డైలీ సీరియల్

పూలకుండీలు 49

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతేగాని, ఈళ్ళకాడ నేను డబ్బులూ తీసుకోవడమేంది! నా భార్యను ఇక్కడ వుంచి పోవడమేంది!? అసలు నా భార్యను ఏం జేశారో? యాడదాశారో? చెప్పమని నేనొస్తే మీరంతా కలిసి ఉల్టా నామీదనే నేరం మోపి నన్ను ఎర్రోన్ని జెయ్యాలని చూస్తున్నారా?’’ అంటూ ధైర్యంగా బదులిచ్చాడు ఎల్లయ్య. అక్కడ జరుగుతున్న తతంగమంతా చూస్తూ నిల్చున్న కానిస్టేబుల్స్ ‘‘పాపం! ఈ ఊరోడెవడోగాని వీడి కర్మకాలి ఇయ్యాల వీళ్ళ పాలబడ్డాడు. అటు మన ఎస్సైగాడు, ఇటు ఈ గల్లీ లీడర్‌గాళ్ళు హాస్పిటల్ వాళ్ళ దగ్గర ఫుల్లుగా పట్టించి చివరికి వాణ్ణి బకరా చేసి పంపుతారు చూడు’’ అనుకుంటూ గుసగుసలాడుకోసాగారు. ‘‘ఏంట్రా నా కొడకా! చేసేదంతా చేసి ఏమీ ఎరగనోడి మాదిరిగా మాట్లాడుతున్నావేంట్రా!? అంటూ ఎల్లయ్యమీద కెళ్ళాడు ఎస్సై. ‘‘ఇయ్యనె్నందుకు సార్! మీకు చేతనైతే నా భార్యను నాకు చూపించి నా ఎంట పంపండి, లేదంటే నా తిప్పలేందో నన్ను పడనియ్యండి’’ కడుపు ఎసరుకుండలా మసులుతుంటే తట్టుకోలేక సూటిగా ఎస్సై కళ్ళలోకి చూస్తూ కొంచెం గట్టిగానే మాట్లాడాడు ఎల్లయ్య.
తన పట్ల ఒక అనామకుడు అంత నిరసగా మాట్లాడడంతో తట్టుకోలేకపోయిన ఎస్సై ‘‘ఏయ్ కానిస్టేబుల్స్ వీడేదో నకరాలు చేస్తున్నాడుగాని లాక్కుపోయ్యి జీపెక్కించండి, స్టేషన్‌కి తీసుకుపొయ్యి గూటం ఎక్కిస్తే గాని వీడి పఖర్ తగ్గదు’’ గాండ్రు గాండ్రుమని రంకెలు వేస్తూ ఆర్డర్ చేశాడు. అప్పటిదాకా తమలో తాము మాట్లాడుకుంటూ ఎల్లయ్యమీద సానుభూతి చూపించిన పోలీసులు కాస్త ఎస్సై మాటలతో యాంత్రికంగా స్పందిస్తూ అతణ్ణి చుట్టుముట్టి రెక్క పట్టుకుని బయట వున్న జీపు వైపు ఈడ్చుకుపోవడానికి ఉద్యుక్తులవ్వసాగారు.
ఆ దృశ్యాన్ని చూసిన ఎల్లయ్య తల్లిదండ్రులు, పిల్లలూ మరోసారి ఘొల్లుమంటూ పోలీసులకు అడ్డుపడి ‘‘ఇదెక్కడి అన్యాయం నాయన్లారా! నా కోడల్ని మాయమాటలు చెప్పి ఈడికి తీసుకొచ్చి దాసిపెట్టినోల్లను వదిలిపెట్టి, ఇదేందని అడిగిన పాపానికి అనె్నం పునె్నం ఎరుగని మా కొడుకును స్టేషన్ తీసుకపొయ్యి కోదండం ఎక్కిస్తానంటారా!?’’ అంటూ లబలబలాడారు. ఇంత జరుగుతున్నా అక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చున్న వాళ్ళల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకొచ్చి ‘‘అసలేంటిదంతా, ఎందుకతన్ని అట్లా కొట్టి పట్టుకుపోతున్నారు? ఆ పిల్లల్ని, ముసలోళ్లను ఎందుకట్లా ఏడిపిస్తున్నారు?’’ అంటూ అడిగిన మనిషే లేడు. పోలీస్ వాళ్ళ హడావుడి అలా కొనసాగుతుండగానే ఒకళ్ళకొకళ్ళు సైగ చేసుకున్న గల్లీ లీడర్లు మెల్లగా ఎస్సై దగ్గరికొచ్చి ‘‘సార్! వీళ్ళేదో ఏమీ ఎరుగని ఊరోళ్ళని మేం కలుగజేసుకున్నాంగాని లేకుంటే మాకేం పని సార్! మా దారిన మేం బోతున్నంగాని మీ పనేందో మీరు చూసుకోండి!’’ అంటూ అక్కణ్ణించి మెల్లగా తప్పుకొని ఫైనాన్స్ సెక్షన్‌లోకి మాయమయ్యారు. వాళ్లు అటు వెళ్ళగానే ఇటు పోలీస్‌ల వంక తిరిగి ఎస్సై ‘‘హాస్పిటల్లో న్యూసెన్స్ చేస్తున్న ఈ మొత్తం కుటుంబాన్నంతటినీ స్టేషన్‌కి తీసుకుపదండీ!’’ అంటూ తిరిగి ఆదేశించాడు ఎస్సై.
