మెయన్ ఫీచర్

సీపీఎంలో ‘పొత్త్తు’ చిచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు తప్పవన్న ఊహాగానాల నేపథ్యంలో విపక్ష పార్టీలన్నీ తమ ఉనికి కోసం తత్తరపాటు పడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీని ఓడించడమే ఏకైక ఎజెండాగా దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ విధానాలను ప్రకటిస్తున్నాయి. అయితే, ప్రబల రాజకీయశక్తిగా ఎదిగిన బీజేపీని ఎదుర్కోగల ప్రజామద్దతుగాని, ఎన్నికల ప్రచారానికి తగిన వనరుల సమీకరణ గాని, కనీసం కలసి వచ్చే పార్టీలతో పొత్తు కుదుర్చుకోవడం పట్ల గాని ఇప్పటివరకు స్పష్టమైన ప్రణాళికలను విపక్షాలు ఏర్పాటు చేసుకోలేకపోతున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి రోజున జమిలి ఎన్నికల గురించి- ఒకవైపు రాష్టప్రతి రామనాథ్ కోవింద్ తన ప్రసంగంలో, మరోవైపు ప్రధాని మోదీ ఎన్టీయే పక్షాల సమావేశంలో ప్రస్తావించడంతో విపక్షాల్లో ‘ముందస్తు’ వేడి రాజుకుంది. హడావుడిగా ఎన్‌సీపీ నేత శరద్ పవార్ చొరవ తీసుకొని కాంగ్రెస్ సహా కొన్ని ప్రతిపక్షాలతో మంతనాలు జరిపారు. బీజేపీకి వ్యతిరేకంగా విస్తృత కూటమి ఏర్పాటుకు వచ్చేవారం కాంగ్రెస్ నేత సోనియా గాంధీ సారథ్యంలో 18 పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు.
బీజేపీ రెండేళ్లుగా వచ్చే ఎన్నికలకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. లోక్‌సభలో 350 సీట్లు గెలుచుకోవడం తమ లక్ష్యం అంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేస్తున్నారు. 1975 నుండి కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలలో క్రియాశీలకంగా పాల్గొంటున్న సిపిఎం క్రమంగా ఎదుగుతూ వచ్చింది. అయితే ఏదో ఒక కూటమితో గాని, పార్టీతో గాని కలవడం తప్ప సొంతంగా బలం పెంచుకోలేకపోయింది. దీంతో 2009 నుండి దాదాపు ఒంటరి పోరాటం జరపవలసి రావడంతో ఆ పార్టీ బలం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. 34 ఏళ్లపాటు పశ్చిమ బెంగాల్‌లో తిరుగులేని అధికారం చెలాయించిన ఆ పార్టీ ఇప్పుడు ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పొందలేకపోతున్నది. తాను అధికారంలో ఉన్న కేరళ, త్రిపురలలో సైతం అస్తిత్వం నిలుపుకునేందుకు సీపీఎం శ్రమపడవలసి వస్తున్నది. జాతీయ పార్టీగా ఎన్నికల కమిషన్ గుర్తింపును పోగొట్టుకొనే పరిస్థితులు నెలకొన్నాయి. పార్లమెంట్‌లో రెండంకెల సీట్లుకూడా పొందలేకపోతున్నది. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికలు ఆ పార్టీ రాజకీయ మనుగడకే ప్రశ్నార్థకంగా కానున్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో జరిగే పార్టీ ‘కాంగ్రెస్’ కీలకంగా మారనున్నది. అందులో ఆమోదించాల్సిన రాజకీయ తీర్మానం విషయమై పార్టీలో అప్పుడే అలజడి ప్రారంభమైనది. రాజకీయ ఎత్తుగడలు అనుసరించడంలో అంతర్గంతంగా తీవ్ర సంక్షోభాన్ని సీపీఎం నేతలు ఎదుర్కొంటున్నారు. కోల్‌కతలో ఇటీవల జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రవేశ పెట్టిన రాజకీయ ముసాయిదా తీర్మానం వీగిపోవడం ఆ పార్టీలో తీవ్రమవుతున్న అంతర్గత వైరుధ్యాలను వెల్లడి చేస్తోంది.
