రుచి

పాస్తాతో పసందుగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లల నుంచి పెద్దల వరకూ న్యూడుల్స్, పాస్తాను ఇష్టపడని వారుండరు. పాస్తా ఇటలీ వంటకం. వివిధ రకాల్లో, వెరైటీల్లో లభించే పాస్తాను తక్కువ సమయంలో రకరకాలుగా వండుకోవచ్చు. ముఖ్యంగా ఉదయం పూటో, సాయంత్రం పూటో పిల్లలు త్వరగా, రుచికరమైన టిఫిన్ కావాలి అన్నప్పుడు దీన్ని నిముషాల్లో తయారుచేసి వారికి అందిస్తే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు. మరి అలాంటి పాస్తా వంటకాల గురించి తెలుసుకుందామా..

*
రవియోలి

పాస్తా
కావలసిన పదార్థాలు
రవియోలి పాస్తా: ఒక కప్పు
పాలు: ఒక కప్పు
గుడ్లు: రెండు
బ్రెడ్ క్రంబ్స్: ఒక కప్పు
ఉప్పు: తగినంత
మిరియాల పొడి: కొద్దిగా
నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
ఒక గినె్నలో పాలు, గుడ్లు, తగినంత ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు వేరొక గినె్నలో బ్రెడ్ క్రంబ్స్, ఉప్పు, మిరియాల పొడి వేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌పై బాణలిని ఉంచి అందులో నూనె పోసి వేడిచేసుకోవాలి. ఈ లోగా రవియోలి పాస్తాని పాలు, గుడ్ల మిశ్రమంలో ముంచి ఆ పై బ్రెడ్ క్రంబ్స్‌లో దొర్లించి ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. అలా అన్ని పాస్తాలను తయారుచేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కదాన్ని కాగిన నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. అతి తక్కువ సమయంలో తయారయ్యే ఈ పాస్తా ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉంటుంది. టొమాటో సాస్‌తో సర్వ్ చేస్తే పిల్లలు దీన్ని ఎంతో ఇష్టంగా లొట్టలేసుకుంటూ తింటారు.
*
టార్టెలిన్ సూప్

కావలసిన పదార్థాలు
టార్టెల్లిన్ పాస్తా: పావు కిలో
సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు: పావు కప్పు
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు: పావు కప్పు
సన్నగా తరిగిన టొమాటో ముక్కలు: ఒకటిన్నర కప్పులు
వెజిటబుల్ స్టాక్: నాలుగు కప్పులు
ఆలివ్ ఆయిల్: ఒక చెంచా
ఉప్పు: తగినంత
తురిమిన చీజ్: గార్నిష్‌కి సరిపడా..
తరిగిన కొత్తిమీర: రెండు చెంచాలు
తరిగిన తులసి ఆకులు: ఒక చెంచా
తయారుచేసే విధానం
ముందుగా ఓ మందపాటి బాణలిని తీసుకుని స్టవ్‌పై ఉంచాలి. అందులో ఒక చెంచా ఆలివ్ నూనె వేయాలి. వేడెక్కిన తరువాత అందులో ఉల్లిపాయ ముక్కల్ని వేసి దోరగా వేయించుకోవాలి. తరువాత క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు ఇందులో వెజిటబుల్ స్టాక్, సన్నగా కట్ చేసిన టొమాటో ముక్కల్ని వేసి రెండు నిముషాలు పాటు ఉడికించాలి. తర్వాత అందులో పాస్తా వేయాలి. ఇది మరిగేటప్పుడు తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలిపి ఉడికించాలి. పాస్తా పూర్తిగా ఉడికిన తరువాత స్టౌపై నుంచి దింపేయాలి. దీన్ని వేడిగా సర్వింగ్ బౌల్లో తీసుకుని కొత్తిమీర, తులసి, చీజ్‌తో గార్నిష్ చేయాలి. ఈ చలికాలపు సాయంత్రాల్లో పొగలు కక్కే ఈ వేడి పాస్తా సూప్‌ను పిల్లలకు అందిస్తే వారు ఎగిరి గంతేస్తారు.
*
బేక్డ్ పాస్తా

