విజయనగరం

చంద్రబాబుని విమర్శించే స్థాయి సోము వీర్రాజుకు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీపురుపల్లి, ఫిబ్రవరి 5: రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడుని విమర్శించే స్థాయి బిజెపి నాయకుడు సోమువీర్రాజుకి లేదని మాజీ శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు గద్దే బాబూరావు అన్నారు. ఈ మేరకు ఆయన స్థానిక విలేఖరులతో సోమవారం మాట్లాడారు. రెండు పార్టీల మధ్య మంచి అవగాహన ఉందని, ఇలాంటివారి అనవసరపు ఆరోపణలతో మైత్రి దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపారు. బిజెపితో సత్సంబంధాలు లేకపోతే ఓటుకి నోటు కేసుతో బెదిరిస్తారన్న విషయంపై ఆయన మాట్లాడుతూ గతంలో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చంద్రబాబుపై 64కేసులు నమోదు చేశారని, ఒక్క కేసు కూడా నిలబడలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. తమ నాయకుడిని ఇష్టానుసారంగా విమర్శిస్తే సహించబోమన్నారు. రెండెకరాలతో వేల కోట్లు చంద్రబాబు సంసాదించారని అసత్య ఆరోపణలు చేయడం దారుణమని, అంబానిలు 15వేల కోట్లతో వ్యాపారాలు ప్రారంభించి లక్షల కోట్లకు ఎలా చేరుకున్నారో అదే విధంగా వ్యాపారంలో వచ్చే లాభాలు, పెరుగుతున్న ఆస్తులు విలువల కారణంగా చంద్రబాబు ఆస్తులు పెరిగి ఉంటాయని తెలిపారు. అంతేగాని అవినీతి సంపాదన కాదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా బిజెపి నాయకులు ఇలాంటి చవకబారు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు.

హోమియోతో వ్యాధులకు చెక్
నెల్లిమర్ల, ఫిబ్రవరి 5: హోమియోతో వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చు నని మిమ్స్ సంక్షేమ అధికారి గిరిబాబు హోమియో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ అన్నారు. స్థానిక మహాత్మా జోతిర్భాపూలే గురుకుల పాఠశాలలో మిమ్స్ హోమియో ఆసుపత్రి ఆధ్వర్యంలో సోమవారం వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో సుధాకర్ మాట్లాడుతూ హోమియో దీర్ఘకాలిక వ్యాధులనే కాకుండా మలేరియా, కలరా, ఆటలమ్మ, తదితర సంక్రమణ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు అని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ఆటలమ్మ వ్యాధి శోకకుండా నివారణ మందులు వేశారు. ఈ మందును వరుసగా మూడు రోజులుపాటు వేస్తామని అన్నారు. ప్రిన్సిపాల్ గణేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్బలక్ష్మి, పిఆర్‌ఒ శ్రీను, జమ్ము అప్పలనాయుడు పాల్గొన్నారు.

