రుచి
సంక్రాంతి పసందు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మునుపు పండుగకు అరిసెల పిండి కొట్టాలన్నా, సకినాలు తిప్పుకోవాలన్నా వారంరోజుల ముందునుంచే హడావుడి మొదలైపోతుంది. నలుగురిళ్లవాళ్లు కలిసి పిండి దంచుకొనేవాళ్లు.. సకినాలను తయారుచేయడానికి అందరూ కలిసి పనులు పంచుకుంటూ సాగేవారు. అలాంటి రోజుల్లోనే రోకటి పాటలు, విసురురాయి పాటలు వంటి జానపద గీతాలెన్నో పురుడు పోసుకొనేవి. వాటిల్లో ఉండే చమత్కార ధోరణితో పుల్లవిరుపు మాటలు మాట్లాడేవారికి చురకలు, అత్తగారి ఆరళ్లకు, ఆడపడుచుల ఎక్కసక్కాలకు మెరుపులు, వదినామరదళ్ల అనురాగాలు, అన్నదమ్ముల అక్కచెల్లెళ్ల మధ్య మమతల హరివిల్లులు.. ఇటువంటి ఎన్నో సామాజిక అనుబంధాలు, సామాజిక బాధ్యతలు గుర్తుచేస్తూ పాటలు సాగేవి. అలా సామాజిక చైతన్యానికి ప్రేరణ కలిగించే సంక్రాంతి పాటలు కోకొల్లలుగా పుట్టుకొచ్చేవి. ఈనాడు అలాంటి పనులు, వాటికి సంబంధించిన ఆటలు, పాటలు కనుమరుగు అయిపోతున్నా అక్కడక్కడా ఈ పండుగ దినాల్లో పాతసంగతులను నెమరువేసుకొంటూ ఆధునిక యంత్రాలతో, పాత వంటలు చేసుకొని ఆనందించే అతివలూ ఉన్నారు. అటువంటి వారికోసమే ఈ వంటల సందడి..
*
అరిసెలు
*
కావాల్సిన పదార్థాలు
తడి కొత్తబియ్యం పిండి: ఒక కప్పు
బెల్లం పొడి: ఒక కప్పు
నెయ్యి లేక నూనె : తగినంత
ఏలకుల పొడి: రెండు చిటికెలు
అరిసెలు వత్తుకోవడానికి పనికివచ్చే అరటి ఆకు, విస్తరి, తమల పాకు.. వీటిల్లో ఏదైనా రెండు ఆకులు
తయారుచేసే విధానం
ముందు రోజు రాత్రే అరిసెల కోసం కొత్తబియ్యాన్ని నానబెట్టుకోవాలి. వాటిని వడగట్టి పిండిమిషన్‌లో మరపట్టించి తడి ఉండగానే బెల్లం పాకం పట్టాలి. పాకం వుండపాకం పట్టాలి. అందులో ఈ బియ్యంపిండిని చేర్చాలి. ఇందులోనే ఏలకుల పొడి , కొద్దిగా నెయ్యిని కూడా చేర్చుకోవాలి. నెయ్యి వేసుకొన్నందువల్ల అరిసెలకు రుచి రావడమే కాకుండా పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది. తరువాత పిండిని చల్లార్చుకోవాలి. స్టవ్‌పైన బాణలి పెట్టి నూనె లేదా నెయ్య పోసి కాగనివ్వాలి. నూనె బాగా కాలిన తరువాత తమలపాకు లేదా విస్తరాకు లేదా అరటి ఆకును తీసుకొని దానిపై అరిసెల పిండిని సన్నగా వత్తి కాగిన నూనెలోకి వదలాలి. రెండుపక్కలా తిప్పుకుని బాగా కాల్చుకోవాలి. వీటిని తీసుకొని అరిసెల చెక్కల్లో వేసుకొని బాగా వత్తి నూనె అంతా కారిపోయిన తరువాత తీసి టిష్యూ పేపరుపైన ఆరబెట్టుకోవాలి. ఆ తరువాత డబ్బాల్లో దాచి పండుగ రోజులు అందరితో కలిసి ఆహా ఏమి రుచి.. అంటూ తినొచ్చు.
