రాష్ట్రీయం

ఆందోళనలపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 26: ప్రత్యేక హోదా కోసం ఆంధ్రా యువత పేరిట విశాఖ ఆర్కే బీచ్‌లో గురువారం తలపెట్టిన వౌన దీక్షను పోలీసులు ఉక్కుపాదంతో అణచివేశారు. వైకాపా తలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీని సైతం అడ్డుకున్నారు. ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన వైకాపా అధినేత జగన్‌ను నగరంలో అడుగుపెట్టనీయ లేదు. పోలీసుల తీరును నిరసిస్తూ విపక్ష నేత విమానాశ్రయంలో రన్‌పైనే బైఠాయించారు.
విశాఖ ఎయిర్‌పోర్టులో గురువారం హైడ్రామా చోటు చేసుకుంది. కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు వైకాపా అధినేత జగన్ సాయంత్రం నాలుగు గంటల సమయంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆయనతోపాటు ఎంపిలు వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి తదితరులు వచ్చారు. జగన్ బృందం విమానం దిగీదిగగానే పోలీసులు వారిని కట్టడి చేశారు. జగన్‌ను ఎయిర్‌పోర్టు లాంజ్‌లోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో ఆయన అప్రాన్ (విమానాలు పార్క్ చేసే స్థలం) మీదే కూర్చుండిపోయారు. ఈ కారణంగా విమానాల రాకపోకలకు 20 నిమిషాలసేపు అంతరాయం ఏర్పడింది. పోలీస్ అధికారులు జగన్ దగ్గరకు వెళ్లి, వెనుదిరిగి వెళ్లిపోవలసిందిగా విజ్ఞప్తి చేశారు. అందుకు జగన్ ససేమిరా అన్నారు. కాసేపటి తరువాత జగన్, తదితరులు అరైవల్ లాంజ్‌లోకి వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. దీంతో జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, అరైవల్ లాంజ్‌లోకి కూడా వెళ్లనీయకుండా, తమను ఏం చేయాలనుకుంటున్నారని పోలీసులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా లాంజ్‌లోకి వెళ్లడానికి అడ్డుకుంటున్న సివిల్ పోలీసులను, సిబ్బందిని విజయసాయిరెడ్డి నెట్టేశారు. ఎంపి సుబ్బారెడ్డి తీవ్ర స్వరంతో పోలీసులపై విరుచుకుపడ్డారు. కాబోయే సిఎంనే అడ్డుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దశలో ఎయిర్‌పోర్టులో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎయిర్‌పోర్టు బయటకు రావడానికి పోలీసులు నిరాకరించడంతో జగన్ చేసేది లేక 6.30 గంటలకు మరో విమానంలో హైదరాబాద్ వెళ్లిపోయారు. ఇదే సమయంలో విమానాశ్రయానికి చేరుకున్న వైకాపా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, పార్టీ మహిళా నాయకులు అకస్మాత్తుగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
ఎక్కడికక్కడ అరెస్టులు
పోలీసులు గురువారంనాడు ఆర్కే బీచ్‌లోకి చీమను సైతం దూరనీయలేదు. కోస్టల్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ వరకూ దాదాపు మూడు కిలోమీటర్ల మేర బీచ్‌రోడ్డులోకి ఎవరినీ అనుమతించకుండా అడ్డుకున్నారు. బీచ్‌రోడ్డుకు వెళ్లే అన్ని మార్గాల్లోనూ వందల సంఖ్యలో పోలీసులు మోహరించారు. రోడ్డుపై కనిపించిన సమూహాలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుని ఊరికి దూరంగా ఉన్న గ్రేహౌండ్స్ మైదానానికి తరలించారు. వౌన దీక్షకు మద్దతు పలికేందుకు వచ్చిన సినీ నటుడు సంపూర్ణేష్ బాబును అరెస్టు చేయగా, ‘మా’ పూర్వపు అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసి వదిలిపెట్టారు. కొవ్వొత్తుల ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్న వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సహా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ను అరెస్టు చేశారు. అత్యంత భద్రత ఏర్పాటు చేసినప్పటికీ ప్రత్యేక హోదా ఉద్యమ నేత చలసాని శ్రీనివాస్, లోక్‌సత్తా ప్రతినిధి సహా పలువురు సముద్రం ఒడ్డు నుంచి వైఎంసిఎ వద్దకు చేరుకోగలిగారు. అయితే ఆ తరువాత వీరిని అరెస్టు చేశారు. అలాగే వైఎంసిఎ వద్దకు చేరుకున్న సుమారు 100 మంది జనసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న డివైఎఫ్‌ఐ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

చిత్రాలు..ఆంధ్రా యూనివర్శిటీ వద్ద హోదాకోసం ఆందోళనకు దిగిన విద్యార్థులను తరిమికొడుతున్న పోలీసులు.
* విశాఖ ఎయిర్‌పోర్టు రన్‌వేపై కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్న వైకాపా అధినేత జగన్ తదితరులు