పశ్చిమగోదావరి

12న జాతీయ నులిపురుగు నివారణా దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 5: జాతీయ నులిపురుగు నివారణా దినోత్సవ సందర్భంగా ఈనెల 12వ తేదీన జిల్లావ్యాప్తంగా 19 సంవత్సరాలలోపు వారందరికి మందులను ఉచితంగా అందించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టరు పి కోటేశ్వరరావు అన్నారు. స్ధానిక కలెక్టరేట్‌లో సోమవారం జాతీయ నులిపురుగు దినోత్సవం సందర్భంగా అధికారులతో మందుల పంపిణిపై సమీక్షించారు. ఈసందర్భంగా జిల్లాలోని 1నుండి 19 సంవత్సరాలలోపు వారందరికి నులిపురుగు నివారణామందులను అందజేయాలని, 3889 అంగన్‌వాడీ కేంద్రాలలో ఉన్న 204200 మందికి, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉన్న 300413 మందికి, 44 జూనియర్ కళాశాలల్లో 16144 మందికి మొత్తం 520757 మందికి ఆల్భెండాజోల్ టాబ్లెట్‌లను అందించాలని వైద్యఆరోగ్యశాఖాధికారులను ఆదేశించారు. 1నుండి 2 సంవత్సరాలలోపు పిల్లలకు చిన్నారులకు అర టాబ్లెట్, 2నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలకు ఫుల్ టాబ్లెట్ అందించి ప్రత్యక్షపర్యవేక్షణలో ఖచ్చితంగా ఈ బిళ్లలు వాడేలా చూడాలని ఆయన కోరారు.
కళాశాలల్లో ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు
ఎస్పీ రవిప్రకాష్
ఏలూరు, ఫిబ్రవరి 5: జిల్లాలో కళాశాలల్లో ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ ఎం రవిప్రకాష్ హెచ్చరించారు. స్ధానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఆయన ఫిర్యాదుదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ కళాశాలలోనైనా ర్యాగింగ్ జరుగుతున్నట్లు సమాచారం ఉంటే తనకుగాని, సంబంధిత పోలీసుస్టేషన్ అధికారికిగాని సమాచారం అందిస్తే తక్షణం చర్యలు తీసుకుంటామన్నారు. ర్యాగింగ్ నిరోధానికి అన్ని కళాశాలల్లో అవగాహనా సదస్సులు నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా కళాశాలల యాజమాన్యాలు కూడా అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. విద్యార్ధులు ర్యాగింగ్ వంటి చర్యలకు పాల్పడి తమ భవిష్యత్‌ను పాడుచేసుకోవద్దని ఆయన హితవు పలికారు. పోలీసు రికార్డుల్లోకి ఎక్కితే విద్యార్ధుల బంగారుభవిష్యత్ నాశనం అవుతుందని, ఈవిషయాన్ని గుర్తించుకుని తమ తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేసేవిధంగా విద్యార్ధులు ప్రవర్తించవద్దన్నారు. ఈసందర్భంగా ఆయన ఫిర్యాదులు స్వీకరించి సంబంధిత పోలీసు అధికారులకు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. జంగారెడ్డిగూడెంనకు చెందిన ఒక మహిళ ఫిర్యాదు చేస్తూ తనకు ప్రభుత్వం ఇచ్చిన భూమిలోకి రావటంతోపాటు వేధింపులకు గురిచేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. పోడూరు మండలానికి చెందిన కొంతమంది వినతిపత్రం ఇస్తూ ఒక వ్యక్తి విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోసం చేశాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు.