కావలసిన పదార్థాలు
పాస్తా: 200 గ్రాములు
ఆలివ్ ఆయిల్: రెండు చెంచాలు
ఉల్లిపాయ: ఒకటి
వెల్లుల్లి తరుగు: ఒక చెంచా
మిక్స్‌డ్ బెల్‌పెప్పర్: ఒక కప్పు
పుట్టగొడుగులు: ఒక కప్పు
పాలకూర: ఒక కట్ట
వంకాయ: ఒకటి
పచ్చిమిర్చి: రెండు
టొమాటో ప్యూరీ: కప్పు
మిక్స్‌డ్ చీజ్: రెండు కప్పులు
క్రీమ్: ఒక కప్పు
బ్రెడ్ ముక్కలు: అర కప్పు
వెన్న: 150 గ్రాములు
తయారుచేసే విధానం
ఒక గినె్నలో నీళ్లు తీసుకుని అందులో కాస్త ఉప్పు వేసి స్టవ్‌పై పెట్టి మరిగించాలి. ఇందులో పాస్తా వేసి పదినిముషాల పాటు ఉడికించి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్‌పై బాణలిని ఉంచి ఆలివ్ ఆయిల్ వేయాలి. అది కాస్త వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత వంకాయ ముక్కలు, బెల్ పెప్పర్ ముక్కలు వేసి రెండు నిముషాల పాటు వేయించాలి. తరువాత ఇందులో పుట్టగొడుగులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. బాగా కలిపిన తరువాత ఇందులో చిన్నగా కట్ చేసి ఉంచుకున్న పాలకూరను కూడా వేసి వేయించాలి. ఇలా ఐదు నిముషాల వేయించిన తరువాత టొమాటో ప్యూరీ, క్రీమ్ వేసి బాగా కలపాలి. తరువాత స్టవ్ ఆపేసి ఉడికించి ఉంచుకున్న పాస్తాను ఇందులో వేసి బాగా కలపాలి. చివరగా వెన్న వేసి కలియబెట్టి ఈ మిశ్రమాన్ని బేకింగ్ డిష్‌లో పోసి సమాంతరంగా నెరపాలి. దీనిపై బ్రెడ్ ముక్కలను ఉంచి ఒవెన్‌లో పెట్టి 20 నిముషాల పాటు ఉడికిస్తే ఎంతో రుచికరమైన బేక్డ్ పాస్తా రెడీ.
*
మెకరోని పాస్తా
కావలసిన పదార్థాలు
మెకరోని పాస్తా: ఒక కప్పు
తురిమిన చీజ్: ఒక కప్పు
పాలు: ఒక కప్పు
వెన్న: రెండు చెంచాలు
మైదాపిండి: ఒక చెంచా
మిరియాల పొడి: పావు చెంచా
బ్రెడ్ క్రంబ్స్: రెండు చెంచాలు
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
మరుగుతున్న నీళ్లలో మెకరోని పాస్తాను వేసి ఉడికించి పక్కకు తీసి పెట్టుకోవాలి. తరువాత ఒక వెడల్పాటి గినె్నను తీసుకుని అందులో ఒక చెంచా వెన్నని వేసి సన్నని మంటపై కరిగించుకోవాలి. ఇందులో మైదాపిండి వేసి కలపాలి. ఇప్పుడు ఇందులో పాలు, ఉప్పు, మిరియాల పొడి వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. తరువాత తురిమిన చీజ్‌ను కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించిన మెకరోని పాస్తాను వేసి మూడు, నాలుగు నిముషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈలోపు వేరొక పాన్‌ను స్టవ్‌పై ఉంచి, మిగిలిన వెన్నను వేసి కరిగించుకోవాలి. ఇందులో బ్రెడ్ క్రంబ్స్‌ని వేసి దోరగా వేయించుకోవాలి. ఉడికించిన మెకరోని మిశ్రమాన్ని ఓ బ్రేకింగ్ ట్రేలో పోసి సమాంతరంగా పరచాలి. దీనిపై వేయించిన బ్రెడ్ క్రంబ్స్ వేసి ఒవెన్‌లో 200 డిగ్రీల వద్ద పదిహేను నిముషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే బ్రిటన్ పాపులర్ మెకరోని పాస్తా రెడీ.
*
ఫార్‌ఫలే పాస్తా
కావలసిన పదార్థాలు
ఫార్‌ఫలే పాస్తా: ఒక కప్పు
వైట్ సాస్: అర కప్పు
టొమాటో ప్యూరీ: అర కప్పు
కట్ చేసిన టొమాటో ముక్కలు:
పావు కప్పు
టొమాటో కెచప్: రెండు చెంచాలు
ఆలివ్ నూనె: ఒక చెంచా
తరిమిన చీజ్: ఒక చెంచా
చిల్లీ ఫ్లేక్స్: ఒక చెంచా
సన్నగా తరిగిన వెల్లుల్లి: ఒక చెంచా
ఉప్పు: తగినంత
తరిగిన కొత్తిమీర: ఒక చెంచా
తరిగిన తులసి: ఒక చెంచా
తయారుచేసే విధానం: ఒక గినె్నను తీసుకుని అందులో మూడు కప్పుల నీటిని పోసి స్టవ్‌పై ఉంచాలి. ఇది మరిగిన తరువాత ఫార్‌ఫలే పాస్తాను వేయాలి. ఇది కాస్త ఉడికింది అనగానే దీన్ని వడకట్టేసి చల్లటి నీటితో కడిగేయాలి. తరువాత స్టవ్‌పై బాణలిని ఉంచి నూనె పోసి సన్నని మంటపై వేడిచేయాలి. ఇందులో తరిగిన వెల్లుల్లిని వేసి ఒక నిముషం పాటు వేయించుకోవాలి. తరువాత ఇందులో కట్‌చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, టొమాటో ప్యూరీ, టొమాటో ముక్కలు, తరిగిన తులసి ఆకులు, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు.. వేయాలి. టొమాటో ముక్కలు బాగా మగ్గేంతవరకూ ఉడికించాలి. తరువాత వైట్ సాస్, టొమాటో కెచప్, ఉడికించి పక్కన పెట్టుకున్న పాస్తాను కూడా వేసి బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల ఈ మిశ్రమం పాస్తాకి బాగా పడుతుంది. ఇలా ఐదు నిముషాల పాటు ఉడికించాలి. తరువాత స్టవ్‌పై నుండి ఈ మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్లోకి మార్చాలి. సర్వ్ చేసే ముందు తురిమిన చీజ్‌తో గార్నిష్ చేస్తే ఆ రుచే వేరు.
*
లసగ్నా పాస్తా