నాళంవారు, బట్టికాలువ సమస్యలు పరిష్కరించాలి
గజపతినగరం, ఫిబ్రవరి 5: మండలంలోని పురిటిపెంట గ్రామంలో గల సాగునీటి కాలువ సమస్యతోపాటు నాళంవారి భూములకు పట్టాల సమస్యను పరిష్కరించాలని తహశీల్దార్ బి.శేషగిరిరావును పురిటిపెంట గ్రామ సర్పంచ్ మండల సురేష్‌తోపాటు పలువురు నాయకులు సోమవారం కోరారు. గంగచోళ్లపెంట-పురిటిపెంట గ్రామాల మధ్యన చంపావతి నది నుండి వచ్చే సాగునీటి కాలువను సర్వేచేసి సాగునీరు ఇవ్వాలని కోరారు. ఈ వివాదం కోర్టులో గతంలో ఉండేదని, కోర్టు కూడా సాగునీటి కాలువ ద్వారా సాగునీరు ఇవ్వాలని తీర్పు ఇవ్వడం జరిగిందని అన్నారు. అలాగే హైకోర్టు తీర్పు ఇచ్చి దశాబ్దాలు గడుస్తున్నా నాళంవారి భూములకు పట్టాలను రెవెన్యూ అధికారులు ఇవ్వలేదని అన్నారు. దీని వలన రైతులకు రుణాలు ఇవ్వడంలేదని, అలాగే పంట నష్ట పరిహారాలు అందడంలేదని అన్నారు. భూములను అమ్మాలన్నా, కొనాలన్నా కొనేనాధుడు ఉండడం లేదని చెప్పారు. కోర్టు తీర్పును ఆధారంగా చేసుకుని రైతులకు పట్టాలు తక్షణమే మంజూరు చేయాలని కోరారు. ఈ రెండు సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు సమస్యలకు సంబంధించి పూర్తిసమాచారం సేకరిస్తానని వారం రోజులు వ్యవధి ఇవ్వాలని తహశీల్దార్ చెప్పారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు కరణం ఆదినారాయణ, టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు గండ్రేటి అప్పలనాయుడు, ఎంపిటిసి గొర్లి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా శ్రీరామానుజ కళ్యాణ మహోత్సవం
మెరకముడిదాం, ఫిబ్రవరి 5: మండలంలో గల బైరిపురం శ్రీ వెంకటేశ్యర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీరామానుజ 86వ కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. శ్రీరామానుజ సేవలను విస్త్రుత పరచాలన్న ఉద్దేశ్యంతో జిల్లాలో 108 కళ్యాణాలు జరిపేందుకు సంకల్పించారు. చినజీయర్ స్వామి స్థాపించిన వికాస తరగతి ఆధ్వర్యంలో రధయాత్రలతో పాటు ఈ కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో బాగంగానే బైరిపురం శ్రీ వెంకటేశ్యర స్వామి వారి ఆలయంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవానికి విశేశ ఆధరణ లభించింది. బైరిపురంలో పురాతణమైన ఆలయాల్లో శ్రీ వెంకటేశ్యర స్వామి ఆలయం ప్రసిద్ది గాంచింది. రామానుజ కళ్యాణంతో ఆలయ ప్రాంగణం పండగ వాతావరణం నెకొంది. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు సూరిబాబు స్థానిక సర్పంచ్ కెంగువ ధనుంజయ, ఎంపిటిసి సభ్యులు పప్పల కృష్ణమూర్తి, వైస్ సర్పంచ్ ఎస్ వెంకట సత్యన్నారాయణ, ప్రముఖ వ్యాపార వేత్తలు బాదం కశీవిశ్యనాధం, కందుల మల్లిఖార్జునరావు, సత్వవరపు చిన బాబు, శ్రీను, కె కరామారావు, అధిక సంఖ్యలో మహాళ భక్తులు పాల్గొన్నారు.