ఆక్రమణలు, పారిశుద్ధ్య సమస్యలపై తక్షణం స్పందించాలి
కలెక్టర్ భాస్కర్ ఆదేశం
ఏలూరు, ఫిబ్రవరి 5: జిల్లాలో ప్రభుత్వ స్ధలాలు ఆక్రమణలు, పారిశుధ్యంపై వచ్చే ఫిర్యాదులపై సంబంధితాధికారులు తక్షణం స్పందించి పరిష్కరించాలని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ ఆదేశించారు. స్ధానిక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టరు కార్యక్రమంలో ప్రజల నుండి ఫోన్ ద్వారా వచ్చిన సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈసందర్భంగా జంగారెడ్డిగూడెం రెండవ వార్డు నుండి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి మాట్లాడుతూ అన్నివార్డుల్లో చాలావరకు డ్రైనేజీ నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు, పందులు సమస్యతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై కలెక్టరు స్పందిస్తూ జిల్లాలో ఆర్‌అండ్‌బి, పంచాయితీ తదితర ప్రభుత్వ స్ధలాల ఆమ్రణలతోపాటు పారిశుద్ధ్యంపై అనేక ఫిర్యాదులు అందుతున్నాయని, అధికారులకు ఎన్నిసార్లు ఆదేశాలు జారీచేసినా పరిష్కరించకపోవటం వల్ల పదేపదే అవే సమస్యలు తన దృష్టికి వస్తున్నాయన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం లోపం ఎక్కడ కన్పించినా సంబంధితాధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం నుండి ఏసుబాబు మాట్లాడుతూ గతంలో ఆయకట్టు చెర్వులో చెత్తాచెదారం వేసి డంపింగ్ యార్డుగా తయారుచేసి సగంచెర్వును ఆక్రమించుకున్నారని, ఈవిషయాన్ని కలెక్టరు దృష్టికి తీసుకురాగా వారి ఆదేశాలతో చెత్తవేయటం నిలిచిపోయినా వేసిన చెత్తను అధికారులు తొలగించటం లేదని, దానివల్ల చెర్వు విస్తీర్ణం తగ్గిపోయి రెండవపంటకు నీరు వెళ్లే అవకాశం లేకుండా పోయిందన్నారు. దీనిపై కలెక్టరు స్పందిస్తూ మూడునెలల్లోగా ఆ చెర్వును చెత్తతొలగించి పరిశుభ్రపర్చాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. తాడేపల్లిగూడెం జగన్నాధపురం నుండి ఒక వ్యక్తి మాట్లాడుతూ ప్రభుత్వస్ధలాల్లో బడ్డీకొట్టులు నిర్వహించటం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడటమే కాకుండా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. దీనిపై కలెక్టరు స్పందిస్తూ ప్రభుత్వస్ధలాలు ఆక్రమించుకుని బడ్డీకొట్టులు, షెడ్డులు వంటివి ఏర్పాటుచేస్తే తక్షణం వాటిని తొలగించి భవిష్యత్‌లో తిరిగి ఏర్పాటుచేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తణుకులో అనర్హులకు సదరన్ సర్టిఫికెట్లపై విచారణ
కలెక్టర్ భాస్కర్ ఆదేశం
ఏలూరు, ఫిబ్రవరి 5: అర్హత లేనివారికి కూడా తణుకు సదరన్ బోర్డు వికలాంగుల సర్ట్ఫికెట్లు ఇవ్వడంపై విచారణ చేసి 15రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని డిసిహెచ్‌ఎస్ డాక్టరు కె శంకరరావును జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ ఆదేశించారు. స్ధానిక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధితాధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈసందర్భంగా కలెక్టరు భాస్కర్ మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్ కోసం వస్తున్న వారిని చూస్తుంటే వికలాంగత్వం 20శాతం మాత్రమే ఉన్నట్లు కన్పిస్తోందని, కానీ సర్ట్ఫికెట్‌లో మాత్రం 60నుంచి 82శాతం వరకు ఉన్నట్లుగా ధృవీకరిస్తున్నారన్నారు. నిడదవోలు మండలం కాటాకోటేశ్వరం గ్రామానికి చెందిన జి శ్రీనివాస్‌కు హియిరింగ్ సమస్య 82శాతం ఉన్నట్లు సర్ట్ఫికెట్ ఇవ్వడం పట్ల కలెక్టరు స్పందిస్తూ తణుకు సదరన్ బోర్డు అందించిన సుమారు 300 వికలాంగుల సర్ట్ఫికెట్లను తనిఖీ చేసి 15రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వికలాంగుల సర్ట్ఫికెట్ల జారీలో ఏమైనా అవకతవకలు జరిగినట్లు రుజువైతే సంబంధిత అధికారులపైనా, తీసుకున్నవారిపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏలూరు మండలం వెంకటాపురం పంచాయితీ నెహ్రునగర్‌కు చెందిన పి అప్పారావు, రాజేష్, లక్ష్మి, జ్యోతి మరికొందరు కలెక్టరుకు వినతిపత్రం సమర్పిస్తూ తాము నిర్మించుకున్న గృహాలకు పన్ను వేయాలని కోరినప్పటికీ ఇంతవరకు పన్ను వసూలు చేయటంలేదని, కాలనీలో డ్రైనేజీ సౌకర్యం, సిమెంట్‌రోడ్లు కూడా ఎక్కడా వేయలేదని చెప్పారు. దీనిపై కలెక్టరు స్పందిస్తూ అక్రమ లేఅవుట్లలో గృహాలు నిర్మిస్తే పన్ను వేసేందుకు అవకాశం లేదని, ఈవిషయంలో అధికారులు స్వయంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొయ్యలగూడెం మండలం పొంగుటూరు గ్రామానికి చెందిన గేలం బాలరాజు వినతిపత్రం సమర్పిస్తూ గ్రామంలో పుంతరోడ్డును ఆక్రమించుకోవటం వల్ల కనీసం పొలాలకు బండి వెళ్లడానికి కూడా మార్గం లేకుండా పోయిందన్నారు. దీనిపై సర్వే చేయించి నివేదిక సమర్పించాలని కొయ్యలగూడెం తహసిల్దార్‌ను కలెక్టరు ఆదేశించారు.