కావలసిన పదార్థాలు
లసగ్నా పాస్తా షీట్స్: పదిహేను
చికెన్ ఖీమా: అరకిలో
టొమాటో ప్యూరీ: ఒక కప్పు
సన్నగా తరిగిన ఉల్లిపాయలు: అర కప్పు
సన్నగా తరిగిన వెల్లుల్లి: ఒక చెంచా
కొత్తిమీర తురుము: పావు కప్పు
ఉప్పు: తగినంత
మిరియాల పొడి: కొద్దిగా
తురిమిన చీజ్: మూడు కప్పులు
తయారుచేసే విధానం
స్టవ్‌పై బాణలిని ఉంచి బాగా కడిగిన చికెన్ ఖీమాలో ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఉడికించాలి. కడిగిన చికెన్ ఖీమాలో సహజసిద్ధంగా ఉత్పన్నమయ్యే నూనెలతోనే అది ఉడుకుతుంది కాబట్టి దీనికి నీళ్లని జత చేయకూడదు. ఇది ఉడికిన తరువాత ఇందులో టొమాటో ప్యూరీ, తరిగిన వెల్లుల్లి, కొత్తిమీర తురుము, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి ఐదు నుంచి పదిహేను నిముషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత స్టవ్ కట్టేసి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో గినె్నలో లసగ్నా పాస్తా షీట్స్‌ను పరిచి వాటిపై వేడిని నీటిని పోసి పది నిముషాల పాటు అలాగే ఉంచాలి. ఇప్పుడు బేకింగ్ ట్రేలో ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని కొద్దిగా వేసి సమానంగా పరిచి, దానిపై లసగ్నా షీట్స్‌ని ఒక లేయర్‌లా పరవాలి. దీనిపై తురిమిన చీజ్‌ని మరో లేయర్‌లా చల్లాలి. ఈ మొత్తం లేయర్‌పై మరోసారి ఇదే పద్ధతిని రిపీట్ చేయాలి. ఇలా చికెన్ మిశ్రమం పూర్తయ్యేంతవరకు లేయర్స్‌లా పరచుకోవాలి. ఇప్పుడు ఈ బేకింగ్ ట్రేని ఒవెన్‌లో 180 డిగ్రీల వద్ద అరగంటపాటు బేక్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే లసగ్నా క్యాసెరోల్ తయారు. దీన్ని పిల్లలకు అందిస్తే ఎగిరి గంతేస్తారు.