Others

కవిత్వాలు - ఇతివృత్తాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్ణన ప్రధానమైంది కవిత్వం. కవిత్వానికి ఇతివృత్తం ప్రాణం. ఇతివృత్తం అంటే కథాంశం. వర్ణించదగిన పదార్థం. ‘పిండికొద్దీ రొట్టె’ అనే సామెత పిండి ఎలా ఉంటే రొట్టె అలా తయారౌతుందనే సత్యాన్ని చెబుతుంది. దేనికైనా ‘పిండి’ ఉండాలి. పిండి అంటే మూలపదార్థం. వౌలికద్రవ్యం. గాలిలో మేడలు కట్టడం ఎలా అసాధ్యమో, వస్తువు లేనిదే కవిత్వం రాయడం అలాగే అసాధ్యం. చిన్న కవిత కూడా విషయానికి లోబడే ఉంటుంది. వర్ణనకు తగినంత విషయ సంపద లేకుంటే ఆ కవిత్వం పేలవంగా మారిపోతుంది.
కవిత్వానికి ఇతివృత్తం ఎలా ఉండాలి? అనే ప్రశ్న అతి ప్రాచీన కాలం నుండి కొనసాగుతున్నది. ‘పుణ్య శ్లోకస్య చరితముదాహరణమర్హతి’ (పుణ్యకీర్తనుడైన కథా నాయకుని చరిత్ర వర్ణింప దగినది) అని విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణంలో అంటాడు. పుణ్యకీర్తనుడంటే మంచి పనులు చేసేవాడు. అలాంటి వాణ్ణి గూర్చి వర్ణించాలని అలంకార శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కవిత్వానికి ఇతివృత్తం ప్రధానం కాదనే వాళ్లూ ఉన్నారు. వర్ణించే తీరే ప్రధానమనీ, అది లోకోత్తర ప్రతిభతోనే ఉద్భవిస్తుందనీ అంటారు. కానీ, విషయం లేకుండా వర్ణనం ఎలా సంభవం? దృశ్యం ఉంటే కదా వ్యాఖ్యానం. దృశ్యమే లేనప్పుడు ఏ వ్యాఖ్యా ఉండదు. వస్తువు దర్శనంతోనే మనస్సు స్పందిస్తుంది. భావుకుడు మనోహర ప్రకృతిని దర్శించినప్పుడు పులకించి పోతాడు. భావుకుడు కానివాడు స్పందించలేడు. నిర్మల వినీలాకాశాన్ని చూచినప్పుడు, వెనె్నలలు కురిసే ఇందు బింబాన్ని తిలకించినప్పుడు, గలగల పారే సెలయేళ్లను పారవశ్యంతో వీక్షించినప్పుడు హృదయం రాగరంజితవౌతుంది. కనబడే దృశ్యాలన్నీ ఇతివృత్తాలే. ఇతివృత్తాలను చక్కగా ఎంచుకొన్న వేళలోనే మానసిక స్పందన హృద్యంగా ఉంటుంది. నీరస విషయాలను ఇతివృత్తాలుగా ఎంచుకుంటే ఎంత మంచి సామర్థ్యం కలిగిన కవి అయినా చక్కని కావ్యాన్ని రాయలేడు. ఇతివృత్తాలే కావ్యాలకు ప్రాణాలు. అవిలేనివి ప్రాణరహిత శరీరాల వంటివే. ధర్మార్థ కామ మోక్షాలనే ప్రధానాంశాలుగా చేసుకొన్నందువల్లనే రామాయణ, భారత, భాగవతేతిహాసాలు లోకవంద్యాలైనాయి. ఉత్తమగుణగణ్యులైన రామాదులను కథాయకులుగా గ్రహించినందువల్లనే రఘువంశాది మహాకావ్యాలు చరిత్రలో నిలిచిపోయాయి. ప్రతి కవితావస్తువుకూ లౌకిక, అలౌకిక ప్రయోజనాలుంటాయి. లోకంలో బ్రతికి ఉన్నంత కాలం మనిషి లౌకిక ప్రయోజనాలను పొందాలని ఆరాటపడుతాడు. మరణానంతరం కూడా మోక్షాది విషయాలున్నాయనీ, పుణ్యపాప ఫలాలు వెంటాడుతాయనీ నమ్మే మనిషి అలౌకిక ప్రయోజనాలైన పుణ్యాదులను ఇష్టపడుతాడు. కనుక సాహిత్యం శ్రేయోదాయకంగానూ, ప్రేయోదాయకంగానూ ఉండాలని అలంకారికులు అంటారు. శాశ్వతక్షేమం శ్రేయస్సు. ప్రియమైన విషయం ప్రేయస్సు. ప్రియమైన విషయం హితం కావచ్చు, కాక పోవచ్చుగానీ, శ్రేయోదాయకమైన విషయం సదా హితకరమైనదే. పైపై మెరుగులకు లోబడి ప్రియమైనదే చాలనుకొంటే అది హితకరం కాదు. మూర్ఖులు ప్రేయస్సును మాత్రమే ఇష్టపడి, శాశ్వతానందానికి దూరవౌతారనీ, వివేకవంతులు శ్రేయస్సునే కోరుతూ అభ్యుదయ పరంపరలను పొందుతారనీ కఠోపనిషత్తు చెబుతోంది. కనుక ఇతివృత్తాలు శ్రేయోదాయకంగా ఉండాలి.
కావ్యాలు సకల కళలకూ నిలయాలు. కళలన్నీ వర్ణించదగిన విషయాలే. ఒక కావ్యాన్ని చదివితే అన్ని శాస్త్రాలు, కళలూ అనుభవంలోకి రావాలి. వాటితో ఆత్మీయ పరిచయం జరగాలి. అప్పుడే అలాంటి కావ్యాలకు వనె్న వస్తుంది. ఒక్క పదం చాలు మనిషి జీవితాన్ని మార్చటానికి. ఒక్క పద్యం చాలు సచ్ఛీలాన్ని పెంపొందించడానికి. పొయ్యి మీద ఉడుకుతున్న పాత్రలో ఒక్క మెతుకు ముట్టి చూస్తే చాలు అన్నం ఉడికిందో లేదో తెలుస్తుంది. కావ్యాలలోనూ కొంత భాగాన్ని ఆస్వాదిస్తే చాలు, కావ్యగత శోభావిలాసం తెలిసిపోతుంది.
ఇతివృత్తం లేని కవిత లేదు. ఇతివృత్తంలేని కావ్యం లేదు. మనిషి జీవనమే ఒక మహేతిహాసం. అందులో అడుగడుగునా కనబడే సంఘటనలన్నీ ఇతివృత్తాలే. కనుక కవిత్వానికి అందమూ, చందమూ ఇతివృత్తమే అనడం సమంజసం!

- డా. అయాచితం నటేశ్వరశర్మ, 9440468557