ఓడీఎఫ్ పేరున భారీ దోపిడి
*లబ్దిదారుల వద్ద నుండి దోచుకుంటున్న, అధికారులు, నేతలు
*ఒక్కో మరుగుదొడ్డికి 3 నుండి 4 వేలు వసూలు
మెరకముడిదాం, ఫిబ్రవరి 5: ప్రభుత్వం అన్ని విధాల పేద ప్రజలను అభివృద్ధి చేయాలనే సదుద్దేశ్యంతో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతుంది. వీటిలో కొన్ని పేద ప్రజలకు చేరుతున్నప్పటికీ వాటికి సంబంధించిన ప్రతిఫలం చేతికందాలంటే అధికారుల, నేతల చేతులు తడపడం తప్పడం లేదు. మరికొన్ని వీరికి తెలియకుండానే వీరు పేరున రికార్డులు నమోదు చేసుకుని అధికారులతో నేతలు చేతులు కలిపి స్వాహా చేస్తున్నారు. ఈ కోవకు చెందినదే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అతి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో ప్రధానమైన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం.
ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి ఉంటే ఆనారోగ్యానికి గురికారన్న ఉద్దేశ్యంతో గత ఏడాది కాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తుంది. పంచాయతీ స్థాయి నుండి ప్రత్యేక అధికారులను నియమించి వారికి టార్గెట్‌లు నియమించారు. ఇందులో భాగంగానే ఓడిఎఫ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రం, జిల్లా, మండలం, పంచాయతీ స్థాయిలో పలు ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ నిర్మాణాలు చేపిస్తుంది. ఈ మండలం విషయానికి వస్తే 24 పంచాయతీలకు గాను 10,629 మరుగుదొడ్లు మంజూరు అయ్యాయి. వీటి నిర్మాణానికి 15.77 కోట్లు నిధులు మంజూరు చేయగా వీటిలో నిర్మాణం పూరె్తైన 5.160 మరుగుదొడ్లు కి గాను 7.58 కోట్లు విడుదల చేసారు. వివిధ నిర్మాణ దశల్లో ఉన్న 4,669 మరుగుదొడ్లకు 2.79 కోట్లు చెల్లించారు. ఇంకా 800 మరుగుదొడ్లు ప్రారంభిచాల్సి ఉంది. ఇంత వరకూ బాగానే ఉన్నప్పటికీ ఇక్కడ మొదలైంది అసలు కధ మరుగుదొడ్డికి బిల్లు విడుదల చేయాలంటే 3 నుండి 4 వేలు రూపాయలు ఇవ్వాలని సంబంధిత అధికారులు, నేతలు లబ్ధిదారులను డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మరుగుదొడ్ల నిర్మాణంలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయకుంటే ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడిచిన వారవుతారు.
ప్రత్యేక అధికారి వివరణ
ఈ విషయమై మండల ప్రత్యేక అధికారి ఎస్ లక్ష్మణరావును వివరణ కోరగా మండలంలో నిర్మాణం జరుగుతున్న మరుగుదొడ్ల బిల్లులు చెల్లింపులో అవకతవకలు జరుగుతున్నట్లు నా దృష్టికి రాలేదన్నారు. ఈ అక్రమాలపై జిల్లా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి విచారణ జరిపి అక్రమాలకు పాల్పడినట్లు ఋజువైతే అటువంటి వారిపై ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు తగు చర్యలు తప్పవన్నారు

ప్రభుత్వ పథకాలను వేగవంతం చేయాలి
బొండపల్లి, ఫిబ్రవరి 5: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను వేగవంతంచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో సిఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మార్చి నెలాఖరినాటికి వంద శాతం వ్యక్తిగత, సామాజిక మరుగుదొడ్లును నిర్మించాలని అన్నారు. గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని సిఎం సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. అలాగే ఓడిఎఫ్ గ్రామాలలో వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి వాడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రధానంగా చెత్త నుండి సంపద కేంద్రాలకు ఉపయోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్‌లో తహశీల్దార్ బాపిరాజు, ఎంపిడిఒ ఎం.ప్రకాశరావు, ఎఒ రవీంద్ర, ఎపిఎం పెంటంనాయుడు, ఎంఇఒ సింహాచలం, పిఆర్ జెఇ అప్పలనాయుడు, ఐసిడిఎస్ సూపర్‌వైజర్ గాయత్రిదేవి తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి
గుర్ల, ఫిబ్రవరి 5: ఆరోగ్యవంతులుగా ఉండాలంటే చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని తెట్టంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ సంతోష్‌రూప అన్నారు. సోమవారం తెట్టంగి పిహెచ్‌సిలో లెప్రో సొసైటీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్యం, తాగునీరు, పౌష్టికాహారంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షుడు వెనె్న సన్యాసినాయుడు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలలో పారిశుద్ధ్యం, తాగునీరు, పౌష్టికాహారంపై ప్రజలకు అవగాహన లోపం ఉందని అన్నారు. ప్రభుత్వ అధికారులు గ్రామ ప్రగతికి ఎన్నిసార్లు చైతన్యం పలికినా ఫలితం లేదని చెప్పారు. అయితే మన ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరు అవగాహన పొంది మార్పు చెందాలని అన్నారు. మార్పు చెందిననాడే గ్రామాలలో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని చెప్పారు. ప్రతిరోజు వేడిచేసిన మంచినీటి తాగాలని తెలిపారు. తినే ఆహార పదార్థాలపై మూతలు పెట్టాలని అన్నారు. ముఖ్యంగా మహిళలు చైతన్యవంతులై గ్రామాలలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కురుమినెని బంగారునాయడు, లెప్రోసొసైటీ ప్రతినిధి రమణ, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