*
మణుగుపూలు
*
కావలసిన పదార్థాలు
కొత్త బియ్యం పిండి: అరకిలో
పుట్నాల పప్పు: వంద గ్రాములు
నెయ్యి లేక వెన్న: రెండు కప్పులు
నూనె: తగినంత
వాము: మూడు చెంచాలు
తయారుచేసే విధానం
ముందుగా బియ్యం కడిగి, నానబెట్టి తరువాత ఆరబెట్టుకొని పిండి మరపట్టించుకోవాలి. పుట్నాల పప్పును పొడి చేసుకోవాలి. బియ్యప్పిండికి పుట్నాలపప్పు పొడి కలుపుకోవాలి. నెయ్యిని కానీ, వెన్నని కానీ వేడిచేసుకొని ఈ మిశ్రమానికి చేర్చుకుని బాగా కలుపుకోవాలి. ఆ తరువాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి లాగా కాక కాస్త జారుగా మురుకుల గొట్టంలో జారేటట్టుగా పిండిని కలుపుకోవాలి. ఇపుడు స్టవ్‌పై బాణలిని వుంచి నూనె పోయాలి. నూనె కాగిన తరువాత మురుకుల గొట్టంలోని సన్నరంధ్రాలున్న రేకును పెట్టుకొని పిండిని అందులో పెట్టి నేరుగా నూనెలోకి గుండ్రంగా చుట్టాలి. వీటిని రెండువైపులా బంగారు రంగు వచ్చేవరకు కాల్చుకోవాలి. ఇవే మణుగుపూలు. అరిసెలతోపాటు తినడానికి ఎంతో రుచిగా కమ్మగా ఉంటాయి.
*
సకినాలు
*
కావాల్సిన పదార్థాలు
మినపప్పు: చిన్న కప్పు
బియ్యం పిండి: ఒక కిలో
నువ్వులు: కప్పు
నూనె: తగినంత
తయారుచేసే విధానం
సక్కినాలనే చక్కిళాలు అని కూడా అంటారు. సక్కినాలను రెండు పద్ధతుల్లో చేసుకొంటారు. బియ్యాన్ని నానబెట్టి తడి బియ్యంతోనే పిండి పట్టించి సకినాలను చుట్టుకోవడం ఒక పద్దతి.
రెండో పద్ధతి
ముందుగా మినపప్పును నూనె లేకుండా వేయించుకుని మిక్సీ వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ తరువాత తడి బియ్యాన్ని పిండి కొట్టుకోవాలి. బియ్యంపిండిలో మినపప్పు పొడి, నువ్వులను వేసి కలుపుకోవాలి. బాణలిలో రెండు చెంచాల నూనెను వేసి కాగిన తరువాత ఆ వేడి నూనెను కలిపి పెట్టుకొన్న పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తరువాత కొద్దినీళ్లను చేరుస్తూ చపాతీ పిండిలాగా తయారుచేసుకోవాలి. ఒక పదినిముషాలు తడిగుడ్డ చుట్టి ఉంచాలి. ఆ తరువాత చేతికి నూనె రాసుకొని మెల్లగా రెండు వేళ్లతో మెలికెలు తిప్పుతూ గుండ్రంగా సకినాన్ని తిప్పి ఒక పేపరు పైన కానీ పళ్లెంలోకానీ ఆరబెట్టుకోవాలి. ఇలా అన్ని చక్కిళాలను చేసి పెట్టుకొని పూర్తిగా ఆరనివ్వకుండా కొద్ది తడిగా ఉన్నప్పుడే స్టవ్‌పై బాణలిలో నూనె వేసి కాగిన తరువాత అందులో సకినాలను వేసి బాగా కాల్చి తీసుకోవాలి. అంతే కరకరలాడే సకినాలు తయారు.