***
బయట జరుగుతున్నదేదీ ఎరుగని శాంతమ్మ తన గదిలో పడుకుని ఇల్లు, పిల్లల్ని, భర్త, అత్తమామల్ని తలపుల్లోకి తెచ్చుకుని రకరకాలుగా తలపోయసాగారు. అయితే, అప్పటిదాకా కింద జరుగుతున్న తతంగమంతా శాంతమ్మకు తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో స్వీపర్ కనకమ్మ పరుగు పరుగున ఆవిడ గదిలోకి వెళ్లింది. ‘‘ఏందక్కా! ఇయ్యాల లేటుగాచ్చావేంది?’’ కనకమ్మను చూస్తూనే ఆప్యాయంగా పలుకరించింది శాంతమ్మ. తను చెప్పాలని వచ్చిన విషయం ‘‘చెప్పాలా వద్దా?’’ అన్న సందిగ్ధంలో పడిపోయింది కమలమ్మ. ‘‘ఏందక్కా! ఏం మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తూన్నావేంది?’’ అంటూ మళ్లీ తనే పలుకరించింది శాంతమ్మ. అయినా కనకమ్మ మాట్లాడకపోవడంతో అప్రయత్నంగా బయట ఏదో జరిగిందన్న సంశయం తన మనసులో బలుసు ముల్లులా పొడుచుకొస్తుంటడే ‘‘గట్టుమీద పడ్డోడికి గాయాలెన్ని? అన్నట్టు ఇంతకంటే ఎక్కువ నాకిందేమైతదక్కా! ఏందో చెప్పు’’ ఎదురుదెబ్బలు తిని తినీ రాటులేలినట్టు గుండె దిటవుతో అంది శాంతమ్మ. శాంతమ్మ గుండె నిబ్బరాన్ని అవగాహన చేసుకున్న కనకమ్మ కింద జరిగిన ఒక్కో సంఘటనను మెల్లగా బయట పెట్టింది. కనకమ్మ అనుకున్నట్టు ఆ మాటలు విన్న శాంతమ్మ గుండెలు బాదుకుంటూ భోరుమని ఏడవలలేదు, సరిగదా కళ్ళు మూసుకొని ఏదో దీర్ఘంగా ఆలోచించసాగింది. శాంతమ్మ ప్రవర్తనకు ఒకింత ఆశ్చర్యపోయిన కనకమ్మ ‘‘నేను చెప్పిన సంగతి అదాటున వినేసరికి శాంతమ్మ మెంటల్‌గా కిందు మీదు కాలేదు గదా?’’ అన్న సందేహంతో బయం భయంగా ఆవిడ వంకే చూడసాగింది.
‘‘అక్కా! తెగబడ్డవాడికి తెడ్డే లింగం అన్నట్టు మా ఆయిన లెక్కనే నేను గూడా ఈ ముఠా సంగతంతా గాలి గాలి జేసి వదలిపెడతా’’ అప్పటిదాకా తను ఆలోచించిందేమిటో సూచనప్రాయంగా తెలియజేసింది శాంతమ్మ.
ఆ మాటలు వింటూనే ‘‘పొద్దుటికుంటే మాపటికి, మాపటికుంటే పొద్దటికి ఠికానా లేని మన్లాంటోల్లం కోట్లకు పడగలెత్తిన వాల్లను ఏం చెయ్యగలం చెల్లే!’’ అంటూ నిస్సహాయంగా మాట్లాడింది కనకమ్మ.‘‘లేదక్కా! ఎదురుదెబ్బలు తిన్నోడే ఎంతకైనా తెగిస్తాడు. మావూల్లో ఆ ఆర్‌ఎంపి లింగడి కటాన్నుంచి ఈవూల్లో వెంకట్రెడ్డి, ఆస్పత్రివాళ్లదాకా కమిషన్ల మీద కమీషన్లు తీసుకొని నాకిస్తానన్న డబ్బుల్లో ఆఖరికి పావలా వంతు కూడా ఇచ్చేటట్లు లేరు.
వీల్లిట్లా ఎంతమందిని మోసం జేసుకుంట వస్తున్నారో? వాళ్ళ మోసాన్ని బంగన బయలు జేసి, వాళ్ళి పరువును పచ్చి పులుసుకన్నా పల్చన చెయ్యకుంటే నా పేరు దీసి మారు పేరు బెట్టు’’ ఒక్కొక్కమాటను వత్తి పలుకుతూ అంది శాంతమ్మ.

- ఇంకా ఉంది

త్వరలో

కొత్త సీరియల్ ప్రారంభం

రాయల కాలం ... రామరాజ్యం
ఎక్కడచూచినా కళారాధనలే, శాస్తవ్రాదోపవాదాలే...
రాయల రాజనీతి...
అప్పాజీ రాజకీయ చతురత....
ఇంకా...ఇంకా....
కాలంలో కలసిన గతాన్ని తవ్వితే....
నాటి మనుషులే నేటి ఆధునికులైతే....
వారికి ఆ పురాతన జ్ఞాపకాలు సజీవంగా కనిపిస్తే
వారు ఏవౌతారు?
మధురమైన కలల్లో
గతాన్ని నెమరే సి
మనసును స్పృశించే

బంగారు కల

చిల్లర భవానీదేవి

-శిరంశెట్టి కాంతారావు