మహాకుంభాభిషేక మహోత్సవాలు నిర్వహించటం అభినందనీయం
దేవదయ, ధర్మదయ శాఖా మంత్రి మాణిక్యాలరావు
ఏలూరు, ఫిబ్రవరి 5: లోకకళ్యాణార్ధం ఏలూరు సత్రంపాడు అంబికాదేవి ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు నిర్వహించటం అభినందనీయమని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెప్పారు. స్ధానిక అంబికాదేవి ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమంలో సోమవారం మధ్యాహ్నం ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో శాంతిసామరస్యాలు పెంపొందించాలనే లక్ష్యంతో విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ ఆధ్వర్యంలో మహా కుంభాభిషేకం గత అయిదురోజులుగా కన్నులపండువగా నిర్వహించిన అంబికా కుటుంబసభ్యులను ఆయన అభినందించారు. ప్రతి మనిషి దైవచింతనలో ఉన్నప్పుడే సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొంటుందన్నారు. భవిష్యత్‌లో అంబికాదేవి ఆలయం మరింత అభివృద్ధి చెందేలా తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. ఎఫ్‌డిసి ఛైర్మన్, ఆలయ వ్యవస్ధాపకులు అంబికా కృష్ణ మాట్లాడుతూ అంబికామాతను ఆరాధిస్తూ జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా పెద్దఎత్తున భక్తులు తరలివస్తున్నారన్నారు. ఈసందర్భంగా అంబికాదేవి ఆలయంలో మహాకుంభాభిషేక కార్యక్రమ శిలాఫలకాన్ని మంత్రి మాణిక్యాలరావు ఆవిష్కరించారు.
చింతలపూడి ఎత్తిపోతల పనులకు ప్రత్యేక యంత్రాలు
పూజలు చేసి ప్రారంభించిన మెగా ఇంజనీరింగ్ కంపెనీ
తాళ్లపూడి, ఫిబ్రవరి 5: తాళ్లపూడి మండలం తాడిపూడి వద్ద నిర్మిస్తున్న చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులకు జర్మనీ నుండి ప్రత్యేక యంత్రాలను మెగా ఇంజనీరింగ్ కంపెనీ దిగుమతి చేసుకుంది. గోదావరి నదీతీరంలో నిర్మించే పంపుహౌస్ పనులకు ఈ యంత్రాలను ఉపయోగిస్తున్నట్టు కంపెనీ ఏజీయం సతీష్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసేందుకు 49 కోట్ల రూపాయలతో కట్టర్, గ్రాబ్ అనే యంత్రాలను జర్మనీ నుండి తెప్పించినట్టు చెప్పారు. వీటిని పిల్లర్ల పనులకు 40 మీటర్ల లోతున్న రాయిని సైతం ఛిద్రం చేసేందుకు, మట్టిని తొలగించేందుకు వీటిని వినియోగిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం పంపుహౌస్ నిర్మాణ ప్రాంతంలో పనులు విజయవంతంగా జరగాలని కోరుతూ శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. మెగా కంపెనీ సిబ్బంది హోమాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.