*
నువ్వుల లడ్లు
*
కావాల్సిన పదార్థాలు
నువ్వులు: పావుకిలో
బెల్లం పొడి: పావుకిలో
పల్లీలు: చిన్న కప్పు
నెయ్యి: నాలుగు చంచాలు
జీడిపప్పు: పది
తయారుచేసే విధానం
ముందుగా నువ్వులను, పల్లీలను నూనె లేకుండా వేయించుకోవాలి. మంచివాసన వస్తూ ఎర్రగా కాలిన నువ్వులను, పల్లీలను బాణలి నుంచి వేరు చేసి చల్లార్చుకోవాలి. అదే బాణలిలో ఒక చెంచా నెయ్య వేసి కాగిన తరువాత జీడిపప్పును వేసి వేయంచుకోవాలి. ఒక చిన్నకప్పు నువ్వులను వేరుగా పెట్టుకుని నువ్వులు, పల్లీలను పొడి కొట్టుకోవాలి. బెల్లంపొడికి కొన్ని నీళ్లను చేర్చి పాకం పట్టుకోవాలి. గట్టిపాకం రాగానే నువ్వులు, పల్లీల పొడిని, జీడిపప్పును, నెయ్యిని పోసి కలియబెట్టుకోవాలి. దీన్ని స్టవ్ నుంచి దింపేసి వేడి చల్లారకుండానే చిన్న చిన్న లడ్డుల్లా చేసుకోవాలి. చేసిన నువ్వుల లడ్డూను ఇందాక విడిగా తీసిపెట్టుకొన్న నువ్వుల్లో దొర్లించాలి. అంతే నువ్వుల లడ్డు రెడీ. ఈ లడ్డూలకు కాజూ పొడి కూడా చేర్చుకుంటే రుచిగా, ఆరోగ్యంగా ఉంటుందనుకొనేవాళ్లు కాజుపొడిని కూడా బెల్లం పాకానికి చేర్చుకుని ఉండలు కట్టుకోవాలి.
*
సంక్రాంతి పొంగలి
*
కావలసిన పదార్థాలు
కొత్త బియ్యం: పావు కిలో
పెసర పప్పు: పావుకిలో
శనగపప్పు: పావుకిలో
బెల్లం: పావుకిలో
నెయ్యి: పావుకిలో
పాలు: అరలీటర్
నీళు: అరలీటర్
జీడిపప్పు: పది
కిస్‌మిస్‌లు: పది
పిస్తా: పది
ఎండు కొబ్బరి పొడి: 2 చెంచాలు
తయారుచేసే విధానం
ముందుగా బియ్యం, పప్పులను విడివిడిగా కడిగి పెట్టుకోవాలి. తరువాత స్టవ్‌పై పాలను కాచి పొంగించి దానిలో కడిగిపెట్టుకున్న పప్పులు, బియ్యం వేసి నీళ్లు కూడా చేర్చాలి. బియ్యం, పప్పులు రెండూ మెత్తగా ఉడికిన తరువాత బెల్లాన్ని మెత్తగా పొడి చేసుకొని వాటికి చేర్చాలి. మధ్యలో కాస్త నెయ్యి కూడా చేర్చాలి. బాగా ఉడికిన తరువాత పాత్రను కిందకు దింపాలి. స్టవ్‌పై బాణలిని వుంచి నెయ్యి వేసి వేడి చేసి అందులో జీడిపప్పు, పిస్తా, ఎండుద్రాక్ష వేసి వేయించుకోవాలి. బాణలిని దింపేటపుడు ఎండుకొబ్బరిని కూడా చేర్చి ఆ మిశ్రమం మొత్తాన్ని పొంగలికి చేర్చుకోవాలి. అంతా బాగా కలిపితే సంక్రాంతి పొంగలి తయారైనట్లే. దీన్ని మొదటగా సూర్య భగవానుడికి సమర్పించి అందరూ తీసుకోవాలి.