లక్ష్యం మేర నీటితీరువా పన్నులు వసూలు చేయాలి
దత్తిరాజేరు, ఫిబ్రవరి 5: మండలంలో 35 గ్రామ పంచాయతీల రెవెన్యూ గ్రామాలలో లక్ష్యం మేర నీటితీరువా పన్నులు వసూలు చేయాలని తహశీల్దార్ జి. కల్పవల్లి వి ఆర్వోలకు ఆదేశించారు. సోమవారం వి ఆర్వోల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నీటితీరువా పన్నులు వసూలుకు రైతుల్లో అవగాహన కల్పించి లక్ష్యం మేర పన్నులు వసూలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఇప్పటి వరకు గ్రీవెన్స్‌లో వచ్చే సమస్యలు అన్నీ పరిష్కరించడం జరిగిందని అన్నారు. అలాగే ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబం మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు వి ఆర్వోలు కృషిచేయాలని కోరారు. ఈ నెల 14లోపు అర్హులను ఓటరు జాబితాలో చేర్పులు చేయాలని కోరారు. వచ్చే 11వ తేదీన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో బి ఎల్ ఓలు అందరు పూర్తి సహకారం అందించాలని తహశీల్దార్ తెలిపారు. కార్యక్రమంలో డిటి రమణ, విఆర్వోలు పాల్గొన్నారు.

ఓటరు నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి
* మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య
దత్తిరాజేరు, ఫిబ్రవరి 5: మండలంలో 35గ్రామ పంచాయతీలకు చెందిన వైసిపి నాయకులు కొత్తగా ఓటర్లను చేర్పించేందుకు పూర్తిస్థాయిలో కృషిచేయాలని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య కోరారు. సోమవారం మండల కేంద్రమైన దత్తిరాజేరులో సర్పంచ్ ఫణీంద్ర స్వగృహంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మండల వైసిపి కన్వీనర్ కడుబండి రమేష్‌నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బొత్స అప్పలనర్సయ్య మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఓటరు జాబితాలో పేర్లను పరిశీలించి నూతనంగా అర్హులందరినీ జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామాలలో కార్యకర్తలు, యువతను ప్రోత్సహించి 18నిండిన వారిని ఓటరు నమోదు జాబితాలో చేర్పించాలని కోరారు. గ్రామాలలో ఉన్న బూత్ కమిటీ సభ్యులు వారి పూర్తి ఆదారాలతో త్వరతగతిగా వివరాలు అందజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోరిలి పి ఎసి ఎస్ అధ్యక్షుడు సింహాద్రి అప్పలనాయుడు, మాజీ జడ్పీటిసి మంత్రి అప్పలనాయుడు, సర్పంచ్ ఫణీంద్ర, గోవింద, శ్రీనివాసరావు, అప్పలనాయుడు, అప్పలస్వామిలతోపాటు ఎంపిటిసి బాలి త్రినాథ్, ఆది, పలువురు సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

అండర్ బ్రిడ్డి నిర్మించే వరకు పోరాటం ఆగదు
కొత్తవలస, ఫిబ్రవరి 5: కొత్తవలస జంక్షన్‌లోని రైల్వే గేటు వద్ద అండర్ బ్రిడ్జీ నిర్మించేవరకు మా పోరాటం ఆగదని సిపిఎం జిల్లా నాయకుడు డేగల అప్పలరాజు పేర్కొన్నారు. సోమవారం సిపిఎం కార్యకర్తలతో కలసి స్థానిక రైల్వే గేటు వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడేళ్లుగా అండర్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖ వారు హామీలు ఇస్తున్నారని ఎప్పిటికీ నెరవేరటం లేదని ఆయన మండిపడ్డారు. ఈ మధ్యకాలంలో అండర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని రైల్వే అధికారులు తెలిపినప్పటికీ పనులు చేపట్టలేదని దుయ్యబట్టారు. రైల్వే గేటు వలన కనీసం ఒక శవమైనా తేలిపోతుందని, ట్రాఫిక్ అంతరాయంతో ప్రయాణీకులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. మంగళవారం కూడా రిలే నిరాహారదీక్ష కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని కోరారు. రిలేనిరాహార దీక్షలో గాడి అప్పారావు, కె. ఈశ్వరరావు, సన్యాసిపాత్రుడు తదితరులు పాల్గొన్నారు.