1975లో అప్పటి సీపీఎం ప్రధాన కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానాన్ని కేంద్ర కమిటీ తిరస్కరిస్తే ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీతో అనుసరించవలసిన వ్యూహంపై ఆ పార్టీ పలు వైరుధ్యాలను ఎదుర్కొంటూనే ఉన్నది. సిపిఐ నుండి చీలిపోయి సిపిఎం ఏర్పడినప్పుడు నిఖార్సైన కాంగ్రెసు వ్యతిరేక పక్షంగా రాజకీయాలు నడిపి ఇతర ప్రతిపక్షాలతో పలు సందర్భాలలో చేతులు కలిపి రాజకీయంగా తన బలాన్ని పలు రెట్లు పెంచుకోగలిగింది. మరోవంక కాంగ్రెస్‌తో చేతులు కలిపిన సిపిఐ బలం తగ్గుముఖం పట్టడంతో సీపీఎం అప్పటి నుంచి వామపక్షాలలో పెద్దన్న పాత్ర వహిస్తూ వస్తున్నది.
1977 ఎన్నికలలో జనతాపార్టీతో సీట్ల సర్దుబాటు చేసుకోవడం- సీపీఎం ఒక బలమైన జాతీయ పక్షంగా ఎదగడంలో మైలురాయి అని చెప్పవచ్చు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనతా పార్టీతో పొత్తు కోసం సీపీఎం నాయకత్వం తీవ్రంగా ప్రయత్నం చేసింది. అయితే సీపీఎంకు 40 శాతం సీట్లు వదలడానికి ఇష్టపడక అన్ని సీట్లకూ జనతా పార్టీ పోటీ చేయడంతో విధిలేక సీపీఎం సొంతంగా పోటీ చేసి అనూహ్యంగా అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ వ్యతిరేక శక్తిగా ఆ రాష్ట్రంలో జనతాపార్టీని కాకుండా సీపీఎంను ప్రజలు గుర్తించారు. 34 ఏళ్లపాటు అత్యంత నిరంకుశ విధానాలు అవలంబించి అధికారం తమ చేయి దాటకుండా సీపీఎం నేతలు జాగ్రత్త పడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎదగకుండా ఢిల్లీలో ఆ పార్టీ నాయకులతో మిత్రత్వం కొనసాగిస్తూ స్థానికంగా తమకు బలమైన పోటీ ఇవ్వకుండా నివారింప గలిగారు. కాంగ్రెస్ నాయకులు అనుసరిస్తూ వచ్చిన ఇటువంటి లాలూచీ రాజకీయాలపై తిరుగుబాటు చేసిన మమతా బెనర్జీ కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి సొంతపార్టీ పెట్టుకొని, సీపీఎంపై అలుపెరుగని పోరాటం జరిపి చివరకు అధికారంలోకి రాగలిగారు. బెంగాల్‌లో సీపీఎం మూలాలలనే కదిలించే వేసే ప్రయత్నం ఆమె చేస్తున్నారు.
2004లో బిజెపిని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇవ్వడం మినహా ఎప్పుడు కాంగ్రెస్‌తో సీపీఎం ఎన్నికల పొత్తు పెట్టుకోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని కొన్ని సందర్భాలలలో కొన్ని సీట్లు గెలుచుకోగలిగింది. ఇక్కడ నుండి కాంగ్రెస్ తో నేరుగా పొత్తు పెట్టుకోవడం పలువురు సీపీఎం నాయకులకు నచ్చలేదు.
సీపీఎం ఒకప్పుడు అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి కావడంతో ఆ పార్టీతో ఢిల్లీలో సయోధ్య ఏమిటనే ప్రశ్నలు తలెత్తాయి. ఆ తర్వాత సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ప్రకాశ్ కారత్ బాధ్యతలు చేపట్టిన్నప్పటి నుండి క్రమంగా పార్టీ కాంగ్రెస్ కు దూరంగా జరుగుతూ వచ్చింది. యుపిఎ ప్రభుత్వం హయం నుండి సీతారాం ఏచూరి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలతో సన్నిహితంగా వ్యవహరిస్తూ వచ్చారు. ప్రకాశ్ కారత్ మాత్రం తొలి నుండి కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా తమ పార్టీ రాజకీయ విధానం ఉండాలని పట్టుబడుతున్నారు. కారత్ పట్టుదల కారణంగానే భారత్-అమెరికా అణు ఒప్పందానికి వ్యతిరేకంగా యుపీఏ ప్రభుత్వంపై బిజెపి సహకారంతో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. ఆ తీర్మానం వీగిపోయినా అప్పటి నుండి కాంగ్రెస్‌తో సీపీఎం పొత్తు తెగిపోయింది.
