తగినంత
తయారుచేసే విధానం
ముందుగా బ్రెడ్ స్లైసెస్‌ని నీళ్లలో వేసి వెంటనే పిండి ఒక గినె్నలో వేసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లి, ఒక మిర్చి, క్యాప్సికం, క్యారెట్ తురుము, కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి ఉంచుకోవాలి. తరువాత బాణలిని స్టవ్‌పై ఉంచి నూనెను పోయాలి. ఇది కాగాక చేసి పెట్టుకున్న ఉండలు వేసి వేయించాలి. ఇవి ఎర్రగా వేగిన తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే పాన్‌లో ఒక స్పూన్ నూనె వేసి వేడిచేసి సన్నగా తరిగిన వెల్లుల్లి, మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి కొంచెం వేగిన తరువాత బ్రెడ్ ఉండలు వేసి చిటికెడు ఉప్పు, కారం వేయాలి. ఇప్పుడు పెరుగును కొంచెం బీట్ చేసి ఇందులో వేసి సన్నని సెగపై అంతా ఇగిరిపోయి పొడిపొడిగా అయ్యేవరకూ వేయించాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సన్నగా తరిగిన కొత్తిమీర వేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.