సీపీఎం ప్రధాన కార్యదర్శిగా కారత్ రాగానే ఒక విధంగా సోనియా గాంధీ ఆందోళన చెందారు. వెంటనే ఏచూరిని పిలిచి ‘వామపక్షాలతో సంబంధాలు తెగిపోగలవా?’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఆ తర్వాత అట్లాగే జరిగింది. అప్పటి నుండి సీపీఎం బలహీన పడుతూ రావడంతో కారత్ అనుసరిస్తున్న కాంగ్రెస్ వ్యతిరేక వైఖరియే అందుకు కారణం అంటూ ఏచూరి మద్దతు దారులు వాదిస్తూ వస్తున్నారు. ఏచూరి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనప్పటి నుంచి తిరిగి సిపిఎం కాంగ్రెస్ కి దగ్గరవుతూ వస్తున్నది. చరిత్రలో మొదటిసారిగా పార్టీ రాజకీయ వైఖరికి విరుద్ధంగా బెంగాల్‌లో కాంగ్రెస్‌తో కలసి సీట్లు సర్దుబాటు చేసుకొని అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసింది. ఆ విధంగా తాము చేయడం వల్ల బెంగాల్‌లో బిజెపి ప్రధాన ప్రతిపక్షంగా ఎదగకుండా నిరోధింప గలిగామని ఆ రాష్ట్ర సిపిఎం కార్యదర్శి సూర్యకాంతి మిశ్రా పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో సమర్థించుకోవడం తెలిసిందే.
సిపిఎంలో ఇప్పటివరకు ఎవరికీ రెండు పర్యాయాలు మించి రాజ్యసభకు వెళ్లే అవకాశం ఇవ్వలేదు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వారెవ్వరూ రాజ్యసభకు వెళ్లిన సందర్భం కూడా లేదు. ఈ రెండు నిబంధనలకు తిలోదకాలిచ్చి, పార్టీకి సొంతంగా గెలుపొందే బలం లేకపోయినా కాంగ్రెస్ మద్దతుతో మూడోసారి రాజ్యసభకు వెళ్లడానికి గత ఏడాది సీతారాం ఏచూరి విఫలప్రయత్నం చేశారు. ఆ సమయంలో బీజెపిని రాజ్యసభలో నిలదీయడానికి ఏచూరి వంటి నాయకుడు ఉండటం చాలా అవసరమని కాంగ్రెస్ నాయకుల సిఫార్సు కూడా పొందారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న కేరళలో సిపిఎంకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కావడంతో ఆ పార్టీతో ఎటువంటి అవగాహనకు వచ్చినా రాష్ట్రంలో తమకు ఎదురుదెబ్బ కాగలదని సీపీఎం నాయకత్వం స్పష్టం చేస్తూ వస్తున్నది. ఏచూరి అనుసరిస్తున్న కాంగ్రెస్ అనుకూల ధోరణుల పట్ల ఆ రాష్ట్ర పార్టీ నాయకత్వంతో పాటు పార్టీ కేంద్ర కమిటీలోని అత్యధిక సభ్యులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ మద్దతుతో ఏచూరి రాజ్యసభకు వెళ్లే ప్రయత్వాన్ని పార్టీ కేంద్ర కమిటీ అడ్డుకొంది. ఇటువంటి పరిస్థితులలో కాంగ్రెస్‌తో అవగాహనకు సిద్ధమని సంకేతం ఇస్తూ ఏచూరి ప్రవేశ పెట్టిన రాజకీయ ముసాయిదా తీర్మానాన్ని పార్టీ కేంద్ర కమిటీ 55-31 ఓట్ల తేడాతో తిరస్కరించింది. ఏచూరి, కారత్ కూడా బిజెపిని ఓడించాలని చెబుతున్నా అందుకు అనుసరించే వ్యూహాల విషయంలో మాత్రం విభేదిస్తున్నారు.
బీజేపీని ఓడించాలన్న లక్ష్యసాధన కోసం అధికారంలో ఉన్న పక్షాలతో ఎన్నికల పొత్తుకు దిగకుండా లేదా కూటములలో చేరకుండా కృషి చేయాలని ఏచూరి ప్రతిపాదించారు. అయితే అందులో ‘కాంగ్రెస్’ అనే పదం లేకుండా చేయడమే కాకుండా ‘అవగాహన’ అనే పదం కూడా వాడలేదు. తద్వారా కాంగ్రెస్‌తో రాజకీయ అవగాహన ఏర్పరుచుకోవడానికి అవసరమైన భూమిక ఏర్పరుచుకునే అవకాశం మాత్రం కల్పించారు. కానీ, కారత్ మాత్రం అదే లక్ష్యాన్ని కాంగ్రెస్ పార్టీతో ఎటువంటి అవగాహన లేదా పొత్తు లేకుండా సాధించాలని ప్రతిపాదించారు. తద్వారా బిజెపి, కాంగ్రెస్‌లకు సమదూరంగా ఉండాలనే పాత సైద్ధాంతిక వాదనను తెరపైకి తెచ్చారు. అయితే బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాలలో అవి కాంగ్రెస్‌తో పొత్తు ఏర్పరుచుకున్నా వాటితో కలసి పోటీ చేయడానికి అభ్యంతరం ఉండనవసరం లేదని ప్రతిపాదించారు. ఉదాహరణకు తమిళనాడులో కాంగ్రెస్‌తో డిఎంకె నేతలు పొత్తు ఏర్పర్చుకున్నారు. డిఎంకెతో వామపక్షాలు పొత్తు ఏర్పర్చుకొంటున్నాయి గదా.
కాంగ్రెస్, బిజెపీ ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న రాష్ట్రాలలో సిపిఎం సొంతంగా కొన్ని సీట్లకు పోటీ చేసి బిజెపిని ఓడించేలా ప్రజలకు పిలుపు ఇవ్వాలని కారత్ ప్రతిపాదించారు. బిజెపిని ఒంటి చేత్తోనే ఓడిస్తామని కాంగ్రెస్‌తో పొత్తుల ప్రసక్తి లేదని ఈ సమావేశం అనంతరం ఏచూరి స్పష్టం చేశారు. బిజెపిని సిపిఎం సొంతంగానే ఎదురొడ్డి ఓడించేందుకు సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.
ముసాయిదా ప్రకారం కాంగ్రెస్‌తో పొత్తు గానీ, ఎన్నికల్లో కలసి పనిచేసే అవకాశం గానీ లేదు. ఇది కేవలం రాజకీయ అంశమే. వామపక్షం.. వామపక్షంగానే బిజెపిని ఓడించేందుకు ప్రయత్నిస్తుంది. ఈ ముసాయిదా పార్టీ పెద్దల వద్దకు వెళుతుంది. దీనిపై వారే తుది నిర్ణయం తీసుకొంటారని ఏచూరి తెలిపారు. ఆయన ఇలా చెప్పడం ద్వారా హైదరాబాద్‌లో జరిగే పార్టీ కాంగ్రెస్‌లో ఈ విషయమై తిరిగి అంతర్గత పోరు జరిగే అవకాశం ఉన్నదని స్పష్టమైన సంకేతం ఇచ్చారు.
ప్రజా ఉద్యమాలలో ముఖ్యంగా కార్మికులు, కర్షకులు, కూలీలు, విద్యార్థులతో మమేకమై వీధి పోరాటాలు జరిపిన నాయకత్వం తరం సీపీఎంలో దాదాపుగా అంతరిస్తున్నది. ఇప్పుడు టివీ షోలు, మీడియా సమావేశాలకు, ప్రసంగాలకు పరిమితం అవుతున్న నాయకత్వం మాత్రమే ముందుకు వస్తున్నది. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఇటువంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నా వామపక్షాల బలం అంతా పేదప్రజలతో పోరాటాలు జరపడం కావడంతో- ఆ బలమే అదృశ్యం అవుతూ ఉండడంతో వారి రాజకీయ ఉనికి ప్రశ్నార్థకమైంది. ఇతర పార్టీలలో వలె కార్పొరేటు రాజకీయ సంస్కృతికి వామపక్షాలు అలవాటు పడలేకపోతున్నాయి. మరోవంక దశాబ్దాలుగా అనుసరిస్తున్న రాజకీయ విలువలను కాపాడుకోవడం అసాధ్యం అవుతోంది. దాంతో సమాజంలో వారి ప్రజా సంఘాలు గతంలో వలే ప్రభావం చూపలేకపోతున్నాయి. ఏదో ఒక పార్టీతో చేతులు కలిపితే గాని రాజకీయంగా నిలదొక్కుకోలేని పరిస్థితులో వామపక్ష నేతలు చిక్కుకొంటున్నారు.

-చలసాని నరేంద్ర